అడవిపూల కదంబ మాల`ఆత్మగోష

ఆదివాసీల‘ఆత్మఘోష’ ను అక్షరీకరించి ఎత్తిచూపిన పాండు కామ్టేకర్‌ కథాత్మక కథనాల గుచ్చం ఇప్పటి వరకు తెలుగు కథా సాహిత్యాన్ని గిరిజనుల జీవిత ఇతివృతాలతో సుసంపన్నం చేసిన గిరిజన,గిరిజనేతర రచయితలు కూడా అబ్బుర పడేటంత గొప్పగా సంకలనీకరించిన అడవిపూల కదంబ మాల ఈ కథనాత్మక కథనాల సంపుటం…
అన్నం వండడానికి పొయ్యి మీద ఎసరు, పొయ్యి కింద మంటపెట్టి గాలికి వదిలేస్తే ఎసరొచ్చిన తరువాత ఆ అన్నం కుండ మీది మూత దానంతట అదే పైకి లేచి కిందపడిపోతుంది. అదే విధంగా తన గుండే గాడి పొయ్యిలో ఎసరులా మసిలిపోతున్న గిరిజనుల జ్ఞాపకాల భారాన్ని భరించి, భరించి ఇక భరించలేని స్థితిలోకి వచ్చిన కామ్టేకర్‌ అప్పటిదాకా ఎటువంటి రచనా చేసిన అనుభవం లేకపోయినప్పటికీ తను అనివార్యంగా ఈ కథా కథనాత్మక రచనకు శ్రీకారం చుట్టారు.

కామ్టేకర్‌ తన యాభై రెండేండ్ల జీవనయనంలో సుమారు పాతిక సంవత్సరాల పాటు ఆంత్ర పాలజిస్ట్‌ లపాలిటి బంగారు గని లాంటి ప్రాంతమైన చింతూర్‌ సమీప గ్రామమైన ‘కోయత్తూర్‌ బాట’ రామన్నపాలెంలో ఓస్వచ్ఛంద సంస్థలో నూటికి నూరుపాళ్ళు నిమగ్నమై, అదివాసీ జీవితాలకు సంబంధిం చిన సమస్త కోణాలనూ ఔపోసన పట్టినవాడు. పాఠకులు అతిశయోక్తి అనుకోకుంటే కామ్టేకర్‌ మన తెలంగాణాకు చెందిన మరో హైమం డార్ఫ్‌గా పేర్కొనదగినవాడు.తన స్వంత కుటుంబంతోపాటు మొత్తం ఆదివాసీ సమా జాన్నే తన బలగంగా భావించి,వారి అభ్యు న్నతికి తన పరిధి మేరకు అనేక విధాలుగా శ్రమించిన ఆదివాసీ ప్రేమికుడు. గిరిజన జీవితాలతో తనకున్న రెండున్నర దశాబ్దాల అనుబంధంలో తటస్థపడిన ప్రతి అనుభవాన్ని తన గుండెకవాటంలో తోరణాలుగా గుచ్చి ఒరుగులుగా దాచు కున్నవాడు కామ్టేకర్‌. తన వ్యక్తిగత,ఆరోగ్య కారణాలతో వ్యక్తిగా కోయ త్తూర్‌ బాట నుండి బయటికొచ్చినా మానసి కంగా తను అను నిత్యం గిరిజన జీవితాలనే శ్వాసిస్తున్న వ్యక్తి. అన్నం వండడానికి పొయ్యి మీద ఎసరు, పొయ్యి కింద మంటపెట్టి గాలికి వదిలేస్తే ఎసరొచ్చిన తరువాత ఆ అన్నం కుండ మీది మూత దానంతట అదే పైకి లేచి కింద పడి పోతుంది. అదే విధంగా తన గుండే గాడి పొయ్యిలో ఎసరులా మసిలిపోతున్న గిరిజనుల జ్ఞాపకాల భారాన్ని భరించి,భరించి ఇక భరించ లేని స్థితిలోకి వచ్చిన కామ్టేకర్‌ అప్పటిదాకా ఎటువంటి రచనా చేసిన అనుభవం లేకపోయి నప్పటికీ తను అనివార్యంగా ఈకథా కథనా త్మక రచనకు శ్రీకారం చుట్టారు. దాని ఫలి తమే మన చేతుల్లో వున్న ఈ సంపుటం. ఇందులో కోయపల్లె, పురుడు పోయడం,కొడ కల్పడం,బాణం తయారీ, సంతకు తయారీ, భూమి పండుగ, సుక్కుడు కాయ పండుగ,తాటి పండుగ,ఇప్పపూల పండుగ,కొలుపుల పండుగ,పెద్దమనిషి,చావు, కీడు నీళ్ళు,దినాలు, పేతర్లముంత,ఇంటి నిర్మాణం, గ్రంధాలయం, పెళ్లి,నేల-ఉపాధి,చీమ గుడ్ల కారం, ఆదివాసీ (కోయత్తూర్‌) కులమా? మతమా?, పోలవరం నిరసనలు,ఒంటరి మహిళలు-జీవన విధానం, గుజిడి, పోలవరం ప్రాజెక్ట్‌-తీరుతెన్నులు, ఓదార్పు-సమస్త జీవజాల మద్దతు,సమస్త సమాజానికి సూటి ప్రశ్న అనే ఇరవై ఎనిమిది శీర్షికలతో వ్రాసిన కథాత్మక కథనాలున్నాయి. ప్రతి కథనం ఒక్కో సమస్యను పాఠకుల ముందుకు తీసుకొచ్చి సవివరంగా వాటిని గురించి మనకు వివరిస్తూ మనను మనకు తెలియని లోకంలోకి చేయిపట్టి నడిపించుకు పోతాడు రచయిత కామ్టేకర్‌. మొట్ట మొదటి కథాకథనంలో ‘కోయపల్లె’లో చింతూర్‌ చుట్టుపక్కల ఉళ్ళన్నీ గుంపుల సముదాయం. ఒక్కొక్క గూడెంలో నాలుగు నుండి ఎనిమిది గుంపులుంటాయి.ప్రతి గుంపుకి ఓఇంటి పేరు వుంటుంది.ఆ ఇంటి పేరు వారే గుంపులో ఎక్కువగా వుంటారు. స్తూపాకారంతో చెక్కిన ఓవేప కర్రను పాతి, దాని చుట్టూ మట్టితో గద్దె వేస్తారు. దాన్ని ‘గామం’ లేదా బొడ్రాయి అంటారు. అక్కడే కొలుపుల పండుగ చేస్తారు. పండుగప్పుడు వెదురు బుట్టలో ఒక మట్టి ముంతను పెడతారు.దాన్ని ‘ముడుపు ముంత అంటారు. అందులో వున్న నీళ్ళల్లో పసుపు కలుపుతారు. ఆ పసుపును ‘బండారు’ అంటారు. ఆబండారును గుంపుల్లో అంటు వ్యాధులు ప్రబలినప్పుడు పిల్లలకు బొట్టు పెడతారు. వేల్పులు ఉన్న చోటును ‘అనె గొందే’ అంటారు. జువ్వి లేదా మద్ది చెట్టును గ్రామ దేవతగా ముత్యాలమ్మ పేరుతో కొలు స్తారు. పురుడు పోయడం కథా కథనంలో మంత్రసాని భద్రమ్మ ద్వారా గుంపుల్లో పురుడు ఏవిధగా పోస్తారో కూలంకషంగా వివరించిన సంద ర్భంలో కథకుడి జిజ్ఞాస ఏస్థాయిలో కొనసాగిందో మనకు అర్ధమౌతుంది. అదివా సీల్లో అమ్మాయి పుడితే కొడవలితోను, అబ్బాయి పుడితే బాణంతోనూ బొడ్డు కోస్తారట. ఈగ్రా మాల్లో గల గల పారే ఏటి దారిలో ఏర్పడే చిన్న చిన్న గుంతలను ‘అలంధర్‌’ అంటారట. ఈ అలంధర్ల దగ్గర ఆదివాసీలు విశ్రాంతి తీసుకుంటుంటారు.‘కొడ కల్పడం’అనే మరో కథా కథనంలో హిందూ ధర్మంలో కొన్ని సామాజిక వర్గాల్లో యుక్త వయస్కులౌతున్న మగపిల్లలకు మెడలో జంద్యము వేసి,దాన్ని ‘ఒడుగు’అంటారు. అదే ముస్లీముల్లో మగ పిల్లలకు సున్తీలు చేసి, ఒడుగు అంటారు.ఇక క్రైస్తవుల్లో ఓ నీటి మడుగులో చేయించే పవిత్ర స్నానాన్ని బాప్థిజమ్‌ పేరుతో ఒడుగు అంటారు. అదే ఆదివాసీల్లో పన్నెండేండ్ల మగపిల్లలందరినీ ఒకరోజు దేవర దగ్గరకు తీసుకుపోయి కోల్లను కోసి,వాటి మాంసంతో ఘాటైన చారు కాస్తారు. ఆ చారును ‘జొమ్ము’ అంటారు. ఆ చారుతో పాటు సారా,కల్లులను తాపించి పెద్దవాళ్ళతో సమానమైన హోదా ఇస్తారు.దాన్నే ఒడుగు అంటారు. ఆవిధంగా ఆలోచించి చూస్తే అన్నీ ధర్మాల్లోకల్లా అదీవాసీ ధర్మంలోనే అందరికన్నా ముందుగా ఈఒడుగు అనే ఆచారం ఆచరణలో వున్నట్టుగా అర్ధం చేసుకోవాల్సి వుంటుంది. ‘బాణం తయారీ’ కథా కథనంలో అడవిలో సంచరించే ఆదివాసికి బాణం అతిముఖ్యమైన వేట సాధనం.దాన్ని తయారు చేయడానికి ఎంతో నైపుణ్యం కావాల్సి వుంటుంది. ముందుగా పిల్లల్లు అడుకోడానికి చిన్న విల్లు బాణాలను తయారుచేసి ఇస్తారు. వాటిని ‘‘డుమ్మిరి విల్లు’’అంటారు.ఆ డుమ్మిరి విల్లే తదనంతరకాలంలో ‘డమ్మీ’ అనే ఆధునిక పదంగా మారిపోయి విస్తృత జనబాహుళ్యంలో వాడుకలో కొచ్చింది.‘ఎర్రగడ చేపలు’ అంటే? కొన్నిసార్లు ఎక్కువ చేపలు దొరికినప్పుడు కొన్ని తిని, మిగతా వాటిని తాటి కమ్మల్లో కాల్చి, దోరగా వేయించి,ఎండలో ఎండబెడతారు. వీటినే ‘ఎర్రగడ’ చేపలు అంటారు. వీటి రుచి ఆదివాసులకు ఎంతో ప్రీతి పాత్రమైనది. ‘సంతకు తయారు’ కథలో నేటి షాపింగ్‌ మాల్స్‌ కి మూల రూపమైన గిరిజన సంతలను గురించి కథకుడు చాలా విలువైన సమాచా రాన్ని అందించారు.అంతేకాదు నేటి ఆధునిక హెయిర్‌ డ్రెస్సర్స్‌ కు ఏమాత్రం తీసిపోని హెయిర్‌ డ్రెస్సర్స్‌ ఆదివాసీ మహిళల్లో ఏనాటి నుండో ఊహించ లేనంత కళాత్మకంగా వుండేదో కథకుడు ఎంతో వివరంగా తెలియజేశాడు.‘భూమి పండుగ’ కథా కథనం లో ఆదివాసీలు ప్రతిరోజూ సాయం కాలం తాటి కళ్ళు దింపుకుని వచ్చి,ఒకచోట కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ,తాక్కుంటూ, ఏదో ఒకటి నంజుకుంటూ గడుపుతారు.అట్లా కూర్చునే తావునే ‘‘గుజిడి’’ అంటారు.ఇట్లాగే ఇంకా మిగిలిన కథా కథనాల్లో కూడా మనకు తెలియని అనేక అంశాలను సందర్భో చితంగా వివరించిన రచయితకు ఆదివాసీల ఆచారవ్యవ హారాల్లో ఎంతటిలోతైన అవగాహన వుందో తెలుసుకుంటున్నా కొద్ది మనం ఆశ్చర్యచకి తులమై పోతుంటాము. వాటిల్లో మచ్చుకు కొన్ని….. కమతం అంటే? :- ఎక్కడైనా ఒక్కరే వ్యవసాయం చేసుకోవడం సాధ్యపడదు. అందుకే మూడు నాలుగు కుటుంబాలు కలిసి వారి భూమిని సమిష్టిగా కలిసి దున్నుకుని సాగుచేయడానికి చేసుకునే ఒప్పందం. ఈ కమతాల భావనే తదనంతర కాలంలో సహకార వ్యవసాయానికి మాతృక అయ్యిందేమో అన్పిస్తుంది.
రాగిపట్ట అంటే? :- గ్రామస్తులందరి భూమిని కలిపి ఒకే ఒక పట్టా రాగిరేకు పైన రాసి వుండేది.దీన్నే రాగి పట్టా అంటారు. నెయిదం అంటే? :- భూమి పండుగనాడు దేవతకు బలి ఇచ్చే జంతువు మాంసంతో చేసే వంటకం.ఆ మాంసంలోనే బియ్యం,పసుపు, కారం,ఉప్పు నూనె ప్రతి ఇంటి నుండి తెచ్చినవి అదే పాత్రలో వేసి,నీళ్ళు పోసి,దగ్గరికి ఉడికి స్తారు.అదే నేయిదం. ఆధునికులు చేసుకునే బిర్యానికి ఈ నేయిదమే మూలం అనవచ్చును. ‘కోయ వాళ్ళు’ అంటే? :- దేవరకు పెట్టే కోడిని కత్తితో కోయకుండా నేలకు కొట్టి చంపి, కోసు కుని తింటారు. కాబట్టి వాళ్ళను ‘కోయని వాళ్ళు’,కోయత్తురు అని అంటారు. పూర్ణ కల్లు అంటే? :- రోజు దించే కల్లును, దించకుండా వారంరోజులు వుంచితే చెట్టుకు కట్టి వుంచిన వెదురు గొట్టం నిండుతుంది. అలా నిండిన కల్లును ‘పూర్ణకల్లు’అంటారు. ఇప్ప పూల పండుగ అంటే :- ఇప్పచెట్టు పాలతో బండ కత్తుల పిడులను, కొడవళ్ళ పిడులను ఊడిపోకుండా వుండడానికి సన్నని ఇసుకతో కలిపి,పిడి చుట్టూ వున్న సందుల్లో ఇప్ప ఆకు పాలు పోస్తే ఆ పిడి గట్టిగా రాయిలాగా అతుక్కుంటుంది.అంతటి మహిమ గల చెట్టుకు మొట్టమొదటి సారిగా రాలిన పువ్వులను సేకరించే సందర్భంగా చేసుకునే పండుగానే ‘‘ఇప్పపూల పండుగ’’ అంటారు. బట్టలను ఉతకాలంటే :- మద్ది ఆకు బూడిదలో బట్టలన్నీ నానబెట్టి ఉతికితే మురికి అంతా పోయి, బట్టలకు కమ్మని వాసన వస్తుంది. వార్తలు :- చావు వార్తలు చెప్పడాని వెళ్ళేటప్పుడు చేతుల్లో గొడుగు పట్టుకెళితే అది కీడు కబురని అందరికీ తెలుస్తుంది.ఆ ప్రయాణాన్ని ఆపకుండా మిగతా వాళ్ళు సహకరిస్తారు. అదే శుభకార్యమైతే బాణం పట్టుకు పోతారు. వెట్టి అంటే?’’ :- ఆదివాసీలు తమ తమ ఇండ్లను పూర్తిగా సహకార పద్ధతిలో కట్టుకుంటారు. ఈ పద్ధతినే ‘వెట్టి’ అంటారు.కానీ,ఇదే వెట్టి అనే పదానికి భూస్వామ్య వ్యవస్థలో పేదవారు ముఖ్యంగా కులవృత్తుల వారు,భూస్వాములకు కొన్ని తరాలపాటు జీతం,బత్తెం లేని సేవలు చేయడాన్ని కూడా వెట్టి అంటారు.దీన్ని బట్టి ఒకే పదానికి సమాజాన్ని బట్టి,కాలాన్ని బట్టి అర్ధం మారిపోతుందన్న విషయం మన దృష్టికి వస్తుంది.
పెళ్లి అనే కథలో :- ఆదివాసీల్లో పెళ్లి చూపుల తతంగం ఏడు అంచలుగా సాగుతుంది. వాటిలోనూ పెళ్లి చేసుకునే అమ్మాయి, అబ్బాయి తరపువాళ్ళు ఏ ఒక్కరూ ఒకే తల్లి పాలు తాగివుండకూడదు.వాళ్ళ వరుసలు, గట్టులు అనుకూలంగా వున్నా, వారు ఒక తల్లి పాలు తాగితే వారి మధ్య అన్నా చెల్లి వరుస వున్నట్టుగా భావిస్తారు. అటువంటి బంధాన్ని ‘పాలవంకలు’ అంటారు. ఆటువంటి పెళ్ళిని వారు అంగీకరించరు.పెద్దల కారణంగా వచ్చే ఈ బాధలన్నీ పడలేకనే ప్రేమించుకున్న అమ్మాయిలు,అబ్బాయిలు చాలామంది లేచి పోయి,కొన్నాళ్ళ పాటు సహజీవనాలు సాగించి, ఆ తరువాత మెల్లగా పెళ్లిళ్లు చేసు కుంటారు. మామిడాకులన్నీ ఓచెట్టు చివరలో గుత్తులు గుత్తులుగా వుంటాయి. కొన్ని ఆకులు ఒకదాని కొకటి అంటుకొని ఒక సొరకాయ బుర్ర మాదిరిగా,గుండ్రంగా డొప్పలు డొప్పలు గా కట్టివుంటాయి.ఆ డొప్పల పైన వున్న రంద్రము లోకి ఎర్రచీమలు వస్తూ పోతూ వుంటాయి.ఆ చీమలను ‘అల్లి పెత్తెలు’ అంటారు.చీమలు ఆగూళ్ళల్లో పెట్టిన గుడ్లను సేకరించిన ఆది వాసీలు వాటిని చక్కగా వేయించి కారప్పొడి గాను,చారుగాను తయారు చేసుకుని తింటారు. అవి ఆరోగ్యానికి ఎంతో మేలుచేస్తాయి. ఈ విధంగా పుస్తకం అంతటా మనం ఎరుగని ఆదివాసీల జీవితానికి సంబంధించి ఇప్పటి వరకూ ఎవ్వరూ ప్రస్తావించని అనే విషయా లను కామ్టేకర్‌ తనదైన శైలిలో మనకు అందిం చడమే కాదు. ముందు తరాల గిరిజనులకు ఒక నిధిని సమకూర్చి పెట్టిన వారుగా మిగిలిపోతారు. ప్రధానంగా ఆదివాసీ బిడ్డల సేవా కార్యక్ర మాల్లో మునిగిపోయిన కామ్టే కర్‌కి రచనా ప్రక్రియల్లో ప్రవేశం లేకుండా పోయింది.ఆ కారణం చేతనే ఎంతో విలువైన సమా చారాన్ని పాఠకుల్లో ఉత్సాహాన్ని రేకెత్తించే కథన పద్ధతిలో వ్రాయలేక పోయా రేమో అన్పిస్తుంది.అదో ప్రధానమైన లోపంగా మిగిలిపోయింది. అయినప్పటికీ ఇప్పటివరకూ ఎవరూ పట్టుకొని విధంగా ఆదివాసీ దేవతల ఆత్మల ద్వారా కథనాలను నడిపించడం వినూత్నంగా వుంది. పాతికేళ్ళపాటు తన కార్య స్థానమైన రామన్న పాలెం పరిసర ప్రాంతాలన్నీ పోలవరం ముంపులో జలసమాధి కావడాన్ని జీర్ణించుకోలేక పోతున్న ఆదివాసీల ఆత్మఘోషను వాళ్ళ దేవతల ఆత్మఘోషగా వెల్లడిరచడం అతని ఊహాశక్తికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు.ముద్రా రాక్షసం కూడా అక్కడక్కడా కొంచం పాఠకుణ్ణి విసిగించే ప్రమాదం పొంచివుంది.
పై రెండు లోపాలను మినహాయిస్తే ఇప్పటి దాకా తెలుగులో వచ్చిన గిరిజన సాహిత్యంలో ఈ పుస్తకం ఒక మైలు రాయిగా నిలిచిపో యేంత గొప్పగావుంది.-ఇది శీరాంషెట్టి కాంతా రావు. రచయిత కామ్టేకర్‌ భవిష్యత్తు లోనూ ఇటు వంటి విలువైన మరిన్ని పుస్తకా లను వెలువరించాలని కోరుకుందాం!.
ఆత్మఘోష కథాసంపుట కోసం..:
ప్రచురణ : బోధి ఫౌండేషన్‌ పేజీలు : 241 ధర : 400/- రూ.లు.
సెల్‌ నెం. : 63004 84726