మార్పు అవసరం..!

నేను 1987లో తూర్పుగోదావరిజిల్లా శంఖవరం మండలం గిరిజనప్రాంతమైన పెదమల్లాపురం వెళ్లినప్పుడు చాలా చోట్ల కరెంట్‌లేదు. రోడ్డుల్లేవు. రవాణా సదుపాయాల్లేవు. సైకిళ్ళు, ఎడ్లబండ్లే అక్కడ..అక్కడా కన్పించేవి. కాలినడకనే కొండెక్కి దిగాల్సి వచ్చేది. ఆఖరికి అగ్గిపుల్ల కావాలన్నా కొండదిగిరావాల్సిందే. ఏ గ్రామానికి వెళ్లిన విద్య,వైద్యం అందక ప్రజలు నానా అవస్థలు పడేవారు. బడులుగాని, ఆసుపత్రులుగాని లేవు. చాలామంది పిల్లలు అస్తవ్యస్థంగా కన్పించేవారు. వైద్యం కూడా ఉండేదికాదు. నిత్యావసరాలు దొరికేవి కాదు. కొన్ని ప్రాంతాల్లో అసలు వారపు సంతలే ఉండేవి కాదు. చాలా వరకు ఉత్తరాలు అందని గ్రామాలు ఉండేవి. ఆసమయంలో వేళింగి సమీపంలో ఉండే స్పందన సంస్థ నిర్వహించే స్వర్గీయ కె.ఎస్‌. తిలక్‌ గారి వద్ద నేను, స్థానిక యువకలు కొంతమంది కలసి కొద్దిరోజులు పనిచేశాం. అక్కడ గిరిజనులకు వాహనాలంటే వేళింగిలో ఉన్న స్పందన సెంటర్‌లో ఉండే మోటర్‌ సైకిల్‌ ఆప్రాంత గిరిజనులకు తెలుసు. హెల్మేట్‌ ధరించి వెళ్తూంటే జనం భయపడేవారు. నక్సలైట్లు, పోలీసులు గోడవలు ఎక్కువగా ఉండేవి. భూవివాదాలు అధికంగా ఉండేవి. ఆరోజుల్లో అక్కడ భూస్వాములైన మల్లుదొర లాంటి వాళ్లు ఉండేవాళ్లు. ఇప్పుడు లేరని కాదు !అక్కడ లోతా సుబ్బారావు గారి నాయకత్వంలో చుట్టుపక్కల గ్రామాలన్నీ తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకొని అధికారులకు తెలయపర్చడం, వాటిని పరిష్కరించడం ..ఇలా ప్రజల్ని చైతన్యపర్చడం, సమస్యలపట్ల అవగాహన కల్పించడం వంటి కార్యక్రమాలు చేసేవాళ్ళం. ఆ కాలంలో అధికారులు కూడా ప్రజా సమస్యలు పట్టించుకొని తక్షణమే పరిష్కరించేవారు.
ప్రస్తుతం కొత్తభూస్వాములు వచ్చారు. నూతన ఆర్ధిక విధానంలో ప్రభుత్వం ద్వారా పారిశ్రామిక భూస్వాములు తయార య్యారు. ఆరోజుల్లో ప్రభుత్వం పనిచేసే అధికారులు ప్రజల కోసం పనిచేసేవారు. అక్కడ ప్రజల గోడు, వారి పడే బాధలు స్వయంగా పరిశీలించి సమస్యలు పట్టించుకొనేవారు. రహదారి సదుపాయాలు లేకపోయిన కాలినడకన మారుమూల ప్రాంతాలు నడిచి గ్రామాల్లో ప్రజల బాధలు ప్రత్యక్షంగా పర్యవేక్షించేవారు. అటువంటి ఉన్నతాధికారుల్లో బి.డి.శర్మ, కె.బి.సక్సెనా, హర్షమందార్‌, ఈ.ఏ.ఎస్‌. శర్మ, ఆర్‌.శంకరన్‌, ఎం.వి.పి.సి శాస్త్రీ, డి.విజయకుమార్‌, ఎస్‌.నరసింగరావు, రెడ్డి సుబ్రహ్మణ్యం, డాక్టర్‌. బి.వి.రమేష్‌, డాక్టర్‌ ప్రేమచంద్‌, ముఖేష్‌ కుమార్‌ మీనా, డాక్టర్‌ డి.టి.నాయక్‌, వంటి ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజాసమస్యలపట్ల శ్రద్ద చూపి పరిష్కరించే వారు.
ప్రస్తుత పరిస్థితులు భిన్నంగా మారాయి. చాలాచోట్ల కరెంట్‌, రోడ్డులు, ఇతర మౌళికసదుపాయాలు వచ్చాయి. వైద్యం, 108,విద్య, ఐసీడీఎస్‌ సెంటర్లు,కమ్యూనికేషన్‌ సెంటర్లు విస్తరించబడ్డాయి. ఏమూలకు వెళ్లినా మొబైల్‌ ఫోన్లు దర్శనమిస్తున్నాయి. అక్షరాస్యత పెరుగుతోంది. చాలామంది గిరిజన యువత చదువుకొని ఉన్నత స్థానాల్లో స్థిరపడుతున్నారు. మూరుమూల ప్రాంతాల్లో సహితం సాంకేతిక పరిజ్ఞానం విస్తరించింది. అయితే ప్రజల్లో సాంకేతికతను పెంచింది తప్పా అభివృద్ధి మాత్రం అంతంత మాత్రంగానే ఉంది. ప్రస్తుతం నాటి కాలంలో ఉండే అభివృద్ధి మాత్రమే కన్నిస్తోంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో గ్రామాల అభివృద్ధిని గాలికి వదిలేసి..పట్టణాల వైపు దృష్టి చారిస్తోంది. ప్రజా సమస్యలు పరిష్కరించడానికి వేదికగా నిలిచే గిరిజన సదస్సులు ఎక్కడా కన్పించ లేదు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌ పర్యాటక సంస్థపై ఖర్చుపెట్టిన నిధులు గిరిజన ప్రాంతాల అభివృద్ధికి తోడ్పడలేదు. అసలు వారికి న్యాయం చేకూరడం లేదు. అయితే గిరిజన ప్రాంతాల్లో పనిచేస్తున్న కొందరు యువ ఐఏఎస్‌ అధికారులైన శివశంకర్‌, ప్రసన్న వెంకటేషన్‌ వంటి అధికారులు గత కాలపు ఐఏఎస్‌ అధికారులైన శంకరన్‌, బి.డి.శర్మ వంటి వారి స్పూర్తిని తీసుకొని మారుమూల గిరిజన ప్రాంతాలపై దృష్టిపెట్టి గిరిజనులకు న్యాయం చేస్తున్నారు. అప్పటికీ ఇప్పటికీ గిరిజన ప్రజల్లో చాలా మార్పులంటే వచ్చాయి గానీ, అభివృద్ధి మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే చందంగా ఉంది. కాలాను గుణంగా గిరిజన ప్రాంతాల్లో మార్పులు వచ్చినా, శంకరన్‌గారి లాంటి ఐఏఎస్‌ అధికారుల స్పూర్తి తీసుకొని పాలనా యంత్రాంగం ప్రజల్లోకి వెళ్లి, వారి అవసరాలు, మౌళిక వసతులు కల్పనకు దృష్టి కేంద్రీకరిస్తే నాటి ఐఏఎస్‌ అధికారులు ఆకాంక్షలు నెరవేరినట్లు అవుతుంది.- రెబ్బాప్ర‌గ‌డ ర‌వి,ఎడిట‌ర్‌