అడవిపై హక్కు`ఆదివాసులదే’

రాజ్యాంగంలోని ఆరవ షెడ్యూల్‌లో చేర్చిన ఈశాన్య రాష్ట్రాలయిన అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరామ్‌లాంటి రాష్ట్రాలలోని అడవిని నమ్ముకొని ఉన్న గిరిజన తెగలకు, దేశంలోని 6వ షెడ్యూల్‌లో లేని మిగతా దేశం మొత్తం మీద ఇతర రాష్ట్రాలలోని అడవిని నమ్ముకొని బతుకుతున్న అయిదవ షెడ్యూల్‌లోని ప్రజలందరికీ ఈ చట్టం వర్తిస్తుంది. ఈ చట్టంలోని కొన్ని సెక్షన్స్‌ ఆక్రమణదారులను తొలగించేందుకు స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల చేయగా, వాటిని దుర్వినియోగం చేస్తున్న ప్రభుత్వాధికారులు అడవి నుండి ప్రజలను తరిమివేసేందుకు పెద్ద కుట్రచేస్తూ రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు, వాటి వెలుగులో వచ్చిన దేశ సర్వోన్నత న్యాయస్థానం(సుప్రీంకోర్టు), వివిధ రాష్ట్రాల హైకోర్టుల తీర్పులు, ఐదు, ఆరవ షెడ్యూల్ల స్ఫూర్తికి తిలోదకాలిచ్చి, బహుళజాతి సంస్థలకు, బడా పెట్టుబడిదారులకు అడవిని అప్పజెప్పేందుకు బృహత్‌ పథకాన్నే రచించాయి. -చిక్కుడు ప్రభాకర్‌
ఈదేశ మూలవాసులు ఆదివాసీలు. దేశవ్యాప్తంగా 16 రాష్ట్రాలలో తరతరాలుగా అడవిలోనే జీవిస్తున్న 12 లక్షల ఆదివాసీలను, అడవి నుంచి ఖాళీ చేయించాలని ఫిబ్రవరి 13వ తేదీన దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. 2006 సంవత్సరంలో దేశ పార్లమెంటు ద్వారా చేసిన ఆదివాసీ అటవీ హక్కుల చట్టం-2006ను రద్దు చేయాలని, ఈ చట్టం ఆదివాసీలు అడవిలో నివసించేందుకు, వ్యవసాయం చేసుకునేందుకు, అలాగే వారితోపాటు జీవించే ఇతర నిరుపేద తెగలకు కూడా అడవి మీద హక్కు కల్పిస్తుందని, ఈ హక్కులు వన్యమృగాల రక్షణ చట్టం, 1972నిబంధనలకు, అభయారణ్యంలోని పులుల రక్షణ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నదని, ఈ చట్టాన్ని కొట్టివేయాలని ‘వైల్డ్‌ లైఫ్‌ ఫస్ట్‌’ అనే స్వచ్ఛందసంస్థతో పాటు ఇతర సంస్థలు 2009 సంవత్స రంలో సుప్రీంకోర్టులో ఒక పిటిషెన్‌ వేసాయి. ఈ రిట్‌ పిటీషన్‌ తరపున గత కొద్ది సంవత్సరాలుగా వాదనలు కొనసాగుతున్నాయి. అటవీ హక్కుల చట్టం-2006లోని సెక్షన్‌2(0) చాలా స్పష్టంగా, గత మూడు దశాబ్దాలుగా, 2005 సంవత్సరం డిసెంబర్‌ కంటే ముందుగా ఎవరైనా అడవిలో బతుకు తున్నట్లయితే, వారికి అడవిలో నివసించే హక్కు, అలాగే వారు సేద్యం చేసుకుంటున్న భూమి మీద సర్వహక్కులు కల్పించాలని చెబుతున్నది. అలాగే సెక్షన్‌ 3(1)(ఎ) చాలా స్పష్టంగా ఈ విధంగా చెబుతున్నది. అడవిలో భూమి, ఇల్లు కలిగి ఉండి అక్కడే జీవిస్తున్న ఆదివాసులకు అడవిపై హక్కు ఉన్నది. ఈ హక్కులు కూడా తరతరాలుగా వారు జీవిస్తున్న సాంఘిక, సాంస్కృతిక, ఆర్థిక, రాజకీయ స్థోమతలకు ఎటువంటి భంగం కలిగించకుండా హక్కులను గుర్తించాల్సిందిగా చెబుతున్నది. అలా కాకుండా అడవిలోకి ఆక్రమణదారులుగా వస్తున్నవారికి ఎటువంటి హక్కులు కల్పించరాదని కూడా చెబుతున్నది. అయితే తరత రాలుగా అడవిని నమ్ముకొని, అడవిలోనే జీవిస్తున్న వేలాది తెగల జీవితాలు రోజురోజుకు దిగజారుతున్నాయి. రాజ్యాంగంలోని ఆరవ షెడ్యూల్‌లో చేర్చిన ఈశాన్య రాష్ట్రాలయిన అస్సాం, మేఘాలయ,త్రిపుర,మిజోరామ్‌లాంటి రాష్ట్రాలలోని అడవిని నమ్ముకొని ఉన్న గిరిజన తెగలకు, దేశంలోని 6వ షెడ్యూల్‌లో లేని మిగతా దేశం మొత్తం మీద ఇతర రాష్ట్రాలలోని అడవిని నమ్ముకొని బతుకుతున్న అయిదవ షెడ్యూల్‌లోని ప్రజలందరికీ ఈ చట్టం వర్తిస్తుంది. ఈ చట్టంలోని కొన్ని సెక్షన్స్‌ ఆక్రమణ దారులను తొలగించేందుకు స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల చేయగా, వాటిని దుర్వినియోగం చేస్తున్న ప్రభుత్వాధికారులు అడవి నుండి ప్రజలను తరిమివేసేందుకు పెద్ద కుట్రచేస్తూ రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు, వాటి వెలుగులో వచ్చిన దేశ సర్వోన్నత న్యాయస్థానం(సుప్రీంకోర్టు), వివిధ రాష్ట్రాల హైకోర్టుల తీర్పులు, ఐదు, ఆరవ షెడ్యూల్ల స్ఫూర్తికి తిలోదకాలిచ్చి, బహుళజాతి సంస్థలకు, బడా పెట్టుబడిదారులకు అడవిని అప్పజెప్పేందుకు బృహత్‌ పథకాన్నే రచించాయి. ఇందులో భాగంగానే రాజ్యాంగాన్ని, దానికి అనుగుణంగా వచ్చిన భూమి మీద అటవీ ప్రజలకు కలిగిన హక్కులను, ఆయా చట్టాల్లోని సారాన్ని సంపూర్ణంగా హరించివేస్తూ అడవిలో బతికే ఈ దేశమూలవాసులకు తీరని అన్యాయం చేస్తున్నారు. నలభై లక్షల ధరఖాస్తులలో 12 లక్షల ధరఖాస్తులు ఎందుకు ఆమోదించలేదు? దానికి గల కారణాలు ఏమిటి? ఒకసారి అవి ఆమోదించి చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా వారికి దక్కాల్సిన హక్కులు ఎందుకు కల్పించలేదు? ఒకవేళ అవి తిరస్కరణకు గురైతే అవి చట్టబద్దంగానే తిరస్కరణకు గురైనాయా? అలా చట్టబద్దంగా తిరస్కరణకు గురికాగానే వారికి చట్టబద్దంగా పై ఫోరాలలో అప్పీల్‌ చేసుకునే అవకాశం ఇచ్చారా? 1996 సంవత్సరంలో దేశ పార్లమెంటు చేసిన పంచాయత్‌ ఎక్స్‌టెన్షన్‌ షెడ్యూల్‌ ఏరియా చట్టం(పెసా)లోని నిబంధనలను వీరి ధరఖాస్తు తిరస్కరణలకు వర్తింపచేశారా? ఆదివాసీలకు, అడవిలో జీవించే ప్రజలందరికి రాజ్యాంగం కల్పించిన రక్షణలు, వాటి వెలుగులో వచ్చిన దేశ సర్వోన్నత న్యాయస్థానం తీర్పులతో పాటు, రాజ్యాంగ మౌలిక స్వరూపమైన, ఏ వ్యక్తికైనా సగర్వంగా సంపూర్ణ ఆరోగ్య జీవితం కల్పించాలని ఇచ్చిన తీర్పులన్ని ఆదివాసీ, అడవిలో బతికే వారందరికి వర్తిస్తాయి. కాని, ఇవేమీ పట్టించుకోకుండా దేశ సర్వోన్నత న్యాయస్థానంలో ముగ్గురు జడ్జీలు కలిగిన ధర్మాసనం ఇచ్చిన తీర్పు, 13 మంది జడ్జీలతో కూడిన ధర్మాసనం ఇచ్చిన తీర్పు కేశవానంద భారతి వర్సెస్‌ కేరళ నుంచి మొదలుకొని ఐదుగురు జడ్జీలు కలిగిన రాజ్యాంగ ధర్మాసనాలు వివిధ సందర్భాలలో ఇచ్చిన తీర్పులయిన, డి.టి.సి వర్సెస్‌ మజ్దూర్‌ కాంగ్రెస్‌, బంధుముక్తి మోర్చా వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా(1984), ఓల్గా తెల్లీస్‌ వర్సెస్‌ ముంబాయి మున్సిపల్‌ కార్పోరేషన్‌, సుభాష్‌కుమార్‌ వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ బీహార్‌, సి.ఇ.ఎస్‌.సి వర్సెస్‌ యన్‌.సి.బోస్‌ లాంటి ఎన్నో తీర్పులను ఆధారం చేసుకొని 1997 సంవత్సరంలో దేశ సర్వోన్నత న్యాయస్థానం సమతరవి కేసులో విస్తృత ధర్మాసనం అడవిపై ఆదివాసుల సర్వ హక్కులను గుర్తించింది. ఈ తీర్పులన్నింటితోపాటు సమతరవి వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ తీర్పును కూడా విస్త ృత దర్మాసనం నియమగిరి పర్వతాలలోని మైనింగ్‌ విషయంలో ఒరిస్సా మైనింగ్‌ కార్పోరేషన్‌ వేసిన కేసులో 2013 సంవత్సరంలో సమతరవి తీర్పును ఎత్తిపడుతూ, ఇదే విస్త ృత ధర్మాసనం అడవిలోని ఆదివాసుల, ఇతర గిరిజన, గిరిజనేతర ప్రజల సర్వహక్కులను ముఖ్యంగా జల్‌, జంగల్‌, జమీన్‌లను ధృవపరిచింది. అయితే విస్తృత ధర్మాసనం పై తీర్పులన్నింటిని పరిగణలోకి తీసుకోకుండా కనీసం కేంద్ర ప్రభుత్వం, కేంద్ర గిరిజన మంత్రిత్వశాఖ తమ ప్రమాణపత్రాలు దాఖలు చేయకుండానే, కేవలం అటవీ మంత్రిత్వశాఖ, వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ఉన్నత, ముఖ్య కార్యదర్శులు సమర్పించిన తప్పుడు ప్రమాణ పత్రాల ఆధారంగా రాజ్యాంగంలోని మౌలిక స్వరూపమైన జీవించే హక్కు, ఐదవ, ఆరవ షెడ్యూల్లు వాటి ఆధారంగా వచ్చిన వివిధ చట్టాలు, తమ సొంత తీర్పులకు భిన్నంగా రాసిన సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకించాల్సిన విశాల సమాజం, ఆదివాసీ, గిరిజన, హరిజన, బడుగు, బలహీనవర్గాల సామాజిక శక్తులవారు కూడా నోరు మెదపకపోవడం అత్యంత విషాదం. ఇటువంటి నిశ్శబ్ద పరిస్థితిని నా నాలుగు దశాబ్దాల ప్రజాజీవితంలో ఎప్పుడూ చూడలేదు. ఈ రోజు కేవలం 12 లక్షల ఆదివాసులను అడవి నుంచి పంపే తీర్పుతో మొదలయ్యే ఈ దుర్మార్గ ప్రక్రియ రేపు మొత్తం దేశంలోని 10 నుంచి 12కోట్ల వరకున్న ప్రజానీకాన్ని తరిమివేసి, బహుళజాతి సంస్థలకు, దేశీయ బడా పెట్టుబడిదారులకు, వారి దళారులకు అడవిని అప్ప జెప్పేందుకు జరుగుతున్న బృహత్‌ పథ కంగా, సమాజంలోని ప్రగతిశీలశక్తులన్నీ గుర్తించాలి.