విస్తృత పరిశోధన సారం`ఆదివాసీల జీవనం
ఒకప్పుడు మౌఖిక సాహిత్యంకే పరిమితమైన… మన ఆదివాసీ సాహిత్యం… అక్షరాస్యతలో వచ్చిన అభివృద్ధిలో భాగంగా .. వివిధ ప్రక్రియలలో పుస్తకాల రూపంలో… వస్తూ ప్రామాణికతకు చోటుచేసు కుం టుంది, ఈ గిరిజన సాహిత్యంలోని… పుస్తకాల వివరాలను ‘‘గవాక్షం’’ శీర్షికన… ‘‘థింసా పాఠకుల’’ కోసం ప్రతి నెల ఒక పుస్తకాన్ని పరిచయం చేస్తున్న పరిశోధక రచయిత డా. అమ్మిన శ్రీనివాసరాజు పమ్రుఖ రచయిత, సంపాదికులు భూక్యా చిన వేంకటేశ్వర్లు కలం నుంచి జాలువారిన ‘ఆదివాసుల జీవనం’ అనే పుస్తకంపై సమీక్ష
తెలుగు సాహిత్యానికి గిరిజన జీవన చిత్రానికి విడదీయరాని బంధం సంబంధం ఏనాటిదో!! మౌఖికంగా ప్రారంభమై అక్షరాల గుండా నేడు అడివంత విశాలంగా వ్యాపించి వివిధ ప్రక్రియల ద్వారా పరిశోధనాత్మకంగా పరిశీలన పథంలో పయనిస్తుంది,గిరిజన సాహిత్య వికాసం కోసం విశ్వవిద్యాలయాలతో పాటు కొన్ని పత్రికల యాజమాన్యాలు చేస్తున్న కృషి అభినందన పూర్వక ఆచరణీయం.
ఇందులో భాగంగానే సుమారు పాతికేళ్ల క్రితం గుంటూరుకు చెందిన,ఆనాటి ఆంధ్రప్రదేశ్ గిరిజన జాతుల సంక్షేమ సంఘం అధ్యక్షులు,గిరిజన స్రవంతి మాసపత్రిక సంపాదకుడు.
‘‘భూక్యా చిన వెంకటేశ్వర్లు’’సంపాదకత్వంలో వెలువడిన వ్యాస సంకలనం‘‘ఆదివాసుల జీవనం’’, విభిన్న రంగాలకు చెందిన రచయితలు,తమ తమ పరిధిలో పరిశోధనాత్మక,ప్రామాణిక,రీతిలో గిరిజన జనావళికి సంబంధించిన అనేక చారిత్రక,సాంస్కృ తిక,సామాజిక,ఆర్థిక,అంశాలను గణాం కాలతో సైతం అందించిన 30వ్యాసాల సంకలనం ఈ పుస్తకం.
వ్యాస సంకలనంలో గిరిజనుల ఆచార వ్యవహారాలు వివరించడంతోపాటు,వారి వెనుక బాటుకు కారణాలు ప్రభుత్వాలు చేయాల్సిన విధులు, గురించి కూడా నిర్మొహమాటపు వ్యాసాలు అనేకం ఇందులో చదవవచ్చు.
ఆదివాసులకు అడవులకు మధ్య గల అవినాభావ సంబంధంను కాలరాస్తున్న ‘‘ఫారెస్ట్ బిల్లు’’ ద్వారా అడవి బిడ్డలకు జరుగుతున్న నష్టం,బావి ప్రమా దాలను, హెచ్చరికలతో అందించిన తొలి వ్యాసంలో ‘‘1927 భారత అటవీ చట్టం’’మొదలు అనంతర కాలంలో వచ్చి రూపాంతరం చెందిన పలు అటవీ చట్టాలు..బాహ్యంగా అడవుల,పర్యా వరణ,పరిరక్షణకు అన్న చందంగా కనిపించిన అంతర్గతంగా అడవి బిడ్డలకు అనేక విధాల ఆటంకాలు కలిగిస్తున్నాయి, అనే అక్షర సత్యం అందులో మనం గమనించవచ్చు, కేవలం బిల్లులోని దోషాలు ఎత్తి చూపడమే కాక పరిష్కార మార్గాలు, సూచనలు,కూడా చేయడం వల్ల ఉత్తమ విమర్శనాత్మక వ్యాసశ్రేణిలో నిలుస్తుంది,ఈ కోవకు చెందిన వ్యాసాలు అనేకం ఇందులో ఉన్నాయి.
నిడివి వ్యాసాల విషయం పక్కనపెట్టి విషయ ప్రాధాన్యతలను ప్రామాణికంగా లెక్కించి వర్గీకరించుకోవలసిన ఈవ్యాసాలు మొత్తం సంఖ్యాపరంగా 29,విషయ సూచిక లోపంగల దీనిలోని వ్యాసాలు పరిశీలించినప్పుడు గిరిజనుల సంస్కృతిని పరిరక్షించడంతోపాటు వారిని ఆర్థికంగా బలోపేతం చేయడంలో ప్రభుత్వాలు చేయాల్సిన కృషిని గురించి, కూడా గుర్తు చేస్తాయి.
‘‘గిరిజనాభివృద్ధి ఒక పరిశీలన’’అనే వ్యాసంలో 1957లో బలవంతరాయ్ కమిటీ సిఫార్సుల మేరకు గిరిజన అభివృద్ధి కోసం భారత ప్రభుత్వం 43 బహు ళార్థ ప్రాజెక్టులు వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన విషయంతో పాటు,మూడవ,నాల్గవ,పంచవర్ష ప్రణాళికల్లో గిరిజన అభివృద్ధికి ప్రత్యేక బ్లాకులు ఏర్పాటు చేసి,వారి ఆర్థిక అభివృద్ధికి జరిగిన కృషిని గుర్తు చేస్తూనే ఆదివాసుల సమగ్ర అభివృద్ధికి చేపట్టే కార్యక్రమాలు మూస పద్ధతిలో కాక, ఆయా గిరిజన ప్రాంతాల్లోని భౌగోళిక వాతావరణ పరిస్థితులకు అనుగుణమైన రీతిలోనే అభివృద్ధి చర్యలు చేపట్టాలనే విలువైన సూచనలు అందించారు వ్యాస రచయిత డాక్టర్ ఎల్. ప్రసాద్,
‘‘గిరిజన విద్య-అవకాశాలు-నిర్బంధాలు’’ అనే మరో వ్యాసంలో రచయిత ‘‘ప్రొఫెసర్ అంబాస్ట్’’ అనేక విలువైన విషయాలు తెలియజేశారు. పూర్వం గిరిజన జాతులు ఒక దానితో ఒకటి ఏవిధమైన సంపర్కం గాని సమాచార సంబంధాలుగానీ లేకుండా ఉండేవి, అందువల్ల వారిలో అధిక శాతం వ్రాసే భాషను అభివృద్ధి చేయలేకపోయి కేవలం మాట్లాడటం ద్వారానే అవసరాలు తీర్చుకుంటూ గిరిజన భాషలు మౌఖిక భాషలుగానే మిగిలిపోయాయి,అనే అక్షర సత్యాలను ఈ వ్యాస రచయిత ఆవిష్కరించడంలో ఆదర్శంగా నిలిచిపోయారు.గిరిజన భాషలకు లిఖితపూర్వకమైన భాష లేకున్నా నిర్దిష్టమైన వ్యాకరణం,భాషా నిర్మాణం ఉండేవి, మన దేశంలోనే చాలా గిరిజన తెగలవారు వారి పురాతన సంస్థల ద్వారానే విద్యావసరాలు తీర్చుకునేవారు.ఈ సంస్థలు ఆయా గిరిజన తెగలలోని యువతను సామాజిక ప్రయోజనం కలిగిన ఉత్పాదక సభ్యులుగా తయారు చేసేవి. గిరిజన సమాజాలు చాలావరకు ఇతర ప్రపంచాలతో సంబంధం లేనివి కావడం చేత వారు లిపి అవస రంగా భావించలేదు. కానీ వారికి భావపరమైన నైపుణ్యం ఉంది.
గిరిజనులందరికి సంపూర్ణ విద్యా సౌకర్యాలు అందాలంటే సమయం పడుతుంది, రాజ్యాంగంలో 46వ అధికరణ ప్రకారం గిరిజనులకు ప్రత్యేక శ్రద్ధతో విద్యా, ఆర్థిక, ప్రయోజనాలు కల్పించాల్సిన బాధ్యత పాలకులపై ఉంది.ఇలాంటి ఎన్నో ప్రామాణిక అంశాలు ఈ వ్యాస పరంపర సాయంగా తెలుసుకోవచ్చు.
గిరిజనులకు రాజ్యాంగం ప్రత్యేకంగా కల్పించిన ప్రయోజనాల గురించి యం.టి.దిన్ తనవ్యాసంలో అనేక ప్రామాణిక అంశాలు కూలంకషంగా వివరించారు, పూర్వం బ్రిటిష్ పాలకులు అనుసరించిన ఏర్పాటు వాదాన్ని గమనించిన రాజ్యాంగ నిర్మాతలు గిరిజన గిరిజనేతర ప్రజల మధ్య గల అవరోధాలను తొలగించే దిశగా మార్పులు చేర్పులు చేసి గిరిజనులు కూడా ఇతర భారతీయులతో సామాజికంగా ఆర్థికంగా సాంస్కృ తికంగా రాజకీయంగా సమాన అవకాశాలు పొందటానికి రాజ్యాంగంలోని ఆర్టికల్స్ ,షెడ్యూళ్లు, రూపొందించారు.
వీటి ద్వారా గిరిజన జనాభా ఆశించిన లబ్ధి పొందవచ్చు, కానీ కార్యాచరణలో నేటి గిరిజన జనాభా అభివృద్ధి ఏమిటి? అన్నది వ్యాసకర్త ప్రశ్న. ఇలా అనేక విషయాల కలబోతలు గల ఈ వ్యాసాలు బహుళ ప్రయోజన కారకాలు అనాలి.
ఇక ఇందులోని రెండవ పార్శ్వం గిరిజనుల సంస్కృతి వికాసానికి సంబంధించిన వ్యాసావళిలో కోయనృత్య ప్రదర్శన, విధానాలు గిరిజనలు పండుగలు, వేడుకలు, గిరిజనుల ఆచారాలు, అలవాట్లు, మొదలైన వ్యాసాలతో పాటు డాక్టర్ బాలగోపాల్ గారి సుదీర్ఘ వ్యాసం ‘‘గిరిజనులు గిరిజన సంస్కృతి’’ ద్వారా అనేక ఆసక్తికరమైన విషయాలు విశేషాలు తెలుస్తాయి.
గిరిజన జీవితాలతో విడదీయలేని బంధం గల నృత్యాల గురించిన ప్రత్యేక వ్యాసంలో గొట్టిపాటి సుజాత అనేక గిరిజన నృత్య రీతుల గురించి కళ్లకు కట్టినట్టు అక్షరీకరించారు. వీటిలో కొండ దొరల ‘‘మయూర నృత్యం’’ గురించి ప్రత్యేకంగా వ్రాశారు, వివాహ సందర్భాల్లో చేసే ఈ నృత్యంలో పెళ్లి, వైవాహిక జీవితం, మొదలైన అంశాలను ఘట్టాల వారీగా ప్రదర్శించడం వీరి ప్రత్యేకత, అలాగే గోండులు చేసే దండారి, థింసా, నృత్య విశేషాలు, అలంకరణలు, మొదలైన అంశాల గురించి కూలంకషంగా ప్రామాణికంగా
ఈ వ్యాసంలో చర్చించారు.
పరిశోధకుల పాలిట కల్ప వృక్షంగా చెప్పాల్సిన ఈవ్యాస సంకలనం బహుళ ప్రయోజన కారి అనడం సబబు, 1998లో ప్రథమ ముద్రణ పొందిన ఈ వ్యాస సంకలనం, 2002లో ద్వితీయ ముద్రణ పొందటం మరో విశేషం,
ఆదివాసుల జీవనం (వ్యాస సంకలనం), పేజీలు : 144
వెల : 55/- రూ
సంపాదకుడు : కీ:శే భూక్యా చిన వెంక టేశ్వర్లు.
సమీక్షకుడు : డా:అమ్మిన శ్రీనివాసరాజు
సెల్ : 77298 83223.