విశాఖ ఉక్కుతో కేంద్రం పరిహాసం
ఇటీవల కాలంలో మొత్తం తెలుగు రాష్ట్రాలను రెండు వివాదాలు కుదిపేశాయి. అందు లో ఒకటి పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను అడ్డుకోవడం. రెండవది ఇరు రాష్ట్రాల ప్రభుత్వాధినేతలు లేదా పాలక పార్టీలూ మొదలెట్టిన వృథా వివాదాన్ని ఆపడం. ఇందులో మొదటిది ఇరు రాష్ట్రాల సుహృద్భావానికి, ఉమ్మడి వారసత్వానికి ప్రతీకగా నిలిస్తే రెండవది రాజకీయ పార్టీల సంకుచితత్వానికి అవాంఛనీయ వ్యూహాలకు అద్దం పట్టింది. వాస్తవానికి మొదటి సమస్యపై కూడా రెండో సమస్య తరహాలోనే స్పందనలు రాకపోలేదు. కాని ఇరు రాష్ట్రాలకు శూన్యహస్తమే చూపిస్తున్న మోడీ ప్రభుత్వం విశాఖ ఉక్కు విషయంలోనూ క్రూర పరిహాసమే చేసింది. ఈ స్వల్వ వ్యవధిలోనే ఇరు రాష్ట్రాలనూ పాలిస్తున్న గతంలో పాలించిన పెద్ద పార్టీలకు మర్చిపోలేని పాఠాలు నేర్పించి తన ఆధిక్యతనూ ఏకపక్ష బాధ్యతా రాహిత్యాన్ని తనే వెల్లడిరచుకుంది.
ఆగిన గత ప్రయత్నాలు
2021 అక్టోబరు ప్రాంతంలో కేంద్రం విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ లేదా రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్‌ను వంద శాతం ప్రైవేటీకరించాలని నిర్ణయించింది. దీన్ని ఎవరికి ఎంతకు కట్టబెడతారనే దానిపైనా చాలా కథనాలు వచ్చాయి. ఇప్పుడు పూర్తిగా భ్రష్టుపట్టిన అదానీ సామ్రాజ్యంలో ఉక్కు ఫ్యాక్టరీని కలిపేస్తారనే వార్తలు వచ్చాయి. ఇంకా దక్షిణ కొరియా కంపెనీ పోస్కో, టాటా వంటి పేర్లన్నీ కూడా వినిపించాయి. 1966లో తెలుగు ప్రజల పోరాటాలు, కమ్యూనిస్టు ఎంఎ ల్‌ఎల రాజీనామాలు, యువత ప్రాణార్పణలతో ఆవిర్భవించింది. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేది నాడు మార్మోగిన నినాదం. ఇందుకోసం తాము కూడా పోరాడామని తెలంగాణ ప్రభుత్వం అంటున్న మాట కూడా నిజమే. దానికి భూమిని సమకూర్చడం కోసం వేలమంది నిర్వాసితుల య్యారు. ఇప్పటికీ వారిలో అనేకులకు సరైన పరి హారం దొరికింది లేదు. ఆ ఫ్యాక్టరీని ప్రారంభించ డానికి చాలాకాలం పట్టినా ప్రజలు ఓపికగా నిరీక్షించారు. దాన్ని జయప్రదంగా నడిపించడంలో కార్మిక వర్గం ముఖ్యపాత్ర వహించింది. అనేక త్యాగాలు చేసింది. అనతి కాలంలోనే విశాఖ ఉక్కు ప్రపంచ చిత్ర పటంలో చోటు సంపాదించగలి గింది. పెట్టిన పెట్టుబడికి మించి లాభాలు అందిం చింది. అయితే దాని పురోగమనానికి చేయి కలపక పోగా కేంద్రం సైంధవ పాత్ర పోషించింది. సుదీర్ఘ సముద్ర తీరం, నిపుణులైన కార్మిక ఉద్యోగ అధికార బృందంతో మంచి విజయాలు సాధించే ఈ ఫ్యాక్ట రీకి ఇనుప గనులు కేటాయించకుండా తొండి చేసింది. దశాబ్దాల పాటు ఇదే పరిస్థితి కొనసాగు తున్నా రాష్ట్రంలో పాలకపార్టీలేవీ కేంద్రంలో తాము వున్నప్పుడు కూడా మార్పు తెచ్చింది లేదు. పైగా ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ సంకేతాలివ్వడం, కార్మిక సంఘాల నిరసనతో వెనక్కు తగ్గడం జరుగు తూ వచ్చింది. విస్తరణకు నిధులివ్వకపోగాఉత్పత్తిని కుదించడం, కావాలని నష్టాల పాలు చేయ డం వాటి వ్యూహంగా అర్థమైంది. సరళీకరణతో ఈ ధోరణి మరింత ముదిరింది. అయినా కార్మిక సంఘాల ఐక్య ప్రతిఘటన కారణంగా కేంద్రం ఆ పని చేయలేకపోయింది. ఇందుకు అనేక ఉదాహరణలున్నాయి.
మోడీ సర్కారు ఏకపక్ష దాడి
నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చాక పెట్టుబడుల ఉపసంహరణ అనే ప్రక్రియను పెద్ద ఆర్భాటంగా సాగించడం, అదానీ వంటి ఆశ్రిత పెట్టుబడిదారులకు కట్టబెట్టడం నిత్యకృత్యమైంది. అయినా మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడే విశాఖకు ఎసరుపెట్టే చర్యలు తీసుకున్న కేంద్రం మలి దఫా గద్దెక్కాక నేరుగా దాడి తీవ్రం చేసింది. వంద శాతం ప్రైవేటీకరణ చేయనున్నట్టు కేంద్రం అధికారికంగా ప్రకటించింది. వాజ్‌పేయి హయాం లోనే ఇలాంటి ప్రతిపాదన వస్తే తాము అడ్డుకున్నా మని చంద్రబాబు నాయుడు తరచూ చెబుతుం టారు. కానీ మోడీ ప్రభుత్వంలో దీర్ఘకాలం పాటు భాగస్వామిగా వున్న ఆ పార్టీ నేతలు ఈ విషయమై సంకేతాలు వస్తున్నా నిరోధించే తీవ్ర ప్రయత్నమేదీ చేయలేదు. ఇప్పుడున్న వైసిపి జగన్ ప్రభుత్వం కూడా ముందస్తుగా అడ్డుకోకపోగా ప్రకటన వచ్చాక కూడా నీళ్లు నములుతూ కూర్చుంది. ప్రైవేటీకరణ తరహాలో వాటాలు విడుదల చేయాలని, భూములు అమ్మి అప్పులు కట్టాలనీ ముఖ్యమంత్రి మొదట్లోనే విడ్డూరమైన ప్రతిపాదనలతో లేఖ రాశారు. మరో వైపున కార్మిక సంఘాలు, వామపక్షాలు నిశితంగా వ్యతిరేకించడమే గాక సమరశీల పోరాటం మొదలె ట్టాయి. ఆ దశలో విశాఖ వచ్చిన ముఖ్యమంత్రి తాము గట్టిగా మాట్లాడతామంటూ వారితో నమ్మబలికారు గాని ఆ దిశలో జరిగింది శూన్యం. టిడిపి,వైసిపి ఒకరినొకరు విమర్శించుకోవడమే తప్ప కేంద్రంపై ఏకోన్ముఖ పోరాటానికి సిద్ధం కాలేదు. బిజెపి ఎ.పినాయకులు రకరకాల మాటలతో గంద రగోళం పెంచడమేగాక ప్రైవేటీకరణ వల్ల ఉద్యో గాలకేమీ ముప్పు రాదని సమర్థన ఎత్తుకున్నారు. రామతీర్థం వంటి మతపరమైన అంశాలతో దృష్టి మళ్లించే ప్రయత్నం చేశారు. బిజెపి మిత్రపక్షమైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కేంద్రంతో మాట్లాడుతున్నానంటూనే రాష్ట్రానిదే తప్పని వింత వాదన తెచ్చారు. అఖిల పక్షాన్ని తీసుకువెళ్లడానికి జగన్ సిద్ధం కాకపోవడం వల్లనే ఇదంతా జరిగిం దన్నారు. ఈవిధంగా మూడు పార్టీలు అవకాశవాద రాజకీయాలు అనుసరించడం బిజెపికి కొమ్ములు తెచ్చింది. కార్మిక సంఘాలు మాత్రం ఎవరి విధా నం ఎలా వున్నా అందరినీ కలుపుకొని లక్ష్యం సాధించడమే తమ మార్గమంటూ అందరికీ సహకారం అందించారు. మరో వంకన ఫ్యాక్టరీ స్థాపనకు దారితీసిన పరిస్థితులు మొదటి నుంచి కేంద్రం సాగించిన నయవంచన, లెక్కల టక్కుటమారం బహిర్గతం చేయడం ద్వారా గొప్ప సైద్ధాంతిక పోరాటం కూడా చేశాయి. స్వంత ప్రత్యేక గనులు (క్యాప్టివ్ మైన్స్) కేటాయించక పోవడం వెనక గల దుష్ట తంత్రం ఏమిటో, నష్టాలు ఎందుకు వచ్చాయో తెలియజెప్పాయి. ఈ చర్చ మొదలైన తర్వాత కూడా జరిగిన గనుల కేటాయిం పు సమయంలో ఒరిస్సా లోని గనుల కోసం ఒత్తిడి తెచ్చాయి. విశాఖ యాజమాన్యం కూడా వేలం పాటలో పాల్గొంది.కాని కేంద్రం కావాలని ప్రైవే టు కంపెనీలకే ప్రాధాన్యతనిచ్చింది.విశాఖ ఉక్కు అభ్యర్థనను పట్టించుకోలేదు.
మోడీ మొండి చేయి!
కార్మిక సంఘాల పోరాటం తీవ్రమైన కొద్దీ తమ నిర్ణయంలో మార్పు లేదని చెప్పడం పనిగా పెట్టుకుంది. ఇందుకోసం లీగల్,అసెస్ మెంట్,బిడ్డింగ్ కమిటీలను ఏర్పాటు చేసింది. మొదట్లో అదానీ,టాటా,దక్షిణ కొరియాకు చెందిన పోస్కో వంటి కంపెనీలు తీసుకోవచ్చనే కథలు వినిపించాయి. వ్యూహాత్మకంగానే టాటాల పేరు తెచ్చినట్టు కూడా చెప్పారు. కొద్ది మాసాల కిందట ప్రధాని మోడీ విశాఖ వచ్చినప్పుడు పాల్గొన్న బహి రంగసభ వేదికపై ముఖ్యమంత్రి జగన్ మొక్కుబడిగా విశాఖ ఉక్కు ప్రస్తావన తెచ్చారే గాని గట్టిగా మాట్లాడిరది లేదు. ఆయన స్పందన అంతకన్నా లేదు. అప్పుడే ప్రధానితో స్వల్ప సమావేశం జరిపిన పవన్ కళ్యాణ్ కూడా మంచిరోజులు వస్తాయని చెప్పడం తప్ప దీనిపై సాధించింది లేదు. కాకపోతే ఈ లోగా అదానీ బండారం బయిటపడిపోయింది. ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి గనక కొంతకాలం కొత్త ఎత్తులతో కాలక్షేపం చేయొచ్చని బిజెపి వర్గాలు వెల్లడిరచాయి.
బిడ్ల ప్రహసనం, గడువు పెంపు
మొదటి నుంచి ఈప్రైవేటీకరణను గట్టిగా వ్యతిరేకిస్తున్న కెసిఆర్ ఈ దశలో రంగంలోకి దిగి అమ్మకమే జరిగేట్టయితే తాము కూడా వేలంలో పాల్గొని కొనుగోలు చేస్తామనడంతో కొత్త వివాదం మొదలైంది. తెలంగాణ సర్కారు చూపిన పాటి తెగువ కూడా జగన్ ఎందుకు చూపడం లేదనే ప్రశ్న వచ్చింది.అత్యుత్సాహవంతులైన వైసిపి మంత్రులు బిఆర్ఎస్పై దాడి చేసేవరకూ వెళ్లారు. అయితే అక్కడ అమ్మకమే లేదని ఆసక్తి వ్యక్తీకరణ పేరిట వర్కింగ్ పెట్టుబడిని మాత్రమే ఆహ్వానిస్తు న్నారని ఎ.పి సర్కారు సలహాదారు సజ్జల రామ కృషా ్ణరెడ్డి సమర్థించారు. తాము విశాఖ ఉక్కు కొనుగోలు చేయడం కోసమనిగాక అక్కడ పరిస్థితిని, అవకాశాలను అధ్యయనం చేయడం కోసం అధికా రుల బృందాన్ని పంపుతామని కెటిఆర్ ప్రకటిం చారు. ఇది విశాఖ ఉక్కుపై జగన్ ప్రభుత్వ స్పంద నా రాహిత్యానికి సవాలేనని అందరూ భావించారు. కార్మిక సంఘాలూ ఆహ్వానించాయి. ఈదశలో సందర్శనకు వచ్చిన కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగన్ సింగ్ కులస్తే తాము ఇప్పుడు ప్రైవేటీ కరణ కోసం గాక నిర్వహణ సామర్థ్యం పెంచే పెట్టుబడి కోసమే ప్రయత్నిస్తున్నామని సన్నాయి నొక్కులు నొక్కారు. దీన్నిబట్టి తమవల్లనే కేంద్రం వెనక్కు తగ్గిందని, ఇది తెలంగాణ దెబ్బ అని కెటి ఆర్తో సహా బిఆర్ఎస్ నాయకులు నిన్న మధ్యా హ్నానికి హడావుడి మొదలెట్టారు. ఉక్కు ఫ్యాక్టరీ కార్మిక సంఘాలు అంతగా తొందరపడకపోగా సాయంత్రం సమావేశంలో అదే కేంద్ర మంత్రిని స్పష్టత కోసం నిలదీశారు. దాంతో తానేమీ చెప్పలేనని ఆయన గొంతు మార్చారు. ప్రజాశక్తిలో నిన్న ఉదయమే కేంద్రం వంచన అంటూ పతాక శీర్షిక వచ్చింది. దాంతో సూటిగా తాము ప్రైవేటీ కరణకే కట్టుబడి వున్నట్టు కేంద్రం మొండి వైఖరిని పునరుద్ఘాటించింది. దాంతో ఒకప్రహసనం ముగి సింది. ఈ రోజు తెలంగాణ లేదా సింగరేణి తర పున బిడ్ దాఖలు కాలేదని సమాచారం. ఆ గడు వును మరో ఐదు రోజులు పొడగించినట్టు చెబుతు న్నారు. విశాఖ నుంచి మళ్లీ లోక్‌సభకు పోటీ చేస్తానని ప్రకటించిన సిబిఐ మాజీ జె.డి లక్ష్మీనారా యణ కూడా బిడ్ వేసి క్లౌడ్‌ఫండిరగ్‌తో ఉక్కు ఫ్యాక్టరీని కాపాడుకోవచ్చని చెబుతున్నారు. ఇవేవీ కూడా సమస్యకు అసలైన పరిష్కారాలు కావు. రెండు రాష్ట్రాల ప్రభుత్వాల చొరవతో మరో సమైక్య ఉద్యమం జరిపి దాన్ని ప్రభుత్వరంగంలోనే కొనసాగించేలా కేంద్రం మెడ వంచాల్సిందే. అందుకు భిన్నంగా ఎ.పి ప్రాంతీయ పార్టీలు తమ మెడలు వంచి మోడీకి వంత పాడుతుండటం దారుణం.20వ తేదీ తర్వాత కూడా ఈ పరిస్థి తిలో మార్పు ఆశించలేము. పైగా విశాఖ ఉక్కు సమర్థత పెంచడానికి వర్కింగ్ పెట్టుబడి సమకూ ర్చడం మరింత పటిష్టం చేసి ప్రైవేటు కార్పొరేట్‌కు కట్టబెట్టే కుట్రమాత్రమే.
వివాదాలు హానికరం
విశాఖ ఉక్కు అమ్మకంలో సాంకేతి కంగా తెలంగాణ సర్కారు లేదా సింగరేణి వారు పాల్గొనవచ్చునా, నిబంధనల మేరకు అందుకు కేంద్రం అనుమతినిస్తుందా అనేది ఇంకా అస్పష్టమే. అందుకు ఆటంకం కలిగించే నిబంధనలు కొన్ని వున్నాయి. అయితే విశాఖ ఉక్కును కాపాడుకో వడం కోసం ఇరు రాష్ట్రాల ప్రజల బలీయమైన ఆకాంక్షకు బిఆర్ఎస్ ప్రభుత్వం చొరవ తీసుకోవడం ఆహ్వానించదగిందే. ఇలాంటి సమయంలో తెలం గాణ మంత్రి హరీష్‌రావు వ్యాఖ్యలు వాటిపై ఎ.పి మంత్రుల ప్రతిసవాళ్లు వివాదానికి దారితీయ డం దురదృష్టకరం.ఎనిమిదేళ్ల కిందటే విడిపోయి ఇంకా విభజన సమస్యలు కూడా పరిష్కారం గాని రెండు తెలుగు రాష్ట్రాలు పరస్పర వ్యతిరేక భావాలకు ఆస్కారం ఇవ్వడం సరైంది కాదు. బిఆర్ఎస్, వైసిపి లు పార్టీలుగా వాదించుకోవచ్చు గాని సోదర రాష్ట్రా లుగా సవాళ్లు, ప్రతి సవాళ్లతో రెచ్చగొట్టుకోవడం ఉభయులకూ శ్రేయస్కరం కాదు. తమ తమ పథకాలను ఎవరైనా కీర్తించుకోవచ్చు గాని అంతిమ తీర్పరులు ప్రజలే. (ప్రజాశక్తి సౌజన్యంతో..)