అడవి తల్లికి గర్భశోకం

ప్రభుత్వ రంగంలో ఇంతవరకూ ఉన్న గనులను ప్రైవేటుపరం చేసే కార్యక్రమానికి ఎటువంటి ఆటంకాలూ లేకుండా చేయడమే ప్రభుత్వ లక్ష్యంగా కనపడుతోంది.‘’ప్రజా ప్రయోజనాల’’ పేరుతో కారుచౌకగా ప్రభుత్వ రంగ కంపెనీల మైన్లను, భూములను ప్రైవేటు కార్పొరేట్లకు కట్టబెట్టడమే ప్రభుత్వ ధ్యేయం. బడా బడా బహుళజాతి మైనింగు కంపెనీల నుండి వస్తున్న ఒత్తిడికి ప్రభుత్వం తలొగ్గినట్టు కనపడుతోంది. దీనివలన ఖనిజ సంపద విస్తారంగా ఉన్న మన అటవీ ప్రాంతాల్లో సామాజిక ఉద్రిక్తతలు బాగా పెరిగే ప్రమాదం ఉంది.

గత నెలలో కేంద్ర ప్రభుత్వం‘’ప్రజల నుండి అభిప్రాయాలను సేకరించే నిమిత్తం’’ ఒక పత్రాన్ని విడుదల చేసింది.1980 అటవీ సంరక్షణ చట్టంలో కొన్ని సవరణలను కేంద్ర పర్యావరణ, అటవీ సంరక్షణ మంత్రిత్వ శాఖ ఆపత్రంలో ప్రతిపాదించారు. ‘’పర్యావరణ పరిరక్షణ, ఆర్థిక అవసరాలు-వీటికి సంబం ధించి వేగంగా మారుతున్న దేశ అవసరాలు నెరవేర్చే’’ ఉద్దేశ్యంతో అటవీ సంరక్షణ చట్టాన్ని సంస్కరించాలని భావిస్తున్నట్టు కేంద్రం ఆపత్రంలో పేర్కొంది. చాలా అస్ప ష్టంగా చేసిన ప్రతిపాదనలు ఆ పత్రంలోఉన్నాయి. కాస్త జాగ్రత్తగా పరిశీలిస్తే జాతీయ మానిటైజేషన్‌ ప్రణాళిక, 2022-25కు అనుగుణంగా ఉండేలా అటవీ అనుమతుల నిబంధనలను, పర్యావరణ సంరక్షణ నిబంధనలను సడలిం చడమే ఈ ప్రతిపాదనల వెనుక అసలు ఉద్దేశ్యం అని మనకు అర్ధమౌ తుంది. అనేక ప్రభుత్వ ఆస్తులు అటవీ ప్రాంతాల్లో వున్నాయి. అవన్నీ ప్రస్తుత అటవీ సంరక్షణ చట్టం విధించిన నిబంధనలకు లోబడి ఉన్నాయి. జాతీయ మాని టైజేషన్‌ పథకం వివిధ ప్రభుత్వ ఆస్తులను లీజుకివ్వాలని ప్రతిపాదించింది. ఆవిధంగా లీజుకివ్వడానికి ఈ అటవీ సంరక్షణ చట్ట నిబంధనలు అడ్డం వస్తున్నాయి. అందుకే ఆ చట్టాన్నే ఏకంగా సవరించాలని మోడీ ప్రభుత్వం భావిస్తున్నది. వివిధ వర్గాల ప్రజలు ఈ ప్రతిపాదిత సవరణలను వ్యతిరేకిస్తున్నారు. ఆ సవరణలను అడ్డుకోడానికి పెద్ద ఎత్తున ప్రతిఘటనను నిర్మించే యోచనలో కూడా వారున్నారు. ఐతే ఈ సవరణల వెనుక అసలు ఉద్దేశ్యం మానిటైజేషన్‌ చేయడానికి ఉన్న ఆటంకాలను తొలగించడమేనన్న సంగతిని వారిలో చాలామంది గుర్తించలేకపోతున్నారు.

నిబంధనల సడలింపు
పెద్ద పెద్ద ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్రాజెక్టులను, రైల్వే, జాతీయ రహదారులు వంటి నిర్మాణాలను, అంతర్జాతీయ సరిహద్దులలో ప్రాజెక్టులను, ఉన్నతస్థాయి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియో గించే ప్రాజెక్టులను చేపట్టే డెవలపర్స్‌కు రవాణా నిమిత్తం దారి ఏర్పరుచుకునే వీలు కల్పించేలా ( రైట్‌ ఆఫ్‌ వే) కేంద్ర ప్రభుత్వం కొన్ని కీలక సవరణలను ప్రతిపాదించింది. ఇటువంటి ప్రాజెక్టులన్నీ ప్రస్తుతం ‘’రక్షిత అడవులు’’గా ఉన్న చోట్ల ఏర్పాటు అవుతున్నాయని తెలిపింది. అక్కడ ముందస్తు అనుమతులు ఉండాలని, వినియోగించే అటవీ భూమికి నష్ట పరిహారం చెల్లించాలని, ప్రత్యామ్నాయ భూములలో అడవుల పెంపకం చేపట్టాలని ఇప్పటి నిబంధనలు నిర్దేశిస్తున్నాయి. ఈ నిబంధనల నుండి ఆభారీ ప్రాజెక్టుల డెవలపర్స్‌కు మినహాయింపు ఇవ్వాలని మంత్రిత్వ శాఖ ప్రతిపాదిస్తోంది. ఈ నిబంధనల కారణంగా డెవలపర్స్‌ తమకు కేటాయించిన భూములను పూర్తిగా వినియోగించలేకపోతున్నారని,మౌలిక వసతులను కల్పించలేకపోతున్నారని, తాము ప్రతిపాదించే సవరణలను గనుక ఆమోదిస్తే అప్పుడు పూర్తి స్థాయిలో భూములను వారు వినియోగించుకోడానికి వీలౌతుందని చెప్తోంది. సవరణలు ఆమోదం పొంది అమలు లోకి వస్తే అప్పుడు ప్రైవేటు డెవలపర్స్‌ ఎటువంటి పర్యా వరణ నిబంధనలనూ పాటించనవసరం ఉండదు. అటవీ సంరక్షణ చట్టం ప్రకారం తప్పనిసరిగా పాటించవలసిన నిబంధనలన్నీ పక్కకు పోతాయి. కేంద్ర ప్రభుత్వం ప్రతిపా దనలు అమలైతే ఆ ప్రాంతాలన్నీ ఇక అటవీ ప్రాంతాలుగా పరిగణించబడవు. ఇప్పటికే 2020లో చేసిన ‘’పర్యావరణ ప్రభావ అంచనా నిబంధనల’’ నుండి ఈ ప్రాంతాలకు మినహాయింపు ఇచ్చేశారు. అంటే ఈ ప్రాం తాల్లో ప్రాజెక్టులు చేపట్టే ముందు వాటివలన సామాజికంగా గాని, పర్యావరణ పరంగా గాని ఎటువంటి ప్రభావం పడబోతున్నది అన్న అంశాన్ని ముందస్తు అంచనా వేయాల్సిన అవసరం ఉండదు. ఈ విధంగా మినహాయిం పులను పొందే భూభాగాలు ఏవో చిన్న,చిన్న సైజుల్లోవి కాదు. జాతీయ మానిటైజేషన్‌ పథకంలో ప్రధానమైన లక్ష్యాలుగా పెట్టుకున్నవి. 8 మంత్రిత్వ శాఖల పరిధిలో రు.2.5 లక్షల కోట్లు ఆర్జించే లక్ష్యంతో కొన్ని ఆస్తులను మాని టైజ్‌ చేయాలని నిర్ణయించుకున్నారు. రోడ్లు, రవాణా మంత్రిత్వ శాఖ పరిధిలో వీటిలో 20 శాతం ఉన్నాయి. రైట్వే మంత్రిత్వ శాఖ పరిధిలో 36శాతం ఉన్నాయి. 2019 లోనే రైల్వే శాఖకు అనేక అభయారణ్యాల ప్రాంతా ల్లో, నేషనల్‌ పార్కులలో పలు నిబం ధనల నుండి మినహాయింపులు ఇచ్చేశారు. రైల్వే శాఖ పరిధిలో ఇంకా 40,000 హెక్టార్ల (లక్ష ఎకరాలు) భూమిని,రోడ్లు,రవాణా మంత్రిత్వ శాఖ పరిధిలో 7లక్షల హెక్టార్ల (17.5 లక్షల ఎకరాలు) భూములను మాని ట్క్కెజ్‌ చేయ దగ్గవిగా గుర్తించారు. దానికి వీలుగా అన్ని రకాల నిబంధనల నుండి గుండుగుత్తగా మినహాయింపుల ఇవ్వాలన్న ప్రతిపాదన కూడా ఉంది. ప్రభుత్వేతర సంస్థలకు లీజుకిచ్చిన భూముల్లో అడవులు ఉన్న భూభాగాలు కూడా కలిసివున్నాయి. అటువంటి సందర్భాల్లో ఆ అడవులను పూర్తిగా నరికివేయడానికి ఆటం కంగా ఉన్న నిబంధన లను తొలగించాలని ప్రతిపాదిస్తున్నారు. ప్రభుత్వ భూములకు ఇచ్చే మినహాయింపు లన్నింటినీ ప్రభుత్వేతర సంస్థలకు కూడా వర్తింపజేయాలని ప్రయత్నిస్తు న్నారు. పలు చిన్న చిన్న మైనింగు లీజులు తీసుకున్న ప్రైవేటు సంస్థలన్నీ ఈ విధమైన మినహా యంపులను పొందే అవకాశం ఉంది. పర్యావరణ ప్రభా వాన్ని ముందస్తుగా అంచనా వేయవలసిన అవసరం ఉండదు. ఈ విష యంలో ఇప్పటికే 2020లో రూపొందించిన నిబంధనలు చాలా సడలింపులను ఇచ్చేశాయి. మైనింగు యథేచ్ఛగా జరుపుకోడానికి మాత్రమే గాక తమ మైనింగు ప్రాంతాన్ని కూడా విస్తరిం చుకునే అవకాశాలను కల్పించారు. కేంద్రం తమ అధీనంలోని అనేక గనులను మానిటైజేషన్‌ ద్వారా అప్పజెప్పి సుమారు రూ.28,747 కోట్లు ఆర్జించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రభుత్వ రంగంలో ఇంతవరకూ ఉన్న గనులను ప్రైవేటు పరం చేసే కార్యక్రమానికి ఎటువంటి ఆటం కాలూ లేకుండా చేయడమే ప్రభుత్వ లక్ష్యంగా కనపడుతోంది. ‘’ప్రజా ప్రయోజనాల’’ పేరుతో కారుచౌకగా ప్రభుత్వ రంగ కంపెనీల మైన్లను, భూములను ప్రైవేటు కార్పొరేట్లకు కట్టబెట్టడమే ప్రభుత్వ ధ్యేయం. బడా బడా బహుళజాతి మైనింగు కంపెనీల నుండి వస్తున్న ఒత్తిడికి ప్రభుత్వం తలొగ్గినట్టు కనపడుతోంది. దీనివలన ఖనిజ సంపద విస్తారంగా ఉన్న మన అటవీ ప్రాంతా ల్లో సామాజిక ఉద్రిక్తతలు బాగా పెరిగే ప్రమాదం ఉంది.

అటవీ హక్కుల చట్టాన్ని నీరుగార్చే దిశగా ..
ఈ విధమైన ప్రభుత్వ ప్రతిపాదనలు అటవీ హక్కుల చట్టం అమలును ఏవిధంగా ప్రభావితం చేయనున్నాయన్నది చూడాలి. ఇప్పటికే కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ ఈ అటవీ హక్కుల చట్టాన్ని ఏదోవిధంగా నీరుగార్చాలని చాలా కాలంనుండీ ప్రయత్ని స్తూనే వుంది. ఆ విషయంలో కొంతమేరకు నీరుగార్చింది కూడా. గిరిజనులను అడవుల నుండి వెళ్ళగొట్టే విధంగా నోటీసులు జారీ చేస్తూ అటవీ శాఖ ఆ భూములను ప్రైవేటు సంస్థలకు ప్రాజెక్టుల నిమిత్తం కట్టబెట్టేందుకు వీలు కల్పిస్తోంది. ఇప్పుడు తాజాగా ప్రతిపా దించిన సవరణలను ఉపయోగించుకుని అన్ని రకాల మినహాయింపులనూ పొంది మానిటై జేషన్‌ చేయడానికి రంగం సిద్ధం చేస్తోంది. ఇప్పుడు ప్రతిపావించిన సవరణలు ప్రైవేటీక రణకు అటవీ హక్కుల చట్టం నిబంధనలు ఆటంకం కాకుండా ఉండేలా తోడ్పడతాయి. తోటల విషయంలో ప్రతిపాదించిన సవరణలు అటవీ హక్కుల చట్టం అమలును బాగా నీరుగార్చే ప్రమాదం ఉంది. అంతర్జాతీయ సంస్థల నుండి, బహుళజాతి కంపెనీల నుండి పెద్దఎత్తున పెట్టుబడులను ఆకర్షించడానికి ప్రస్తుత చట్టాలు పెద్ద ఆటంకంగా ఉన్నాయని మన విధాన రూపకర్తలు తరచూ వాదిస్తూం టారు. మౌలిక వసతుల రంగంలో కార్పొరేట్‌ పెట్టుబడులను ఆకర్షించడం ప్రధాన లక్ష్యంగా మానిటైజేషన్‌ ప్రాజెక్టు రూపొందింది. భూవిని యోగం మీద కాని, రైతాంగం, గిరిజనులు, వ్యవసాయ కూలీల హక్కుల ఉల్లంఘన మీద కాని ఏవిధమైన ఆంక్షలు పెట్టినా మానిటైజేషన్‌ ప్రాజెక్టు లక్ష్యాలు నెరవేరవు. ఈ నేపథ్యంలో అటవీ సంరక్షణ చట్టానికి సవరణలను ప్రతిపా దించడం యాదృచ్ఛికం ఎంతమాత్రమూ కాదు. వాస్తవానికి మానిటైజేషన్‌ ప్రాజెక్టు అమలు జరగాలంటే ఈ సవరణలను తీసుకురావడం తప్పనిసరి అవుతుంది. ఈ సవరణలు ఆదివాసీల భద్రతకు పెనుముప్పు కానున్నాయి. పర్యావరణానికి, అడవులపై ఆధారపడిన కార్మికులకు, రైతులకు మనుగడ ప్రశ్నార్ధకం కానున్నది. అందుచేత ప్రభుత్వ ఆస్తులను కాపాడడానికి జరుగుతున్న పోరాటం యొక్క సామాజిక పునాదిని మరింత విస్తృతం చేయ వలసిన అవసరం చాలా ఉంది. ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణతోబాటు భూములను ప్రాజెక్టులకు కేటాయించే విషయం, భూవిని యోగానికి సంబంధించిన నిబంధనల విషయం కూడా జోడిరచి ఉద్యమాలను విస్తృతం చేయాలి. మంత్రిత్వ శాఖ ప్రతిపాదనలు ఈ కర్తవ్యాన్ని వెంటనే చేపట్టవలసిన అగత్యాన్ని సూచిస్తున్నాయి.

ఎన్‌.ఎఫ్‌.పి.తో పెనుముప్పు
పర్యావరణ,అటవీ,శీతోష్ణ స్థితి మార్పు మంత్రిత్వశాఖ 2018 నాటి జాతీయ అటవీ విధాన ముసాయిదా (ఎన్‌.ఎఫ్‌.పి.)ను మార్చిలో విడుదల చేసింది. ఇప్పుడు ఆవిధానం మీద సూచనలు, అభ్యంతరాలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి. మూడు దశాబ్దాల కిందట అంటే 1998లో రూపొందించిన అటవీ విధానం స్థానంలో కొత్త విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. శీతోష్ణ స్థితిలో మార్పు ప్రస్తుతం చర్చనీయాంశంగా ఉంది కనక పాత విధానంపై పునరాలోచించడంలో తప్పు లేదని అనిపిస్తుంది. బొగ్గు పులుసు వాయువు ప్రభావాన్ని నిలవరించడానికి అడవులు తోడ్పడతాయి. భూతాపం పెరగడంవల్ల కలిగే దుష్ప్రభావాన్ని అడవులు తగ్గిస్తాయి. శీతోష్ణ స్థితిలో మార్పులను ప్రభుత్వం పరిశీలించడం మంచిదే. కాని కొత్త విధానం రూపొందిం చడంలో అసలు ఉద్దేశం పర్యావరణ పరిరక్షకు లకు, పౌర సమాజానికి ఆందోళనకరంగా తయారైంది. 1952లో ఉన్న అటవీ విధానం స్థానంలో 1988 నాటి విధానాన్ని తీసు కొచ్చారు. 1952 నాటి అటవీ విధానంలో వలసవాద ఛాయలు ఉన్నాయి. ఆవిధానం అడవులను ఆర్థిక వనరుగా మాత్రమే పరిగ ణిస్తుంది. 1988 నాటి విధానంలో కూడా వలసవాద ఛాయలు ఉన్నాయి. సహజమైన అడవులు దేశ పర్యావరణకు,జీవావరణంలో సమతూకానికి అవసరం. అడవులు అంటే కేవలం చెట్లు,వాటి ద్వారా వచ్చే కలప మాత్రమే కాదని,అవి జీవ వైవిధ్యానికి కేంద్రాలని, అనేక రకాల ఉత్పత్తులు అడవుల నుంచి వస్తాయని, వాటిని అడవుల్లో ఉండే వారు వినియోగించుకుంటారని 1988నాటి విధానం గుర్తిస్తుంది. అడవులను ఇతర ప్రయో జనాల వినియోగంపై నిశిత పరిశీలన అవసరం. తప్పని సరి పరిస్థితిలో తప్ప అడవులను ఇతర ప్రయోజనాలకు ఉపయోగించ కూడదు. అయితే ఈచట్టం అమలులో లోపాలు ఉన్నాయి. అటవీ సంరక్షణ సులభమైన వ్యవహారం కాదు. అయితే 1988 నాటి ఎన్‌.ఎఫ్‌.పి.మునుపటి విధానంకన్నా చాలా మెరుగు. అటవీ సంరక్షణ దిశ మారడంవల్లే అడవుల్లో ఉండే వారికీ హక్కులు ఉంటాయన్న వాస్తవాన్ని గుర్తించగలిగాం. అటవీ సంరక్షణలో వారు బాగా తోడ్పడగలరని గుర్తించాం. అడవుల్లో ఉండే వారి హక్కులను 2006 నాటి గిరిజనులు,సాంప్రదాయికంగా అడవుల్లో ఉండే వారి (అటవీహక్కుల)చట్టం ఈ హక్కులను పరిపుష్టం చేసింది. ఈకారణంగానే ఒరిస్సాలోని నియమగిరి కొండల్లో ఉండే గిరిజనులు బాక్సైట్‌ తవ్వకాలకు వ్యతిరేకంగా పోరాడగలిగారు. 2018 నాటి జాతీయ అటవీ విధానం ముసాయిదా పైకి చాలా నిరూపాయక రమైందిగా కనిపిస్తుంది. కాని తెరచి చూస్తే అసలు మతలబు ఏమిటో అర్థం అవుతుంది. మునుపటి అనేక ప్రభుత్వాలు రూపొందించిన విధానాల్లాగే ఈ విధానమూ సహజమైన అడవులు పోషించే పాత్రను పైపైన మాత్రమే గుర్తిస్తుంది. అంతిమంగా అడవులను ఆర్థిక వనరుగా మాత్రమే పరిగణిస్తుంది. అందుకే అటవీ ఉత్పత్తులను ‘‘శీతోష్ణ స్థితికి ఉపకరించే’’ ఉత్పత్తులుగా పరిగణిస్తుంది. అటవీ ఉత్పత్తుల్లో తక్కువ ఉత్పాదకత ఉందని ఈ విధానం విచారం వ్యక్తం చేస్తోంది. అంతరించిన అడవులను పునరుజ్జీవింప చేయడానికి 40 శాతం అడవులను ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంతో పెంచి పోషించాలని చెప్తోంది. అయితే ఈ పద్ధతిని అనుసరిస్తే సహజంగా ఉన్న వృక్ష జాతుల స్థానంలో ఒకే రకమైన సీమ జాతి మొక్కలను నాటి అడవులను పారిశ్రామిక అవసరాలకు అనువుగా మారు స్తారన్నది గతానుభవం. ఇందులో సహజమైన అడవుల పరిరక్షణకు తావు లేదు. పైగా ఈ విధానంవల్ల అడవుల్లో నివాసం ఉండే వారిని, సంచార జాతుల వారిని అడవులనుంచి తరిమేస్తారు. వారిని ఉమ్మడి వనరులను వినియోగించుకోనివ్వరు. ఈ విధానం అను సరించడానికి ప్రధానమైన కారణం ఏమిటంటే కలప ఆధారిత పరిశ్రమలకు కలప కొరత లేకుండా చూడడం మాత్రమే. కొరత ఉండడం వల్ల కలప దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. అంతే గాక అడవులు అంతరించడంవల్ల కలిగే ఇతర నష్టాలను పూడ్చే అంశాన్ని ఈ విధానం పట్టించుకోదు. ఉదాహరణకు అభివృద్ధి పథకాలు, ఇతర పథకాల పేర అడవులు అంతరిస్తున్నాయి. ఇది ప్రధానమైన సమస్య. ఆనకట్టల నిర్మాణం,గనుల తవ్వకం,రోడ్ల నిర్మాణం కోసం ప్రతి రోజూ 135 హెక్టేర్ల అడవులు నాశనం అవుతున్నాయని పర్యావరణ పరిరక్షణకు కృషి చేసే న్యాయవాదులు రుత్విక్‌ దత్త, రాహుల్‌ చౌదరి 2013లో సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించిన సమాచారం ద్వారా వెల్లడైంది.ఒక వేపు నూతన అటవీ విధాన ముసాయిదా మీద చర్చ రుగుతుండగానే కర్నాటకలోని చిక్కమగళూరు-దక్షిణ కన్నడ జిల్లాల మధ్య 65 కి.మీ. మేర రోడ్డు నిర్మాణం కోసం పశ్చిమ కనుమల్లోని దట్టమైన అడవుల్లో 39,000 చెట్లు నరికారు. బొగ్గు తవ్వకం కోసం అడవులను అప్పగించడం కొనసాగుతూనే ఉంది.ఇలాంటి పనులవల్ల అటవీ సంరక్షణ పక్క దారి పడ్తున్న తీరుపై సమగ్ర చర్చ జరగడమే లేదు. విధానాలను కచ్చితంగా అమలు చేస్తే అవిచ్ఛిన్నంగా ఉండే అడవులను కాపాడడం సాధ్యం అవుతుంది. కాని అడవులను చిన్న చిన్న ముక్కలుగా విభజించి వినియోగించుకోవడం మొదలు పెడితే అడవులను ఆక్రమించుకోవడానికి మార్గం సుగమం అవుతోంది. అప్పుడు క్రమంగా అడవులు మాయం అవుతాయి. పట్టణ ప్రాంతాలలో జరిగింది ఇదే.
పలచబడిన అడవులను, సహజ అడవులను%ౌౌ%. వివిధ పథకాలకు%ౌౌ%. ప్రైవేటు రంగానికి అప్పగించడంవల్ల జరిగిన నష్టమేమిటో 1988నాటి అటవీ విధానం గుర్తించింది. కాని నూతన విధానం ఈ అపసవ్య విధానాన్ని కొనసాగించడానికే ఉద్దేశించింది. ఈ విధానం అమలులోకి వస్తే 40 శాతం అడవులు కేవలం ప్రైవేటు రంగానికి కలప కోసమే ఉపకరిస్తాయి.
ఇలాంటి తిరోగమన విధానంవల్ల 30 కోట్ల మంది అడవుల్లో నివాసం ఉండే వారికి, అడవుల మీద ఆధారపడి బతికే వారికీ ఏ ప్రయోజనమూ ఉండదు. కాని భూమి, అడవులు, నీరు మొదలైన సహజ వనరులన్నింటి నుంచి వీలైనంత ఎక్కువ ఆదాయం రాబట్టాలని ప్రయత్నించే ఈ ప్రభుత్వానికి మాత్రం నూతన విధానం బాగా లాభ సాటిగా ఉంటుంది.

అటవీ పరిరక్షణ చట్టం, 1980
భారతదేశం విరివిగా అడవులను కోల్పోవటం, పర్యావరణం దిగజారటంతో, ఫారెస్ట్‌ (కన్సర్వేషన్‌) ఆక్ట్‌ 1980లో వచ్చింది. 1988 చట్ట సవరణ ప్రకారం ఏ రాష్ట్రమైనా రిజర్వు అడవిని సాధారణ అడవిగా మార్చినా, అటవీయేతర ఉత్పత్తుల ఉపయోగించినా, ఏ ప్రైవేట్‌ వ్యక్తికైనా ధారాదత్తం చేసినా, లేక పరిశ్రమకి వచ్చినా, అడవిని కొట్టి వేసినా ఏమైనా కూడా భారత ప్రభుత్వం అనుమతి తీసుకోవాల్సి వుంది. ఇటువంటి అనుమతులన్నిటికీ చట్టం క్రింద వున్న సలహా సంఘం కేంద్ర ప్రభుత్వానికి సలహాలనిస్తుంది. డెహ్రాడూన్‌ లోయ వ్యాజ్యంలో 1988లో లోయలో గనులు త్రవ్వకం అటవీ (సంరక్షణ) చట్టాన్ని ఉల్లంఘించటమని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.

ఏమిటీ చట్టం?
పచ్చని అరణ్యాలను కాపాడుకునేందుకు 1980లో తొలిసారి అటవీ పరిరక్షణ చట్టం తీసుకువచ్చారు. వలస పాలకుల హయాంలో అమలుచేసిన అటవీ చట్టం- 1927కు ఇది కొనసాగింపు. దుంగలను కొట్టి అక్రమంగా అడవిని దాటించేవారిని నియంత్రించేందుకు బ్రిటిష్‌ పాలకులు తెచ్చిన చట్టం ఇది. దానిని మరింత సంస్కరించి తెచ్చినదే అటవీ పరిరక్షణ చట్టం.. కేంద్ర ప్రభుత్వానికి విశేష అధికారులను కట్టబెట్టింది. అటవీ భూముల్లో అటవీయేతర కార్యకలాపాలను రాష్ట్రాలు చేపట్టాలంటే కేంద్రం అనుమతి తప్పనిసరి. అడ్వైజరీ కమిటీ నివేదిక ఆధారంగా రాష్ట్రాల వినతులపై కేంద్రం నిర్ణయం తీసుకుంటుంది.

ప్రతిపాదనలివీ…
అటవీ విస్తీర్ణం పెంచేందుకు కేంద్రం తీసుకునే చర్యలు..చాలా సందర్భాల్లో రాష్ట్రాలు, ప్రైవేటు వ్యక్తులు చేపట్టే అభివృద్ధి ప్రణాళికలు ముందుకు పోకుండా అడ్డుకుంటున్నాయి. ఇటీవల కేంద్ర, రాష్ట్రాల మధ్య ఉద్రిక్తతలు పెరగడానికి ఇదీ ఒక కారణమే. ఈ క్రమంలో అటవీ పరిరక్షణ చట్టాన్ని తాజా పరిచేందుకు కేంద్రం సిద్ధమైంది. మార్పులు ఎలా ఉంటాయన్నది ఇటీవలవరకు బయటకు పొక్కలేదు. ఈ క్రమంలో కేంద్ర పర్యావరణ శాఖ ‘పరిరక్షణ పత్రం’ పేరిట తన ప్రతిపాదనలను బహిరంగ చర్చకు ఉంచింది. వచ్చే 15 రోజుల్లోగా ఈ ప్రతిపాదనలపై స్పందించాలని ప్రజలను కోరింది. ప్రాజెక్టు డెవలపర్లకు అనుకూలంగా తయారైన ప్రతిపాదనలివీ. అటవీ భూములను అటవీయేతర అవసరాలకు వాడుకునేందుకు ఇప్పుడు రాష్ట్రాలు, ప్రైవేటు డెవలపర్లు కేంద్రం అనుమతి తీసుకోవాల్సిందే. కానీ, కొన్నిరకాల మౌలిక కల్పన ప్రాజెక్టులను దీనినుంచి మినహాయించాలని తాజాగా ప్రతిపాదించారు. అటవీ భూముల మళ్లింపునకు ఇప్పటివరకు చట్టపరంగా ఉన్న కఠిన నియంత్రణలను తాజా ప్రతిపాదనలు మొత్తంగానే సడలించినట్టు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికి ఇవి ప్రతిపాదనలు మాత్రమే. ప్రజాభిప్రాయ సేకరణ దశలోని ఈ ప్రతిపాదనలను కేబినెట్‌ చర్చించాల్సి ఉంది. ఆ తర్వాత పార్లమెంటు ముందుకు కేంద్రం ప్రతిపాదనలు వెళ్లి.. అక్కడా ఆమోదం పొందితే అటవీ పరిరక్షణ చట్టానికి మరో సవరణ జరుగుతుంది.

మినహాయింపులు వీటికే..
అటవీ పరిరక్షణ చట్టం అమల్లోకి రాకముందు, అంటే 1980కి ముందు కేంద్ర రైల్వే శాఖ, కేంద్ర రోడ్డు రవాణా శాఖల పరిధిలో ఉన్న భూముల్లో జరిపే కార్యకలాపాలకు అనుమతులు అవసరం లేదు. జాతీయభద్రత దృష్ట్యా అటవీ భూముల్లో చేపట్టే ప్రాజెక్టులను చట్టం నుంచి మినహాయించారు.రోడ్లు, టవర్లు వంటి సరిహద్దుల్లోని మౌలిక కల్పన పనులు చేయాలంటే కేంద్రాన్ని సంప్రదించాల్సిన అవసరం లేదు. వీటిని మినహాయిస్తే.. అనుమతి లేకుండా అటవీ భూములను వేరే కార్యకలాపాలకు మళ్లించే ఏజెన్సీలు, వ్యక్తులకు జరిమానా, జైలుశిక్ష విధిస్తారు.

చట్టానికి సవరణలు..
అమల్లోకి వచ్చిన ఇన్నాళ్లలో అటవీ పరిరక్షణ చట్టానికి రెండు సవరణలు జరిగాయి. తాజాగా ఈ ఏడాది మార్చిలో మరో సవరణను కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఇప్పటివరకు 1988లో ఒకసారి, 1996లో రెండోసారి చట్టాన్ని సవరించారు. సుప్రీంకోర్టు ‘అడవి’ అనే పదానికి ఉన్న నిర్వచనాన్ని విస్తృతం చేస్తూ 1996లో కీలక తీర్పును వెలువరించింది. అప్పటివరకు కూడా… అటవీ చట్టం- 1927 పరిధిలోకివచ్చే భూములు, ఇతర స్థానిక భూములు, అటవీ శాఖ నియంత్రణ, నిర్వహణలోని భూములను మాత్రమే ‘అటవీ భూములు’గా ఎంచేవారు. వాటి పరిధిలోనే రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వ నిబంధనలు అమలయ్యేవి. గోదావర్మన్‌ తిరుముల్‌పాడ్‌ అనే వ్యక్తి వేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు 1996లో ముఖ్యమైన పరిశీలనలు చేసింది. అనుభవం, యాజమాన్యం, వర్గీకరణ, గుర్తింపుతో సంబంధం లేకుండా అటవీ శాఖ రికార్డుల్లో పొందుపరిచినవాటిన్నింటినీ ‘అటవీ భూములు’గానే పరిగణించాలని కోర్టు రూలింగ్‌ ఇచ్చింది. అలాగే ‘అడవి’ అనే పదానికి ఉన్న నిఘంటువు అర్థంతో సరిపోలే భూములను కూడా ఈ జాబితాలోకే తెచ్చింది. అంతేకాదు.. సుప్రీంకోర్టు నియమించిన నిపుణుల కమిటీ అధ్యయనం జరిపి గుర్తించే భూములను కూడా అటవీ పరిరక్షణ చట్టం పరిధిలోకి తెచ్చారు. అభివృద్ధి పనుల కోసం డీనోటిఫై చేసిన ప్పుడు..ప్రస్తుత నెట్‌ విలువ, ఆర్థిక విలువల ఆధారంగా పరిహారం చెల్లించే పద్ధతికీ కోర్టు తీర్పు తొలిసారి వీలు కల్పిం చింది. అలాగే, అటవీ పునఃసృష్టి నిధిని ఏర్పాటుచేయాలని, తీసుకున్న భూమికి సమా నంగా వేరేచోట భూమిని కేటాయించాలని కూడా స్పష్టం చేసింది.

అటవీచట్టం పలచన!
అడవిని పెంచుతామని ప్రపంచ వేదికలకు భారత్‌ వాగ్దానం చేసింది. మూడు బిలియన్‌ టన్నులుగా ఉన్న వార్షిక కార్బన్‌ వినియోగాన్ని 2030 నాటికి 2.5 బిలియన్‌ టన్నులకు కుదిస్తామని హామీ కూడా ఇచ్చింది. ఇందుకోసం రానున్న కాలంలో అటవీ విస్తీర్ణాన్ని 22 శాతం నుంచి 33 శాతానికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే, ఇందుకుభిన్నంగా ఇతర అవసరాల కోసం ‘అటవీ మళ్లింపు’ అనేది ఇటీవలికాలంగా బాగా పెరిగిపోయింది. ‘అడవిని కొట్టుకుంటాం.. అభివృద్ధి ప్రాజెక్టులు కట్టుకుంటాం’ అంటూ రాష్ట్రాలు కేంద్రంపై ఒత్తిడి పెంచేస్తున్నాయి. అటవీ భూముల్లో గనుల అక్రమ తవ్వకాలపై కోర్టులో వ్యాజ్యాలు నడుస్తున్నాయి. అరణ్యాల్లో ప్రైవేటు అవసరాలకు రోడ్లు వేయడంపై ట్రైబ్యునళ్లలో పడే పిటిషన్లు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా అడవిని కవచంలా కాస్తున్న అటవీ పరిరక్షణ చట్టం – 1980ను సరళతరం చేయాలని, ‘అడవి’ని నిర్వచించాలనే డిమాండ్‌ రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేటు వ్యక్తుల నుంచి వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ చట్టాన్ని తాజాపరచాలని కేంద్రం తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో అసలు ఏమిటీ చట్టం? రాష్ట్రాలకు, ప్రైవేటు వ్యక్తులకు ఏం కష్టం? అనేది పరిశీలించాల్సిన అవశ్యకత ఉంది.
-గునపర్తి సైమన్‌ / అర్చనా ప్రసాద్‌