గిరిజన గ్రామసభలకు పునరుజ్జీవం ఎప్పుడూ..?

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం గ్రామసభలకు ఇస్తున్న ప్రాధాన్యత అభినందనీయం.గతనెల ఆగస్టు 23న రాష్ట్రంలో13,236గ్రామ పంచాయితీల్లో ఒకరోజు గ్రామసభలు నిర్వహించిన పంచా యితీలకు పునరుజ్జీవం కల్పించింది.అయితే ఆదివాసీ ప్రజలకు భారత రాజ్యాంగం కొన్ని విశేషమైన హక్కులు కల్పించింది.సమత సుప్రీంకోర్టు జడ్జెమెంటు ద్వారా ఆదివాసుల భూమి,అడవి,నీరు, వనరులపై ప్రత్యేకమైన హక్కులు కల్పించబడ్డాయి.అలాగే కొండ,కోనల్లోని ఆదివాసుల సంప్రదాయ గ్రామసభలకు సముచిత గౌరవం ఇవ్వడానికి ఉద్దేశించిన పంచాయతీరాజ్‌-షెడ్యూలు ప్రాంతాల విస్తరణ చట్టం(పెసాచట్టం-1996)షెడ్యూల్డ్‌ ప్రాంతాలలో గ్రామసభలకు ప్రత్యేక అధికారాలను ఇచ్చింది.వీటిపై రాష్ట్రప్రభుత్వం ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
సహజ వనరులనిర్వహణ కోసం గ్రామసభలో చురుకైన ప్రమేయంతో గిరిజన జనాభాను దోపిడీకి గురికాకుండా,స్వయంప్రతిపత్తిని అందించడం ప్రధాన లక్ష్యం.ఆదివాసుల భూమి,అటవీపై వారిహక్కులను పరిరక్షిస్తోంది. సుమారు మూడు దశాబ్దాల క్రితం పెసాచట్టం కోసం దేశవ్యాప్తంగా గిరిజనులు పోరాడారు. ముఖ్యంగా ప్రముఖ విశ్రాంతి ఐఏఎస్‌ అధికారులు స్వర్గీయ బీడీశర్మ,ఎస్‌ఆర్‌ శంకరన్‌,దిలీప్‌సింగ్‌ భూరియా వంటి గిరిజనతెగల స్పూరి ్తదాతల సహకారం కూడా మరవలేనిది.
ఈచట్టం ప్రకారం ఆదివాసీ ప్రాంతాల్లో గ్రామపంచాయితీని కాకుండా గ్రామసభను కేంద్రబిందువు చేశారు. గ్రామసభకు విశేషాధి కారాలను కల్పించారు.రాజ్యాంగంలోని ఐదో షెడ్యూలు జాబితాలోని ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ,ఒడిశా,ఛత్తీస్‌గఢ్‌,జార్ఖండ్‌,మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, కర్ణాటక, బిహార్‌లలోని షెడ్యూలు ప్రాంతాల్లోని ఆదివాసీ ప్రాంతాలన్నింటికీ ఈచట్టం వర్తిస్తుంది.ఆదివాసీ ప్రాంతాల్లో గ్రామపంచాయితీని కాకుండా గ్రామసభను కేంద్రబిందువు చేశారు.గ్రామసభకు విశేషాధి కారాలను కల్పించారు.ఈపెసాచట్టం ఏర్పడి28ఏళ్లు పూర్తియింది.అయినా సరేనేటికీ చట్టం లక్ష్యాన్ని పూర్తిస్థాయిలో అమలు పర్చడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయి.ఆదివాసుల జీవనోపాధుల మెరు గుదల,అటవీ హక్కుల కల్పన,మౌలిక వసతుల అభివృద్ధి తదితర కీలక అంశాల్లో వారికి స్వయం పాలన హక్కులు కల్పించే పీసాచట్టం స్ఫూర్తిని ఇన్నేళ్లలో ప్రభుత్వ వ్యవస్థలు పూర్తిగా అర్థం చేసుకోలేక పోయాయనే చెప్పాలి.జల,అటవీవనరులను తమ అవసరాలకు వాడుకుని సంరక్షించుకునే విధంగా గ్రామ సభలను సుశిక్షితంచేయాలి.
విద్యా,వైద్య కేంద్రాలను పర్యవేక్షించే బాధ్యత ఉంటుంది.అభివృద్ధి ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణ,నష్ట పరిహారపంపిణీ,గనుల తవ్వకాలకు అవసరమైన లీజుల మంజూరుకు గ్రామసభల అనుమతి తప్పనిసరి.ఆవాసాల సామాజిక,ఆర్థిక అభివృద్ధి కార్యక్రమాలకు సంబం ధించిన ప్రణాళికల రూపకల్పనబీ గిరిజనాభివృద్ధి ఉపప్రణాళిక నిధులను ఖర్చు చేసేందుకు తప్ప నిసరిగా గ్రామసభల పాత్ర ఉండాలి.సంక్షేమ పథకాల్లో లబ్ధిదారుల గుర్తింపు,చిన్న తరహా అటవీ ఉత్పత్తులపై యాజమాన్య హక్కులు,మద్యం అమ్మకాలు,వడ్డీ వ్యాపారాలపై నియంత్రణ తదితర విషయాల్లో గ్రామసభలకు పూర్తి అధికారాలు ఉంటాయి. గిరిజన ప్రాంతాల్లో చేపట్టే అభివృద్ధి పనుల కోసం విడుదలయ్యే జమా ఖర్చుల ధ్రువపత్రాలను అధికారులు గ్రామసభల నుంచి తీసు కోవాలి.
పెసాతో సహా ఇతర గిరిజనరక్షణ చట్టాలు,సంబంధిత నిబంధనలపైశిక్షణ,అవగాహన పెంచే బాధ్యత,అమలుతీరును పర్యవేక్షణ బాధ్యతలు ప్రభుత్వంశ్రద్ద తీసుకోవాలి.గ్రామసభల ప్రాముఖ్యతపై ఆదివాసీ ప్రజలకు అవగాహన కల్పించాలి.విశేషాధికారాలున్న పెసా చట్టం నియమ నిబంధనల మేరకు,షెడ్యూల్‌ప్రాంతాల్లో గ్రామసభలు సమర్ధవంతంగా అమలయ్యేలా ఆదివాసులకు హక్కులు కల్పించాలి.వారికి స్వయంపాలన కల్పించాల్సిన అవశ్యకత ఎంతైనా ఉంది.– రెబ్బాప్రగడ రవి,ఎడిటర్ 

పకృతి శాపమా?..మన పాపమా.?

దేశంలో సంభవిస్తున్న వరుస ఉత్పాతాలు భూమిపై వాతావరణ మార్పునకు సూచికలు. ఇదివరకు వందేండ్లలో వచ్చినమార్పుగా భావిస్తే, ఇప్పుడు తుఫాన్లు,భారీవర్షాలు,మెరుపులు, శీతల గాలులు,వడగాల్పులు,వరదలు,కరువు,కొండచరియులు విరిగిపడడం వంటివి త్రీవమైన ప్రకృతి విధ్వంస ఘటనలు ఐదేండ్లలో అనేకం చూస్తున్నాం.వాస్తవానికి పర్యావరణాన్ని సంరక్షిస్తే..అది మానవాళి ప్రయోజనాలు కాపాడుతుంది.యధేచ్ఛగా విధ్వంసక దుశ్చర్యలకు తెగబడితే,అనూహ్య స్థాయిలో ఇలాంటి విఫత్కర పరిస్థితులే దాపురిస్తాయి.ఇది కొన్నేళ్లుగా పదేపదే నిరూపితమవుతున్న సార్వత్రిక సత్యం.ప్రకృతిపట్ల మనిషిలో మేటవేసిన అలసత్వం,నిర్లక్ష్యం,అడ్డూఆపూలేని పారిశ్రామీకీక రణల దారుణ పర్యవసానమే విఫత్తుల పరంపరం.దేశంలో ఈఏడాది రెండు,మూడు,నెలల వ్యత్యా సంలో రెండు ప్రకృతి విధ్వంసక సంఘటనలు చోటు చేసుకున్నా విషయం తెలిసిందే.కేరళలోని సుందరమైన వయనాడ్‌ ప్రకృతి ఆగ్రహానికిగురై శ్మశానస్థలిగా మారిన దృశ్యాలు చూస్తుంటే ఎవరికైనా భావోద్వేగం కలగకమానదు.జూలై 29న ప్రజలంతా నిద్రిస్తున్న వేళ భారీఎత్తున కొండచరియలు విరిగి మీద పడడంతో చిగురాకులా వణికిపోయి వందలాది మంది నిండు ప్రాణాల్ని కబళించాయి.మే నెలలో హిమాచల్‌ ప్రదేశ్‌లోని కాంగ్రాజిల్లాలోని లంబడుగ్‌ జలవిద్యుత్‌ ప్రాజెక్ట్‌ డ్యామ్‌ ధ్వంస మైంది.దీంతో బురద,బండరాళ్లువచ్చి వ్యవసాయ పొలాలు,దుకాణాలు,ఇళ్లు దెబ్బతిన్నాయి. ఈరాష్ట్రం లో గతపదేళ్లలో కనీసం14ఘటనలు జరగ్గా,35మంది ప్రాణాలు కోల్పోయారు.అదేవిధంగా జూలైలో సంభవించిన భారీ వర్షాలకు దేశ ఆర్ధిక రాజధాని ముంబాయిని ముంచెత్తేసింది.రికార్డుస్థాయిలో నీటిమట్టం పెరిగి వర్షపాతం నమోదయ్యింది.దీంతో నగరంలో జనజీవనం స్తంభించి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
తూర్పుకనుమల్లో విశాఖ ఉమ్మడి జిల్లా అరకు దరి కోడిపుంజువలస గ్రామంలో 1995లో సంభవించిన వరదలకు పచ్చనికొండ కరిగిపోయింది.బురదమట్టి,కొండచరియలు విరగబడి భారీ స్థాయిలోనే ప్రకృతి విధ్వంసం సంభవించింది.ఇలాంటి ప్రకృతి విఫత్తులు పర్యావరణ విధ్వంసం, భూతాపాలే ఇందుకు మూలకార ణాలని(వైజ్ఞానిక పర్యావరణ కేంద్రం`సీఎస్‌ఈ)అధ్యయనం వెల్లడి స్తోంది.దేశంలో అటవీ ఛాయ హరించుకుపోతుండటాన్ని ప్రస్తావించింది.
నవ్యాంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాలు విభజన నేపథ్యంలో గిరిజన ప్రాంతాలు రాజ్యాంగ ఉల్లంఘనలకు గురవుతుంది.అల్లూరి జిల్లా.చింతపల్లి మండలం, ఎర్రవరం గ్రామంలో హైడ్రోపవర్‌ ప్రాజెక్ట్‌ నిర్మాణానికి సర్కారుధారాదత్తం చేసి,కొండకోనల నడుమ ప్రశాంతంగా ఉండే గిరిజనుల గూడేల జీవితాల్లో చిచ్చుపెట్టింది.ఈప్రాజెక్టు నిర్మాణంవల్ల 32గిరిజన గ్రామాలు ముంపునకు గురికానున్నాయి.షెడ్యూల్‌ ప్రాంతాల పరిరక్షణకు సమత చేసిన ఉద్యమం మేరకు సుప్రీంకోర్టు ఇచ్చిన సమత జడ్జెమెంటు ఉన్నప్పటికీ ఉల్లంఘనలు జరుగుతూనే ఉన్నాయి.ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ ఏజెన్సీలోచోరబడి ఎక్కడబడితే అక్కడ పర్యాటకప్రాజెక్టులు నెలకొల్పి పర్యావరణానికి విఘాతం కల్గిస్తోంది.పర్యావరణ పరిరక్షణకు ఎక్కడా సంరక్షణ లేని పరిస్థితి నేడు ఏజెన్సీ ప్రాంతాల్లో ఏర్పడిరది. పర్యావరణ పరిరక్షణ,నీటివనరులసంరక్షణపై 2009లో సమత కొండల ఆరోగ్యమే..పల్లపు ప్రాంతాల సౌభాగ్యం అనే నినాదంతో ఉత్తరాంధ్ర జిల్లాలో భారీస్థాయిలో అవగాహన ర్యాలీ చేపట్టాం.అభివృద్ధి పేరుతో వాతావరణాన్ని,పర్యావరణాన్ని వినాసనం చేయరాదని,కొండలు ఆరోగ్యంగా ఉంచితేనే మైదాన ప్రాంతాలకు ప్రాణాధారమైన నీటివనరులు లభిస్తాయని సూచించింది.
ఈనేపథ్యంలో ప్రకృతి ప్రసాదించిన సహజ సంపద అంతా విచక్షణాయుతంగా మానవ జాతి గర్విష్టంగా మేలు చేసేలా సద్వినియోగం కావాలి. అటువంటి పర్యావరణ స్పృహ ప్రభుత్వాలు, పాలక గణాల్లో కొరవడితే రేపటితరాలు మనల్ని క్షమించవు! –రెబ్బాప్రగడ రవి,ఎడిటర్ 

పెరుగుతున్న వాతావరణ ఉష్ణోగ్రతలు

ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో సంభవిస్తున్న వాతావరణ ఉష్ణోగ్రతల్లో పెనుమార్పులు సంభవిస్తూ మానవ మనుగడకు విఘాతం కలుగుతోంది.ముఖ్యంగా ఈ ఏడాది దేశవ్యాప్తంగా ఎండలు పెరిగి సూర్యప్రతాపానికి జనాలు అల్లాడుపోయారు.దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నట్లు భారత వాతావరణశాఖ ప్రకటించింది.చాలా ప్రాంతాల్లో 45డిగ్రీల కంటే ఎక్కువఉష్ణోగ్రత నమోదయిందని ఐదు రాష్ట్రాలకు వాతావరణశాఖ వెల్లడిరచిది. ఏప్రిల్‌, మే,జూన్‌ నెలల్లో వడదెబ్బ తగిలి అనేకమంది ప్రాణాలు కోల్పోయిన ఉదంతాలను విన్నాం.ఢల్లీిలో రికార్డుస్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదుయ్యాయి.ముంగేష్‌పుర్‌లో అత్యధికంగా52.9డిగ్రీల ఉష్ణోగ్రత నమోదై వడదెబ్బ కేసులు పెరిగాయి.వడదెబ్బతో ఐదుగురు మృతిచెందారు.
కేవలం భారత్‌లోనే కాకుండా..ప్రపంచదేశాల్లో గతజూన్‌లో దాదాపు 5బిలియన్ల మంది ప్రజలు తీవ్రమైన వేడినిభరించారు.భారతదేశంలో 619 మిలియన్ల మంది ప్రభావితమయ్యారని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.యుఎస్‌లోని ఓస్వతంత్ర శాస్త్రవేత్తల బృందం చేసిన కొత్తవిశ్లేషణ ప్రకారం,జూన్‌లో తొమ్మిదిరోజులపాటు భారతదేశంనుండి 619మిలియన్ల మందితో సహా ప్రపంచ వ్యాప్తంగా దాదాపు ఐదు బిలియన్ల మంది ప్రజలు వాతావరణ మార్పు-ఆధారిత విపరీతమైన వేడిని అనుభవించారని పేర్కొంది.క్లైమేట్‌ సెంట్రల్‌ నివేదిక ప్రకారం జూన్‌లో పొక్కులు వచ్చే వేడి భారతదేశంలో 619 మిలియన్లు, చైనాలో 579 మిలియన్లు, ఇండోనేషియాలో 231 మిలియన్లు, నైజీరియాలో 206మిలియన్లు, బ్రెజిల్‌లో 176మిలియన్లు,బంగ్లాదేశ్‌లో 171 మిలియన్లు, యుఎస్‌లో 165మిలియన్లు, ఐరోపాలో 152మిలియన్లు, మెక్సికోలో 123మిలియన్లు, ఇథియోపియాలో 121 మిలియన్లు మరియు ఈజిప్టులో103మిలియన్లు.ఈవిధంగా ప్రపంచ జనాభాలో 60శాతానికి పైగా ప్రజలు తీవ్రమైన వేడిని ఎదుర్కొన్నారు. ఇదిజూన్‌16-24 మధ్య వాతావరణ మార్పులవల్ల కనీసం మూడు రెట్లు ఎక్కువ అవకాశం ఉందని క్లైమేట్‌ సెంట్రల్‌లోని చీఫ్‌ ప్రోగ్రామ్‌ ఆఫీసర్‌ ఆండ్రూ పెర్షింగ్‌ వెల్లడిరచారు.ఒకశతాబ్దానికి పైగా బొగ్గు,చమురు,సహజ వాయువులను కాల్చడంవల్ల మనకు పెరుగుతున్న ప్రమాదకరమైన ప్రపంచాన్ని అందించిందని అభిప్రాయపడ్డారు.
అయితే ఇలాంటి దుర్ఘటనలు భవిష్యత్తులో సంభవించ వచ్చని సమత గతమూడు దశాబ్దాల నుంచి గుర్తిచేస్తూనే ఉంది.వాతావరణంలో సంభవిస్తున్న మార్పులు, పర్యావరణ పరిరక్షణపై తీసుకోవాల్సిన చర్యలపై అనేక ఉద్యమాలు చేపట్టడం జరిగింది.ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సమత ఉహించినట్లుగానే వాతావరణంలో సంభవిస్తున్న పెనుసవాల్‌ను నేడుప్రపంచదేశాల ప్రజలు ఎదు ర్కొంటున్నారు.ఈవేసవిలో ప్రపంచవ్యాప్తంగా వేడితరంగాలు అసహజ విపత్తులు ఉద్భవించాయి.
దేశంలోని దాదాపు 40శాతం ఏప్రిల్‌ నుండి జూన్‌ మధ్యకాలంలో సాధారణం కంటే రెట్టింపు హీట్‌వేవ్‌ రోజులను నమోదు అయ్యాంది. దేశంలోని కొన్ని నగరాలు 50 డిగ్రీల సెల్సియస్‌ను అధిగమించాయి.పెరుగుతున్న అధిక ఉష్ణోగ్రతల నియంత్రణపై ప్రపంచదేశాలు తీసుకుంటున్న నిర్ణయాలపై ప్రజలను చైతన్యవంతులను చేయాల్సిన బాధ్యత ప్రభుత్వయంత్రాంగంపై ఉంది.ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ప్రజలు సైతం భాగస్వాములు కావాలి.బహుళజాతి కంపెనీల నియంత్రణపై చర్యలు చేపట్టాలి.దీనికి సమాఖ్యతభావంతో పోరాడినప్పుడే వాతావరణ మార్పులుపై సమూలమైన మార్పులు తీసుకురాగలం. -రెబ్బాప్రగడ రవి,ఎడిటర్ 

భూమిని రక్షిద్దాం..పర్యావరణాన్ని కాపాడుదాం!

తాము సామాజిక సేవా కార్యక్రమాలు ప్రారంభించినప్పటి నుంచీ పర్యవరణ పరిరక్షణ కోసం ఉద్యమిస్తూనే ఉన్నాం.బహుళజాతి ప్రాజెక్టులు నిర్మాణాలు,ఇతర కట్టడాలు వల్ల పర్యవరణం దెబ్బతింటూందని 1991లోనే పోలవరం డ్యామ్‌ నిర్మాణానికి వ్యతిరేకంగా సుమారు రెండువేల కిలోమాటర్లు దూరం మన్యప్రాంత చైతన్య యాత్ర చేట్టి ప్రజల్ని చైతన్యవంతులను చేశాం.2009లో ఉత్తరంధ్ర,ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో కూడా కొండల ఆరోగ్యమే పల్లపు ప్రాంతాల సౌభగ్యం అనే నినాదంతో మరో పాదయాత్ర చేపట్టాం.ఇదింతా ఎందుకంటే వాతావరణంలో చోటు చేసుకుం టున్న మార్పులపై కొన్ని దశాబ్దాల నుంచి ప్రపంచవ్యాప్తంగా ఉద్యమాలు జరుగుతూనే ఉన్నాయి.దీన్ని పరిగణనలోకి తీసుకున్నా తాము వాతావరణ మార్పుల్లో చోటుచేసుకుంటున్న పరిణామాలు ఎప్పటి కప్పుడు ప్రజలు చైతన్యవంతు చేస్తూ వస్తూన్నాం.
క్రమీణా ఉష్ణోగ్రతలు పెరుగుదల,హిమాలయాల్లో మంచుగెడ్డలు కరిగిపోయి సముద్రంలో నీటిమట్టం పెరుగుదల,దీంతోపాటు సముద్రతీర దరిలో పెరుగుతున్న పరిశ్రమల ద్వారా సముద్రంలోకి విడిచిపెడుతున్న కాలుష్య కారకాలు పెరుగుతున్నాయి.మరిముఖ్యంగా ప్రస్తుత పరిస్థితుల్లో మానవ వసరాలు విపరీతంగా పెరగడంతో వాతావరణంలో పెనుమార్పులు సంతరించుకుంటున్నాయి.దీని కారణంగా విపరీతమైన ఉష్ణాగ్రతలు పెరుగుతున్నాయి.పర్యావరణ పరిరక్షణపై ప్రపంచ దేశాలు కలసి విస్త్రత నియంత్రణ చర్యలకు ఉపక్రమించాయి.అటవీ,పర్యావరణ విభాగాలను అప్రమత్తం చేశాయి.వాతావరణ మార్పు అనేది మన ఇప్పుడు ఎదుర్కొంటున్న అత్యంత తీవ్రమైన ముప్పులలో ఒకటి.
ఇటీవల రాజస్థాన్‌ రాష్ట్రంలో వేడుగాలులకు మరణాలు సంభవించడంతో ఆరాష్ట్రహైకోర్టు సంచాలనాత్మక తీర్పు నిచ్చింది.వేడిగాలులు,చలిగాలులను జాతీయ విపత్తుగా ప్రకటించాల్సిన సమయం ఆసన్నమైందని,వాటిని ఎదుర్కొనేందుకు ముందస్తు సన్నాహాలు చేయాలని జస్టిస్‌ అనూప్‌ కుమార్‌ దాండ్‌తో కూడిన సింగిల్‌ జడ్జి ధర్మాసనం పేర్కొంది.మానవ జీవులను కాలుష్యం,కల్తీ ఆహార పదార్థాల వినియోగం నుండి రక్షించడానికి తగిన చట్టాన్ని తీసుకురావాలని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.వేసవిలో 50డిగ్రీల సెల్సియస్‌్‌ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని, లక్షలాది మందిపై ప్రభావం చూపుతుందని కోర్టు పేర్కొంది. అయితే కేవలం రాజస్థాన్‌ రాష్ట్రంలోనే కాకుండా ఏపీలో కూడా ఈఏడాది అంతకంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు ప్రజలు అనుభవించారు. వాతావరణ మార్పు,ప్రకృతికి మానవనిర్మిత మార్పు అలాగే జీవవైవిధ్యానికి విఘాతం కలిగించే నేరాలు,అటవీ నిర్మూలన,చెట్ల నరికివేత,భూ వినియోగ మార్పులు,సహజ నీటి వనరులను నాశనం చేయడం మొదలైనవివిధ్వంసం వేగాన్ని వేగవంతం చేస్తాయని పేర్కోంది.
ఈనేపథ్యంలో మనమందరం మన మాతృభూమి నుండి మనకు లభించే ప్రతిదాన్ని గౌరవించాలి మరియు నిర్వహించాలి.మన భవిష్యత్‌ తరాలు సురక్షితమైన వాతావరణంలో జీవించేలా భూమి మాతను కాపాడుకోవాలి.చెట్లను,సహజ వృక్ష సంపదను,నీటి సహజ వనరులను కాపాడు కోవడం ద్వారా భూమిని కాపాడుకోవచ్చు.దేవుడు మనకు ఇచ్చిన అమూల్యమైన బహుమతి భూమి అని రాశాడు.ఈభూమి మనకు అన్నీ ఇచ్చింది.తల్లి తన బిడ్డను ఎలా పోషిస్తుందో, భూమి మనలను అదే విధంగా పోషించింది,అందుకే దీనిని మనం భూమి అని పిలుస్తాము,కానీ అది ఇబ్బందుల్లో ఉంది.మన భవిష్యత్‌ తరాలు సురక్షితమైన వాతావరణంలో జీవించేలా భూమిని కాపాడుకోవాలి. పర్యావరణ కాలుష్యం మరియు గ్లోబల్‌ వార్మింగ్‌ను నియంత్రించడానికి సాధ్యమయ్యే అన్ని చర్యలను మనం ఖచ్చితంగా పాటించాలి.కాలుష్యాన్ని అరికట్టడానికి మరియు గ్లోబల్‌ వార్మింగ్‌ ప్రయత్నాలను తగ్గించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి.!-రెబ్బాప్రగడ రవి,ఎడిటర్ 

ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత కీలకం

రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి.మే 13న జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి ఓటును సద్వినియోగం చేసుకోవాలి.పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. మంచి నాయుకుడిని ఎన్నుకుంటేనే భవిష్యత్తు బాగుంటుంది.ఎన్నికల్లో ఉత్తములను ప్రజాప్రతి నిధులుగా ఎన్నుకుంటే సత్ఫలితాలు ఉంటాయి. ఓటు హక్కు వినియోగం విషయంలో స్వచ్ఛంధంగా నిర్ణయం తీసుకోవాలి.ఎవరో చెప్పారని ఓటు వేయకూడదు.దీనిపై మరింతగా చైతన్యం పెంపొం దించాలి. ప్రజాస్వామ్య పరిరక్షణకు ఓటును వజ్రాయుధంగా వినియోగించాలి. విద్యావంతులను ఎన్నుకుంటే సుపరిపాలనకు అవకాశం ఉంటుంది.నేర చరితులు చట్టసభల్లోకి వెళ్లకుండా చూడాలి. ఈ బాధ్యతను యువత తీసుకుని భావితరాలకు ఆదర్శంగా నిలవాలి.
ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత కీలకమైనదని, ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగిం చుకోవాలని ఎన్నికల సమయంలో ఓటు హక్కు గల ప్రతి ఒక్కరు తమ ఓటును ఎలాంటి ఒత్తిడులకు, ప్రలోభాలకులోను కాకుండా సక్రమంగా వినియోగించుకొని సమర్థవంతమైన నాయకత్వాన్ని ఎన్ను కోవడం ద్వారా దేశాన్ని అభివృద్ధి చేసుకుందాం.దేశాన్ని పాలించే నాయకులను ఎన్నుకునే హక్కు రాజ్యాంగం మనకు కల్పించిన వరం.ఈహక్కును సద్వినియోగం చేసుకొని సమర్థవంతమైన నాయక త్వాన్ని ఎన్నుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.ఓటు విలువ,ప్రాముఖ్యత తెలుసుకోవాలి.ఇతరలను చైతన్యవంతులను చేయాలి. ప్రజాస్వామ్యంలో ఓటు విలువ ఎంతో గొప్పదని, దానిని సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడిపై ఉందని చాటిచెప్పాలి.
దేశ ఆర్థిక,సామాజిక,రాజకీయాలలో ఓటు హక్కు ఎంతో విలువైన పాత్ర పోషిస్తుంది. అర్హతగల ప్రతిఒక్కరూ ఓటుహక్కు వినియోగించుకోవాలి.నోటుకు తలవంచితే జీవితాంతం తలదిం చుకునే జీవించాల్సిన పరిస్థితి తలెత్తుతుంది.విజ్ఞులైన భవిష్యత్‌ భద్రంగా ఉండాలంటే నీతి నిజా యితీగా ఎన్నికల్లో పోటీచేసి వారికి అండగా నిలవండి.ఓటును మించిన ఆయుధం లేదు.మనం వేసే ఓటు బుల్లెట్‌ కన్నా బ్యాలెట్‌ పవర్‌ గొప్పది.ఆదాయం,చదువులో మాత్రమే కాదు..సామాజిక బాధ్యతతో కూడా ఓటు వేసేందుకు ముందుండాలి.ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ ఓటే వేసేలా ఇంటిలో,ఆఫీసుల్లో,బంధువులు,స్నేహితులకు అవగాహన కల్పించి చైతన్యపర్చాలి.ఓటుకు మించిన ఆయుదం లేదు.ఓటుతో తీసుకురాలేని విప్లవం ఉండదు.ఓటు అనేది హక్కు కాదు..నీబాధ్యత. బాధ్యతాయుతమైన పౌరులు అనిపించుకోవాలంటే ఓటుహక్కును తప్పనిసరిగా వినియో గించు కోవాలి.
ప్రజాస్వామ్యాన్ని మన ఓటేనడిపిస్తుంది.భవిష్యత్తుకు ఓటు అభివృద్ధికోసం ఓటు. ప్రజా స్వామ్య విలువలకు జీవంపోయాలి.ప్రజాస్వామ్యంలోవిలువలను చాటి చెప్పాలన్నా, అక్రమార్కుల పాలనకు స్వస్తి పలకాలన్న నీ ఓటే కీలకం. ప్రజాసంక్షేమానికిపాటు పడేవారిని ఎన్నుకోవాలి. ఓటుహక్కును నిర్భయంగా వినియోగించుకొన్నప్పుడే ప్రజాస్వామ్యం బలోపే తమవుతుంది. ఓటు హక్కు పవిత్రమైనది, పరిపాలన విధానానికి ఆయుధం లాంటిది.అందుకే ఎలాంటి ప్రలోభాలకు తలవంచకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలి. ప్రపంచంలో ప్రజాస్వామ్యానికి దిక్సూచి అయిన ఓటును వినియోగించుకోవటం ప్రజల ప్రధానకర్తవ్యం.అప్పుడే దానికి సార్థకత ఉంటుంది. నిజమైన ప్రజాస్వామ్యానికి పునాది ఓటు.అందుకే ఎవరూ ఓటు అనే విలువైన ఆయుధాన్ని నోటుకు అమ్ముకో వద్దు.మనం వేసే ఓటుతోనే నవసమాజ నిర్మా ణం సాధ్యమవుతున్నది. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు విలువైన వజ్రాయుధం.ప్రజల చేతఎన్నుకోబడి,ప్రజల కొరకు పనిచేస్తూ,ప్రజలే పాలకులు గల పాలన విధానమే ప్రజాస్వామ్యం.మనలోనే మార్పు రావాలి..ఓటే వారధి కావాలి!– రవి రెబ్బాప్రగడ ,ఎడిటర్ 

నిర్విర్యీమవుతున్న ప్రజాస్వామ్యం!

రాజ్యాంగేతర శక్తులతో ప్రజాస్వామ్యం నిర్వీర్యమైపోతుంది.వారి నియంత్రత్వధోరణి ప్రదర్శనతో ప్రతిపక్షాలను నోరెత్తకుండా చేస్తోన్నాయి.రాజ్యాంగం,చట్టం,న్యాయ వ్యవస్థలపై రాజకీయపెత్తనం గణనీయంగా పెరుగుతోంది.ఇటీవల వెలుగు చూసిన ఎలక్టోరల్‌ బాండ్ల పథకం ద్వారానే తేటతెల్లమైంది.ఈఘటన ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌ను తల దించుకొనేలా చేసింది.పటిష్టమైన రాజ్యాంగబద్ద వ్యవస్థలను నిర్వీర్యం చేయడమే కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.బహుళజాతి వ్యాపార సంస్థల రాజకీయ విరాళాలు రాజకీయ పార్టీలకు సంపద ఆర్థిక,రాజకీయ కేంద్రీకరణకు దారితీస్తోంది.పటిష్టమైన రాజ్యాంగబద్ద వ్యవస్థలను నిర్వీర్యం చేయడమే కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.రాజ్యాంగబద్ద సంస్థలతోపాటు ఆర్థికంగా పరిపుష్టి సాధించిన ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటు పరం చేసేందుకు కేంద్రప్రభుత్వం తహతహలా డుతున్నారని, ప్రజాస్వామ్యంలో ఇలాంటి పరిణామాలు దుష్పలితాలిస్తాయని ప్రతి పక్షాలు భావిస్తున్న విషయం తెలిసిందే!.ఎన్నికల్లో హిందువుల ఓట్లు సాధించేందుకు మత దురహాకార విధానాన్ని పెంచుతూ,ముస్లిం మైనారిటీలకు హాని కలిగిస్తోంది.
నితో పాటు,నాటి పెద్దనోట్లరద్దు నిర్ణయంలో కూడా ప్రజలు తీవ్ర గందరగోళానికి గురయ్యారు.ఈడీమోనిటైజేషన్‌ తర్వాత విచారణలో జస్టిస్‌ బివినాగరత్న తన అసమ్మతి వెల్లడిరచడం ప్రశంసనీయం.ఈదేశంలో రాజ్యాంగ ప్రజాస్వామ్యాన్ని సమర్థించడంలో ధైర్యం,విశ్వాసాన్ని వెల్లడిరచిన ఏకైక న్యాయమూర్తి ఆమె.అంతేకాకుండా స్వతంత్రంగా వ్యవహరించాల్సిన సర్వోత్తమ కేంద్ర ఎన్నికల కమిషన్‌ను సైతం కేంద్రంలోనిప్రభుత్వం నిర్వీర్యం చేయడం గమనార్హం.
ప్రతి సాధారణఎన్నికలను సజావుగా నిర్వహిస్తున్న ఘన చరిత్ర కేంద్ర ఎన్నికల కమిషన్‌కు దక్కుతుంది.అలాంటి గొప్పచారిత్రక నేపథ్యం ఉన్న కేంద్ర ఎన్నికల కమిషన్‌ను ప్రభుత్వం తన కనుసన్నల్లో పెట్టుకోవాలని చూడటం, ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించేదిగా వ్యవహరించడం ఆందోళనకరమని ప్రతిపక్షాలు సైతం ఆవేదనలు వ్యక్తం చేస్తున్నాయి.ఈనేపథ్యంలో దేశంలో జరగబోయే సార్వత్రిక ఎన్నికలు స్వేచ్ఛాయుతమైన,నిష్పక్షపాతమైన వాతావరణంలో జరగవేమోనని ప్రజల్లో నమ్మకం సన్నగిల్లుతోంది.
ప్రస్తుతం ప్రజాస్వామ్య గుంపులో నియంత్రత్వధోరణి నడుస్తోంది.అంబాని కుమారుడు అనంత అంబాని వివాహానికి ఓచిన్న విమానాశ్రాయాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా మార్చేశారు. అంటే బడా పారిశ్రామికవేత్తల గుప్పెట్లో ప్రజాస్వామ్యం విలవిలలాడుతోందని జగమెరిగిన సత్యం. 1947 ఆగష్టు 15న వచ్చిందిస్వాతంత్య్రం కాదు..తెల్లదొరల నుండి నల్లదొరలకు అధికార మార్పిడి మాత్రమేనన్న అంచనా నిజమని అంతకంతకూ రుజువుతోంది.మన దేశానికి రాజ్యాంగమే అత్యున్నత శాసనం.దేశంలోని వ్యక్తులు,సంస్థలు ప్రభుత్వాలు రాజ్యాంగ నియమాలకు లోబడి వ్యవహరించాలి. కేంద్ర,రాష్ట్రా ప్రభుత్వాలు రాజ్యాంగం ఆధారంగా ఏర్పడి,దానిద్వారానే అధికారాలు పొంది దాని పరిధికి లోబడి పనిచేయాలి.
రాబోయే ఎన్నికల్లో అలాంటి సమాఖ్య వ్యవస్థను ఎంచుకోవాలి.దేశాన్ని కాపాడుటానికి బలమైన కేంద్రీకృత యంత్రాంగం కావాలి.దాని కోసం ఏకకేంద్రపద్దతిని అనుసరించాలి.కేంద్ర,రాష్ట్రాల మధ్య అధికారాలను,విధులను స్పష్టంగా విభజించాలి.సంక్లిష్టమైన వైవిధ్యమైన దేశాన్ని పాలించ డానికి,జాతి ఐక్యతను రక్షించడానికి ఆచారణాత్మక విధానాన్ని రూపొందించాల్సిన వ్యవస్థ అవశ్యం.-రెబ్బాప్రగడ రవి ,ఎడిటర్ 

కనుమరుగువుతున్న సోషలిజం..!

ప్రస్తుతం కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల విధానాలు నరమేథాన్ని తలపిస్తున్నాయి.విశాలమైన ప్రజాస్వామ్యదేశంలో సామాన్యల బ్రతులకు స్వేచ్ఛ కరువైంది.75 ఏళ్ల స్వాతంత్య్ర భారతవనిలో రాజులు,జమిందారులు పాలనపోయి..బహుళజాతి బడా కంపెనీలు రాజ్యమేలుతున్నాయి.. ప్రజాస్వామ్య వ్యవస్థలో సోషలిజం కన్పించడం లేదు.సమాజంలోని భూమి,కర్మాగారాలు ,వ్యాపారాలు వంటి వనరులు సమాజానికి చెందినవి, ప్రైవేట్‌ వ్యక్తులకు కాదు. కానీ ప్రస్తుతం మాత్రం అదానీ,అంబానీ,టాటా,బిర్లా..ఇలా దేశంలో ఒక రెండు,మూడు శాతం మంది వ్యక్తుల వద్దే దేశ సంపదలో సింహభాగం పోగుబడిరది.వీళ్లే నూతన భారతావనికి మహారాజులు.
మనప్రధానమంత్రి మోదీ రామరాజ్యం జపంలో దేశఆర్ధిక వ్యవస్థ ఛిన్నాభిన్నంగా మారింది.పెద్దనోట్లు రద్దుచేసి ఆర్ధిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేశారు. అగ్నివీర్‌ యోజన పేరిట సైన్యంలో శాశ్వత నియామకాలకు చిల్లుచీటి పొడుచారు.దేశంలో 50శాతం జనాభాలో వెనుకబడిన వర్గాలు. 15శాతం దళితులు,8శాతం గిరిజనులు,15శాతం మైనారిటీలు కలిపి దాదాపు 90శాతం ఉన్నారు. వారికి అన్నీ రంగాల్లోనూ అన్యాయమే జరుగుతోంది.వారెవరికీ వివక్షే తప్పడం లేదు. ఇటీవల జరిగిన రాముని ప్రాణ ప్రతిష్టకార్యక్రమంలో ఎంతమంది దళితులు,గిరిజనులు,వెనుకబడిన వర్గాల వారు వున్నారు? గిరిజనురాలైన రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఆహ్వానించలేదు.దళితుడైన మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ కోవింద్‌ను లోపలకు అనుమతించలేదు.ప్రజాస్వామ్యంలో ప్రజల ఓట్లుతో గెలిచిన ప్రజాప్రతి నిధులు పరిపాలన ఎలా ఉండాలనేది,ప్రజాసంక్షేమంపై పాలకులు ఎలా శ్రద్ద పెట్టాలనే విషయాలపై రాజ్యాంగం చెబుతుంటే..మోదీ రామరాజ్యమే రాజ్యాంగంగా పరితపిస్తున్నారు.
చట్టాలనుపక్కన పెట్టి సనాతన ధర్మం కావాలంటున్నారు.ఇది ఇప్పుడు హిందువుల మతంగా సంస్థాగతీకరించబడిరది.మత ప్రమేయం లేకుండా ప్రజలందరినీ సమాన దృష్టితో చూడాలని రాజ్యాంగం చెబుతుంది. గతంలో వాజ్‌పేయి ప్రభుత్వంలోనూ జరిగిన అభివృద్ధి,అవినీతి రహిత పాలన,ప్రపంచంలో మన దేశకీర్తి ప్రతిష్టలు పెరిగాయి.అభివృద్ధి చెందిన దేశాలెన్నో భారత దేశం ఇంకా ఐదోస్థానంలోనే ఉండటం గమనార్హం.పూర్వం కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలువారు చేసిన అభివృద్ధి, ప్రణాళికలు అసెంబ్లీ, పార్లమెంటు సభలో తీసుకున్న వివిధరకాల సంస్కరణలు,కీలక విధి,విధానాలు ప్రజలకు తెలిపేలా ప్రెస్‌మీట్లుపెట్టి తెలియజేసేవారు.కానీ నేడుఆపరిస్థితులు ఎక్కడా కన్పించలేదు. నాలుగు గోడల మధ్యనే అన్నీ జరిగిపోతున్నాయి.చీకట్లోనే జీవోలు వచ్చేస్తూన్నాయి.వాటిని వ్యతిరేకించే ప్రజలపై నరమేథం సృష్టించి ప్రజా ఉద్యమాలను అణగ దొక్కేస్తున్నారు.
ప్రస్తుతం రాజకీయాల్లో పెనుమార్పులు సంభవించాయి. బలవంతులను ఎదుర్కొని బాధితులకు న్యాయం చేయగలిగితే సమాజంలోమార్పు వస్తుంది.సమాజాన్ని మెరుగుపరిచే ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యం కావాలి.సమాజాన్ని అన్ని కోణాల్లో ఉత్ధానపరిచే ప్రజాస్వామ్యం రావాలి.వంచన,మోసంతో కేవలం తన అనుకున్నవారికే సాయం చేసి,మిగిలినవారికి అన్యాయం చేసే పార్టీకి ఓటేయొద్దు.
రాబోతున్న సాధారణ ఎన్నికలపై రాజకీయ పార్టీలన్నీ తమ ఎత్తుగడలు వేస్తూ అధికారాన్ని మళ్లీ చేజిక్కుంచుకోవడానికిప్రజల్ని వివిధరకాల ప్రలోభాలకు గురిచేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఓట్లుకోసం ప్రజల్ని ఆశావాహులుగా,సోమరులగా మార్చే ఎత్తుగడలు చేస్తున్నారు. ప్రజారాజ్యాన్ని బలహీనపరుస్తున్నారు.ప్రజలకు కావాల్సింది..రామరాజ్యం కాదు. ప్రజాసంక్షేమం కావాలి. సమాజంలో ప్రతిపౌరునికి సమానన్యాయం జరగాలి.ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే ప్రజాస్వామ్య వాదులను,సామాజిక సమానత్వం,న్యాయంకల్పించే వారికి,ఓటు వేసి నెగ్గించుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఎంతైనా ఉంది! -రెబ్బాప్రగడ రవి ,ఎడిటర్ 

గిరిజనుల అణచివేత ఇంకెన్నాళ్లు!

ప్రజాస్వామ్యంలో గిరిజనుల సమస్యను చర్చించేటప్పుడు వాస్తవాలను సూక్ష్మంగా పరిశో ధించడం చాలా అవసరం.ఇప్పటికే రాష్ట్రం,జిల్లాలు పునర్వివిభజన నేపధ్యంలో చాలామంది గిరిజన ప్రజలు వారి ఉనికిని కోల్పోతున్నారు.విభజననేపథ్యంలో గిరిజనం కంటే గిరిజనేతరుల పెత్తనం షెడ్యూల్‌ ప్రాంతాల్లో అధికమవుతుంది.గిరిజనులకు అనుకూలంగా రాజ్యాంగం కల్పించిన చట్టాలు ప్రతిదశలోనూ ఉల్లంఘనలకు గురవుతున్నాయి.
గిరిజనుల బతుకుల్ని బాగు చేయడానికి ఏచట్టాలు,నిబంధనలు అమలుకాని దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి.ప్రభుత్వాలు మారుతున్నా ఇక్కడ వనరుల దోపిడి ప్రయత్నాలు ఆగడం లేదు. వనరులు,వారి హక్కుల పరిరక్షణకోసం సమత చేసిన పోరాట ఫలితంగా 1997లో సుప్రీంకోర్టు సమత జడ్జెమెంట్‌ సాధించుకున్నాం.ఈతీర్పు షెడ్యూల్‌ప్రాంత ఆదివాసులకు రాజ్యాంగం కల్పించిన ఒక వరంగా భావించి, కాపాడుకోవాల్సిన అవశ్యకత ఆసన్నమైంది.
రాష్ట్రంలో సంభవిస్తున్న సామాజిక,రాజకీయ పరిస్థితులు కారణంగా గిరిజన ప్రాంతాలలో అనేక మార్పులు సంభవిస్తున్నాయి.చట్టాలను ఉల్లంఘిస్తూ ప్రైవేటు కంపెనీలు,గిరిజనేతరులు పెద్దఎత్తున చొరబాటు పెరుగుతుంది.ఈ కారణంగా అభివృద్ధిపేరుతోగిరిజనుల భూములను,సహజవనరుల దోపిడికి గురవుతున్నాయి. యువతకు ఉద్యోగ అవకాశాలను లేకుండా చేస్తున్నారు.ఈ పరాయికరణ నిజంగా పాలస్తీనా ప్రజలు యూదుల దౌర్జన్యానికి గురైనట్టు అనిపిస్తుంది.చొరబడిన గిరిజనేతరులు స్థానిక గిరిజనులను తమ బానిసులుగా,కూలీలుగా మార్చే ప్రమాదాలు ముంచుకొస్తున్నాయి. ఇలా ప్రభుత్వాలు వేర్వేరు రూపాలలో దోపిడీ చేయడానికి చాపకింద నీరులా దూసుకువస్తోంది.
సమత జడ్జెమెంటును ఉల్లంఘిస్తూ షెడ్యూల్‌ ప్రాంతాల్లో ప్రైవేట్‌ కంపెనీలు చొరబాటు గణనీ యంగా పెరుగుతుంది.ఉదాహరణగా గిరిజన ప్రాంతాల్లో పర్యాటకులను ఆకర్షించడానికి, ఆంధ్రప్రదేశ్‌ పర్యాటకశాఖ రకరకాల ఎత్తుగడలేస్తోంది.నిబంధనలకు విరుద్దంగా బొర్రాగుహల వద్ద ఓప్రైవేట్‌ కంపెనీ జిప్‌లైన్‌ ఏర్పాటు చేసింది.ఇది షెడ్యూల్‌ ఏరియా 1/70యాక్ట్‌,పీసా చట్టాన్ని ఉల్లంఘించి ఏర్పాటు చేశారు.బొర్రా గుహలను ఆనుకుని ఉన్న వనసంరక్షణ సమితికి సంబంధించిన 2.3ఎకరాల భూమిని అటవీశాఖనుంచి పర్యాటకశాఖ తీసుకుని అడ్వంచర్‌ పేరుతో బయట వ్యక్తులకు అప్పగిస్తున్నారన్నారు.ఇటీవల అరకు,అనంతగిరి మండలాల్లో ఉన్న ఆరు రిసార్టులు,బొర్రా గుహలను ప్రైవేటు కంపెనీలకు ధారదత్తం చేయడానికి ఈ`టెండర్లు ప్రకటించి మళ్లీ రద్దు చేసుకున్న వైనం తెలిసిందే.
21వ శతాబ్దం వచ్చినా..స్వేచ్ఛ,స్వతంత్రం లేకుండా పోతుంది. ప్రపంచీకరణ,పెట్టుబడి దారి వ్యవస్థ నాగరికత సమాజంలో గిరిజనుల అస్తిత్వం,మనుగడ కోల్పోతున్నారు. జీవన విధానం నాశనమై అంతరించిపోతున్నారు. రాష్ట్రంలోనే కాదు దేశంలో ఎక్కడ చూసినా గిరిజనుల అరణ్యరోదన కన్పిస్తుంది.వాళ్లజీవితాలు అడవులు,ప్రకృతిసంపదలో సాంప్రదాయం,సంస్కృతి ధ్వంసం చేయబడు తోంది. ఐదువ షెడ్యూలులో స్వయంపాలన,స్వయం నిర్ణయ హక్కును హరించడమే కాక ప్రపంచీకరణ ముసుగులో జరిగే దోపిడీకి దుర్భరమైన జీవితాన్ని గడపవలసిన పరిస్థితి వస్తుంది.గిరిజనుల ఉద్య మాలన్నీ రాజ్యవ్యతిరేకఉద్యమంగానో,శాంతిభద్రతల సమస్యగానో చిత్రీకరించి నిర్దాక్షణ్యంగా అణచి వేస్తుంది.స్వయంపాలన ఏర్పడినప్పుడే ప్రజాస్వామ్య విలువలు రక్షించబడతాయి.మారుతున్న కాలా నుగుణంగా గిరిజనులకు రాజ్యాంగం కల్పించిన హక్కులు,చట్టాలపట్ల అవగాహన కలిగి అప్ర మత్తంగా వ్యవహరించాలి.చట్టాలకు వ్యతిరేకంగాచొరబడుతున్న ప్రైవేటుకంపెనీలును పారద్రోలేందుకు సమత సుప్రీంకోర్టు తీర్పును భావితరాలకు తెలుసుకొనేలా అవగాహన చేసుకోవాల్సిన అవశ్యకత ఉంది.లేని పక్షంలో షెడ్యూల్‌ ఏజెన్సీ ప్రాంతం అనే పేరు కనుమరగుయ్యే ప్రమాదం ముంచుకోస్తుంది. -రవి రెబ్బాప్రగడ ,ఎడిటర్ 

జీవితాన్ని అంకితమిచ్చిన సామాజిక ఉద్యమ నేతలు

తమ ఆరోగ్యాలను సైతం లెక్కచేయకుండా ప్రతిక్షణం గిరిజన,దళిత ప్రజల ఆకాంక్షలు, కలలనే ఊపిరిగా చేసుకుని బతికిన సామాజిక స్పూర్తిదాతలు,పర్యావరణవేత్త శ్రీధర్‌ రామ్మూర్తి, సామాజికవేత్త విలియమ్‌ స్టాన్లీ,అలుపెరగని పోరాట యోధుడు,సామాజిక సేవకు అద్దంపట్టే మరోఆత్మ కె.రాజేంద్ర కుమార్‌లు ఒకే నెల జనవరిలో మనమధ్య నుంచి దూరమవ్వడం మర్చిపోలేని సంఘటన.ఈ ముగ్గురు సామాజిక యోధులతో నాకున్న అంకుఠిత పరిచయం చిరస్మరణీయమైనది.నాతోటి సహచారులు మనలో లేరంటే నా హృదయం పరితపిస్తోంది.
వివిధ రంగాల్లో నిర్మాణాత్మకమైన సామాజిక ఉద్యమాలను నడిపించారు.సమాజ శ్రేయస్సుకు..సమూహ ప్రయోజనాలు అందించారు. వర్తమాన సామాజిక ఉద్యమాల చరిత్రలో చెరిగిపోని సంతకాలగా వారి సామాజిక సేవలు నిలిచిపోయాయి.సామాజిక అసమానతలపై సమరం సాగిస్తూ,సమాజాన్ని సంస్కరించడం కోసం,అలుపెరగని కృషి చేసిన పోరాట యోధులు.
శ్రీధర్‌ అనంతమైన ఆలోచనలు,విశ్లేషణలతో కూడిన పరిశోధకుడు.శాస్త్రవేత్త.దేశంలోనే కాకుండా అనేక దేశాలలో ఆదివాసీ ప్రజలకు ఆలోచనలు అందించారు. ఒకశాస్త్రవేత్త,ఒకకార్యకర్త, ఒకసాహసికుడు,ఒక స్వాప్నికుడుగా తన జీవితమంతా అట్టడుగున ఉన్నవారి కోసం, పర్యావరణంకోసం, సహజవనరులపై సమాజాల నియంత్రణకోసం అలుపెరగని పోరాటాలు చేశారు.
ఇక విలియమ్‌ స్టాన్లీ ఒడిస్సా,చత్తీష్‌ఘర్‌ ఆదిమతెగల జీవితాల్లో వెలుగు నింపాడు.అనాగరిక గిరిజన ప్రజల హృదయాల్లో సుస్థిరస్థానం సంపాదించారు.వందలాది గిరిజన గ్రామాలకు త్రాగునీరు, విద్యుత్‌,ఇతరమౌళిక సదుపాయాలు కల్పించారు.గిరిజన యువతకు మార్గదర్శిగా ఉంటూ సామా జిక,ఆర్ధిక,రాజకీయరంగాల్లో ఎందరో యువకులకు భవిష్యత్తునిచ్చారు.
ఇక అలుపెరగని సామాజిక యోధుడు రాజేంద్ర నాతోటే పయనించారు.అత్యంత అట్టడుగున దళిత కుటుంబంలో జన్మించిన రాజేంద్ర తన దళిత,గిరిజనుల జీవితాల కోసం రక్తాన్ని ధారపోసిన హృదయం.ఒకఆత్మ స్థిరమైన ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి మార్గాల కోసం అనంతంగా అన్వేషించిన నిస్వార్ధపరుడు.రాజేంద్ర చేసినసుదీర్ఘ పోరాటాలు ఎన్నో నేటికి చెరగని ముద్రవేసుకున్నాయి.కాలుష్యకోరల్లో కొట్టిమిట్టులాడుతున్న క్వారీ ప్రజలకు అండగా నిలిచారు.ఏలేరు నిర్వాసితులకు పునరావాసం సుదీర్ఘ పాదయాత్ర చేశారు.అత్యాచారానికి గురైన దళిత బిడ్డకు అండగా నిలిచి న్యాయంపోరాటం చేసి గెలిచారు.కాకినాడ జిల్లా తీరప్రాంతంలో ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రత్యేక ఆర్ధిక మండలి(స్పెషల్‌ ఎకనామిక్‌ జోన్‌`(ఎస్‌ఈజెడ్‌) పేరుతో రైతులు,మత్స్యకారుల భూములు ప్రభుత్వం స్వాదీనపర్చు కోవడంపై తరుపున సుదీర్ఘ పోరాటంచేసి కొద్దిరోజులు జైలుజీవితాన్నికూడా అనుభవించారు. వంతాడ ఆదివాసీ వనరుల పరిరక్షణపై(లేటరైట్‌)పోరాటంచేసి విజయం సాధించారు.
సామాజిక సేవలో కుటుంబాన్ని,ఆరోగ్యాన్నిసైతం విస్మరించారు.వారి జీవితాన్ని ప్రజా ప్రయోజనాల కోసం అలుపెరగని సేవలందించారు.వాస్తవానికి సామాజిక సేవ చేసే ప్రతి కార్యకర్త ప్రజలతోనే మమేకంగా ఉంటారే తప్పా వారి ఆరోగ్యం,కుటుంబం సంక్షేమకోసం పట్టించుకోవడం తక్కువ.ఈనేపథ్యంలోనే ఈ ముగ్గురు సహచరులు హాఠత్తుమరణానికి గురికావాల్సి వచ్చింది. మనిషికి మరణమనేది ఏరకంగా సంభవిస్తుందో తెలియని పరిస్థితి. ఈనేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపట్ల నిర్లక్ష్యం వహించకూడదు. అనారోగ్యం రాకుండానే ముందు జాగ్రత్తలు తీసుకోవాలి.ప్రస్తుత మానవ జీవనవిధానం కలుషితమయంగా మారింది.కలుషితమైన ఆహారపదార్ధాలనే తీసుకుంటున్నాం.ముఖ్యంగా సమాజంలో సామాజిక మార్పులు తీసుకొచ్చే శ్రేణులు ఆరోగ్యపరిరక్షణ పట్ల మరింత శ్రద్ద తీసుకోవాల్సిన అవశ్యకత ఉంది.జీవిత విలువ తెలుసుకొనే ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహించకూడదు.!- రవి రెబ్బాప్రగడ ,ఎడిటర్ 

కాఫ్‌28 సదస్సులో నిర్ధిశిష్టమైన నిర్ణయాలు అవశ్యం!

వాతావరణ మార్పులపై మనిషి పోరుకు వేదికగా నిలిచిన కాప్‌ సమావేశాలు నవంబర్‌ 30న జరుగుతున్న నేపథ్యంలో కొన్ని విషయాలు చర్చించుకోవాల్సి ఉంది.యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యుఏఈ)లో ఐక్యరాజ్య సమితి వాతావరణమార్పుల 28వసదస్సు మానవాళి భవిష్యత్తును నిర్ధేశించవచ్చు. అంతర్జాతీయ వాతావరణ మార్పుల చర్చల్లో సమూలమైన మార్పు తీసుకురావాలని భారత్‌ ఆకాంక్షిస్తోంది.అతిథ్య దేశంతో భారత్‌కు ఉన్న ప్రత్యేక అనుబంధం కూడా కాఫ్‌28సమావేశాలు తమ లక్ష్యాన్ని చేరుకునేందుకు దోహదపడతాయని భావిస్తున్నారు.దీనికి కేంద్రబిందువుగా భారత్‌ ప్రభుత్వపు లైఫ్‌స్టైల్‌ ఫర్‌ ఎన్విరాన్‌మెంట్‌(లైఫ్‌)కార్యక్రమం ఉండాలి.సుస్థిర,అతితక్కువ ఇంధన ఖర్చును ప్రొత్సహించే ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకునేందుకు లైఫ్‌ దోహదపడుతుంది.
వాతావరణంలో సంభవించిన మార్పుల్లో ప్రధానమైనవి ఓజోన్‌ పొరు క్షీణత,పెరుగుతున్న ఉష్ణోగ్ర తలు,మంచుకొండలు కరిగిపోవడం వంటి కారణాలున్నాయి.దీనికి మానవ జీవనశైలిలో సంభవిస్తున్న పెనుమార్పులు ఒకకారణంగా నిపుణులు భావిస్తున్నారు.ఇవన్నీ కూడా అభివృద్ధిపేరుతో వస్తున్న పారిశ్రామిక విప్లవమే మానవాళి వినాసానికి నాంది పలుకుతోంది.దీని కారణంగా ప్రపంచ వ్యాప్తంగా బడాబహుళజాతి కంపెనీలు తమ వ్యాపారాలను విస్తరించుకుంటూ పోతున్నాయి.పారిస్‌ ఒప్పందం ప్రాథమికంగా వాతావరణ విపత్తును నివారించడానికి మనుషులు అమలు చేయాలనుకున్న వ్యూహం.గ్లోబల్‌ వార్మింగ్‌ కారణంగా పారిశ్రామిక విప్లవానికి పూర్వంఉన్న ఉష్ణోగ్రతలు1.5 సెంటిగ్రేడ్‌ పెరుగుతున్నాయి.ఏదైనా ఒక ప్రణాళికను ప్రకటించినప్పుడు దానికి కట్టుబడి ఉండాలి.కాప్‌ సదస్సుల ఉద్దేశం కూడాఅదే.కలిసికట్టుగా తీసుకున్న నిర్ణయాలు,వ్యూహాలు సరిగ్గా పని చేస్తున్నాయా లేదా అన్నది చర్చించుకోవడానికే ఈసదస్సులు ఏర్పాటు చేస్తారు.భూతాపాన్ని తగ్గించడానికి ఏమాత్రం గడువు లేదు. సత్వరం మార్పులకు శ్రీకారం చుట్టాల్సిందే. ప్రధానంగా ఇంధన,భూవినియోగం, నగరాలు,పరిశ్రమల వ్యవస్థల్లో సమూల మార్పలు తెస్తేనే భూతాపాన్ని అనుకున్న స్థాయిలో తగ్గించగల మని నివేదికలు వెల్లడిస్తున్నాయి.అయితే, వ్యవస్థలతో పాటు మనిషి తనకు తాను ఇలాంటి మార్పులను నిర్దేశించుకోకుంటే లక్ష్యాన్ని చేరుకోవడం కష్టం.ఇందుకుగాను వ్యక్తిగతంగా తీసుకురావాల్సిన మార్పు లనూ నివేదికలు సూచిస్తున్నాయి.
పదిహేను రోజులపాటు కొనసాగే కాన్పరెన్స్‌ ఆఫ్‌ పార్టీస్‌(కాఫ్‌)28సమావేశానికి,వాతావరణ మార్పులపై జరిగే ఇతరసమావేశాలకూ మధ్య స్పష్టమైన తేడా ఇదే కానుంది. ధనిక దేశాలు అనేకం కాప్‌ సమావేశాల్లో పెద్ద మాటలు మాట్లాడుతాయి.అలివికాని హామీలా గుప్పిస్తాయి. సమావేశాల తర్వాత అన్నింటినీ మరిచిపోతుంటాయి. ఇప్పుడు ఆదేశాలూ వాతావరణ మార్పుల ప్రభావాన్ని ప్రత్యక్షంగా చవిచూస్తున్నాయి.అయితే అవి యూఏఈ మాదిరిగా పరిస్థితిని సీరియస్‌గా తీసుకుంటాయన్న గ్యారెంటీ లేదు.
సుస్థిర,అతితక్కువ ఇంధన ఖర్చును ప్రొత్సహించే ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రజలు అలవర్చుకునేందుకు లైఫ్‌ కార్యక్రమం దోహదపడుతుంది.దీనికి ప్రపంచ ఆమోదముద్ర పడితే ప్రస్తుత జీవనశైలి భిన్నంగా మారుతుంది.అప్పుడే ఆలోచనలు ఆచరణ రూపం దాలుస్తాయి.ధనిక దేశాల ఖరీదైన జీవనశైలి,వృధా వ్యవహారాలకు చెక్‌ పడుతుంది. యుఏఈ స్వయంగా చమురు అమ్మకాలు చేస్తున్నప్పటికీ పశ్చిమమాజియాలో అణుశక్తి కేంద్రం కలిగిన తొలి దేశం కూడా ఇదేకావడం గమనార్హం.పర్యావరణానికి మేలు చేసే స్వచ్ఛమైన టెక్నాలజీలను అందుబాటులోకి తెచ్చేందుకు అవసరమైన ఆర్దిక వనరులు యూఏఈవద్ద పుష్కలం.ఈనేపథ్యంలో 2015ప్యారిస్‌ సమావేశాల కంటే ఈ సారి జరిగే కాప్‌ సమావేశాలు మరింత ఫలప్రదమవుతాయని ఆశిద్దాం! – రెబ్బాప్రగడ రవి ,ఎడిటర్,

1 2 3 6