రాజ్యాంగ మౌలిక విలువలకు ముప్పు

స్వాతంత్య్రానంతరం…సుమారు రెండేండ్లపాటు దేశవ్యాప్తంగా జరిగిన చర్చోపచర్చ ల పర్యవసానంగా దేశం గణతంత్రంగా అవతరించింది. ఎందరో త్యాగధనుల పోరాటాల ఫలితంగా సముపార్జించిన స్వాతంత్రాన్ని..అంతకు ముందున్న రాజులూ మహారాజుల చేతుల్లో పెట్టకుండా.. ప్రజలనే ప్రభువులుగా ప్రకటిస్తూ ప్రజాతంత్రంగా మారడం.. గణతంత్ర దినోత్సవ విశిష్టతకు నిదర్శనం. నేడు దేశంలో స్వైరవిహారం చేస్తున్న మతోన్మాద మనువాద మూకలు.. నాడు.. పంద్రాగస్టుకు, చబ్బీస్‌ జనవరికి మధ్యనున్న రెండేండ్ల సంధి కాలంలో సైతం జబర్ధస్తీ చేస్తూ.. తమతిరోగామి పంథాని దేశ ప్రజల మీదరుద్దాలని ప్రయత్నించారు. స్వతంత్ర భారతం ఏపంథాలో నడవాలి..దేశంలో ఏరాజకీయ వ్యవస్థను నిలపాలిఅనే అంశంపై ఆరెస్సెస్‌, హిందూమహాసభ,రామరాజ్య పరిషద్‌ ఇత్యాది సంస్థలు.. తమ రాచరిక అనుకూల ధోరణులకు అనుగుణమైన ప్రతిపాదనలు తీసుకొచ్చారు. పైగాతాము చెప్పినదే సనాతన భారతీయ పంథా అంటూ.. ప్రజాస్వామ్యమనే విదేశీ పోకడలు మనకొద్దు అంటూ దుష్ప్రచారం మొదలుపెట్టారు. బ్రిటిష్‌ వాడిని వెల్లగొట్టాము కాబట్టి..ఆబ్రిటీషువాడు ఎవరినైతే కూలదోసాడో..ఆదేశీయ రాజులు, మహారాజులను మళ్లీ తీసుకొచ్చి, వాళ్లకి మళ్లీ పట్టం కట్టి, అధికారం వాళ్ళ చేతుల్లో పెట్టడమే స్వాతంత్య్రానికి నిజమైనఅర్థం అంటూ విపరీత వ్యాఖ్యానాలు చేశారు. ఈకుత్సిత వాదనల న్నింటినీ గాంధీ,నెహ్రూ,పటేల్‌,అంబేద్కర్‌,మౌలానా అబ్దుల్‌ కలాం..ఇతరజాతీయ నాయకులు నిర్ద్వంద్వంగా తోసిపుచ్చారు. ఇక వెనక్కి పోయేది లేదు..దేశం చూపుముందు వైపేఉంటుందటూ స్పష్టీకరించారు. దేశాన్నిసర్వసత్తాక,ప్రజాస్వామ్య గణతంత్రంవైపు నడిపించారు.
బ్రిటిష్‌ వాడి వలసవాద సంకెళ్ళు మన దేశాన్ని చుట్టు ముట్టక ముందు.. వలస వాదంతో పోలిస్తే మరింత విషపూరితమైన మనువాద వ్యవస్థ ఈదేశంలో రాజ్యమేలింది. సుమారు మూడు వేల ఏండ్ల పాటు మనువాద వ్యవస్థ పన్నిన విషవలయంలో ఈదేశం బందీ అయింది..బానిసగా బతికింది. మనిషిని మనిషిగా చూడ నిరాకరించిన అమానుష వ్యవస్థ-మనుధర్మం. కాయకష్టం చేసి సంపదను సృష్టించే శ్రమజీవులను శూద్రులను, ఛండాలు రను చేసి..ఏపనీ చేయకుండా సోమరిపోతులుగా మెలగుతూ,పక్క వాడి కష్టార్జితాన్ని దోచుకుతినే స్వార్థపరులను ఉన్నత స్థానంలో నిలబెట్టింది ఈ మను వ్యవస్థ. 90 శాతంగా ఉన్న శ్రామిక జనాలను బానిసలుగా మార్చేసింది. రాజ్యమేదైనా, రాజులెవరైనా, వంశమేదైనా..భారతఉపఖండమంతటా మనుస్మృతియే రాజ్యాంగంగా అమలయింది. భారతీయులందరూ వేల ఏండ్లుగా పూజించిన గ్రంధాలన్నీ ఒకటే నీతిబోధించేవి. రాజులు ఎవరైనా సరే..ధర్మం తప్పక పరిపాలన కొనసాగించాలని. ధర్మమంటే.. మనుధర్మమే! శ్రీరాముడంతటివాడు సైతంశంభూకుడి తలను నిర్దాక్షి ణ్యంగా తెగనరికింది..అందుకోసమే! మన రాజ్యాంగం విశిష్టత ఏమి టంటే.. రెండువందల ఏండ్ల బ్రిటిష్‌ వాడి బానిస త్వాన్ని నిర్మూలించడం తోటే ఆగిపోలేదది. బ్రిటీషువాడు రాకముందు.. మూడు వేల ఏండ్ల పాటు ఈ దేశంలో రాజ్యమేలిన మనుస్మృతి తీసుకొచ్చిన కులవ్యవస్థ బానిసత్వాన్ని సైతం రాజ్యాంగం భూస్థాపితం చేసింది. వేలయేండ్ల మన దేశ చరిత్రలో.. రాజ్యాంగ అవతరణ తర్వాతనే.. మొట్టమొదటి సారిగా దేశ ప్రజలందరికీ కుల మత ప్రాంత లింగ విభేదాలు లేకుండా సమాన హోదా లభించింది. మనిషిని మనిషిగా చూసింది.. మనుషు లందరికీ ఈదేశంలో మొదటిసారిగా సమాన హక్కులనిచ్చిందీ… రాజ్యాంగమే. ఈ గడ్డ మీద పుట్టిన మనుషులందరూ సమానులేనన్న మానవతా సూత్రాన్ని మొట్టమొదటిసారిగా శాసన బద్ధం చేసింది మన భారత రాజ్యాంగం! సామాజిక విప్లవ మూర్తులు బుద్ధుడు పూలే అంబేద్కర్‌లు కొట్టిన సమ్మెట దెబ్బల కారణంగా తమప్రాభవాన్ని కోల్పోయిన కులదురహంకారుల ముఠా..తమ స్వార్థప్రయోజనాలకు రక్షణగా ఉన్న కుత్సిత మనుధర్మాన్ని ఎట్లాగైనా దేశం మొత్తం మీద పునస్థాపిం చాలనే కుతంత్రంలో భాగంగానే 1925లో ఆరెస్సెస్‌ను స్థాపించారు. 18వ శతాబ్దంలో…మహారాష్ట్రలో పీష్వాలు గా రాజ్యాధికారం చెలా యించిన ‘’చితపవన్‌’’ బ్రాహ్మణులు…మనువ్యవస్థను నూటికి నూరు పాళ్ళూ నిర్దాక్షిణ్యంగా అమలు పరిచారు. దళితులను పశువుల కంటే హీనంగా చూసే ‘’ముడ్డికి చీపురు…మూతికి ముంత’’ విధానం వీళ్ళ హయాంలోనే అమలయింది. దేశ ప్రజలలో స్వేచ్ఛా స్ఫూర్తిని నింపిన ఇంగ్లీష్‌ విద్యకు తోడు.. మానవతామూర్తులు తీసుకొచ్చిన సాంఘిక తిరుగుబాట్ల కారణంగా.. మరణశయ్యకు చేరువైన మనుధర్మాన్ని… జాతీయత, దేశభక్తి అనే మాయమాటలతో…ఎలాగోలా పునరుజ్జీవింప చేయాలనే తలంపే ఆరెస్సెస్‌ ఆవిర్భావానికి కారణమయింది. మహారాష్ట్ర లోని నాగపూర్‌ ఈ సంస్ధకు కేంద్ర స్ధానం కావడం.. హిందూత్వ నాయకులంతా మహారాష్ట్ర ‘చితపవన్‌’ బ్రాహ్మణులే కావడము వెనుకనున్న మతలబు అదే! మనుస్ముృతి ఆరెస్సెస్‌ దృష్టిలో అతి పవిత్రమైనది. హిందూ మతానికి మనువాదం, కులవ్యవస్థే కీలకమనీ…అవిలేకపోతే హిందూమతమే లేదని ఆరెస్సెస్‌వారు ప్రగాఢంగా విశ్వసిస్తారు… ఆచరిస్తారు. ‘’వేదాల తర్వాత.. హిందువులకు అత్యంత పవిత్రమైనది మనుస్మతి’’ అనిసావర్కార్‌ పేర్కొంటాడు. ఆరెస్సెస్‌ రెండవ సర్‌ సంఫ్‌చాలక్‌ గోల్వాల్కర్‌ తన రచన ‘బంచ్‌ ఆఫ్‌ థాట్స్‌’లో.. ‘’అసమానతలు పకతిలో భాగం…కులాల పేరిట అసమానతల్లో తప్పేమీలేదు’’ అనిస్పష్టీకరిస్తాడు. ప్రపంచంలోనే గొప్ప స్మతికారుడైన మనువు రాసిన చట్టాలను హిందువులందరూ విధిగా పాటించాల్సిందేనని తేల్చి చెబుతాడు. దేశ ప్రజలని కులాల వారీగాచీల్చి దేశఅనైక్యతకు, వెనుకబాటు తనానికీ మూలకారణంగా నిలిచిన మనుస్మతియే అసలు రాజ్యాంగంగా భావిస్తున్న మనువాద శక్తులు.. మొదటి నుంచి భారత రాజ్యాంగాన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి. అందులోనూ.. మనుస్మతి ప్రకారం హీనజాతి వాడైన అంబేటద్కర్‌ ఆధ్వర్యంలో రాజ్యాంగ రచన జరగడం మనువాదులకు మింగుడు పడని విషయంగా పరిణ మించింది. ‘’మనువు స్థానంలో పంచముడైన అంబేద్కర్ని ఎట్లా ఒప్పుకుంటాం..?’’అంటూ దురహం కార పూరితంగా హుంకరించారు. స్వతంత్ర భారత రాజ్యాంగం.. మనుధర్మ సూత్రాలకు అనుగుణంగా ఉండాలంటూ డిమాండ్‌ చేసారు. 26 నవంబరు 1949న దేశ రాజ్యాంగసభ రాజ్యాంగాన్ని స్వీకరించిన తరువాత..30 నవంబరు 1949 సంచికలో ఆరెస్సెస్‌ అధికార పత్రిక ‘’ఆర్గనైజర్‌’’ భారత రాజ్యాంగాన్ని తూలనాడుతూ ఇలా రాసింది: ‘’భారతదేశానికి రాజ్యాం గం ఇప్పుడు కొత్తగా రాయాల్సిన అవసరం లేదు. ప్రాచీన కాలంలో మనువు రాసిన సూత్రాలు ఉన్నప్పటికీ వాటి ప్రస్తావనే రాజ్యాంగంలో లేకపోవడం పెద్ద అపరాధం. ప్రపంచానికే ఉత్తేజంతో దారి చూపగల ఆరాధనపూరితమైన మనుధర్మ శాస్త్రం.. అంబేద్కర్‌కూ, రాజ్యాంగ పండితులకూ గుర్తు కూడా రాలేదు’’
నేటి దేశ ప్రధాని నరేంద్ర మోడీ తన గురువుగా చెప్పుకునే ఎం. ఎస్‌. గోల్వాల్కర్‌ (ఆర్‌ఎస్‌ఎస్‌ రెండవ సర్‌ సంఘచాలక్‌) అంబే ద్కర్‌ రచించిన రాజ్యాంగం అసలు విలువ లేనిదంటూ తేల్చిపారేశాడు. ‘’పాశ్చాత్య దేశాల రాజ్యాంగాల నుంచి అక్కడో ముక్క, ఇక్కడో ముక్క పేర్చి..భారత రాజ్యాంగ మంటూ వీళ్ళు మనకు చూపెడుతున్నారు. అంబేద్కర్‌ రాసిన ఈరాజ్యాంగంలో భారతీయమైనదంటూ ఏదీ లేదు.. అంతా పరాయిదే’’ నంటూ తేల్చేసాడాయన. కులం పేరుతో తన సోదరులను బానిసలుగా చూడడం గోల్వాల్కర్‌ గారి దృష్టిలో భారతీ యత. దేశ ప్రజలందరూ సమానులేనని చెబితే.. అది పరాయి భావన. ఇలా ఉన్నది ఈ దేశ భక్తుల కుతర్కం! నాడు దేశ స్వాతంత్య్ర సంగ్రా మంలో పాల్గొనకుండా విదేశీ ప్రభువులకు వత్తాసు పలికిన సంఘ పరివారం..నేడు స్వతంత్ర భారత రాజకీయ అధికారాన్ని చేజిక్కించు కుని ఢల్లీి గద్దెపై కూర్చున్నది. తన రాజకీయ అంగమైన బీజేపీ ద్వారా నేడు ఆర్‌ఎస్‌ఎస్‌ దేశ పరిపాలనను తనచేతుల్లోకి తీసుకున్నది. స్వయంగా ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్త అయిన నరేంద్రమోడీ నేడు రాజ్యాం గం మీద ప్రమాణం చేసి దేశ ప్రధాని పదవిలో కూర్చున్నాడు. అయితే సంఘ పరివారపు భావజాలంలో భారత రాజ్యాంగం పట్ల వ్యతిరేకత ఏమాత్రమూ తగ్గలేదు. అంబేద్కర్‌ రాసిన రాజ్యాంగం కాదు..మనుస్మ తియే మాకు శిరోధార్యమంటూ ఎన్నోసార్లు ఆర్‌ఎ స్‌ఎస్‌ నేతలు తేల్చి చెప్పారు.1992లో డిసెంబర్‌ ఆరెస్సెస్‌ ఏర్పాటు చేసిన ధర్మ సంసద్‌లో ప్రస్తుత రాజ్యాంగం హిందూవ్యతిరేకమైనదనీ..మనుస్మ తిని రాజ్యాంగంగా స్వీకరించాలంటూ ఏకగ్రీవంగా తీర్మానించారు. మోడీ క్యాబినెట్‌ లోని మంత్రి అనంత్‌ కుమార్‌ హెగ్డే 2016 డిసెంబర్‌ లో కర్ణాటకలో ఒకకుల సమావేశంలో మాట్లాడుతూ..బీజేపీ అధికారం లోకి వచ్చిందే రాజ్యాం గాన్ని మార్చడానికి..కాబట్టి ఖచ్చితంగా రాజ్యాంగాన్ని మార్చి తీరుతామని తేల్చి చెప్పాడు.
నేడు కేంద్రంలో అధికారాన్ని అనుభవిస్తున్న సంఫ్‌ పరివార్‌ నేతలు భారత రాజ్యాంగంపట్ల కపట భక్తిని ప్రదర్శిస్తున్నారు. మానవతా మూర్తులైన సాంఘిక విప్లవ కారులు తీసుకొచ్చిన మార్పుల వలన నేడు మనువాదం బలహీన పడిరది కాబట్టి.. సమయంకోసం వేచి చూస్తున్నారు. దేశ ప్రజల్లో క్రమక్రమంగా మతోన్మాద,మనువాద విషబీజాలను నాటి దేశంలో మళ్లీ మనువాద రాజ్యాన్ని స్థాపించాలనేదే వారి కుట్రల సారాంశం. దేశ ప్రజలలో సమతా, మమతా వెల్లివిరిసి.. అభివద్ధి పధంలో దేశం సమున్నతంగా ముందడుగు వేయాలని ఆకాంక్షించే దేశభక్త పౌరులందరూ నేడు మతోన్మాద-మనువాద ముఠాల కుతంత్రాల పట్ల జాగ్రత్త వహించాలి. ఈ దేశంలో సామాజిక న్యాయం వెల్లివిరియడం, అసమానతల మనువ్యవస్థ అంతం కావడమనేది ఏకొందరి ప్రయోజనాల కోసమో కానే కాదు. మను వాదం అంతమయితేనే భారత జాతి ఐక్యంగా నిలబడగలదు. భారత దేశ ఐక్యత, సమగ్రత..భారతరాజ్యాంగంలో పొందుపరచబడిన ప్రజాస్వామ్యం, లౌకికత్వం, సమసమాజ భావనల పైన ఆధారపడి ఉన్నది. మనువాదుల విషపు పడగల నుండి భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవడం, నేడు దేశ భక్త పౌరులందరి ప్రథమ కర్తవ్యంగా నిలిచి ఉన్నది. – ఆర్‌.రాజేశమ్‌