మానవ హక్కులు కనబడుట లేదు

ఒక లక్ష్యంకోసం పోరాడినా… ఆ లక్ష్యాన్ని సాధించలేనప్పుడు,పోరాటం ఆగాలా..! పోరాటం సాగాలా..!! మహాత్మాగాంధీ అన్నట్టు ‘‘వాళ్లు నాశరీరాన్ని హింసించ వచ్చు, నా ఎముకలు విరిచేయవచ్చు,నన్ను చంపే యొచ్చు కూడా… అప్పుడైనా వాళ్లకు దొరికేది నా దేహమే నా విధేయత కాదు’’
మానవ హక్కులు దేవతావస్త్రాల్లా తయారయ్యాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజా స్వామ్య దేశంగా ఘనత చాటుకునే మన భారత్‌ లోను, అతిపాత ప్రజాస్వామ్య దేశంగా జబ్బలు చరుచుకునే అగ్రరాజ్యం అమెరికాలోనూ మానవ హక్కుల ఉల్లంఘనలు యథేచ్ఛగా జరుగుతూనే ఉన్నాయి. ఇక నియంతృత్వ పాలన సాగుతున్న దేశాల పరిస్థితి ఎలా ఉంటుందో తేలికగానే అర్థం చేసుకోవచ్చు. చాలాచోట్ల ప్రభుత్వాలే నిస్సిగ్గుగా మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతున్నాయి. ఇంకొన్నిచోట్ల ప్రభుత్వాలు మానవ హక్కుల పరిరక్షణకు కంటితుడుపుగా అధికారిక వ్యవస్థలను ఏర్పాటు చేసుకున్నా,అలాంటిచోట్ల ప్రభుత్వాల అధీ నంలో పనిచేసే శాంతిభద్రతల బలగాలు,రక్షణ బలగాలు ప్రజల కనీస మానవ హక్కులను కాలరా స్తున్నాయి. ప్రపంచంలోని మిగిలిన దేశాల సంగతి సరే,ముందు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఘనత పొందిన మన భారత దేశంలో మానవ హక్కుల పరిస్థితిని ఒకసారి చూద్దాం. మనరాజ్యాంగం జీవించే హక్కును,సమానత్వ హక్కును,దోపిడీకి గురి కాకుండా ఉండే హక్కును,భావప్రకటనా స్వేచ్ఛను, విద్యాహక్కును,సాంస్కృతిక స్వేచ్ఛను,మత స్వేచ్ఛను, గోప్యత హక్కును ప్రాథమిక హక్కులుగా గుర్తిం చింది. ఈ హక్కులకు భంగం వాటిల్లితే రాజ్యాంగ పరిధిలో చట్టపరంగా రక్షణపొందే హక్కును కూడా ప్రాథమిక హక్కుగా గుర్తించింది. మన రాజ్యాం గంలో హక్కులు,మన చట్టాల్లో హక్కుల పరిరక్షణ మార్గాలు చాలా పకడ్బందీగానేఉన్నా, మన దేశం లో యథేచ్ఛగా హక్కుల ఉల్లంఘనలు జరుగు తూనే ఉన్నాయి. దేశంలోమానవహక్కులకు రక్షణ కల్పించ డానికి 1993లో జాతీయ మానవహక్కుల కమిషన్‌ ఏర్పడిరది. తర్వాతి కాలంలో వివిధ రాష్ట్రాల్లోనూ మానవ హక్కుల కమిషన్‌లు ఏర్పడ్డాయి.ఇన్ని ఏర్పా ట్లు చేసుకున్నా, మానవహక్కులకు భరోసా కల్పిం చడంలో మనదేశంలో పెద్దగా సాధించి నదేమీ లేకపోగా,ఎక్కడో ఒకచోట సామాన్యుల హక్కులకు తరచుగా విఘాతం కలుగుతూనే ఉంది.

హక్కుల ఉల్లంఘనలో మన రికార్డు
స్వాతంత్య్రంవచ్చి డెబ్భై ఏళ్లు నిండినా, ఆధునిక బానిసత్వంలో, వెట్టిచాకిరిలో మన దేశం ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది. కట్టు బానిసలుగా వెట్టి చాకిరిలో మగ్గిపోతున్న అమాయ కుల సంఖ్య మనదేశంలో1.83కోట్లు అని అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి. అనధికారికంగా ఈ సంఖ్య మరింత ఎక్కువగానే ఉండవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా వెట్టి చాకిరిలో మగ్గుతున్న వారి సంఖ్య 4.58కోట్లు అయితే,వారిలో దాదాపు మూడోవంతుకు పైగా వెట్టి కార్మికులు మన దేశంలోనే ఉన్నారు. దోపిడీకి గురికాకుండా ఉండే హక్కును ప్రాథమిక హక్కుగా గుర్తించిన మన దేశమే శ్రమ దోపిడిలో ప్రపంచం లోనే మొదటి స్థానంలో నిలుస్తుండటం విషాదకర వాస్తవం. దేశంలోవిద్యాహక్కు అమలులో ఉన్నా, దాదాపు1.26 కోట్ల మందిచిన్నారులు పొట్ట పోసు కోవడానికి ప్రమాదకరమైన పరిశ్రమల్లో పనులు చేస్తున్నారు. వీరిలో చాలామంది నామమాత్రపు ప్రతిఫలానికి వెట్టిచాకిరి చేస్తున్నవారే. పేదరికం వల్ల అప్పులపాలైన తల్లిదండ్రులు తమ పిల్లలను రుణదాతలవద్ద వెట్టిచాకిరికి పెడుతున్నారు. వెట్టి చాకిరి కోరల్లో చిక్కుకుంటున్న బాలికల్లో చాలా మంది లైంగిక దోపిడీకి గురవుతున్నారు.

రక్షకులే భక్షకులు
మానవ హక్కుల పరిరక్షణలో, శాంతి భద్రతల అమలులో కీలక పాత్ర పోషించాల్సిన పోలీసు బలగాలు యథేచ్ఛగా హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్నాయి. పోలీసుల కస్టడీలోను, జుడీషియల్‌ కస్టడీలోను చిత్రహింసలకు తాళలేక చాలామంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. మన దేశంలోని పరిస్థితినే గమనిస్తే, 2001%–%13 మధ్య కాలంలో 1,275 మంది పోలీసు కస్టడీలో మరణించారు. అదే కాలంలో ఏకంగా 12,727 మంది జుడీషియల్‌ కస్టడీలో ప్రాణాలు వదిలారు. పోలీసు కస్టడీ మరణాలకు సంబంధించి మహారాష్ట్ర (306),ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ (210),గుజరాత్‌ (152) మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. కస్టడీ మరణాలకు సంబంధించి 2013సంవత్సరం తర్వా తి లెక్కలను అధికారికంగా ఇంకా ప్రకటించ లేదు. ఆలెక్కలను కూడా కలుపుకుంటే,ఈ సంఖ్య మరింత ఎక్కువగానే ఉంటుంది. ఇక ఎన్‌కౌంటర్ల పేరిట భద్రతా బలగాలు పొట్టన పెట్టుకుంటున్న వారి సంఖ్య దీనికి అదనం. జమ్ము కశ్మీర్‌లోను, ఈశాన్య రాష్ట్రాల్లోను భద్రతాబలగాలు సామాన్యులపై సాగిం చే దమనకాండకు సంబంధించి నిత్యం వార్తలు వస్తూనే ఉన్నాయి. ఎవరిపై అయినా ఉగ్రవాదులు, తీవ్రవాదులు అనే అనుమానం వస్తే చాలు, కాల్చి పారేయడమే పనిగా పెట్టుకున్న పోలీసులు ఈశాన్య రాష్ట్రాల్లో చాలామందే ఉన్నారు. ఉగ్రవాదులుగా అనుమానించిన దాదాపు వందమందిని తాను స్వయంగా కాల్చి చంపానని మణిపూర్‌కు చెందిన హెరోజిత్‌ అనే మాజీ పోలీసు అధికారి పాత్రికే యుల వద్ద సగర్వంగా చెప్పుకున్నాడంటే ఆ ప్రాం తంలో మానవ హక్కుల పరిస్థితిని అర్థంచేసుకో వచ్చు.పోలీసుకస్టడీ,జుడీషియల్‌ కస్టడీల్లో సంభవి స్తున్న మరణాలకు సంబంధించి బాధ్యులకు శిక్షలు పడుతున్న సందర్భాలు దాదాపు రెండుశాతం మాత్ర మే ఉంటున్నాయి. కస్టడీ మరణాలు,బూటకపు ఎన్‌కౌంటర్లు ఒక ఎత్తయితే,మరోవైపు… బెదిరిం పులు,బలవంతపు వసూళ్లకు పాల్పడటం, కూం బింగ్‌ ఆపరేషన్ల పేరిట అత్యాచారాలకు తెగబడ టం,చట్ట విరుద్ధంగా సెటిల్‌మెంట్లు చేయడం, పౌరుల పట్ల నిష్కారణంగా దురుసుగా ప్రవర్తిం చడం,భావప్రకటనా స్వేచ్ఛకు భంగం కలిగించడం వంటి ‘ఘన’కార్యాలు కూడా మన పోలీసులకు చాలా మామూలు విషయాలు. కేవలం 2015 సంవత్సరంలో దేశంలోని వివిధ ప్రాంతాల్లో 46 మంది మహిళలు పోలీసుల చేతిలో అత్యాచా రాలకు గురయ్యారని జాతీయ మానవ హక్కుల కమిషన్‌ వెల్లడిరచింది. మన పోలీసుల మానవ హక్కుల ఉల్లం‘ఘన’ చరిత్ర విదేశాలకూ పాకింది. మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డాడనే ఆరోప ణలు ఉన్నందున సీఆర్పీఎఫ్‌ మాజీ ఐజీ తేజీందర్‌ సింగ్‌ ధిల్లాన్‌కు వీసా ఇచ్చేందుకు కెనడా నిరాక రించింది. మానవ హక్కుల ఉల్లంఘనలో మన పోలీసుల ‘ఘనత’కు ఇది ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. మానవ హక్కుల ఉల్లంఘనలకు సంబం ధించి పోలీసులపై గత ఏడాది 36వేలకు పైగా కేసులు నమోదైనట్లు జాతీయ మానవ హక్కుల కమిషన్‌ ప్రకటించింది.

భావప్రకటనకూ దిక్కులేదు
స్వతంత్ర భారత దేశంలో భావ ప్రకట నకూ దిక్కులేకుండా పోతోంది. ఎమర్జెన్సీకాలంలో భావప్రకటనకు పూర్తిగా సంకెళ్లు పడ్డాయి. ఆ తర్వాత ఇటీవలి కాలంలో భావప్రకటనా స్వేచ్ఛకు తరచుగా అవరోధాలు ఏర్పడుతున్నాయి. కార్టూన్లు వేసినందుకు, వ్యాసాలు, పుస్తకాలు రాసినందుకు, చివరకు సామాజిక మాధ్యమాల్లో వ్యాఖ్యలు చేసినం దుకు కటకటాల వెనక్కు వెళ్లే పరిస్థితులు,కేసుల్లో చిక్కుకునే పరిస్థితులు దాపురిస్తున్నాయి. ప్రభుత్వం పైన, ప్రభుత్వాధినేతలపైన విమర్శలు చేసే వారికి బెదిరింపులు, భౌతిక దాడులు ఎదురవుతు న్నాయి. అవినీతి బాగోతాలను బట్టబయలు చేసేందుకు సమాచార హక్కు చట్టాన్ని ఆశ్రయిస్తున్న వారిలో కొందరికి ఏకంగా ప్రాణాలకే ముప్పు ఎదురవు తోంది. సమాజంలో భిన్నాభిప్రాయాలను గౌరవిం చే లక్షణం తగ్గిపోతోంది. ఒక వర్గం అభిప్రాయా లకు భిన్నంగా మరోవర్గానికి చెందిన వారెవరైనా అభిప్రాయాలను వ్యక్తం చేస్తే, వారిపై భౌతిక దాడు లకు తెగబడే మూకలు పేట్రేగిపోతున్నాయి. ఒక్కో సారి ప్రాణాలను హరించడానికి కూడా అలాంటి మూకలు వెనుకాడటంలేదు. వీళ్ల తాకిడికి ఎక్కువ గా రచయితలు,కళాకారులు,అవినీతి పాలనపై విమ ర్శలు సంధించేవాళ్లు,నిబంధనలకు కట్టుబడి నిజా యతీగా విధులు నిర్వర్తించే ప్రభుత్వాధికారులు బాధితులవుతున్నారు.కర్ణాటకలో పత్రికా సంపాద కురాలు గౌరీ లంకేష్‌ హత్య,‘పద్మావతి’ సినిమా దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీ, ఆసినిమా కథా నాయకురాలు దీపికా పదుకొనెలపై బెదిరింపులు, ఫత్వాలు ఇలాంటి పోకడలకు తాజా ఉదాహర ణలు. ఇలాంటి బెదిరింపులకు పాల్పడే వారిలో మత ఛాందసులతో పాటు రాజకీయ పదవుల్లో కొనసాగుతున్న నాయకులు కూడా ఉంటున్నారు. దేశ రాజ్యాంగంపైన కనీస గౌరవం లేని ఇలాంటి నాయకులు చట్టసభల్లో కొనసాగుతున్నారు.

బలహీనులే బాధితులు
మానవ హక్కుల ఉల్లంఘనలకు సంబంధించి బలహీనులే బాధితులుగా మిగులు తున్నారు. సమాజంలోని బలహీనులు తరచుగా హక్కుల అణచివేతకు గురవుతున్నా, వారికి న్యాయం దక్కుతున్న సందర్భాలు మాత్రం అరుదుగానే ఉంటున్నాయి. మహిళలు,దళితులు,మైనారిటీలు తీవ్రమైన అణచివేతకు గురవుతున్నారు. అమెరికా విదేశాంగశాఖ విడుదల చేసిన వివరాల ప్రకారం మన దేశంలో గత ఏడాది దళితులపై 45 వేలకు పైగా నేరాలు జరిగాయి. గిరిజనులపై 11వేలకు పైగా నేరాలుజరిగాయి.గడచిన రెండేళ్లలో మైనా రిటీలపైన, దళితులపైన గోపరిరక్షక దళాల దాడు లు గణనీయంగా పెరిగాయి. కేంద్ర హోంశాఖ విడుదల చేసిన వివరాల ప్రకారం 2015లో మత ఘర్షణలకు సంబంధించి దాదాపు 750 సంఘట నలు జరిగాయి. ఈసంఘటనల్లో 97మంది మైనా రిటీలు ప్రాణాలు కోల్పోయారు.2016 సంవత్స రంలో మొదటి ఐదు నెలల్లోనే ఇలాంటి 275 మత ఘర్షణలు జరిగి 38మంది మరణాలకు దారితీశాయి. కులమతాలకు అతీతంగా ప్రేమించు కున్న ప్రేమజంటలు పరువు హత్యలకు గురవు తున్నారు. సభ్య సమాజంలో ఇలాంటి పరువు హత్యలు అత్యంత హేయమైనవి అంటూ సుప్రీం కోర్టు ఒక తీర్పులో తీవ్రంగా అభిశంసించినా, ఈ సంఘటనలు తగ్గకపోగా మరింతగా పెరుగు తున్నాయి. నేషనల్‌ క్క్రెమ్‌ రికార్డ్స్‌ బ్యూరో లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా 2014లో28 పరువు హత్య లు జరిగితే,2015లో ఏకంగా251హత్యలు జరిగా యి. ఎక్కువగా దళితులు, మైనారిటీలు,మహిళలే పరువు హత్యల బారిన పడుతున్నారు.

అణచివేత నుండి హక్కుల పోరాటం వరకూ…
అమ్మ కడుపులో పిండంగా వున్నప్పటి నుండే దాడి మొదలవుతుంది. పుట్టేది అమ్మాయి అయితే అబార్షన్లు, అమ్మలకి తన్నులు. అది దాటు కొని బయటకు వచ్చాక ప్రతి చోటా ఆంక్షలే. అదే అబ్బాయిలకైతే ఏం చేసినా ‘ఆడు మగాడ్రా బుజ్జి’ అంటారు. అందుకే నేడు అసమానతలకు తోడు అత్యాచారాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. చేసిన అత్యాచారాన్ని కప్పిపుచ్చుకునేందుకు డ్రస్సుల మీద నెపం వేస్తున్నారు. 6రోజుల పాప నుండి అరవై ఏళ్ల అవ్వ వరకూ అత్యాచార బాధితులే. ప్రేమించలేదని గుంటూర్లో నడిరోడ్డుపై ఒక అమ్మాయి గొంతు కోశాడు ఓఉన్మాది. విశాఖలో 13ఏళ్ల అమ్మాయిని కిడ్నాప్‌ చేసి హత్యాచారానికి తెగబడ్డారు దుర్మార్గులు. నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో (ఎన్‌సిఆర్‌బి) రిపోర్టులు పరిశీలిస్తే సగటున రోజుకి 98 మందిపై అత్యాచార కేసులు నమోదవుతున్నాయి. ఎన్‌సిఆర్‌బి ప్రకారం 2019-20లో3,71,503 అత్యాచారకేసులు నమోదు కాగా అందులో 49,385 కేసులతో ఉత్తర ప్రదేశ్‌ మొదటి స్థానంలో ఉంది. తెలంగాణ, ఆంధ్రా 8,9స్థానా ల్లో ఉన్నాయి. అత్యాచార కేంద్రాలుగా బిజెపి పాలి త ప్రాంతాలైన అస్సాం,బీహార్‌,మధ్యప్రదేశ్‌ నిలి చాయి. అమ్మాయిలపై ఇటువంటి అత్యాచారాలు జరిగినప్పుడల్లా నిందుతుడిని ఉరి తీయాలనో, ఇంకా కఠినమైన చట్టాలు రావాలనో పౌర సమాజం నుండి స్పందనలు రావడం సహజం. ప్రభుత్వాలు కూడా ఆయా పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకొని హడవుడిగా కొత్తచట్టాలు తీసుకు రావడం,ఉరితీయడం లేదా ఎన్‌కౌంటర్‌ చేసి తమ ఓటు బ్యాంకును కాపాడుకొంటూ చేతులు దులుపు కుంటున్నాయి. శాశ్వత పరిష్కారం కోసం ఆలోచిం చడం లేదు. స్త్రీని కేవలం ఒక వ్యాపార వస్తువుగా, బానిసగా,వంటింటికే పరిమితం చేయాలనే ఫ్యూ డల్‌, పురుషాధిక్య, మనువాద భావజాలమే ఇందుకు ప్రధాన కారణం. అసమానత, వివక్ష, అణచివేత ఏరూపంలో ఉన్నా ప్రశ్నించాలి. ఆడ పిల్లలు లేకపోతే సమాజ మనుగడే ప్రశ్నార్ధకం అవుతుందని చెప్పాలి.

విద్యలోనూ అసమానతే
‘బాలికా విద్యే మా ప్రాధాన్యత’ అంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఊదరగొడుతున్నాయి. కానీ ఆచరణ లేదు. బడిలో చేరుతున్న అమ్మాయిల సంఖ్య అబ్బాయిల సంఖ్య కంటే తక్కువగా ఉంటుంది.ఫలితాల్లో మాత్రం అమ్మాయిలే ముం దంజలో ఉంటున్నారు. అఖిల భారత ఉన్నత విద్యా సర్వే 2019-20ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో పిహెచ్‌డి, ఎం.ఫిల్‌, పీజీ, పీజీ-డిప్లొమా, యూజీ, ఇంటిగ్రేటెడ్‌ వంటి కోర్సుల్లో చేరిన మొత్తం విద్యా ర్థులలో అబ్బాయిల సంఖ్య 10,21,126 వుండగా అమ్మాయిల సంఖ్య 8,70,023 ఉంది.గత 5సం వత్సరాల నుండి అటు దేశంలోనూ ఇటు రాష్ట్రం లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతున్నది. దీనికి తోడు ఓవైపు విద్య వ్యాపారీకరణను మరింత పెంచే నూతన విద్యా విధానం 2019 (ఎన్‌ఇపి). మరో వైపు కరోనా విపత్కర పరిస్థితుల వలన తల్లి లేదా తండ్రి లేదా ఇద్దరినీ కోల్పోవడం లేదా కుటుం బాలు ఆర్థికంగా చితికిపోవడంవల్ల కూడా అమ్మా యిల మీదే ప్రభావం పడిరది.

వారి హక్కులు వారికిద్దాం
కంప్యూటర్‌ కాలంలో కూడా ఆడపి ల్లలను సమానంగా చూడలేకపోతున్నాం. మహిళా భివృద్ధి కోసం, సమానత్వ సాధన కోసం రాజ్యాం గం మహిళలకు కల్పించిన 33 శాతం రిజర్వేషన్‌ బిల్లు నేటికీ చట్టం కాలేకపోయింది. పార్లమెంటులో మెజారిటీ ఉందని విర్రవీగుతున్న బిజెపి… ప్రజలకు నష్టం కలిగించే అనేక బిల్లులను పాస్‌ చేసింది. కార్మిక చట్టాలను కాలరాసి ప్రయివేట్‌ సంస్థల్లో ప్రసూతి సెలవు పెట్టిన వారిని ఇంటికే పరిమితం చేసింది. ప్రతిపక్షాలు వ్యతిరేకించినప్పటికీ ప్రభుత్వ సంస్థలను అమ్మేస్తున్నారు. రాత్రికిరాత్రి 360 ఆర్టి కల్‌ రద్దు,నోట్లరద్దు చేసిన ప్రభుత్వం…33 శాతం రిజర్వేషన్‌ బిల్లును ఎందుకు చట్టం చేయడం లేదు. ఈ రోజు 33 శాతం రిజర్వేషన్‌ని అంగీకరించని వారు రేపు 50శాతం రిజర్వేషన్‌ని అంగీకరి స్తారా? ఓటింగ్‌లో 51శాతం పాల్గం టున్న మహి ళలను పాలనలో కేవలం 14 శాతానికి పరిమితం చేశారు.

ఆంధ్రప్రదేశ్‌లో అణచివేతలు…
ఆంధ్రప్రదేశ్‌లోనూ హక్కుల ఉల్లం ఘనలు కొత్త ముచ్చటేమీ కాదు. ప్రజల హక్కులకు భరోసా కల్పించాల్సిన ప్రభుత్వమే హక్కుల ఉల్లం ఘనలకు పాల్పడుతున్న ఉదంతాలు ఉన్నాయి. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మండలంలోని తుందుర్రు గ్రామ ప్రజలు తమ ఉనికికే ముప్పుగా మారిన గోదావరి మెగా అక్వా ఫుడ్‌ పార్కు పేరిట రొయ్యల ఫ్యాక్టరీ నిర్మాణానికి వ్యతిరేకంగా ఆందో ళనకు దిగితే, ప్రభుత్వం వారిపై దమనకాండకు పాల్పడిరది. రొయ్యల ఫ్యాక్టరీ నుంచి వెలువడే రసాయనాల వల్ల వాతావరణ కాలుష్యంతో పాటు భూగర్భ జలాలు కలుషితమవడమే కాకుండా, సమీప గ్రామాల మత్స్యకారులు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉండటంతో ఆందోళనలు చెలరేగాయి. రొయ్యల ఫ్యాక్టరీని గ్రామాలకు చేరువలో కాకుండా, సముద్ర తీరానికి తరలించాలంటూ తుందుర్రు చుట్టుపక్కల దాదాపు నలభైగ్రామాల ప్రజలు ఆందోళన బాటపట్టారు. ఈ ఆందోళనకు వివిధ రాజకీయ పార్టీలు,ప్రజాసంఘాలు మద్దతు పలికినా, ప్రభుత్వం మాత్రం గ్రామస్తులగోడు పట్టించు కోకుండా ఆందోళనకారులపై కేసులు బనాయించి, జైళ్లలోకి నెట్టింది.
ా కృష్ణా జిల్లా ముసునూరు తహసీల్దారుగా ఉన్న సమయంలో ఇసుక మాఫి యాను అడ్డుకున్న వనజాక్షిపై ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ ప్రోద్బలంతో దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఇలాంటి సంఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా చాలానే జరుగుతున్నాయి.
ా భీమవరానికి చేరువలోని గరగపర్రు గ్రామం లో అంబేడ్కర్‌ విగ్రహం ఏర్పాటు చేసినం దుకు మూడువందల దళితకుటుంబాలను అగ్ర వర్ణాలవారు సాంఘిక బహిష్కరణకు గురి చేశారు.

ా శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలంలోని కొవ్వాడలో తలపెట్టిన అణువిద్యుత్‌ కేంద్రానికి వ్యతిరేకంగా సమీప గ్రామాల ప్రజలు ఆందో ళనలు కొనసాగిస్తున్నారు. ఆందోళ నలను ఎలాగైనా అణచివేయాలనే లక్ష్యంతో ప్రభు త్వం ఆప్రాంతంలో సంక్షేమపథకాలతో పాటు,స్థిరాస్తుల క్రయవిక్రయాలను కూడా నిలిపివేసింది.
ా నవ్యాంధ్రప్రదేశ్‌ రాజధాని నిర్మాణం కోసం ప్రభుత్వం పంట భూములను బలవంతంగా సేకరిస్తుండటానికి వ్యతిరేకంగా గుంటూరు జిల్లా ఉండవల్లి మండలంలోని పెనుమాక గ్రామస్తులు మూడేళ్లుగా పోరాటం సాగిస్తున్నారు.
ా కర్నూలు జిల్లా పాములపాడు మండలంలోని వెంపెంట గ్రామస్తులు తమ ఉనికికే ముప్పుగా మారిన పవర్‌ ప్లాంట్‌ నిర్మాణానికి వ్యతి రేకంగా ఏళ్లతరబడి పోరాటం కొనసాగి స్తు న్నా, ప్రభుత్వం ఏకపక్షంగావ్యవహరిస్తోంది.
ా తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలం లో దివీస్‌ పరిశ్రమకు ప్రభుత్వం 505 ఎకరాల అసైన్డ్‌ భూమిని కేటాయించింది. ఈ పరిశ్రమ ఏర్పాటైతే తమ మనుగడకే ముప్పు వాటిల్లుతుందంటూ పంపాదిపేట పరిసర గ్రామాల ప్రజలు న్యాయపోరాటం సాగిస్తున్నారు.
ా ఇవన్నీ ఒక ఎత్తయితే, రెండేళ్ల కిందట చిత్తూ రు జిల్లాలో ఎర్రచందనం స్మగ్లర్లనేనెపంతో ఇరవై మంది కూలీలను పోలీసులు కాల్చి చంపారు. ఈ సంఘటనను జాతీయ మానవ హక్కుల కమిషన్‌ తీవ్రంగా అభిశంసించింది.

మోడీ – మానవ హక్కులు
జాతీయ మానవ హక్కుల కమిషన్‌ (ఎన్‌హెచ్‌ఆర్‌సి) 28వ వ్యవస్థాపకదినోత్సవం సందర్భంగా ప్రధాన మంత్రినరేంద్రమోడీ చేసిన ప్రసంగం నవ్విపోదురు గాక నాకేటి సిగ్గుఅనే విధంగా ఉంది.ఉత్తరప్రదే శ్‌లోని లఖింపూర్‌ఖేరిలో తన సహచర మంత్రి సుపుత్రుడు రైతులపై వాహనాన్ని నడిపి నలుగురి ప్రాణాలను బలిగొన్న అత్యంత దారుణ సంఘట నపై ఇంతవరకు పెదవి విప్పని ఆయన మానవ హక్కులపై మాట్లాడటమే హాస్యాస్పదం. పోనీ ఆ సందర్భంగానైనా అమానుషాన్ని ప్రస్తావించి విచా రం వ్యక్తం చేశారా అంటే అదీలేదు. ఆపని చేయ కపోగా మానవహక్కులపై కొందరు ఇష్టా రీతిన అర్ధాలు తీస్తున్నారని,ఏచిన్న సంఘటన జరిగినా మానవ హక్కుల ఉల్లంఘన అంటూ గగ్గోలు పెడుతున్నారు. లఖింపూర్‌ ఘటనపై దేశవ్యాప్తంగా తీవ్రఆగ్రహావేశాలు వ్యక్తమై, అత్యు న్నత న్యాయస్థానం జోక్యం చేసుకునేంత వరకు ఏలినవారి ప్రభుత్వంలో నామమాత్రపు స్పందన కూడా కనిపించని వైనాన్ని దేశ ప్రజలందరూ చూశారు. ఆనిష్క్రియాపర త్వంపై మాట కూడా మాట్లాడని ఆయన మానవ హక్కులను రాజకీయ ప్రయోజనాలకు వాడుకుం టున్నారని ఆరోపిం చడం ఎంత విచిత్రం! నరేంద్రమోడీచుట్టూ మానవ హక్కుల చర్చ జరగడం కొత్తేమీ కాదు. ఆయన గుజ రాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుండి సాగు తున్నదదే! కాకపోతే ఎప్పటికప్పుడు తిమ్మినిబమ్మి చేసే టక్కుట మారాలతో ప్రజలను చీల్చి ఏమా ర్చడం సంఫ్న్‌ పరివారానికి వెన్నతో పెట్టిన విద్య! ఆ కుదురు నుండే వచ్చిన మోడీ ప్రధాని హోదా లో సైతం ఆవిద్యను ప్రదర్శిస్తున్నారు. వ్యవసా యాన్ని కార్పొరేట్ల పరం చేయడాన్ని వ్యతిరేకిస్తూ రైతాంగం చేస్తున్న ఉద్యమం,దానికి దేశ వ్యాప్తంగా లభిస్తున్న మద్దతును, రైతులపై బిజెపిశ్రేణులు చేస్తున్న దాడు లను తక్కువ చేసి చూపిస్తున్నట్లుగానే అనేక విష యాల్లో ఇదే ధోరణి! జమ్మూ కాశ్మీర్‌ను ఏకపక్షంగా మూడు ముక్కలు చేసిన తరువాత అక్కడి ప్రజల గొంతులను ఎలానొక్కేశారు?అక్కడేం జరుగు తోందో బయట ప్రపంచానికి తెలియ కుండా ఉండ టానికి ఇంటర్‌నెట్‌ను కూడా నెలల తరబడి నిలిపి వేశారు కదా! చివరకు ప్రజాప్రతి నిధులను, మాజీ ముఖ్యమంత్రులను గృహ నిర్బం ధం చేసిన తీరు మానవహక్కులపై దాడికాక మరేమిటి?ఆచర్యతో ఏదో సాధించామని చెప్పు కున్న దానికి భిన్నంగా కాశ్మీర్‌ ఇంకా రగులుతూనే ఉండటానికి, సైనికులతో పాటు అమాయక ప్రజల ప్రాణాలు గాలిలో కలుస్తుండటానికి కారణం ఏమిటి?ఎందరో మేధావులు, రచయితలు, న్యాయ వాదులను జైలు పాలు చేసినప్పటికీ భీమా కోరెగావ్‌ కేసు అడుగు కూడా ముందుకు ఎందుకు సాగడం లేదు? వయోవృద్ధుడని కూడా చూడకుండా స్టాన్‌ స్వామిని నానాఅగచాట్ల పాల్జేసి,కస్టడీలోనే ప్రాణాలు పోయేలా చేశారే.దీనిని ఏమందాం? మోడీ అధికా రంలోకి వచ్చిన తరు వాత దేశ వ్యాప్తంగా మైనార్టీ లను, దళితులను, మహిళలను లక్ష్యంగా చేసుకుని సాగిన మూక దాడుల సంగతేంటి? ఇంట్లోకి వచ్చి ఏం వండు తున్నారో తనిఖీలు చేసిన గుంపులకు ఆ ధైర్యం ఎక్కడి నుండి వచ్చింది? ఇలాచెప్పు కుంటూ పోతే ఈజాబితాకు అంతుందా! నిజానికి ఈతరహా చర్యల కారణం గానే దేశప్రతిష్ట అంత ర్జాతీ యంగా పాతాళానికి చేరుతోంది. ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల విభాగం కూడా దేశంలో రోజు రోజుకి దిగజారుతున్న మానవహక్కుల పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. తాజాగా కార్పొరేట్‌ వ్యవసాయానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతులపై ప్రభుత్వ అండతో జరుగుతున్న దాడులపై ప్రపంచ వ్యాప్తంగా నిరసన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యం లోనే ప్రధాని మానవహక్కులకు మసిపూసి మారేడు కాయ చేసే ప్రయత్నం చేశారు-కందుకూరి సతీష్‌ కుమార్‌