గత ముప్పై సంవత్సరాలక్రితం దేశంలో నూతనఆర్ధిక విధానాన్ని ప్రవేశ పెట్టారు.స్వాతంత్య్రం వచ్చిన తర్వాత సోషలిస్టు విధానం అమలు పర్చారు. అటు కమ్యూనిస్టులు కాదు..ఇటు కాపిలిస్టులు కాదు..మిశ్రమ ఆర్ధిక విధానాన్ని మన దేశం ఎంచుకోవడం జరిగింది.రాజకీయ విధానంలో బహుళజాతి ప్రాజెక్టులు అనగా స్టీల్ ప్లాంట్,పవర్ ప్రాజెక్టులు,వంతెనల నిర్మాణాలు వంటి దేశంలో ఉన్న ప్రభుత్వరంగసంస్థలపై ప్రభుత్వమే పెట్టుబడులు పెడుతోంది. వీటిపై లాభం రావడం సమయం పడుతోంది. ఈలోగా లాభంవచ్చేటప్పటికీ ప్రైవేటు సంస్థల చేతుల్లోకి వెళ్లిపోతున్నాయి. 2001లోప్రభుత్వ రంగ సంస్థ బాల్కో,వేదాంత వంటి ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు కంపెనీల చేతుల్లోకి వెళ్లిపోయాయి. అక్కడ నుంచి పరిశీలిస్తే అన్నీ ప్రైవేటీకీకరణ అయిపోతూనే ఉన్నాయి. ఆఖరికి విశాఖ స్టీల్‌ఫ్లాంట్,ఎయిర్ ఇండియా లిమిటెడ్ అన్నీ అమ్ముడైపోతున్నాయి. గిరిజనులున్న అటవీ ప్రాంతాలలో అటవీ అభి వృద్ధిపేరుతో రకరకాల పథకాలు,కార్యాచరణ ప్రణాళికలు నడుస్తున్నాయి. ఇవన్నీ నూతన ఆర్థిక విధానాలతో ముడిపడి ఉన్నాయి.ప్రజా ప్రయోజనాల పేరుతో కారుచౌకగా ప్రభుత్వ రంగకంపెనీల మైన్లను,భూములను ప్రైవేటు కార్పొరేట్లకు కట్టబెట్టడమే ప్రభుత్వ ధ్యేయం.
దేశ ఆర్ధికవిధానాలపై 1991లో ఒకఆర్ధికశాస్త్రవేత్త చెప్పిన మాటలు నేడు అక్షర సత్యమౌతున్నాయి. ప్రభుత్వరంగ సంస్థలపై ప్రభుత్వంతోనే పెట్టుబడులు పెట్టించి,వాటిపై లాభాలు అర్జించే సరికి ప్రైవేటు కంపెనీలు కాజేస్తాయని వివరించారు. ప్రస్తుతం అదే నిజమౌతోంది. ఈనేపథ్యంలోనే ఇటీవల కాలంలో అటవీ చట్టాలు,మైనింగ్‌చట్టాలను సవరించడానికి ప్రభుత్వం ప్రతిపాదనలు జారీ చేసింది. ‘పర్యావరణ పరిరక్షణ,ఆర్థిక అవసరాలు-వీటికి సంబంధించి వేగంగా మారుతున్న దేశ అవసరాలు నెరవేర్చే ఉద్దేశ్యంతో అటవీ సంరక్షణ చట్టాన్ని సంస్కరించాలని భావిస్తున్నట్టు కేంద్రంపేర్కొంది. చాలా అస్పష్టంగా చేసిన ప్రతిపాదనలు ఆపత్రంలో ఉన్నాయి. కాస్త జాగ్రత్తగా పరిశీలిస్తే జాతీయ మానిటైజేషన్ ప్రణాళిక, 2022-25 కు అనుగుణంగా ఉండేలా అటవీ అనుమతుల నిబంధనలను,పర్యావరణ సంరక్షణ నిబంధనలను సడలించడమే ఈ ప్రతిపాదనల వెనుక అసలు ఉద్దేశ్యం అని మనకు అర్ధమౌతుంది. అనేక ప్రభుత్వ ఆస్తులు అటవీ ప్రాంతాల్లో వున్నాయి. అవన్నీ ప్రస్తుత అటవీ సంరక్షణ చట్టం విధించిన నిబంధనలకు లోబడి ఉన్నాయి. జాతీయ మానిటైజేషన్ పథకం వివిధ ప్రభుత్వ ఆస్తులను లీజుకివ్వాలని ప్రతిపాదించింది. ఆవిధంగా లీజుకివ్వడానికి ఈఅటవీ సంరక్షణ చట్ట నిబంధనలు అడ్డంవస్తున్నాయి. అందుకే ఆచట్టాన్నే ఏకంగా సవరించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నది. తక్కవ సమయాన్ని ఇచ్చి వాటిపై ప్రజాభిప్రాయ సేకరణ సేకరిస్తున్నట్టు ప్రకటించింది.ఈచట్టాలపై ప్రజల అభిప్రాయాలు తెలియజేయడానికి కేవలం15రోజులు మాత్రమే గడువు ఇచ్చింది.సుమారు22భాషలు కలిగిఉన్న ప్రజాస్వామ్య దేశంలో కేవలం రెండు(హిందీ, ఆంగ్లం) భాషల్లో సవరణ చట్టాల ముసాయిదా పత్రాలు ప్రచురించింది. ఇంత తక్కువ సమయంలో ఈ పత్రాలను ఎంతమంది చదవి అర్ధం చేసుకొని వారి మనోభావాలు వెల్లడిరచగలరనేది ప్రశ్న.
గిరిజన తెగలకు ఇతర అటవీ నివాసులకు జరిగిన చారిత్రక అన్యాయాన్ని సరిచేస్తూ భారత పార్లమెంట్ చేసిన చట్టం పంచాయితీరాజ్‌విస్తరణ చట్టం(పీసా),అటవీ హక్కుల చట్టం(ఎఫ్‌ఆర్‌ఎ).తీసుకొచ్చింది. ఇవి గిరిజనుల హక్కులకు సంబంధించింది. వలస చట్టాలు, స్వాతంత్య్రం తర్వాత చట్టాలు. ఉదాహరణకు 1967 ఎ.పి అటవీ చట్టం సెటిల్‌మెంట్ అధికారులను నియమించమని, వారి హక్కులను గుర్తించమని చెప్పాయి. అయినా పాలకులు పట్టించుకోలేదు.‘పీసా’చట్టం ప్రకారం ఏర్పడిన గ్రామసభలను కేవలం సంప్రదిస్తారట. ప్రతిపాదించబడిన సవరణ చట్టం ‘పీసా’ చట్టాన్ని కాని,‘అటవీ హక్కుల చట్టం-2006’ను గాని గుర్తించినట్లులేదు. పర్యావరణ పరిరక్షణకు గిరిజనులను అడవుల నుండి నెట్టి వేయరాదని చట్టం చెప్పినా,దీన్ని అమలు చేయలేదు. ఎన్విరాన్‌మెంటల్ ఇంపెక్ట్ అసెస్‌మెంట్(ఇఐఏ)పర్యావరణ ప్రభావఅంచనా నోటిఫికేషన్ ఫలితంగా ప్రస్తుతం అటవీ చట్టం సవరణ ప్రతిపాదనలు జరుగుతున్నాయి. సరళీకరణ విధానం ప్రైవేటు కంపెనీల్లో ఒక భాగం. కేంద్రప్రభుత్వం ఇటీవల రాష్ట్రప్రభుత్వాల అధిపత్యాలన్ని తగ్గించి నిర్వీర్యం చేయడానికి పూనుకుంటోంది. దీనిపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలుకూడా కేంద్రప్రభుత్వం తీసుకుంటున్న అనాలోచిత విధానాలు, ప్రతిపాదనలు,సవరణలపై ప్రజల మనోభావాలు పరిగణనలోకి తీసుకొని కేంద్రప్రభుత్వంలో వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది! –ఎడిటర్,రవిరెబ్బా ప్రగడ రవి