మారని ఆదివాసీల బతుకులు

స్వాతంత్య్రం వచ్చి ఏడున్నర దశాబ్దాలు దాటినా ఆదివాసీల బతుకుల్లో ఎటువంటి మార్పు లేదు. ప్రభుత్వాలు, పాలకులు మారుతున్నా గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపలేకపోతున్నాయి. ఇప్పటికీ జిల్లాలోని పలు మారుమూల గ్రామాలకు రహదారి సౌకర్యం లేదు. కిలో మీటర్ల మేర కాలినడకన, గుర్రాలపై వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. ఆస్పత్రులకు డోలీల్లోనే తరలించాల్సిన పరిస్థితి కొనసాగుతోంది. జిల్లాలోని 22 మండలాల పరిధిలో తొమ్మిదిన్నర లక్షల మంది గిరిజనులు జీవిస్తున్నారు. వారిలో ఏడు లక్షల మంది గిరిజనులు పాడేరు ఏజెన్సీలో, మిలిగిన రెండున్నర లక్షల మంది రంప ఏజెన్సీలో ఉన్నారు. ప్రాంతాలు వేరైనా వారందరిదీ ఒకే రకమైన వేదన బతుకులే కావడం గమనార్హం.
రవాణా వ్యవస్థల్లో ఎంతో మార్పు చోటు చేసుకున్న ఈ రోజుల్లో సైతం ఆదివాసులు రోగులను డోలీల్లో మోయడం, తమ ప్రయా ణాలకు గుర్రాలను వినియోగిస్తుండడం గిరిజన ప్రాంతంలో రవాణా వ్యవస్థ దుస్థితికి అద్దంపడుతోంది. ఏజెన్సీ ప్రాంతాల్లో సగానికిపైగా గిరిజన పల్లెలకు కనీస రోడ్డు సౌకర్యం లేని పరిస్థితి. ఏజెన్సీలో మారు మూల పల్లెలు అధికంగా ఉన్న ముంచంగి పుట్టు, పెదబయలు, జి.మాడుగుల, చింత పల్లి, జీకేవీధి, కొయ్యూరు మండలాల్లో వందలాది గ్రామాలకు చెందిన ఆదివాసులు ఇప్పటికీ గుర్రాలపైనే రాకపోకలు సాగిస్తు న్నారు. గుర్రాలను కొనుక్కోలేని పేద గిరిజనులు కాలినడకనే తమ ప్రయాణాలు సాగిస్తున్నారు. ఏజెన్సీలో మండల కేంద్రాలు, కాస్త రోడ్డు పక్కన గ్రామాలకు మాత్రమే రోడ్డు, రవాణా సదుపాయాలున్నాయి.
అందనంత దూరంలో ప్రాథమిక వైద్యం
జిల్లాలోని పాడేరు ఏజెన్సీలో ఉన్న ఏడు లక్షల మంది గిరిజనులకు వైద్య సేవలు అందిం చేందుకు ఏజెన్సీ వ్యాప్తంగా 36 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పాడేరులో రెండు వందల పడకల జిల్లా ఆస్పత్రి, అరకులోయలో వంద పడకల ఏరియా ఆస్పత్రి,చింతపల్లిలో 50, ముంచంగిపుట్టులో 30పడకల సామాజిక ఆరోగ్య కేంద్రాలు,గిరిజన పల్లెలో 202 ఆరోగ్య ఉపకేంద్రాలు, గ్రామానికి ఒకరు చొప్పున 3,800 మంది ఆశ కార్యకర్తలు న్నారు. కానీ నేటికీ గిరిజనులకు సాధారణ జ్వరం వ చ్చినా సకాలంలో వైద్యం అందని దుస్థితి కొనసాగుతోంది. గిరిజనుల వైద్యంపై సర్కారు నిర్లక్ష్యం, అధికార యంత్రాంగం అలసత్వంతో వైద్య సేవలు సకాలంలో అందడం లేదు. ఏజెన్సీ 11మండలాల్లో ఉన్న ఆస్పత్రులు, సిబ్బందిని పర్యవేక్షించాల్సిన ఐటీడీఏ పీవో,డీఎంహెచ్‌వో,ఏడీఎంహెచ్‌వో వంటి అధికారులు సైతం ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి. క్షేత్ర స్థాయిలో వైద్యసేవలు అందించే ఆశ కార్య కర్తల వ్యవస్థను పటిష్ఠం చేయకపోవడం, పారా మెడికల్‌ సిబ్బందిపై పర్యవేక్షణ లేమి కారణంగా గిరిజనులకు వైద్య సేవలు సక్రమంగా అందడం లేదు.
పల్లెల్లో కానరాని మౌలిక సదుపాయాలు
ఆదివాసీలు జీవించే పల్లెల్లో కనీస మౌలిక సదుపాయాలు సైతం లేని దుస్థితి నెలకొంది. రోడ్డు, రవాణా,తాగునీరు,విద్య,విద్యుత్‌ వంటి సదుపాయాలు సంపూర్ణంగా లేని పరిస్థితి. ప్రధానంగా తాగునీటి సదుపాయాలు అధ్వా నంగా ఉండడంతోనే గిరిజనులు తరచూ వ్యాధుల బారినపడుతున్నారని తెలిసినా పాలకులు రక్షిత తాగునీటి సదుపాయాల కల్పనపై ప్రత్యేక శ్రద్ధపెట్టడడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏజెన్సీలో భౌగోళిక మార్పుల కారణంగా అధిక సంఖ్యలో గ్రామాల్లోని బోర్లు, బావులు, గ్రావెటీ నీటి పథకాలు అడుగంటి ఇంకిపోతున్నాయి. దీంతో గతి లేక అందు బాటులో ఉన్న ఊటగెడ్డల్లో నీటిపైనే ఆధారపడుతున్నారు. సాంకేతికతను వినియో గించి గిరిజనులకు అవసరమైన రక్షిత నీటిని అందించేందుకు అధికారులు చర్యలు చేపట్టాల్సి ఉంది. కనీసం పంచాయతీ కేంద్రాల్లోనైనా రక్షిత తాగునీటిని అందించేందుకు కృషి చేయాలనే డిమాండ్‌ చాలా కాలంగా ఉంది. అలాగే రోడ్డు, రవాణా విషయాలకు వస్తే మరింత దారుణ మైన పరిస్థితులు కొనసాగుతున్నాయి. నేటికీ ఏజెన్సీలో వందల సంఖ్యలోని పల్లెలకు రోడ్లు లేకపోవడంతో ఆయా ప్రాంతాలకు రవాణా సదుపాయాలు కల్పించని దుస్థితి నెలకొంది. దీంతో గిరిజనులు కాలినడకనే రాకపోకలు సాగిస్తున్నారు. ఇక విద్య విషయానికి వస్తే అంతా మేడిపండు చందంగానే ఉంది. ఏజెన్సీలో నేటికీ పదుల సంఖ్యలోని బడులకు భవనాలను లేని పరిస్థితి నెలకొనగా, ఉన్న పాఠశాలల్లోని గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడం లేదనే వాదన వినిపిస్తున్నది. ప్రధానంగా డీఈవో, ఏజెన్సీ డీఈవో కార్యాలయాల్లోనే ఇప్పటికీ అనేక కీలక పోస్టులు ఖాళీగా ఉండడంతో గిరిజన విద్యా భివృద్ధి మేడిపండు చందంగా ఉందనే విమర్శలున్నాయి.
వ్యవ‘సాయం’ కరువు
గిరిజనుల జీవనాధారమైన వ్యవసాయంపై పాలకుల నిర్లక్ష్యం చెప్పలేనిది. ఏజెన్సీలో దాదాపు 80 శాతం మంది భూమిపై ఆధారపడి జీవిస్తున్నప్పటికీ, ఆ స్థాయిలో గిరిజన రైతులకు ప్రభుత్వాల నుంచి సాయం అందడం లేదు. లోకమంతా వ్యవసాయ రంగంలో దూసుకువెళుతుంటే గిరి రైతులు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడనే చందంగానే ఉన్నారు. గిరిజన ప్రాంతంలో వ్యవసాయ, ఉద్యాన పంటలకు ఎంతో అనుకూలమైనప్పటికీ, కేవలం ప్రభుత్వాల ప్రోత్సాహం లేని కారణంగా ఊహించిన స్థాయిలో వ్యవసాయం అభివృద్ధి చెందడం లేదని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక స్వయం ఉపాధి, చిన్నతరహా పరిశ్రమల గురించి మన్యంలో మాట్లాడుకోవడానికే అవకా?శం లేని పరిస్థితి. దీంతో గిరిజనుల జీవితాల్లో ఆశించిన స్థాయిలో వెలుగులు ప్రసరించడం లేదనేది పలువురి వాదన. గిరిజనాభివృద్ధిపై పాలకులకు చిత్తశుద్ధి లేనంత కాలం ఎన్ని ఆదివాసీ దినోత్సవ వేడుకలను నిర్వహించుకున్నా… తమ బతుకుల్లో మార్పురాదని ఆదివాసీలు ముక్తకంఠంతో ఘోషిస్తున్నారు.
విశాఖ జిల్లాలోని 9 మండలాల్లో 95 వేల జనాభా గల 320 గిరిజన గ్రామాలకు స్వాతంత్య్ర ఫలాలు అందడం లేదు. విద్య, వైద్యం,రవాణా సౌకర్యం, రక్షిత మంచి నీరు అందని ద్రాక్షే. సుదీర్ఘ ప్రాంతాల నుండి గెడ్డల్లో ఊటనీళ్లు, డోలిమోతలు తప్పడం లేదు. ఏజెన్సీని ఆనుకొని ఉన్న నాన్‌ షెడ్యూల్డ్‌ గిరిజన గ్రామాలను 5వ షెడ్యూల్డ్‌లో చేర్చడంలో పాలకవర్గాలు బాధ్యతగా వ్యవహరించడం లేదని గిరిజన సంఘాలు మండిపడుతున్నాయి. జిల్లాలోని మూడు వందల పైచిలుకు గిరిజన గ్రామాలను ఐదవషెడ్యూల్‌లో చేర్చకుండా అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని గిరిజనులు ఆగ్రహం వెలిబుచ్చుతున్నారు. వీటిని షెడ్యూల్డ్‌ ఏరియాలో చేర్పిస్తామని అధికార పార్టీ తియ్యనిమాటలు చెప్పిందేగానీ..అమలు చేయడంలో నిర్లక్ష్యం వహించింది. గిరిజన సలహా మండలి (ట్క్రెబల్‌ ఎడ్వయిజరీ కమిటీ) 112 గిరిజన గ్రామాలకు పరిమితం చేస్తూ ఏడాది క్రితం తీర్మానం చేసింది. దీనిపై గిరిజన, ప్రజాసంఘాలు ఆందోళనకు దిగడంతో మరల తహసీల్దార్లతో క్షేత్రస్థాయి నివేదిక తెప్పించుకుంటామని పాలకులు చెప్పారు. ఇది కూడా ఏడాదికాలంగా నానుతుందే తప్ప అమలుకు నోచుకోలేదు. వందశాతం గిరిజన పంచాయతీలు ఉంటేనే ప్రతిపాదనలు పంపిస్తామని, గిరిజనేతరులతో కలిసి ఉన్న గ్రామాలను పంపించేదిలేదని తహసీల్దార్లు తెగేసి చెబుతున్నారు. నిజానికి శివారు గిరిజన గ్రామాల్లో వందశాతం గిరిజనులు నివసిస్తున్నారు. దీనిని ఇప్పుడు గుర్తించకపోతే తీవ్రనష్టం జరుగుతుందని గిరిజన సంఘాలు మండిపడుతున్నాయి. ఇప్పటికే 1956,1976లో రెండుసార్లు రాష్ట్రపతి ఇచ్చిన గెజిట్‌ నోటిఫికేషన్లో విశాఖ జిల్లాలోని తొమ్మిది మండలాల్లో గిరిజనులకు అన్యాయం జరిగిందని, ఇప్పుడు మళ్లీ అదేవిధంగా చేస్తే గిరిజనులు నష్టపోతారని ఆందోళన చెందుతున్నారు. ప్రతి శివారు గిరిజన గ్రామాన్ని గుర్తించి తహసీల్దార్లు ప్రతిపాదనలు పంపించి జిల్లా కలెక్టర్‌, ఐటీడీఏ ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం పొందాలని, తరువాత అసెంబ్లీలో తీర్మానం చేసి%ౌౌ%రాష్ట్రపతి ఆమోదం ద్వారా గిరిజన గ్రామాలను ఐదవషెడ్యూల్డ్‌లో చేర్చాలని గిరిజన సంఘాలు కోరుతున్నాయి. మాయ మాటలు చెప్పడం మానుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాయి. గిరిజన గ్రామాలను 5వ షెడ్యూల్డ్‌లో చేర్చక పోవడంతో ఆ గ్రామాలు ఎలాంటి అభివృద్ధికి నోచుకోవడం లేదు. ఐటీడీఏ ద్వారా వచ్చే సంక్షేమ పథకాలు, ఉపాధి అవకాశాలు, ఉద్యోగాలు కోల్పోతున్నారు. 1/70 భూబదలా యింపు చట్టం వర్తించడం లేదు. స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా జరుపుకుంటున్న పాలకులు గిరిజన గ్రామాలకు కనీస సదుపాయాలు కల్పించకపోవడం సిగ్గుచేటని విమర్శిస్తున్నారు.
గిరిజన బతుకులు నేటికీ చికట్లోనే..
గిరిజనులు అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీఠ వేస్తుందని ఇటు అధికారులు, అటు ప్రజాప్రతినిధులు చేస్తున్న ప్రకటనలు పత్రికలకే పరిమితం తప్ప ఆచరణ సాధ్యం కావడం లేదు. ఏటా గిరిజనులు అభివృద్ధికి కోట్లాది రూపాయిలు ప్రభుత్వం కేటాయిస్తున్నప్పటికీ నేటికీ గిరిజనులు బతుకులు మారని గ్రామాలు అనేకం వున్నాయని చెప్పకతప్పదు. అందులో భాగంగా ఉత్తరావల్లి పంచాయతీ మధురా గ్రామం గదబపేట అని చెప్పవచ్చు. ఈ గ్రామంలో పూర్వం నుండి 10 కుటుంబాలు కొండలు, తోటలు మధ్య అడవితల్లిని నమ్ముకొని జీవనాన్ని సాగిస్తున్నారు. వారి బతుకులు దయనీయంగా వుండటంతో పాటు అగమ్యగోచరంగా వున్నాయని చెప్పకతప్పదు. నిన్నమొన్నటి వరకు తోటలు మధ్యలో పూరిపాకల్లో తలదాచుకునేవారు. అయితే ఇటీవల కాలంలో నాలుగు ఇళ్లులు ప్రభుత్వం మంజూరు చేయగా, పునాదులు ప్రాప్తికి మూడు ఇళ్లకు బిల్లులు అందగా ఒక ఇంటికి ప్రభుత్వం బిల్లులు మంజూరుచేసిన దాఖాలాలులేవు అయితే గిరిజనులు బతుకులు చూసిన ప్రతీ ఒక్కరికీ గుండె చలించక తప్పదు.గ్రామంలో మినీవాటర్‌ ట్యాంక్‌ వున్నప్పటికీ రెండు నెలలకోసారినీరు సరఫరా కావడంతో కిలో మీటరు దూరంలో వున్న బావికి వెళ్లి తాగునీరు తెచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. తాగునీరు కోసం గిరిజనులు పడుతున్న బాధలు అన్నీఇన్నీకావు. అలాగే వీధి దీపాలు గత కొన్ని నెలలుగా వెలగక పోవడంతో అంధకారంలోనే కాలాన్ని గడుపుతున్నారు. పలుమార్లు ప్రజాప్రతినిధులు దృష్టికి తీసుకెళ్లినప్పటికీ గ్రామం వైపు కనీసం కన్నెత్తి చూసిన పాపాన పోలేదని గిరిజనులు వాపోతున్నారు. గ్రామంలో వున్న రెండు విద్యుత్‌ స్థంభాలకు రెండు బల్బులు వేయటానికి నెలలుగడపటం అధికారులు నిర్లక్ష్యానికి నిదర్శనంగా చెప్పకతప్పదు.
అనుకోని రీతిలో అనారోగ్యం సంబవించినా, 108కి ఫోన్‌ ద్వారా సమాచారం అందినప్నటికీ రావడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎటువంటి అవసరం వచ్చినా మూడు కిలోమీటర్లు దూరంలో వున్న ఉత్తరావల్లి వెళ్లాల్సిందే. రోడ్డు సౌకర్యం అంతంత మాత్రంగానే వుంది. ఈ పది కుటుంబాలు ప్రభుత్వం పంపిణీ చేస్తున్నా పింఛన్లు, రేషన్‌ బియ్యం, అడవినుండి తెచ్చిన కట్టెలను అమ్ముకొని జీవనాన్ని సాగిస్తున్నారు. ఇంతదారుణంగా గిరిజనులు బతుకున్నప్పటి కీ పట్టించుకునే నాధుడు కరువయ్యాడు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తక్షణమే గిరిజనులు అభివృద్ధికి కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా వుంది.
వర్ణణాతీతంగా ఏజెన్సీలోని గిరిజనుల కష్టాలు
ఎన్ని ప్రభుత్వాలు మారినా వారి బతుకులు మాత్రం మారడం లేదు. వారి కష్టాలు తీరడం లేదు. విశాఖలోని గిరిజనుల కష్టాలు వర్ణణాతీతమనే చెప్పాలి. ముఖ్యంగా ఆనారోగ్య సమస్యలు వస్తే.. అంబులెన్స్‌ వెళ్లే పరిస్థితి కూడా లేదు. –(జి.ఎ.సునీల్‌ కుమార్‌)