ఓ యువ..యువా!

‘‘ ప్రస్తుతం మనదేశ జనాభాలో సగం మంది యువతీ యువకులే! ఇది చాలా గొప్ప మానవ వనరు. సరైన పద్ధతిలో ఈ శక్తిని ఉపయోగిస్తే- దేశ ప్రగతికి ఇదొక గొప్ప అవకాశం. ఉన్నామా? తిన్నామా? మన బాగు మనం చూసుకున్నామా? అన్నది ఎప్పుడూ యువతరం జీవన విధానం కాదు. యువశక్తి… అంటే- అంతకుమించి. నవనవోత్తేజం ప్రవహించి… నవీన మార్పులను స ృష్టించగలిగేంత స్ఫూర్తి. దేశానికి సరికొత్త వెలుగులు ప్రసరించేంత ప్రబల దీప్తి ’’

యువతీ యువకులు ఎప్పుడూ కొత్త మార్పులను ఆహ్వానిస్తారు. పాతలోని చెడుని నిరాకరిస్తారు. కొత్తలోని మంచిని స్వాగతిస్తారు. తమకోసం మాత్రమే ఆలోచించరు. తమ చుట్టూ ఉన్న పరిస్థితులనూ పట్టించుకుంటారు. సమన్యను గుర్తిస్తారు. కారణం కనుక్కొంటారు. పరిష్కారం కోసం ప్రయత్నిస్తారు. ప్రతి తరంలోనూ ముందు తరాలకోసం ఆలోచించే యువత గణనీయంగానే ఉంటుంది. ఇది ఆ వయో వ్యవధిలో ఒక సహజ ఉత్సాహ లక్షణం. కెరీర్‌ అనేది ఇప్పట్లా వెంటబడి తరమకుండా ఉన్నప్పుడు ఈ సామాజిక స్ప ృహ ఎక్కువగా ఉండేది. ఇప్పుడంతా పెట్టుబడితో కూడిన ప్రయివేటు విద్యాభ్యాసం. కెరీర్‌ నిర్మాణం కోసం పరుగులు పెడుతున్న కాలం. ఏదో ఒకలా నెగ్గుకురావాలనే తపన బలంగా నెడుతున్న సందర్భం. ఖర్చు పెట్టాం కాబట్టి, అది ఏదొక రూపంలో అందిపుచ్చుకోవాలనే తాపత్రయం నడిపిస్తున్న తరుణం. కాబట్టి- యువతరానికి సహజంగా ఉండే సామాజికోత్సాహం అణచివేతకు గురవుతోంది.
ముందు తరాల మేలు కోరి …
గుత్తాధిపత్యాలూ, సంపన్న సామ్రాజ్యాలూ అంతకంతకూ విస్తరిస్తున్న వర్తమాన వాస్తవం కళ్లెదుట కనిపిస్తూనే ఉంటుంది. విద్య, వైద్యం వంటి వాటికి ఖరీదు పెరగటం కనిపిస్తూనే ఉంటుంది. ఎవరో అధికార పీఠం ఎక్కడం కోసం సమాజంలో విబేధాలూ, వివాదాలూ సృష్టిస్తున్న వైనం కనిపిస్తూనే ఉంటుంది. కాలం శాస్త్ర సాంకేతిక ప్రగతి పట్టాల మీద పయనిస్తున్న సత్యం తెలుస్తూనే ఉంటుంది. అదే సమయంలో ఛాందసం, అంధయుగపు ఆచారాలూ కొత్త భాష్యాలతో ముందుకొస్తూనే ఉంటాయి. వీటిన్నిటి మధ్య నిజం ఏమిటి? కారణం ఏమిటి? కల్పించేదెవరు? కవ్విస్తున్నదెవరు? వంటి ప్రశ్నలు సహజాతి సహజంగా తలెత్తాలి. వాటికి సమాధానాలు తార్కికంగా, శాస్త్రబద్ధంగా అన్వేషించాలి. ఇలాంటి ఆలోచన, అవకాశమూ ఇవ్వకుండా యువతరాన్ని గందరగోళానికి గురి చేసే ‘పరిస్థితులు’ ఎప్పటికప్పుడు నెలకొంటూ ఉంటాయి. ఎప్పటికన్నా ఇప్పుడు ఆ సంక్లిష్టత బాగా పెరిగింది. ఇలాంటి పరిస్థితిలోనే సమాజం గురించి పట్టించుకోవాల్సిన బాధ్యత యువతపై మరింత ఎక్కువగా ఉంటుంది.
కాలం ఏదైనా కొత్త మార్పును తెచ్చే ఆలోచనలను, ఆచరణనూ సమాజం వెంటనే ఆమోదించదు. పాతభావాలకు ప్రాతినిథ్యం వహించే వ్యక్తుల నుంచి, వ్యవస్థ నుంచి ప్రతికూలత, ప్రతిఘటనా ఎదురవుతాయి. ఇది సహజమనే అవగాహన యువతరానికి ఉండాలి. ఇప్పుడు మనం స్వాతంత్య్రోద్యమం గురించి ఘనంగా చెప్పుకుంటాం. అందులో పాల్గొన్న పెద్దలను గొప్పగా కీర్తిస్తాం. కానీ, ఆసమయంలో వారికి సమాజం మొత్తం నుంచి, కొన్ని సందర్భాల్లో కుటుంబ సభ్యుల నుంచి కూడా మద్దతు లభించలేదన్నది వాస్తవం. కొందరు స్వార్థంతోనో, అవగాహ నాలేమితోనో అప్పటి పాలకుల భావాలకు అనుగుణంగా ప్రవర్తిస్తారు. మార్పు కోసం ప్రయత్నిస్తున్న వారికి వ్యతిరేకంగా సాగే ప్రచారంలో భాగస్వామ్యం వహిస్తారు.
వెలుగు దివ్వెలూ .. నిప్పురవ్వలూ
అల్లూరి సీతారామరాజుకు మన్యంవీరుడని పేరు. మన్యం ప్రజలపై బ్రిటీషు వారి దాష్టీకానికి వ్యతిరేకంగా 1922-24 మధ్య పోరాటం నడిపాడు. ఆరోజుల్లో ఆయన్ని దోపిడీదారు అన్నవారు ఉన్నారు. పోలీస్‌ స్టేషన్లో అలాంటి కట్టుకతలతోనే కేసులు పెట్టారు. ఆయనకు, ఆయన బృందానికి సహకరించ కూడదని పరమ దారుణంగా గ్రామాలను భయపెట్టారు. చిత్రహింసలకు గురి చేశారు. కొందరు జాతీయ నాయకులు కూడా అప్పట్లో అల్లూరిని సమర్థించలేదు. స్వాతంత్య్రం వచ్చాక పరిస్థితి మారింది. ఆయనిప్పుడు మన్యం గుండెల్లో దేదీప్య తార. ఇది కందుకూరి వీరేశలింగం శతవర్థంతి సంవత్సరం. తరతరాలకు ఆయనొక చెరగని స్ఫూర్తి సంతకం. బాల్య వివాహాలను అడ్డుకున్నాడు. ఊహ తెలియక ముందే వితంతువులుగా మారిన ఎందరికో పునర్వివాహాలు చేశాడు. వారికి ఆశ్రయం ఇచ్చాడు. ఆడపిల్లలకు చదువు నేర్పించాడు. ఆకాలంలో ఇదంతా సంప్రదాయ విరుద్ధమని, విలువలకు పాతరేసే మహా పాతకమని సాంప్రదాయ వాదులు నానా రభసా చేశారు. ప్రదర్శనలు జరిపారు. శాపనార్థాలు పెట్టారు. ఆయన వ్యక్తిత్వాన్ని హీనపరిచే కట్టుకథలను ప్రచారం చేశారు. భౌతిక దాడులకు పాల్పడ్డారు. కులం నుంచి వెలివేశారు. అయినా, అధైర్యపడలేదు కందు కూరి. మహిళల అభ్యున్నతే తన లక్ష్యం అన్నాడు. ఛాందస భావాలకు సమాధి కట్టటమే తన సంకల్పమని చెప్పాడు. ఆయన తరువాతి కాలంలో సంఘ సంస్కర్తగా, నవయుగకర్తగా ప్రఖ్యాతి పొందారు. ఇప్పుడు బాల్యవివాహాలను ఎవరైనా అంగీ కరిస్తారా? చిన్న వయసులో భర్త చనిపోయిన యువతులు మళ్లీ పెళ్లి చేసుకోవటాన్ని వ్యతిరేకిస్తారా? సమాజం కాలం గడుస్తున్నకొద్దీ తన భావాలను విస్తరించుకుంటుంది. ఎక్కువమంది వ్యతిరేకించినంతమాత్రాన కొన్ని దురాచారాలూ, అసమానత్వ భావాలూ మంచివి అయిపోవు. యువతీయువకులు ముందు కాలపు దూతలు. అందుకనే రేపటి సమాజం ఎలా ఉండాలో ఇప్పుడే ఆలోచించాలి. ఆ విధమైన మార్పు కోసం ఇప్పటినుంచే ప్రయత్నం చేయాలి. ఎంతమంది వ్యతిరేకించినా-రాజా రామ్మోహన్‌ రారు, కందుకూరి వీరేశ లింగం, జ్యోతిరావు బా ఫూలే వంటి మహానుభావులు తాము యువకులుగా ఉన్నప్పుడే తమ స్పష్టమైన బాటను, భావజాలాన్ని ఎంచుకున్నారు. ఆబాటలో సమాజాన్ని నడిపించారు.
యువతకు తిరుగులేని ఉత్తేజం భగత్‌సింగ్‌. స్వాతంత్య్రోద్యమ పోరాటంలో భయమెరగని వీరకిశోరం. ఉరితాడును వరమాలగా భావించిన 1931 నాటికి ఆయన వయస్సు కేవలం 23 ఏళ్లు! అంత చిన్న వయసులోనే స్పష్టమైన భావావేశం, దృఢమైన సంకల్ప బలం గుండెలనిండా నింపుకున్నాడు. భగత్‌ స్వీయరచనలు, లేఖలూ చదివితే- ఎంత నికరంగా ఉండేవాడో తెలుస్తుంది. తన క్షేమం కోరి తండ్రి రాసిన లేఖలో కొద్దిపాటి మెతక తనం ప్రదర్శించటాన్ని కూడా భరించలేక పోయాడు. క్షణక్షణం దేశం కోసం పరితపించాడు. దేశ అభ్యున్నతికి ఏ మార్గం అవసరమో చాలా స్పష్టాతిస్పష్టంగా ఆ ఇరవై మూడేళ్లకే అవగాహనలోకి తెచ్చుకున్నాడు. ఇప్పుడు మతతత్వం రగిలించే కొన్ని శక్తులు భగత్‌ సింగ్‌కు వారసులమంటూ చెప్పుకోవటం ఎంత హాస్యాస్పదమో ఆయన రచనలు చదివితే తెలుస్తుంది. భగత్‌సింగు, రాజగురు, సుఖ్‌దేవ్‌ జైల్లో ఉన్నప్పుడు, మరణశిక్ష పడినప్పుడు-అప్పటి ప్రధాన నాయకులు వారికి దన్నుగా నిలవలేదు. కానీ, కోట్లాదిమంది ప్రజల గుండెల్లో వారు వీరకిశోరాలుగా నిలిచారు. ఇప్పటికీ, ఎప్పటికీ ధైర్యంగా బిగించే పిడికిలి వెనక, నిర్భయంగా ప్రశ్నించే గొంతు వెనకా వారి స్ఫూర్తి ధ్వనిస్తూనే ఉంటుంది.
మార్పు ఒక నిరంతర ప్రక్రియ
సమాజం ఒకదశలోంచి ఒక దశలోకి నిరంతరంగా మారుతూ ఉంటుంది. మారుతున్న క్రమంలో పాత విలువలు కొన్ని నశించిపోతాయి. కొత్త విలువలు కొన్ని వచ్చి చేరతాయి. ఇది నెమ్మది నెమ్మదిగా జరిగే మార్పు. ఒకనాడు కాదన్నది ఇప్పుడు అవున వుతుంది. ఇప్పుడు అవున్నది కొంతకాలానికి కొరకాకుండా పోతుంది. అవసరాలను బట్టే చెల్లుబాటు ఉంటుంది. ఏవిలువా స్థిరంగా పాతుకొనిపోవటం కుదరదు. ఈ అంశాలను అర్థం చేసుకోవటానికి చారిత్రిక పరిశీలన, శాస్త్రీయ దృష్టి, సామాజిక దృక్పథం అవసరమవుతాయి. ఇప్పటి వరకూ ఏం జరుగుతూ వచ్చింది? దీని వెనక గల శాస్త్రీయ, తార్కిక కారణాలు, సంబంధాలూ ఎలాంటివి? సామాజిక సంబంధాలూ, అవసరాలూ ఎలా నడుస్తున్నాయి? అన్న విశ్లేషణ ఉంటే-ప్రతి పరిణామం సులభంగానే అవగతం అవుతుంది. శాస్త్ర సాంకేతిక విజ్ఞానం పెరిగినకాలంలో -ఈ అవగాహన పొందటం మరింత సులభం కూడా! కానీ, మోడర్న్‌ కాలాన్ని కూడా కొన్ని శక్తులు మూఢత్వ విస్తృతికి ఉపయోగిస్తున్నాయి. తార్కిక దృష్టికి నిలవని అబద్ధాలను భావోద్వేగాలను జతచేసి ప్రచారం చేస్తున్నాయి. కొంతమంది యువతీ యువకులు తెలుసో తెలియకో ఇలాంటి అజ్ఞాన సమాచారాన్ని నమ్మటం, ప్రచారం చేయటం బాధాకరమే! ప్రతి కాలాన్ని మరింత మంచికాలంగా మార్చే బాధ్యత మనందరిదీ! ముఖ్యంగా యువతది. గాంధీ, నెహ్రూ, అంబేద్కర్‌, సుందరయ్య లాంటి మహానుభావులు ఆశించిన దిశగా దేశాన్ని నడిపించటంలో మన పాత్రా ఉంటుంది. మనది భిన్నత్వంలో ఏకత్వం గల దేశం. భిన్నభాషలూ, భిన్నప్రాంతాలూ, భిన్న సంస్క ృతీ సంప్రదాయాలూ, భిన్నఆచార వ్యవహారాలూ… అన్నీ కలిస్తేనే భారతదేశం. మరి సమకాలీన పరిణా మాలు ఆదిశగా ఉన్నాయా? మనుషుల మధ్య చిచ్చు పెట్టే విధంగా ఉన్నాయా? యువత గమనించాలి. చారిత్రిక దృష్టితో చూస్తే-సామాజిక పరిణామ క్రమాన్ని గమనిస్తే, కులం అనేదానికి ప్రాధాన్యం లేదు. ఆపేరిట కొందరు ఆధిక్య భావనకు గురవ్వడం, కొందరిని కించపర్చటం, కులాల పేరిట స్నేహాలూ గుర్తింపూ కోరు కోవటం ఆటవిక లక్షణం కన్నా అథమం. కులాన్ని కెలుక్కోవటానికి ఇంటర్నెట్‌ని వాడితే-అది ఆధునికం అనిపించుకోదు. ఇలాంటి విషయాల్లో యువతలో రెండు రకాల ధోరణులు కనిపిస్తాయి. అందరం ఒకటే అనే తరహా ఒకటి కాగా, తక్కువ ఎక్కువల విభజనతో కుల సమీకరణలు కోరుకునే ధోరణి మరొకటి. కారణం ఏది చెప్పుకున్నా-ఇలాంటి విభజనతో సమూహాలు ఏర్పడ్డం సమాజానికి హానికరం.
సమానత్వం దిశగా …
స్త్రీ పురుష సమానత్వం సాధించే దిశగా గతంలో ఎంతోమంది ఎన్నో ప్రయత్నాలు చేశారు. వాటి ఫలితమే ఇప్పుడు మనం చూస్తున్న ఈపాటి మార్పు. ఇదింకా ముందుకు వెళ్లాలి. కట్నాలు తీసుకోని యువకులు ఈమధ్యకాలంలో చాలా పెరిగారు. కానీ, ఆ సంఖ్య ఇప్పటికీ అత్యల్పమే! ఆ భావజాలం ఇంకా విస్తృత ప్రచారం పొందాలి. మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా మాట్లాడ్డం, వ్యవహరించటం బాగా పెరగాలి. కానీ, ఈకాలంలో సైన్సునీ, చాదస్తాన్ని కలగలిపి మాట్లాడేవారు పెరిగారు. మనం గొప్పవాళ్లం అని చెప్పుకోవటానికి మన గతమంతా ఘనమైనదేనని జబ్బలు చరుచుకోవటం మంచిది కాదు. తార్కిక దృష్టితో చూస్తే మంచిచెడ్డలు రెండూ విడివిడిగా బోధపడతాయి. గతంలో మంచి కొంచెమేనని, రానున్నదే మంచికాలమని వందేళ్లనాడే ఉద్ఘాటించాడు మహాకవి గురజాడ. వాస్తు, జ్యోతిష్యం వంటివి ఇంతగా అభివ ృద్ధి చెందని కాలంలో ప్రజలకు కొంత ఉపయోగపడ్డ మాట నిజమే! ఇప్పుడు సైన్సు అండ్‌ టెక్నాలజీ అంతకుమించి అభివృద్ధి చెందింది. ఇంకా వాటిని పట్టుకొని వేలాడ్డంలో ఔచిత్యం లేదు. కొందరు పాత నమ్మకాల్లో ఏదో అంతరార్థం ఉందంటూ సైన్సుని గుప్పించి, చెబుతూ ఉంటారు. ఆ కబుర్లు చెప్పటానికి మళ్లీ ఈనాటి టెక్నాలజీతో కూడిన టీవీలూ, ల్యాప్‌ట్యాపులూ ఉపయోగిస్తుంటారు. దీనినిబట్టే అందులోని డొల్లతనం బట్టబయలు అవుతుంది.
పార్టీల గుట్టు..ప్రభుత్వాల పట్టు తెలియాలి
ఎన్నికల హామీలూ, రాజకీయ పార్టీల ప్రచారాలూ, అందులోని వాస్తవాలూ ఏమిటో…యువతరం బాగా అవగతం చేసుకోవాలి. మాటలకు, చేతలకు పొంతన ఉందా? చెప్పిన కబుర్లలో సాధ్యమయ్యేది ఎంత? గతంలో చెప్పిందేమిటి? చేసిందేమిటి? వంటి విషయాలను స్వీయ పరిశీలనతో అధ్యయనం చేయాలి. ఆపని నేడు చాలా సులభం. కంప్యూటర్ల సాయంతో క్షణాల్లో సమాచారాన్ని పొందొచ్చు. ఎవరో రాసిన వ్యాఖ్యలను, లెక్కలను యథాతథంగా నమ్మకుండా వాస్తవాలతో బేరీజు వేసుకోవాలి. ఎవరు ఏపని చేసినా, ఎంత సంపాదించినా, ఏఉద్యోగంలో ఉన్నా- అందరిపైనా మన ప్రభుత్వాల పనితీరు ప్రభావం తప్పనిసరి. రాజకీయాలు మాకొద్దు అని విరక్తినో, విముఖతనో ప్రదర్శించటం సరైంది కాదు. కాబట్టి- రాజకీయ వ్యవస్థలను దగ్గరగా పరిశీ లించాలి. అభిమాన దురాభిమానాలను పక్కన పెట్టి- మన దేశానికి, ఆధునిక కాలానికీ తగినట్టుగా ప్రభుత్వాలూ, పార్టీలూ నడుస్తున్నాయో లేదో చూడాలి. రాజకీయాల్లో సంపన్నులూ, కార్పొరేట్‌ శక్తులూ పెరిగే కొద్దీ-సామాన్యులకు అందే పథకాలూ, ప్రయోజనాలూ తగ్గిపోతాయి. బలహీనంగా ఉండే రైతులు, దళితులు, గిరిజనులు, అన్నితరగతుల పేదలకు కేటాయింపులు కుంచించుకుపోతాయి. వీటిని పరిశీలించి, ప్రజలకు చెప్పటం కూడా యువతరం పనే! ‘మా డబ్బుతో మేం చదివాం. మా కృషితో మేం ఎదిగాం. మాకు ఈ సమాజంతో సంబంధం లేదు.’ అని యువతను వేరు చేయడం ప్రయివేటు విద్య లక్షణం. ఎక్కడ చదివినా, ఎలా ఎదిగినా మనమంతా సామాజికులం. సంబంధీకులం. సమాజం గురించి పట్టించుకోవటం ఎప్పటికీ బాధ్యతే! యువతరం దేశానికి ఇంధనం. ప్రగతికి ముందు చక్రం. ఇందులో ఏ సందేహమూ అక్కర్లేదు. చరిత్రలో ఏ మార్పు సంభవించినా అది ఉరకలెత్తే యువత వల్లే సాధ్యమైంది. ‘యువతరం శిరమెత్తితే.. నవతరం గళమెత్తితే- చీకటే పారిపోదా? లోకమే మారిపోదా?’ అన్న కవి ఆశాభావం అత్యాశ కాదు. అది గతంలో జరిగింది. భవిష్యత్తులోనూ జరుగుతుంది. అయితే, దానికి వర్తమానంలోని యువతరం ఎలాంటి ఆచరణ చేపడుతుంది అన్న దానిపై ఆ మార్పు దిశా, దశా ఆధారపడి ఉంటాయి. కాలమైతే- మంచిమార్పునే కలగంటూ ఉంటుంది ఎప్పుడూ. దానిని నిజం చేసే బాధ్యత గల యువతీయువకులు కావాలిప్పుడు.
దేశానికి ఇంధనం యువతే!
దేశంలో దాదాపు 16 శాతం నిరుద్యోగం ఉంది. గొప్ప శక్తియుక్తులు ఉన్న 30 ఏళ్లలోపు యువతరం చదువుకు తగ్గ ఉద్యోగాలు లేక నానా తిప్పలూ పడాల్సి వస్తోంది. పెద్ద పెద్ద ప్యాకేజీల గురించి పత్రికల్లో ఘనమైన వార్తలు వచ్చినా- నిజానికి అలాంటి జీతాలు పొందుతున్న వారి సంఖ్య 3 శాతానికి మించటం లేదు. ఎక్కువ ఉద్యోగ అవకాశాలు లభిస్తున్న సాఫ్ట్‌వేర్‌ వంటి రంగాల్లో పనిఒత్తిడి, పనిగంటలు దారుణంగా ఉంటున్నాయి. ఉద్యోగం ఎప్పుడు పోతుందో, జీతానికి ఎంత కోత పడుతుందోనన్న భయం సీనియర్లను సైతం వెంటాడుతోంది. ఇలాంటి సమస్యలపై 150 ఏళ్ల క్రితమే సాధారణ కార్మికులు సంఘటితమై పోరాడారు. చాలా సదుపాయాలు సాధించుకున్నారు. ఇప్పుడు అలా ప్రశ్నించే పరిస్థితే లేకపోవటం నిజంగా అభివృద్ధేనా? ఇలాంటి అంశాల్లో అమెరికా, ఫ్రాన్స్‌, ఐరోపా దేశాల్లోని యువత ఈ మధ్యకాలంలో తీవ్రంగా గొంతెత్తుతోంది. మన దగ్గర ఇది ఇంకా రావాల్సిన మార్పు.
`రచయిత : సీనియర్‌ జర్నలిస్టు, (ప్రజాశక్తి సౌజన్యంతో…) 9490099167- సత్యాజీ