సబ్‌ప్లాన్ ఆశశ్యకత !
సమాజంలో అత్యంత అణగారిన వర్గాలుగా ఉన్న షెడ్యూల్డ్ కులాలు, తెగలకు చెందిన ప్రజానీకానికి, ఇతర ప్రజానీకానికి మధ్యనున్న అభివృద్ధి అసమాన తలను, ఈ వర్గాల ప్రజల్లోనే అంతర్గతంగా ఉన్న అసమానతలను తొలగించాలన్న లక్ష్యంతో రాష్ట్ర శాసనసభ షెడ్యూల్డ్ కులాలు, తెగలకు ఉప ప్రణాళికను ఆమోదించింది. అణగారిన తరగతులైన షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగల ప్రజల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం 1980వ దశకంలోనే చట్టపరంగా తీసు కొచ్చిన ఈ సబ్‌ప్లాన్ విధానం నయా ఉదారవాద ఆర్థిక విధానాలు వచ్చాక క్రమంగా నీరుగారుతూ వచ్చింది. రాష్ట్ర స్థాయిలో సబ్‌ప్లాన్ చట్టం చేయాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద ఉద్యమం సాగిన ఫలితంగానే ప్రభుత్వం 2013లో చట్టం చేసింది.అయితే,దాని కాలపరిమితి పదేళ్లుగా నిర్ణయించడంతో రానున్న జనవరి 24వ తేదీతో గడువు ముగుస్తుంది.
సబ్ ప్లాన్ చట్టాన్ని కొన సాగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తగు చర్యలు చేపట్టాలని దళితులు, గిరిజనులు, వివిధ ప్రజా సంఘాలు ఆందోళన చేయవలసిరావడం విచారకరం. అట్టడుగు వర్గాల సంక్షేమానికి కట్టుబడి ఉన్నా మని చెబుతున్న ప్రభుత్వం ఇలాంటి కీలకమైన అంశంపై మీనమేషాలు లెక్కించడం మాని కార్యాచరణకు ఉపక్రమించాలి. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏర్పడ్డాక కేంద్రంలో సబ్‌ప్లానును క్రమంగా నిర్వీర్యం చేస్తున్నారు. ప్రణాళికా సంఘాన్ని రద్దు చేసి నీతి ఆయోగ్‌ను తీసుకు రావడమే పరమ తిరోగమన చర్య. అసలు ప్లానే లేకపోతే ఇక సబ్‌ప్లాన్ ఇంకెక్కడ అనే స్థితి తెచ్చారు. కాని దేశవ్యాప్తంగా ప్రజాగ్రహం పెల్లుబకడంతో బడ్జెట్లో ప్రత్యేకంగా కేటా యింపులు చేస్తున్నారు. కాని, అదంతా ఖర్చు చేయకుండా కోతలు పెట్టడం, ఇంకొన్ని నిధులను దారి మళ్లించడం షరా మామూలే! కార్పొరేట్లకు లక్షల కోట్ల రూపాయల రాయితీ లిస్తున్న మోడీ సర్కారు ఎస్సి,ఎస్‌టిల సంక్షే మానికి కనీస కేటాయింపులను కూడా ఖర్చు చేయకపోవడం సంఘపరివార్ నైజానికి నిదర్శనం.కాని,కేరళలోని ఎల్డిఎఫ్ ప్రభుత్వం ఆరాష్ట్రంలోని ఎస్సి,ఎస్‌టిల జనాభాశాతం కన్నా ఎక్కువ శాతం నిధుల్ని ప్రణాళికా వ్యయంలో కేటాయించడం శ్లాఘనీయం. దేశం లో అలా చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఇంకేదీ లేదు.రాష్ట్రంలో సబ్‌ప్లాను చట్టం చేయడంతో నిధుల కేటాయింపు,ఖర్చునకు కొంత గ్యారంటీ వచ్చింది. కాని,2018 నుండి రాష్ట్ర బడ్జెట్లో నిధుల కేటాయింపు క్రమంగా తగ్గిస్తున్నారు. నిధుల మళ్లింపు యథేచ్ఛగా సాగిపోతోంది. జనాభా ప్రాతిపదికగా సబ్‌ప్లాన్ నిధులు కేటా యించాలి.ఆ ప్రకారం చూస్తే ఈ ఏడాది రాష్ట్ర బడ్జెట్లో 20వేలకోట్ల రూపాయలు కేటాయిం చాలి కానీ అది కేవలం రూ.17,403 కోట్లు మాత్రమే. ఇందులోనూ ఎస్సి ఎస్‌టిల అభి వృద్ధికి ఖర్చు చేసింది సుమారు ఐదు వేలకోట్లు మాత్రమేననీ మిగతా 12వేల కోట్లను ఇతర పథకాలకు మళ్లిం చారన్న ఆరోపణ సత్య దూరం కాకపోవచ్చు. సబ్‌ప్లాన్ నిధులను ఆ తరగతులవారు నివసించే ప్రాంతాలుఅంటే దళిత వాడలు,గిరిజనగూడేలు,తండాల అభివృద్ధికి, ప్రత్యేకించి మౌలిక వసతుల కల్పనకు ఖర్చు చేయాలి. చట్టం స్పష్టంగా చెబుతున్నా, గతంలోనూ, ఇప్పుడూ ప్రభుత్వాలు ఆ రీతిలో ఖర్చు చేయడంలేదు.రోడ్లు వేయ డానికి,సాగు నీటి ప్రాజెక్టులకూ సబ్ ప్లాన్ నిధులనే వాడేయడం దారుణం. ఎవరైనా ప్రశ్నిస్తే వారూ వాడుకుంటారు కదా అన్న ఏలినవారి సమాధానం పేదలను, సబ్‌ప్లాన్ చట్టాన్ని వెక్కిరించడమే! ఆయా తరగతుల అభివృద్ధికి ప్రత్యేకించి ఖర్చు చేయవలసిన నిధులను నవరత్నాల్లో భాగంగా సాధారణ పథకాలకు వెచ్చించడం ధర్మం కాదు. ప్రభుత్వ రంగాన్ని పాలకులు క్రమంగా కుదించి వేయ డంతో సామాజిక న్యాయం చతికిలపడు తోంది.ఎస్సి,ఎస్టి లకు ఉపాధి అవకాశాలు సన్నగిల్లుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రయివేటు రంగంలోనూ రిజర్వేషన్ల కోసం ఉద్యమించ వలసిన పరిస్థితి. అణగారిన వర్గాలపట్ల వివక్ష కొనసాగుతూనే ఉంది. కనుక ఎస్సి, ఎస్‌టిల అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు వెచ్చించేలా సబ్‌ప్లాన్ చట్టం కొనసాగాల్సిందే. కేటాయిం పులు అణగారిన తరగతులవారి అభివృద్ధికి దోహదపడే విధంగా ఉండాలి. కేటాయించిన సబ్‌ప్లాన్ నిధులు మళ్లించే వీలు లేకుండా పటిష్ట చర్యలు చేపట్టాలి. ఉల్లంఘించేవారిపై చర్యలు తీసుకోవాలి. ఇలాంటి న్యాయమైన డిమాండ్లతో వివిధ సామాజిక సంఘాలు, సంస్థలు విశాల ఐక్య ఉద్యమం సాగించాలి. దానికి అభివృద్ధి కాముకుల,ప్రగతిశీల శక్తుల మద్దతు తప్పక లభిస్తుంది. ప్రభుత్వాలు ప్రజా ఒత్తిడికి తలొగ్గక తప్పదు.
ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందాలని..
రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. కాలానుగు ణంగా గతంతో పోలిస్తే ఈ వర్గాల ప్రజానీకం అభివృద్ధి చెందినా, ప్రధాన జీవన స్రవంతి కంటే ఇంకా వెనుకబాటుతనాన్ని అనుభవిస్తూనే ఉన్నారు. సమాజంలో వివక్షకు గురవుతున్న ఈ వర్గాల ప్రజలకు అభివృద్ధి ఫలితాలు అందాలని పన్నెండో పంచవర్ష ప్రణాళిక పేర్కొంది. అందుకే వేగవంతమైన, సుస్థిరమైన, మరింత సమ్మిళితమైన అభివృద్ధిని సాధించడమే పన్నెండో ప్రణాళిక ప్రాథమిక లక్ష్యంగా నిర్దేశిం చారు. రాజ్యాంగంలోని అనేక అధికరణలు అన్యాయం, అణచివేత నుంచి సమాజానికి రక్షణ కల్పిస్తున్నాయి. ఈ అధికర ణలు:46,14, 15(1),17,15(2),15 (4) (5), 16(4), 16(4ఎ), 16(4బి),335,243డి,340టి. అదేవిధంగా షెడ్యూల్డ్ తెగల రక్షణకు రాజ్యాం గంలో అనేక అధికరణలున్నాయి. వివిధ రాజ్యాంగ అధికరణలతోపాటు పార్లమెంట్ ఈ వర్గాల ప్రజల రక్షణకు అనేక చట్టాలను కూడా చేసింది.ఉదాహరణకు, 1955లో అంట రానితనంపై చట్టం రూపొందించారు. దీన్ని తర్వాతి కాలంలో (1976లో) పౌరహక్కుల రక్షణ చట్టంగా పునఃనామకరణం చేశారు. సామాజిక అణచివేతకు గురవుతున్న ఈ వర్గాల ప్రజలపై జరుగుతున్న అత్యాచారాలను నివారిం చేందుకు 1989లో షెడ్యూల్డ్ కులాలు, తెగల (అత్యాచారాల నివారణ చట్టం) వచ్చింది.
ఎస్సీ జనాభా వివరాలు
రాష్ట్రంలో షెడ్యూల్డ్ కులాల జనాభా పెరుగు తూ వస్తోంది. ఇప్పటికీ ఎస్సీ జనాభాలో అధిక భాగం గ్రామాల్లోనే నివసిస్తున్నారు. 1991 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో మొత్తం ఎస్సీ జనాభా 1.06కోట్లు. మొత్తం జనాభాలో ఇది15.9శాతంగా ఉండేది.2001 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీల జనాభా మొత్తం జనా భాలో16.2 శాతానికి పెరిగింది. 2001 జనా భా లెక్కల ప్రకారంరాష్ట్రం మొత్తం మీద చూస్తే నెల్లూరు జిల్లాలో ఈ వర్గం జనసాంద్రత అత్య ధికం.ఈ జిల్లాలో మొత్తం జనాభాలో 22.5 శాతం ఉన్నారు. తర్వాతి స్థానంలో ప్రకాశం (21 శాతం), చిత్తూరు (18.7) జిల్లాలున్నాయి.
అక్షరాస్యత తీరుతెన్నులు
జనాభా లెక్కల వివరాలను పరిశీలిస్తే రాష్ట్రంలో అక్షరాస్యత పెరుగుతోందని అర్థమవుతుంది. ఉదాహరణకు, ఆంధ్రప్రదేశ్‌లో 1981లో అక్షరాస్యతా రేటు 29.9 శాతం. 2001లో ఇది 60.5 శాతానికి పెరిగింది. అదేవిధంగా ఎస్సీలలో కూడా అక్షరాస్యత పెరుగుతోంది. రాష్ట్రంలో ఎస్సీ జనాభాలో అక్షరాస్యతా రేటు 1981లో 17.7 శాతం ఉండగా, ఇది 2001లో 53.6 శాతానికి పెరిగింది. అంటే 2001 జనాభా లెక్కల ప్రకారం చూసినా మొత్తం జనాభా అక్షరాస్యతా రేటుతో పోలిస్తే ఎస్సీ ప్రజానీకంలో అక్షరాస్యతా రేటు తక్కువగా ఉంది. మానవాభివృద్ధి, సామాజికాభివృద్ధిలో కీలకాంశంగా ఉన్న అక్షరాస్యతా రేటు విషయంలో ఇతర వర్గాల ప్రజానీకానికి, ఎస్సీలకు మధ్యనున్న తేడాను అర్థం చేసుకోవచ్చు. ఎస్సీ మహిళల్లో అక్షరాస్యతా రేటులో పెరుగుదల వేగం తక్కువగా ఉంది. ఉదాహరణకు 2001లో మొత్తం మీద చూస్తే మహిళా అక్షరాస్యతా రేటు 50.4శాతంగా ఉంటే ఎస్సీలలో మహిళా అక్షరాస్యతా రేటు 43.4 శాతంగా ఉంది. విద్యారంగంలో ప్రమాణాలకు మరో కీలక కొలమానం మధ్యలో బడి మానేసే వారి సంఖ్య. భారత విద్యావిధానంలో చూస్తే, బడిలో చేర్పించే విషయంలో దాదాపు పూర్తి స్థాయిలో విజయం సాధించాం. కానీ మధ్యలో బడి మానేసే వారి సంఖ్యను తగ్గించడంలో మాత్రం ఇంకా వెనుకబడే ఉన్నాం. కొంత కాలంగా విద్యారంగ ధోరణులను పరిశీ లిస్తే ఎస్సీ బాలబాలికల్లో కూడా మధ్యలో బడి మానేసే వారి శాతం తగ్గుతోంది. కానీ, ఇప్పటికీ ఇదిచాలా అధికంగా ఉండటం ఆందోళనకరం. ఉదాహరణకు 2007-08లో ఎస్సీ బాలబాలికల విషయంలో మధ్యలో బడి మానేసే వారి శాతం ఇంకా 69 శాతంగా ఉంది. ఎస్సీ బాలురతో పోలిస్తే బాలికల్లో ఈ శాతం సహజంగానే మరింత ఎక్కువగా ఉంది. అందుకే అంబేద్కర్ పేర్కొన్నట్లు అణగారిన వర్గాలలోని మహిళలు రెండు రకాల వివక్షకు గురవుతారు. కులపరమైన వివక్షతో పాటు లింగ వివక్షకు కూడా బలవుతున్నారు.
జీవనోపాధి ధోరణులు
గ్రామీణ ప్రాంతాల్లో జీవనోపాధి కోసం వ్యవసాయేతర స్వయం ఉపాధిపై ఆధారపడు తున్న వారి శాతం పెరుగుతోంది. మరోవ్కెపు మొత్తం ఎస్సీ జనాభాలో వ్యవసాయం, స్వయం ఉపాధి, వ్యవసాయ కూలీలుగా ఆధారపడి జీవిస్తున్న వారి శాతం తగ్గుతోంది. అయితే ఇప్పటికీ ఎస్సీలలో 63శాతం ప్రజల జీవనో పాధి వ్యవసాయమే. ఎస్సీ ప్రజానీకం అత్యధికంగా గ్రామాల్లో జీవిస్తున్నారు. వ్యవసాయ కూలీలుగా గడుపుతున్నారు.ఉప ప్రణాళిక అమలులో భాగంగా రాష్ట్ర బడ్జెట్లో ప్రణాళికా కేటాయింపులలో జనాభా దామాషా ప్రాతిపదికపై ఎస్సీలకు నిధులను కేటాయి స్తున్నారు. ప్రతీ ప్రభుత్వ శాఖ తమ ప్రణాళికా కేటాయింపులలో ఇలాగే నిధులు కేటాయిస్తే ఇక్కడో సమస్య ఉంది. అత్యధిక ఎస్సీ జనాభా వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారు. కానీ, రాష్ట్ర ప్రణాళికా బడ్జెట్లో ఆ మేరకు వ్యవసా యానికి అంత ప్రాధాన్యం ఉండదు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో వివిధ రంగాలకు లభిస్తున్న ప్రాధాన్యానికి, ఎస్సీ ప్రజల జీవితాల్లో ఆయా రంగాల ప్రజల జీవనాధారానికి మధ్య వ్యత్యాసం ఉంటుంది. ఇటీవల ఆమోదించిన చట్టం అమలులో భాగంగా పథకాలు,కార్యక్ర మాలను రచించేటప్పుడు ఈ విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించాల్సి ఉంటుంది. కొంత కాలంగా రాష్ట్ర ప్రణాళికా బడ్జెట్లో దాదాపు సగం మేరకు జలయజ్ఞానికి కేటాయిస్తున్నారు. అందులో భారీ నీటిపారుదల రంగానికి అధిక ప్రాధాన్యం ఉంటోంది. కానీ, ఎస్సీల్లో అత్యధి కులు భూమిలేని వ్యవసాయ కూలీలు. వీరికి భూమే లేనప్పుడు భారీ ప్రాజెక్టుల వల్ల కలిగే ప్రయోజనం పరిమితంగానే ఉంటుంది. అందుకే నిధులను వెచ్చించేందుకు ప్రణాళికలను రూపొందించేటప్పుడు ఉప ప్రణాళిక అమలు మండలి, నోడల్ ఏజెన్సీలు ఈ విషయాలను పరిగణనలోకి తీసుకోవాలి.
పేదరికం తేడాలు
పేదరికాన్ని అంచనా వేసేందుకు ఇటీవల లక్డావాలా కమిటీ, టెండుల్కర్ కమిటీ పద్ధతులు వచ్చాయి. లక్డావాలా కమిటీ అంచనాల ప్రకారం గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో పేదరికం తగ్గుతూ వస్తోంది. అలాగే పట్టణ ప్రాంతంలో ఇదే కాలంలో ఎస్సీలలో పేదరికం 50.6 శాతం నుంచి 37.4శాతానికి తగ్గింది. టెండుల్కర్ కమిటీ తాజా అధికారిక అంచనాల ప్రకారం 2009-10లో గ్రామీణ ప్రాంతాలలో ఎస్సీలలో పేదరికం 23.5శాతం ఉండగా, పట్టణ ప్రాంతంలో 17.4 శాతంగా ఉంది. లక్డావాలా కమిటీ, టెండుల్కర్ కమిటీల ప్రకారం గ్రామీణ, పట్టణ పేదరికం అంచ నాల్లో చాలా వ్యత్యాసం ఉంది. అందుకే ఈ ఉప ప్రణాళిక అమలును సాంకేతిక దృక్పథంతో కాకుండా సామాజిక, ఆర్థిక దృక్పథంతో పరిశీలించాల్సి ఉంటుంది. ఆర్థిక వ్యవస్థలో వస్తున్న వేగవంతమైన మార్పులలో ఎస్సీ ప్రజానీకాన్ని కూడా భాగస్వాములను చేయాల్సిన బాధ్యత సమాజానికి ఉంది. గిరిజనుల విషయంలో కూడా ఇదే పద్ధతిని అనుసరించాలి. ఆధునిక ఆర్థిక వ్యవస్థలో సేవల రంగానికి ప్రాధాన్యం పెరుగుతోంది. జాతీ యాదాయంలోనే కాదు, రాష్ట్ర ఆదాయంలో కూడా అధిక భాగం సేవలరంగం నుంచే వస్తోంది. కానీ,ఈ నూతన సంపదలో ఎస్సీ, ఎస్టీ ప్రజానీకానికి సరైన భాగస్వామ్యం లేదు.అందుకే చట్టం చేయ డంతో సరిపోదు. ఆ చట్టం అమలులో నవీ నత్వం,సృజనాత్మకత కీలకమవుతాయి. ‘సబ్‌ప్లాన్’ కాలపరిమితి పెంచండి
దళిత, గిరిజనులకు జనాభా ప్రాతిపదికన నిధులు కేటాయించడానికి పదేళ్ల కాలపరిమితితో 2013లో తీసుకువచ్చిన ఎస్సి, ఎస్టి సబ్‌ప్లాన్‌చట్టం గడువు 2023 మార్చితో ముగుస్తున్నందున ఈ కాలపరిమితిని పొడిగించడానికి వీలుగా చట్ట సవరణ చేయా లని కెవిపిఎస్ రాష్ట్ర కార్యదర్శి అండ్ర మాల్యా ది కోరారు. ఈ మేరకు గుంటూరులో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగా ర్జునను ఆయన క్యాంపు కార్యాల యంలో కలిసి వినతిపత్రం అంద జేశారు.ఉమ్మడి రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉద్యమించడం వల్ల సబ్ ప్లాన్ చట్టాం2013 వచ్చిందన్నారు. అయితే సరైన నిబంధనలు లేకపోవటంవల్ల 2015 వరకూ ఈ చట్టం అమలులో పలు సమస్యలు వచ్చాయని తెలిపారు. ఈ చట్టానికి లోబడి జనాభా ప్రాతిపదికన రాష్ట్ర ప్రభుత్వాలు నిధులను కేటాయిస్తూ వచ్చాయని, మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రణాళికా సంఘాన్ని రద్దు చేయటం వల్ల దళిత, గిరిజన, వెనుకబడిన తరగతులకు, వెనుకబడిన ప్రాంతా లకు అపార నష్టం జరిగిందని అన్నారు. ప్రణాళికా సంఘాన్ని పునరుద్ధరించడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని కోరారు. ప్రస్తుత ఆర్థిక, సామాజిక పరిస్థితుల్లో ఎస్సి,ఎస్టిలకు రక్షణ అవసరమని, అందుకోసం చట్టాలను మరింత పకడ్బందీగా అమలు చేయాలని, సబ్‌ప్లాన్‌చట్టం 2013చాప్టర్ 1క్లాజ్4ను సవరించి, కాలపరిమితిని పొడగించేందుకు రానున్న అసెంబ్లీ సమావే శాల్లోనే నిర్ణయం చేయాలని మంత్రిని కోరారు.
–జిఎన్‌వి సతీష్