అడవి తల్లి వేదన..అరణ్య రోధన
అడవంటే జ్ఞాన నిలయం.తపోభూమి. అడ వంటే ఆరోగ్య ప్రదాయిని. ఔషధుల ఖని. ఒక్క మాటలో చెప్పాలంటే అడవి భారతీయ ఆత్మ. జీవితాన్ని నాలుగు భాగాలు చేసుకుంటే అందులో ఒక భాగానికి వానప్రస్థాశ్రమం అన్న పేరు పెట్టి, అడవిలో తమని తాము భాగం చేసుకున్నారు భారతీయులు. ఈ అద్భుత చింతనను గతం గూటిలోకి నెట్టడం సరికాదు. ఇప్పుడు అడవులకు మనిషి చేస్తున్న చేటును ఆపాలంటే ఆ భావన ఉపయోగపడు తుందని ఆశిద్దాం. అడవిని రక్షించుకోవాలన్న నినాదం ఈ క్షణం నుంచి ప్రతి గుండె లయ కావాలి. లేదంటే రేపన్నరోజు ఆ గుండె కొట్టుకోవడం కష్టమవు తుంది. అడవి లుప్తమైతే మంచి గాలి ఉండదు. అడవి నరికితే భూమి ధ్వంసమవుతుంది. చెట్లు నరికితే పర్యావరణం నాశనమవుతుంది. వీటన్నిటికి స్పందిం చేది నీ గుండె, నా గుండె, మనందరి గుండెలు. అడవిని రక్షించుకోవడం ధార్మిక విషయమే కాదు. శాస్త్రబద్ధం కూడా. కాని వనాల మీద భారతీయులు పెంచుకున్న భావనకు వేళ్లు విజ్ఞానశాస్త్రంలో ఉన్నాయి.
ప్రపంచ జనాభాను బాధిస్తున్న దాదాపు ఎనభై శాతానికి పైగా జబ్బులకు ఔషధాలను అంది స్తున్న ఆఅడవితల్లి ఇప్పుడు రక్తకన్నీటిని కారుస్తున్నది..ప్రతీ యేటా ప్రపంచ అటవీ సంరక్షణ దినోత్సవాన్ని ఘనంగా జరిపే ఐక్యరాజ్య సమితి ఈసంవత్సరం కూడా ‘’ఫారెస్ట్ అండ్ ఎనర్జీ(అడవి మరియు శక్తి)’’ నినాదంతో పర్యావరణ ప్రాధాన్యతపై ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే విధంగా ప్రణాళికలను రూపొందించింది. అయినప్పటికీ,ప్రకృతి మాతపై జరుగుతున్న ఘోర కలి ఆగట్లేదు. డెబైÄ్భయేండ్ల క్రితం 250కోట్లుగా ఉన్న ప్రపంచ జనాభాకు ఎటువంటి రక్షణను అందించిందో, ప్రస్తుతమున్న ఎనిమిది వందల కోట్ల జనులకు అదే ప్రేమను పంచుతున్న ఆ అడవికి మాన వుడు చేస్తున్న గాయం వర్ణనాతీతం! తనను ఎంతగా నాశనం చేస్తున్నా..ఆఅడవితల్లి తన బిడ్డలకు జీవ వాయువులను అందిస్తూ, వర్షాలు కురిసేలా చేస్తూ, ఆకలితీర్చే అమ్మగా తన ఒడిలో ఇప్పటికీ సమస్త ప్రాణికోటిని కంటికి రెప్పల సాకుతూనే ఉన్నది.
అగ్ర రాజ్యాలే ఆజ్యం పోస్తున్నాయి
1990 నుంచి ఇప్పటి వరకు సగానికి సగం వర్షాధార అడవులు కేవలం అగ్ర దేశాల కార్యకలాపాల వల్లనే నాశనమయ్యాయని తెలిస్తే ఆశ్చర్యం కలక్కమానదు..అటవీ పరిరక్షణ సమితి,ఐక్యరాజ్య సమితి నివేదికల ప్రకారం..భూమిపై 30శాతం అడవులు ఉం డాలి.కానీ ఏటావీటి విస్తీర్ణం గణనీయంగా పడిపోతున్నది. ప్రతీ సెకనుకి ఒకటిన్నర ఎకరం అడవి నరకబడుతుందంటే పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చు. పర్యావరణవేత్తలు చెప్పే దాన్ని బట్టి..వాతావరణంలోకి విడుదల య్యే ఒక క్లోరిన్ పరమాణువు, భూమికి కవచంలా ఉన్న ఓజోన్ పొరలోని లక్ష అణువులను విచ్ఛి న్నం చేయగలదు! అడవులను క్రమక్రమంగా క్షీణింపజేస్తూ..రోజుకి కొన్నిలక్షల లీటర్ల క్లోరిన్ సంబంధ ఉదారాలను అగ్రదేశాలు వాతావర ణంలోకి వదులుతున్నాయని, ఇదిలాగే జరిగితే రానున్న శతాబ్ద కాలంలో భూమిపై ఒక్కటంటే ఒక్క వర్షాధార అడవి కూడా మిగలదని హార్వర్డ్,కొలంబియా విశ్వ విద్యాలయాల పర్యావరణ విభాగానికి చెందిన నిపుణుల పరిశోధనల్లో వెల్లడ వ్వడం యావత్ ప్రపం చాన్ని నిశ్చేష్టులను చేస్తున్నది.
అడవుల ప్రాధాన్యం తెలుసా ?
అభివద్ధి ముసుగులో అగ్రరాజ్యాలు అవలం భిస్తున్న పారిశ్రామిక వింత పోకడలు ప్రకతి మాత ఒంటిని తునాతునకలు చేస్తున్నది. అడవులను విచక్షణా రహితంగా నరకడం వల్ల కార్బన్ డైయాక్సైడ్ నియంత్రణ కుంటు పడి, వాతావరణంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపు తున్నది. సాధా రణంగా సముద్రాలు 25శాతం కార్బన్ డైయాక్సైడ్‌ను పీల్చుకుం టాయి.ఇవి నీటిలోని వివిధ మూలకాలతో కలిసి కార్బాలిక్ యాసిడ్ వంటి పదార్ధాలను ఏర్పరుస్తాయి.ఈ విధంగా గడచిన 250 సంవత్సరాల్లో సము ద్రజలాల ఆమ్లత్వం 30శాతం పెరిగిందని, దీనికి కారణం..అడవులశాతం తగ్గడమే నని,ఇది ఇలాగే కొనసాగితే,2100 సంవత్స రం నాటికి సముద్రజలాల ఆమ్లత్వం 150 శాతం వరకు పెరిగి..సముద్రాన్నే ఆవాసంగా ఏర్పరచుకున్న లక్షలాది సముద్ర జీవులు మృత్యువాత పడటం ఖాయమని బయో డైవర్సి టీ రిపోర్టులు కుండబద్దలు కొట్టాయి. ఇక,అడవుల్లో చెలరేగే అగ్ని ప్రమాదాలు పర్యా వరణానికి, జంతువులకే గాక మానవుల్లో సైతం వివిధ శ్వాసకోశ వ్యాధులు,అస్తమా, ఊపిరితిత్తుల క్యాన్సర్ వంటి రోగాలకు పెను ముప్పుగా దాపురిస్తున్నాయి. ఉదాహరణకు.. 2015ఆగష్టు నెలలో ఇండోనేషియా అటవీ ప్రాంతంలో సంభవించిన ఘోరఅగ్ని ప్రమా దంలో వేలకు వేల అరుదైన వ క్షాలు, జీవ జాలం కలిగిన సుమారు 2.6మిలియన్ హెక్టార్ల అటవీ ప్రాంతం అగ్నికి ఆహు తవ్వగా..సుమారు 1,00,300 మంది ప్రజలు వివిధ శ్వాసకోశ వ్యాధులతో అసువులు బాసా రని తేలింది.అడవులను నరకడంవల్ల ఓజోన్ పొర క్షీణించి సూర్యుడినుంచి అతినీల లోహిత కిరణాలు నేరుగా భూమికి చేరుకోవడవల్ల మానవుల్లో వివిధ రకాల క్యాన్సర్లకు కారణ మవుతాయనే విషయం కూడా తెలిసిందే !
అడవులను విచక్షణారహితంగా నరుకుతూ..ప్రపంచ వ్యాప్తంగా ఉత్పత్తవుతున్న సుమారు 70శాతం కాగితాన్ని వినియోగించు కుంటూ ..రానున్న ఇరవై యేండ్లలో 28వేల జీవజాతుల మనుగడనే ప్రశ్నార్ధకంచేస్తున్న అమెరికా,ఐరోపా వంటి అగ్రదేశాలే జరుగు తున్న విపత్కర పరిణామానికి జవాబుదారీతనం వహించాలి.పర్యావరణ ప్రేమికులు,అభివృద్ధి చెందుతున్న దేశాల అధినేతలు అగ్రరాజ్యాల మెడలు వంచి అడవితల్లి మెడలో పచ్చల తోర ణం అలంకరించే అవసరం ఎంతైనా ఉంది.
అడవులు ఆశ్చర్యకర అంశాలు
ప్రపంచ వ్యాప్తంగా సుమారు 160కోట్ల మంది ప్రజలకు అడవే జీవనాధారం!భూమిపై ప్రతి నిమిషం..ఇరవై ఫుట్ బాల్ స్టేడియం విస్తీర్ణ మంతా అటవీ ప్రాంతం కనుమరుగవుతు న్నది.ప్రపంచ జనాభాలో 5శాతం కూడా లేని అమెరికన్లు, ముప్పై శాతంకి పైగా కాగితాన్ని వినియోగిస్తున్నారు.ప్రపంచ దేశాలతో పోలిస్తే కేవలం అమెరికా,ఐరోపా దేశాలే 12రెట్లు ఎక్కువ అడవిని పారిశ్రామికీకరణ పేరుతో నాశనం చేస్తున్నాయి.
చెట్టును కూల్చడమంటే హత్యతో సమానం. ఒక అడవిని నిర్మూలించడమంటే ఒక జాతి మీద జరిగిన సామూహిక హననం కాదా! చెట్టుకు అనుభూతులుంటాయి. చెట్టుకు వ్యక్తీకరణలుంటాయి. వైర్లెస్ సిగ్నలింగ్, మైక్రోవేవ్ ఆప్టిక్స్ శాస్త్రవేత్త సర్ జగదీశ్ చంద్రబోస్ వంటి మహా శాస్త్రవేత్త చెప్పిన అద్భుత సత్యమిది. చెట్టుకు అనుభూతులు ఉంటాయని ఆయన నిరూపించారు.లండన్ రాయల్ సొసైటీలో 1901లో ఏర్పాటు చేసిన ప్రదర్శనలో రుజువు చేశారు.జంతువులకు వలెనే మొక్కలకీ నాడీ వ్యవస్థ ఉంటుందని చెప్పారాయన.వాటికి హాని జరిగితే మౌనంగా రోదిస్తాయి కూడా.వాటిని నిర్మూలించుకోవడం అంటే మానవాళి తనను తాను నిర్మూలిం చుకోవడమే.
పచ్చదనం మీద కక్ష
అడవులు స్వచ్ఛమైన గాలినిస్తాయి. వాతావ రణాన్ని ఆహ్లాదకరంగా మారుస్తాయి.పర్యా వరణ సమతుల్యాన్ని కాపాడతాయి. ఉపాధిని స్తాయి. జీవజాలానికి ఆశ్రయమిస్తాయి. సకాలంలో వానలు కురిపిస్తాయి.భూగర్భ జలాల పరిరక్షణ,కర్బన ఉద్గారాల తగ్గింపు, వాతావరణ మార్పుల నియంత్రణలో అడవులు విశేషమైన పాత్ర పోషిస్తాయి.కానీ రానురాను ఆధునికత, అభివృద్ధి, ప్రజావసరాలు, పట్టణీ కరణ పేరుతో విచక్షణా రహితంగా వనాల నరికివేత సాగిపోతోంది. ఇది ఏఒక్క దేశా నికో,రాష్ట్రానికో పరిమితం కాలేదు. ప్రపంచ వ్యాప్తంగా కళ్లకు కడుతున్న దుష్పరిణామం. పచ్చదనం మీద మనిషి కక్ష కట్టినట్టే వ్యవహరి స్తున్నాడు.దీనివల్ల కలిగే అనర్థాలు విపరీతంగా ఉంటున్నాయి. వాయు కాలుష్యం పెరిగిపో తోంది. స్వచ్ఛమైన గాలి కరవవుతోంది. వన్య ప్రాణులు ఆహారం కోసం వనాలు వదలి పల్లెలు,పట్టణాలకు తరలుతున్నాయి. పంటలను ధ్వంసం చేస్తున్నాయి.ప్రజలను భయపెడు తున్నాయి. దాడులు చేస్తున్నాయి.రుతుపవ నాలు క్రమం తప్పుతున్నాయి.వర్షాలకు విఘాతం కలుగుతోంది. అయితే కుంభవృష్టి, లేకపోతే అనావృష్టితో యావత్ భూ మండలం తల్లడిల్లుతోంది.విశ్వవ్యాప్తంగా అడవుల క్షీణత మానవాళి మనుగడను ముప్పులోకి నెడుతోంది. చెట్లు తరిగేకొద్దీ కరవులు,తుపాన్లు,వరదలు, వాతావరణ మార్పులు చోటుచేసుకుంటు న్నాయి.ఇవి ప్రజలకు సవాళ్లను విసురుతు న్నాయి.
ఏటా నాశనమయ్యే అడవి ఎంతో తెలుసా?
ఐక్య రాజ్య సమితి అంచనా ప్రకారం ఏటా దాదాపు కోటీ ఇరవై లక్షల హెక్టార్ల అటవీ విస్తీర్ణం హరించుకుపోతోంది.వనాలక్షీణత, జలవనరులతో పాటు వాతావరణ మార్పులపై, జీవనోపాధులపై ఇది తీవ్ర ప్రభావాన్ని చూపు తోంది.12నుంచి 20శాతం వరకు కర్బన ఉద్గారాలకు అడవుల క్షీణతే కారణం.ఈపరి స్థితిని అధిగమించేందుకు 2012 నవంబరులో ఐక్యరాజ్య సమితి నడుంబిగించింది.
కాపాడలేకపోతున్న ‘కంపా’
కానీ అడవుల రక్షణ కాగితాల మీదే విస్తరి స్తున్నది. అనేక దేశాలు అంతర్జాతీయ అటవీ దినోత్సవాన్ని మొక్కుబడిగా నిర్వహిస్తుండటంతో ఆశించిన ఫలితాలు రావడం లేదు. పాలకు లలో చిత్తశుద్ధి లేక వనాల నరికివేతకు అడ్డుకట్ట పడటం లేదు.కొత్తగా వనాల పెంప కం తూతూ మంత్రంగా సాగుతోంది. మొక్కలు నాటేందుకు వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తు న్నామని పాలకులు గొప్పలు చెప్పుకుంటు న్నప్పటికీ క్షేత్రస్థాయిలో ఆ మేరకు ఫలితాలు కనపడటం లేదన్నది చేదు నిజం.జలాశ యాలు,వివిధ ప్రాజెక్టులు,రహదారుల నిర్మాణం,విస్తరణ,ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణాలకు ఏటా పెద్దయెత్తున వనాలను వినియోగిస్తుండటంతో అవి కుచించుకు పోతున్నాయి.ఈపరిస్థితిని అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం కొన్నేళ్ల క్రితం‘కంపా’పథ కాన్ని తెరపైకి తీసుకువచ్చింది.కాంపన్సేటరీ అఫారెస్టేషన్ మేనేజ్‌మెంట్,ప్లానింగ్ అథారిటీ (ప్రత్యమ్నాయ వనీకరణ నిధి ప్రణాళిక సంఘం)కి సంక్షిప్త రూపమే ‘కంపా’.కోల్పో యిన అటవీ భూమి మేరకు ప్రత్యామ్నాయంగా అడవులను పెంచడం ఈ పథకం ప్రధాన ఉద్దే శం.దీనికింద 27రాష్ట్రాలకు కేంద్రం 2019లో రమారమి రూ.47వేలకోట్లు మంజూరు చేసింది.ఈ నిధులను ప్రత్యమ్నాయ అటవీ పెంపకం, వన్యప్రాణుల సంరక్షణ,అడవుల్లో అగ్ని ప్రమాదాల నివారణ తదితరాలకు వెచ్చించాల్సి ఉంటుంది. అటవీ భూములను పారిశ్రామిక అవసరాలకు బదలాయిస్తే,ఆ మే రకు అడవుల పెంపకం చేపట్టాలన్న ఆలోచన తో ‘కంపా’ పథకం రూపుదిద్దుకుంది.పథకం లక్ష్యాలు సమున్నతమే.కానీ ఆచరణ అంతంత మాత్రం.వివిధ ప్రభుత్వ విభాగాల మధ్య సమన్వయ లోపం,కాగితాలపై లెక్కలు, క్షేత్ర స్థాయిలో లోపాల కారణంగా అడవుల పెంప కం కార్యక్రమం నత్తనడకన నడుస్తోంది. వనాల విస్తీర్ణం తగ్గడానికి పోడు వ్యవసాయం కూడా కొంతవరకు కారణం.అభివృద్ధి పేరుతో విచక్షణారహితంగా అడవులను ధ్వంసం చేయడం,నదీగమనాలను మళ్లించడం,నీటి వనరులను విచ్చలవిడిగా వాడటం వైపరీ త్యాలకు దారితీస్తోంది.కొండలను,గుహలను తొలచి, భారీ సొరంగాలను తవ్వి విద్యుత్ ప్రాజెక్టులను నిర్మిస్తుండటంతో ప్రకృతి సమతుల్యం దెబ్బతిని అనర్థాలు చోటుచేసు కుంటున్నాయి.ఇటీవలి ఉత్తరాఖండ్ వరదలకు ఇదే కారణం.అడవులు జీవ వైవిధ్యానికి మారుపేరుగా నిలుస్తాయి.ఇక్కడ అనేక రకాల జంతుజాలాలు మనుగడ సాగిస్తాయి. దాదాపు అరవై వేల చెట్ల జాతులు ఉన్నయాని అంచనా. ఈ వైవిధ్యమే మానవాళికి మేలు చేస్తుంది.– (గోపరాజు విశ్వేశ్వరప్రసాద్)