ఎన్నికల సంస్కరణలు

ప్రజాస్వామ్యంలో ప్రజలు తమను తామే పాలించుకొంటారు. జనాభా తక్కువగా ఉంటే ప్రత్యక్ష, ప్రజాస్వామ్యాన్ని అమలు చేయవచ్చు. జనాభా లక్షల్లోనూ, కోట్లలోనూ ఉంటే ప్రాతినిథ్య ప్రజాస్వామ్యాన్ని అమలు చేయాలి. ప్రపంచమంతా ప్రాతినిథ్య ప్రజాస్వామ్యమే నడుస్తున్నది. ప్రాతినిథ్య ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ప్రధాన పాత్ర కలిగి ఉంటాయి. ప్రజలు ఎన్నికల ద్వారా తమ పాలకులను ఎన్నుకొంటారు. 1950నుంచి ఇప్పటి వరకు చాలా సార్లు చట్టసభలకు ఎన్నికలు జరిగాయి. ఎన్నికల విధానంలోని లోపాలను అప్పుడప్పుడు కొద్దిగా సవరించు కుంటూ వస్తున్నారు.
ఎన్నికల వ్యయం విపరీతంగా ఉండటం, ఓటర్లకు అర్హతలు సరిగా నిర్ణయించకపోవటం, ఓటర్లు డబ్బులకు ఓట్లు అమ్ముకోవటం, ఓట్ల లెక్కింపు విధానం సరిగా లేకపోవటం, రహస్య ఓటింగుతో పాటు బహిరంగ ఓటింగు లేకపోవటం, దొంగ ఓట్లు వేయటం, పోలింగు కేంద్రాలను ఆక్రమించి రిగ్గింగు చేయటం, బలహీనవర్గాలను పోలింగు కేంద్రాలకు రానీయకుండా అడ్డుకోవ డటం, ఎన్నికల్లో మితిమీరిన హింస, తక్కువ శాతం పోలింగు కావటం, నేర చరిత్ర ఉన్న వ్యక్తులు ఎన్నికల్లో పాల్గొనటం, కుల, మత, ప్రాంతీయ తత్వాలను రెచ్చగొట్టటం, అధికార యంత్రాంగాన్ని ఎన్నికల్లో దుర్వినియోగం చేయటం, వ్యక్తిగత దూషణలకు పాల్పడటం, అసంబద్ధమైన వాగ్దానాలు చేయటం, సాధారణ ఎన్నికలు, మధ్యంతర ఎన్నికలు, ఉపఎన్నికలతో సంవత్సరం పొడవునా, ఐదు సంవత్సరాల పాటు ఎన్నికల వాతావరణం నెలకొనటం, రాజకీయ పార్టీల నియంత్రణ చట్టం లేకపోవటం, ఎన్నికల సంఘానికి ఎక్కువ అధికారాలు లేకపోవటం, ప్రభుత్వ, ప్రైవేటు మీడియాను దుర్వనియోగం చేయటం, పార్టీ ఫిరాయింపులు మొదలగునవి మన ఎన్నికల విధానంలోని ముఖ్యమైన లోపాలు. ప్రజాస్వామ్యం, ఎన్నికల వ్యవస్థ బలంగా ఉండాలంటే రాజకీయ పార్టీల నియంత్రణ చట్టం చాలా అవసరం. రాజకీయ పార్టీల వ్యవహారాన్ని అంతరంగిక వ్యవహారంగా భావించరాదు. అవికూడా ప్రజలకు, న్యాయ స్థానాలకు, ఎన్నికల సంఘానికి జవాబుదారీగా ఉండాలి. రాజకీయ పార్టీల ఎన్నికలు ఎన్నికల సంఘం పర్యవేక్షణలో ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలి. రాజకీయ పార్టీల ఆదాయ, వ్యయాలను ‘కాగ్‌’ పరిధిలోకి తేవాలి. ప్రజాస్వామ్యం పట్ల విశ్వాసం కలిగిన రాజకీయ పార్టీలను మాత్రమే అనుమతించాలి. సాధారణ ఎన్నికల నిర్వహణ సుదీర్ఘకాలంపాటు ఉంటున్నది. దశలు ఎక్కువగా ఉండటం, ఒక్కొక్క దశకు ఎక్కువ కాలపరిమితి ఉండటం వలన సుదీర్ఘ ప్రక్రియగా మారింది. ప్రజా ప్రాతినిథ్య చట్టంలోనే ఎన్నికలను నాలుగు దశలలోనే జరపాలన్న నిబంధన ఉండాలి. ఒక్కొక్క దశకు నాలుగు రోజుల వ్యవధి మాత్రమే ఉండాలి. ఎన్నికల ప్రకటన తేదీ నుంచి లెక్కింపు తేదీ మధ్య రెండు నెలలకు మించి ఉండకూడదు. పార్లమెంటు, అసెంబ్లీ స్థానాల సంఖ్యలో నాలుగింట మూడు వంతుల స్థానాలను అభ్యర్థులను ఎన్నుకోవటం ద్వారాను, స్థానాలను పార్టీలకు వచ్చిన ఓట్ల నిష్పత్తి ప్రకారం రాజకీయ పార్టీలు సూచించిన అభ్యర్థులను ఎంపిక చేయాలి. పార్లమెంటరీ విధానం వలన మన దేశం లాభపడిరదో లేక నష్టపోయిందో అర్థం కావటం లేదు. సాధారణ ఎన్నికల్లో మెజారిటీ రాని చోట్ల సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడటం, కొద్ది రోజుల్లోనే పార్టీ ఫిరాయింపుల వలన అవి కూలిపోవటం, మళ్లీ ఎన్నికలు ఎదుర్కొనవలసి రావటం గత 60 సంవత్సరాల నుంచి చూస్తున్నాము. చట్టసభల కాలపరిమితి ఐదు సంవత్సరాలని చెప్పినప్పటికీ చాలాసార్లు మధ్యలోనే రద్దవుతున్నాయి. పార్లమెంటరీ విధానంలో ఇదొక పెద్దలోపం. దేశంలోని అన్ని వ్యవస్థలకు ఒకేసారి ఎన్నికలు జరిగే విధంగా రాజ్యాం, చట్టసవరణలు చేసుకోవాలి. కాలపరిమితి ప్రకారమే సాధారణ ఎన్నికలు జరగాలి. పార్ల మెంటు, అసెంబ్లీ ఎన్నికలు పార్టీ చిహ్నాల మీద జరిగితే, స్థానిక సంస్థలు, ఇతర సహకార సంఘాల ఎన్నికలుపార్టీ రహితంగా జరగాలి. స్థానిక సంస్థల ఎన్నికలు ఏకగ్రీవం లేక లాటరీ విధానం అనుకరిస్తే ఇంకా మంచిది. ప్రభు త్వాలు, రాజకీయ పార్టీలు ఓటర్లను ఆకట్టుకోవటానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. పోటీ చేసే అభ్యర్థులు ఓట్లను కొనటానికి తెగబడుతున్నారు. ఓటర్లు కూడా చాలామంది ఓట్లు అమ్ముకోవటం తప్పు కాదన్నట్లుగా ప్రవర్తిస్తు న్నారు. ఓటుకు ఇంత ఇవ్వాలని పట్టుబట్టే స్థితికి ఓటర్లు వచ్చారు. దీన్ని నివారించటానికి రహస్య ఓటింగుతో పాటు బహిరంగ ఓటువిధానాన్ని ప్రవేశపెట్టాలి. బహిరంగ ఓటింగు విధానం ప్రజాస్వామ్యాన్ని మరింత బలపరు స్తుంది. ఓటర్లకు కొన్ని అదనపు అర్హతలను నిర్ణయించాలి. ఓట్ల లెక్కింపు విధానంలో మార్పులు చేయాలి. ఓటర్లను మూడు తరగతులుగా వర్గీకరించాలి. పూర్తిఅర్హత కలిగిన ఓటర్లు, సగం అర్హత కలిగిన ఓటర్లు, పూర్తిగా అర్హతలేని ఓటర్లుగా విభజించాలి. ఎటువంటి సివిల్‌, క్రిమినల్‌ కేసులు లేని వాళ్లు, ప్రభుత్వాలకు, ఇతర ప్రభుత్వరంగ సంస్థలకు, స్థానిక సంస్థలకు ఎటువంటి బకాయిలు లేని వాళ్ళను పూర్తి అర్హత కలిగిన ఓటర్లుగా భావించాలి. సివిల్‌, క్రిమినల్‌ కేసుల్లో ఉన్నవారు, ప్రభుత్వ సంస్థలకు, స్థానిక సంస్థలకు బకాయిలు ఉన్నవారు సగం అర్హత కలిగిన ఓటర్లుగా భావించాలి. సివిల్‌, క్రిమినల్‌ కేసుల్లో చార్జిషీట్‌ పెడితే సగం అర్హతే ఉంటుంది. సివిల్‌, క్రిమినల్‌ కేసుల్లో శిక్ష పడినవారు, మతి స్థిమితం లేనివారు, ప్రభుత్వ సంస్థలకు దీర్ఘకాలంగా బకాయిలు ఉన్నవారు, పన్నులు ఎగవేసినవారు, దివాలా తీసినవారు పూర్తిగా అర్హతలేని ఓటర్లుగా భావించాలి. మొదటి, రెండవ తరగతి ఓటర్లకు ఓటు వేసే హక్కు ఉంటుంది. మొదటి తరగతి ఓటర్లను ఒక రకం బ్యాలట్‌ బాక్స్‌, రెండవ రకం ఓటర్లకు మరొక రకం బ్యాలట్‌ బాక్సు ఉండాలి. ఓట్ల లెక్కింపులో మొదట మొదటి రకం బాక్స్‌లోని ఓట్లను లెక్కించాలి. ఓట్లు సమానంగా వచ్చినప్పుడు లేక అతి తక్కువ మెజారిటీ వచ్చినపుడు రెండవ రకం బాక్స్‌ ఓట్లను లెక్కించాలి. ఈపద్ధతి వలన ఓటర్లు బాధ్యత కలిగి ఉంటారు. ప్రభు త్వాలకు బకాయిలు పెట్టరు. బాధ్యతతో మెలిగే ఓటర్లుకు విలువ పెరుగుతుంది. ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్యం దేశం భారత దేశమేనని అందరూ చెబుతుంటారు. మన ప్రజాస్వామ్యం, ఎన్నికల వ్యవస్థ మేడిపండులాగానో, నేతి బీరకాయలాగానో మారకూడదు. ఎన్నికల సంస్కరణలను త్వరగా ప్రవేశపెట్టి భారత ప్రజాస్వామ్యం, ఎన్నికల వ్యవస్థ ప్రపంచానికి ఆదర్శంగా చూపాలి. అప్పుడే మన స్వాతంత్య్రం సమరయోధుల పోరాటాలు ఫలవంతమవుఆయి. ఈదిశగా అన్ని రాజకీయ పక్షాలు నడుం బిగించి ఎన్నికల సంస్కరణల కొరకు పోరాడాలి.
రాజ్యసభ ఎన్నికల విధానం:
శాసనసభ్యులుగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు మాత్రమే ఓటర్లు, ఆయా రాష్ట్రాల నుండి పార్లమెంటు ఎగువసభకు పంపవలసిన ప్రజాప్రతి నిధులను వీరే ఎన్నుకోవాలి. ఎమ్మెల్యేలు మాత్రమే అభ్యర్థు లను ప్రతిపాదించాలి కూడా! ఇటువంటి ప్రత్యేక అంశాలను ఎన్నికల కమిషన్‌ విస్మరించింది. దీనికన్నా ఎన్నికల ప్రక్రియ నేరమయం కావడంపై సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు అత్యంత కీలకమైనవి! భారత ప్రజాస్వామ్యంలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభం అయినప్పటి నుండే లోటుపాట్లపై చర్చ కూడా మొదలైంది. మేధావులు, ప్రజాస్వామ్య వాదులు ఎన్నో సూచనలు చేశారు. అనేక సందర్భాల్లో సుప్రీంకోర్టు సైతం ఎన్నికల రణరంగంలో నీరుగారుతున్న ప్రజాస్వామ్య స్ఫూర్తిపై ఆవేదన వ్యక్తం చేసింది. గడిచిన రెండేళ్లలోనే అరడజను సార్లకు పైగా దేశ సర్వోన్నత న్యాయస్థానం ఎన్నికల ప్రక్రియ అపహాస్యమవుతున్న తీరుపై స్పందించిందంటే మన ప్రజాస్వామ్యం నేతి బీరకాయలో నెయ్యి చందంగా ఎలా మారుతోందో అర్థం చేసుకోవచ్చు. ఎన్నికల బరిలో నేరచరితులు దిగడంపై సుప్రీంకోర్టు తాజాగా వ్యక్తం చేసిన ధర్మాగ్రహాన్ని సైతం ఈ కోవలోనే చూడాలి. ఈఅంశంపై కూడా అత్యున్నత న్యాయస్థానం స్పందించడం ఇదే మొదటిసారి కాదు. ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధులపై నేరారోపణలపై విచారణ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించింది. 1951 నాటి ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్‌ 8 ప్రకారం నేరం రుజువైన వ్యక్తి శిక్ష అమలులోకి వచ్చిన తేదీ నుండి జైలు నుండి విడుదలైన ఆరు సంవత్సరాల వరకు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హుడవుతారు. అయితే, ఇదే చట్టంలోని సెక్షన్‌ 8 సబ్‌సెక్షన్‌ 4 ఎన్నికైన ప్రజాప్రతినిధులకు కొన్ని మినహాయింపులిచ్చింది. ఈ మినహాయింపు ప్రకారం అప్పటికే ఎంపి, ఎంఎల్‌ఏగా ఉన్న వ్యక్తి చేసిన నేరం రుజువై శిక్ష పడినా మూడు నెలల వరకు అనర్హత నిబంధన అమలులోకి రాదు. ఈ లొసుగును అడ్డం పెట్టుకుని పై కోర్టులకు అప్పీలు చేస్తూ నేరస్తులు తమ పబ్బం గడుపుకుంటున్నారు. ఈ మినహాయింపే నేరస్తులు దొడ్డ్డిదోవలో అధికారం చేజిక్కించుకునేందుకు ఊతమిస్తోంది. ఫలితంగా చట్టసభల్లో నేరస్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతూ ఉంది. 15వ లోక్‌సభలో 128 మంది సభ్యులపై క్రిమినల్‌ కేసులుండగా, ప్రస్తుత లోక్‌సభలో ఆ సంఖ్య 162కు పెరిగింది. హత్యలు, కిడ్నాప్‌లు, మానభంగాల వంటి తీవ్ర స్వభావం గల నేరారోపణలు ఎదుర్కుంటున్న వారు 15వ లోక్‌సభలో 58 మంది ఉండగా, ప్రస్తుతం వీరి సంఖ్య 76కు చేరింది. అంటే 18 శాతం పెరిగింది. పార్లమెంటుతో పాటు రాష్ట్రాల శాసనసభల్లోనూ కలిపి 30శాతం మందికి పైగా సభ్యులు నేరారోప ణలు ఎదుర్కుంటున్నారని స్వయంగా కేంద్ర ప్రభుత్వమే కొన్ని సంవత్సరాల క్రితం సుప్రీంకోర్టుకు నివేదించింది. ఈ సంఖ్యలు చాలు చట్టసభల్లో ఎవరు తిష్టవేస్తున్నారో, ఎవరికోసం పని చేస్తున్నారో తెలుసుకోవడానికి! నేర చరిత్ర ఉన్న వారిని చట్టసభ్యులుగా పంపడంలో బిజెపి,కాంగ్రెస్‌లు పోటీ పడుతు న్నాయి. 19 శాతం బిజెపి లోక్‌సభ సభ్యులపైనా, 13శాతం కాంగ్రెస్‌ సభ్యుల పైనా క్రిమినల్‌ కేసులున్నట్లు నేషనల్‌ ఎలక్షన్‌ వాచ్‌ ప్రకటించడం గమనార్హం. ఇక వివిధ ప్రజా సమస్యలపై పోరాటం చేసే వామపక్ష పార్టీల నేతలపైనా తప్పుడు కేసులు బనాయించి నేరచరితులుగా రికార్డుల కెక్కించడం, ఇతర పార్టీలకూ వాటికి తేడా లేదన్నట్లు గా చిత్రీకరించడం పాలకవర్గ పార్టీల కుతంత్రంలో భాగం! ఈ నేపథ్యంలోనే రాజకీయ పార్టీలు ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల నేర చరిత్రను బహిరంగంగా ప్రకటించేలా నిబంధన తీసుకురావాలని, అలా ప్రకటించని పార్టీల గుర్తింపు రద్దు చేసేలా చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్‌ను ఆదేశిస్తామని హెచ్చరించాల్సి వచ్చింది. సుప్రీంకోర్టు ఈ స్పందన ఆహ్వానించదగినదే అయినప్పటికీ దాని వల్ల ఫలితం సందేహాస్పదమే. ఇటువంటి వివరాలు ఇప్పటికే ఎన్నికల కమిషన్‌కు అభ్యర్థులు నివేదిస్తున్న విషయం తెలిసిందే! నిజానికి మెజార్టీ మార్కు మాయాజాలం తో సాగే ప్రక్రియే మన ఎన్నికల వ్యవస్థ లోని దుష్పరిణామాలకు కారణం. దీనిని సాధించడానికే పాలకవర్గ పార్టీలు రూ. వందల కోట్లు ఖర్చు పెట్టగలిగే కార్పొరేట్లను, నేరస్తులను అభ్యర్థులుగా ముందుకు తెస్తున్నాయి. కొన్ని సమయాలలో తక్కువ శాతం ఓట్లతోనూ అధికారాన్ని చేజిక్కించుకుంటున్నాయి. వీటి నుండి భారత ప్రజాస్వామ్యం బయట పడాలంటే దామాషా ప్రాతినిధ్య ఎన్నికల విధానమే మార్గం! ఆ దిశలో విస్త ృత స్థాయిలో చర్చ జరపడానికి మేధావులు, ప్రజాస్వామ్య వాదులు ముందుకు రావాలి.- సైమన్‌ గునపర్తి