పాఠ‌శాల చుట్టూ సామాజిక ఉద్య‌మాన్ని నిర్మిద్దాం..!

ఓవైపు మనమంతా 23 శాతం ఫిట్‌మెంట్‌ వద్దని, మెరుగైన పిఆర్‌సి కావాలనే డిమాండ్లతో పోరాటం చేస్తూ వున్నాం. మరొకపక్క ప్రభుత్వం అనుకున్న విధంగా ప్రాథమిక పాఠశాలలను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయబోతున్నది. కనుక ‘మాకు ఊరు బడి వుండాల’నే తల్లిదండ్రులను కదిలించి వారితో కలిసి ఉద్యమించాలి. ప్రాథమిక పాఠశాల యథాతథంగా వుంచాలి. సమాంతర మీడియంలను కొనసాగించాలి. ఖాళీగా వున్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలి…అనే డిమాండ్లతో సామాజిక ఉద్యమాన్ని నిర్మించాలి. ఇందుకు కలిసి వచ్చే శక్తులను కలుపుకొందాం.
పిఆర్‌సిలో అన్యాయం జరిగితే రోడ్డు మీదకు వచ్చి ప్రతిఘటించింది ఉపాధ్యాయులు. పాఠశాలలను రక్షించుకోవాల్సిన బాధ్యత కూడా వారిదే. పోరాటాల ద్వారా సాధించుకున్న హక్కు లను ఊడగొడతూ, కొత్త హక్కుల మాట ఎత్తకుండా చేస్తూ ఎందరికో విద్యా పునాది వేసిన ప్రాథమిక పాఠశాల వ్యవస్థను ధ్వంసం చేసే ప్రయత్నాలను అడ్డుకోవాలి. పాఠశాల చుట్టూ సామాజిక ఉద్య మాన్ని నిర్మించాలి. ప్రాథమిక పాఠశాల-ప్రభుత్వ వైఖరి వచ్చే20ఏళ్ళ తరువాత పోటీ పరీక్షలకు విద్యార్థు లను సిద్ధంచేసేలా ఒకటవ తరగతిలోనే బీజం వేసే ప్రక్రియకు శ్రీకారం చుడుతున్నాం. 96 శాతం మంది తల్లులు తమ బిడ్డలు ఇంగ్లీషు మీడియంలో చదువుకోవాలని కోరుతున్నారు.అందువల్ల ప్రీప్రె ౖమరీ నుండి ఇంగ్లీషు మీడియం ప్రవేశ పెడుతు న్నామని ప్రభుత్వం ప్రకటించింది. దానికి అను గుణంగా విద్యాశాఖ వేగంగా చర్యలు తీసుకుం టున్నది.రాష్ట్రంలో పది మంది లోపు విద్యార్థులున్న ప్రాథమిక పాఠ శాలలు1010వుండగా,40లోపు విద్యార్థులున్న ప్రాథమిక పాఠశాలలు 16827. 30లోపువున్న ప్రాథమికోన్నత పాఠశాలలు 1531. వంద లోపు విద్యార్థులున్న ఉన్నత పాఠశాలలు 483.వీటన్నింటిలో46,769మంది ఉపాధ్యా యులు పనిచేస్తున్నారు. ప్రాథమిక పాఠశాలల్లో ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి 1:30వుండవలసి వుండగా1:16 మాత్రమే వుందని, అలాగే ప్రాథమి కోన్నత పాఠశాలల్లో 1:35 కి బదులుగా 1:7.8 వుందని, ఉన్నత పాఠశాలల్లో 1:40కు బదులుగా 1:24 మాత్రమే వుందని చెబుతున్నారు. కనుక ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తిని సవరించాలి. అలాగే తక్కువ విద్యార్థులున్న పాఠశాలలను ప్రత్యామ్నాయ పాఠశాలలుగా మార్చి విద్యా వలంటీర్లతో నడిపితే ఎలా వుంటుందో ఆలోచన చేస్తున్నారు. ఈగణాం కాలను పరిగణ లోకి తీసుకొని మే 30,2020న సర్క్యులర్‌172తీసుకొచ్చారు. మూడు రకాల పాఠ శాల వ్యవస్థను ముందుకుతెచ్చి ప్రాథమిక పాఠశా లల్లోని 3,4,5 తరగతులను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయాలని చెప్పారు. దీనిపై ఉపాధ్యాయ సంఘాలు, తల్లిదండ్రులు, ఎమ్మెల్సీల నుండి తీవ్ర వ్యతిరేకత రావడంతో ఆరురకాల పాఠశాలల వ్య వస్థను ముందుకు తెచ్చి, ఉన్నత పాఠశాలకి 500 మీటర్ల దూరంలోని ప్రాథమిక పాఠశాలలోని 3,4,5 తరగుతులను మాత్రమే విలీనం చేస్తామని చెప్పారు. గతంలో సర్క్యులర్‌ 172కి అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి కనుక దానిని యథాతథంగా అమలు చేయడం లేదని తాత్కాలికంగా వెనక్కి తగ్గినా,తర్వాత ఆర్‌.సి.నెం.151 (18-10-20 21) ఉత్త ర్వులు ఇచ్చి దూకుడుగా తాము అనుకున్న విధానాల అమలుకు సిద్ధమయ్యారు. విద్యా హక్కు చట్టానికి భిన్నంగా జీవో 85 తీసుకొచ్చారు.ఈ ఉత్తర్వులలో ఎన్‌ఇపి 2020ని, ప్రాథమిక విద్యాహక్కు చట్టాన్ని ఉటంకిస్తూ…1,2 తరగతుల ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి 1:30గా చూడాలని, ఒకే మీడియంను పరిగణలోకి తీసుకోవాలని, వారానికి 30 నుండి 32 గంటల బోధన సమయం వుండాలని,45 పిరియడ్స్‌ వుండాలని…ప్రాథ మికోన్నత పాఠశాలలో 35లోపు విద్యార్థులున్న చోట, అలాగే 75లోపు విద్యార్థులున్న ఉన్నత పాఠ శాలల్లో స్కూల్‌ అసిస్టెంట్లు ఎందరు వున్నారో లెక్క తేల్చాలని,20లోపు విద్యార్థులున్న ప్రాథమిక పాఠ శాలల్లో పనిచేస్తూ ఉన్నతవిద్య అభ్యసించిన ఉపాధ్యాయుల వివరాలు సేకరించాలని కోరారు. ప్రాథమిక పాఠశాలలు విలీనం అయ్యే ఉన్నత పాఠశాలల్లో సరిపడా గదులు లేకపోతే ఉపాధ్యాయులు ప్రాథమిక పాఠశాలకు వెళ్ళి బోధించాలని, 3కిమీ లోపు ఉన్న ప్రాథమిక పాఠశాలల్లోని 3,4,5 తరగతులను ఉన్నత పాఠశాలలో విలీనం చేయాలని ఉత్తర్వులు ఇచ్చారు. ఉత్తర్వుల సారాంశంగా ప్రాథమిక పాఠశాలల వ్యవస్థ అస్తవ్యస్ధంగా వున్నదని, 3వ తరగతి నుండే సబ్జెక్ట్‌ బోధన, నాణ్యమైన విద్య అందించాలని, అంగన్‌వాడీతో కలిపి 1,2 తరగతులకు పునాది విద్య అందిస్తామని చెబుతున్నారు. పాఠశాల వ్యవస్థ ఎందుకు బలహీనంగా వుందో అధ్యయనం చేసి బలోపేతానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో ప్రయత్నం చేయకుండా పాఠశాల వ్యవస్ధను మాయం చేయడానికి చర్యలు తీసుకోవడాన్ని వ్యతిరేకించాలి.
సమాధానం లేని ప్రశ్నలు దేశంలో ఏరాష్ట్రంలో లేని 3-10 తరగతుల వ్యవస్థను ఆంధ్ర ప్రదేశ్‌లో ఎందుకు ప్రవేశపెడుతున్నారు. ఇప్పటికే గిరిజన సంక్షేమ పాఠశాలల్లో చేసిన ఇలాంటి ప్రయోగం విఫలం అయ్యింది కదా! 1-5 తరగతుల విద్యార్థి సామర్థ్యాలు,6-10 తరగతుల సామర్థ్యాలు వేరువేరుగా వుంటాయి కదా. పిరియడ్స్‌ వ్యవస్థ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు బోధన నుండి దూరం చేస్తుంది కదా! ప్లే స్కూల్‌గా వున్న అంగన్‌వాడీ కేంద్రాలలోకి 1,2 తరగతుల పిల్లలను చేర్చడం చదువు నేర్పడానికేనా? ‘ఒక్క పాఠశాల మూసివేయం. ఒక పోస్టు తగ్గించం’ అని ప్రభుత్వం చెబుతూ 1:30 నిష్పత్తిని ముందుకు తీసుకురావడాన్ని ఎలా చూడాలి? పునాది విద్యను నేర్పే ప్రాథమిక పాఠశాలను విడదీసిన తరువాత విద్యార్థికి చదువు దూరం కాదా! 1 కిమీలో పాఠశాల వుండాలనే ప్రాథమిక విద్యా హక్కు చట్టం నిబంధనకు ప్రస్తుత ఉత్తర్వులు విరుద్ధం కాదా! ఎన్‌ఇపి 2020 లోని 8వ తరగతి లోపు మాతృభాషలో విద్య అనేది ఎందుకు విస్మరించారు. ఎన్‌ఇపి 2020లో 3,4,5 తరగతులను ప్రాథమిక విద్య నుండి విడదీయాలని ఎక్కడైనా వుందా! తమ నివాస ప్రాంతాలలో స్కూలు లేకపోతే… దూరం పోలేని, దూరం పంపించడానికి ఇష్టపడని విద్యార్థులు పాఠశాలకు దూరం కారా! ఇప్పటికే ఖాళీగా వున్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసి పాఠశాల వ్యవస్థ బలోపేతానికి చర్యలు తీసుకోకుండా మరిన్ని ఉపాధ్యాయ పోస్టులను మిగులుగా చూపించడానికి చేసే ప్రయత్నం కాదా! ఒకే మీడియం వల్ల ఇప్పటికే ఉన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న సబ్జెక్ట్‌ ఉపాధ్యాయులు మిగులుగా మారిపోతే, 3,4,5 తరగతులు ఉన్నత పాఠశాలల్లో విలీనం వల్ల వచ్చే ఎస్‌జిటి ఉపాధ్యాయులకు పదోన్నతులు రావు కదా! మొత్తం విద్యార్థులు, మొత్తం ఉపాధ్యాయులను పరిగణ లోనికి తీసుకొని ఉపాధ్యాయ, విద్యార్థి నిష్పత్తిని నిర్ధారించడం అశాస్త్రీయం కదా! ఉన్నత పాఠశాలల్లో సెక్షన్ల వారీ ఉపాధ్యాయుల సంఖ్యను కేటాయించాలి కదా! ఇంకా ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానం లేకపోగా… విప్లవాత్మకమైన మార్పులను మీరు అంగీకరించాలని చెబుతున్నారు. ఐనా ‘ఒక్క సంవత్సరం ఆగండి. మా సంస్కరణలు మంచి ఫలితాలు ఇస్తాయ’ని చెబుతున్నారు.
ఏం జరగబోతున్నది ?
75 సంవత్సరాలుగా ప్రజలందరికి అమ్మ ఒడి లాంటి ప్రాథమిక వ్యవస్థ కనుమరుగవుతుంది. విద్యార్థులు లేక కొన్ని, విలీనం వల్ల అన్ని ప్రాథమిక పాఠశాలలతో పాటు ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు కొన్ని మాయమవుతాయి. ఉపాధ్యాయుల సంఖ్య (సుమారు 54 వేలు) తగ్గిపోతుంది. 1-2 తరగతుల విద్యార్థులకు నాణ్యమైన బోధన వుండదు. ఇప్పటికే బడి బయట వున్న విద్యార్థులకు తోడు మరింత మంది విద్యార్థులు చదువుకు దూరం అవుతారు.
ఏం చేయాలి ?
ఓవైపు మనమంతా 23శాతం ఫిట్‌మెంట్‌ వద్దని, మెరుగైన పిఆర్‌సి కావాలనే డిమాండ్లతో పోరాటం చేస్తూ వున్నాం. మరొకపక్క ప్రభుత్వం అనుకున్న విధంగా ప్రాథమిక పాఠశాలలను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయబోతున్నది. కనుక ‘మాకు ఊరు బడి వుండాల’నే తల్లిదండ్రులను కదిలించి వారితో కలిసి ఉద్యమించాలి. ప్రాథమిక పాఠశాల యథాతథంగా వుంచాలి. సమాంతర మీడియంలను కొనసాగించాలి. ఖాళీగా వున్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలి…అనే డిమాండ్లతో సామాజిక ఉద్యమాన్ని నిర్మించాలి. ఇందుకు కలిసి వచ్చే శక్తులను కలుపుకొందాం. వ్యాసకర్త : యుటిఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు- ఎన్‌. వెంకటేశ్వర్లు