మన మూల వాసులు
‘‘మనిషి మనుగడకు మూలం ప్రకృతి నుంచే మొదలయ్యింది. నాగరికతకు దూరంగా, ప్రక ృతిలో భాగంగా ఉండే అడవులు, కొండలు, కోనలు, వాగులు, వంకల్ని అంటిపెట్టుకొని ఇప్పటికీ కొందరు మనుషులు జీవనాన్ని కొనసాగిస్తున్నారు. వారే దేశీయతెగలు, ఆదివాసీలైన మూలవాసులు. మనదేశంలో ఒక్కో మూల ఒక్కో ఆది వాసులకు సంబంధించిన మూలాలు కనిపిస్తాయి. మన దేశ కథ చెప్పాలంటే ముందుగా వీరి ఘట్టంతోనే మొదలుపెట్టాలి. మూలవాసులతోనే అసలైన భారతీయ సంస్క ృతిని ప్రపంచానికి చూపించాలి. అడవితో అను బంధాన్ని ఇంకా సజీవంగా మిగులుస్తోన్న ప్రకృతి బిడ్డల జీవనాన్నే ‘అబౌట్ ఇండియా’లో ముందుగా వివరించాలి. వివిధ ప్రాంతాల్లో ప్రాచుర్యం పొందిన ఆతెగల ఆచారాలు, సాంప్రదాయాలకు సంబంధించిన విశేషాల సమాహారం ’’
ఆఫ్రికాలోని ఇథియోపియా, బ్రెజిల్‌లోని అమెజాన్ అటవీ ప్రాంతం పురాతన ఆటవిక తెగలకు స్థావరం అని ఎక్కువమందికి తెలుసు. మరి మనదేశంలోనూ అలాంటి తెగలు దాదాపు500పైగా తెగలుగా ఉన్నవారి గురించి తెలిసింది మాత్రం అతితక్కువమందికే. ఆహార్యం,భాష,నృత్యం, ఆచారాలు ఇలా ఈతెగల్లో ఎన్నోవైవిధ్యాలు ప్రత్యేకతలు కనిపిస్తాయి. అలాంటి తెగల్లో గోండ్‌తెగ ఒకటి. ఈతెగకు చెందినవారు చత్తీస్‌గఢ్‌లోని బస్తర్ జిల్లాతోపాటు, మహారాష్ట్ర, అంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో నివాసం ఉంటున్నా అత్యధికó సంఖ్యలో గోండ్లు నివసిస్తోంది మధ్యప్రదేశ్‌లోని చింద్వారా జిల్లాలోనే. అడవికి దగ్గరలోని ప్రాంతాల్లో మారుమూల గ్రామాల్లో వీరు మట్టి ఇళ్ళను ఏర్పాటుచేసుకుని నివసిస్తుంటారు. ఇలా అధిక సంఖ్యలో గోండ్లు నివసించే కొన్ని ఆవాసాల్ని గోండ్ల గ్రామం అని పిలుస్తారు. ఇలాంటి మహారాష్ట్రలో మనకు ఎక్కువగా కనిపిస్తాయి. గోండ్ల గ్రామంలో ఒకగ్రామ పెద్దఉంటాడు. ఆయన్ని మాహజి/పటేల్ అనిపిలుస్తారు. ప్రతిగోండు గ్రామంలో గ్రామపెద్దతో పాటు ఒక మహిళ కూడా ఆ ఊరికి పెద్దదిక్కుగా ఉంటారు. వీళ్ళు జరుపుకునే పండుగల్లో వీరిరువురినీ ప్రత్యేకంగా అంలంకరించి సత్కరిస్తుంటారు. ఇక ఈతెగలో పేద ధనికలాంటి అసమానతలేవీ ఉండవు. ఈతెగ మహిళలు స్వయంగా ఎంపిక చేసుకున్న వ్యక్తులతోనే వారి వివాహాన్ని జరిపించే ఆచారం కూడా ఉంది. మహిళలు చీరల్ని మాత్రమే ధరిస్తారు. ఇక ఈతెగ మహిళల ఆహార్యం సాదాసీదాగానే ఉన్నా వృత్తాకారంలో సత్తుతో తయారుచేసిన కంఠాభరణాలతోపాటు, చెవిభాగంలో ధరించే పెద్ద రింగులతో ఎంతో ప్రత్యేకంగా కనిపిస్తారు. మధ్యప్రదేశ్‌లో జరిగే మదాయి జాతర లో సాంప్రదాయ వస్త్రాలతో ఈతెగకు చెందిన స్త్రీ,పురుషులిరువురూ కలిసి చేసే నృత్యం కన్నుల పండుగగా ఉంటుంది. తెలంగాణలో నాగోబా జాతర గోండు తెగలు విశేషంగా జరుపుకునే పండుగ. ఈ తెగ ఎక్కువగా తీసుకునేది మాంసాహారమే అయినా, కొడొ, కుట్కి చిరుధాన్యాలతో చేసే వంటకాలను వీళ్ళు ఎక్కువగా ఆహారంగా తీసుకుంటారు. గోండీ వీరిప్రధాన భాషే అయినా, మనదేశంలో వివిధ రాష్ట్రాల్లో సంచార జీవనం కొనసాగించే ఈ తెగలో చాలా మందికి తెలుగు, హిందీ, మరాఠీ, పారీభాషలతోపాటు ఇతర ద్రవిడ భాషలూ తెలుసు. కమ్మరి, పశువుల కాపరి, డప్పు వాద్యంలాంటి వృత్తుల్లో ఈ తెగకు చెందిన పురుషులు కొనసాగుతున్నారు.
గూమర్ పుట్టిందిక్కడే…రాజస్థాన్‌కు చెందిన ఒక ప్రధాన తెగ భిల్. దుంగార్పూర్, బన్స్వారా జిల్లాలతోపాటు ఉదరుపూర్‌లోని సిరోహి ప్రాంతంలో ఈ తెగ నివాసాలు కనిపిస్తాయి. వీళ్ళ వస్త్రధారణ దాదాపు రాజస్థానీ సాంప్రదాయ దుస్తులని పోలుంటుంది. ఈ తెగ మహిళలు కంచుతో చేసిన వివిధ రకాల ఆభరణాల్ని ధరిస్తారు. సంగీతం, నృత్యానికి ఈతెగలో ఎక్కువ ప్రాధాన్యత కనిపిస్తుంది. భిల్ తెగలో జరిగే పండుగలను గ్రామ పెద్ద నిర్వహిస్తుంటారు. వారిని భగత్ అని పిలుస్తారు. ఈతెగ జరుపుకునే పండుగల్లో బనేశ్వర్ జాతర ప్రధాన పండుగ. ఈపండుగ సమయంలోనే మహిళలు గూమర్ నృత్యాన్ని ప్రదర్శిస్తుంటారు. అంటే..రాజస్థాన్ సాంస్క ృతిక ప్రతీకగా చెప్పుకునే గూమర్ న ృత్యానికి ఊపిరి పోసింది ఈ తెగ మహిళలేనన్న మాట. ఈ తెగలో ప్రదర్శించే మరో ప్రధాన నృత్యం గైర్‌జ. ఇక ఈ తెగలో దేవతారాధన ఉన్నా వాటికి సంబంధించి ఎలాంటి గుళ్ళూ కనిపించవు. స్థానికంగా ఉండే మిగతావాళ్ల ఆలయాల వద్దే వీరి పండుగలకు సంబంధించిన వేడుకలు జరుగుతుంటాయి. వేటతెగలో ప్రధాన లక్షణంగా ఉన్నా ప్రస్తుతం జీవనోపాధి కోసం ఎక్కువ మంది వ్యవసాయం, పశుపోషణలో కొనసాగుతున్నారు. ఇక తెగలో మహిళలు ఎక్కువ ధైర్య సాహసాల్ని కలిగుంటారు.
తిరుగుబాటు తెగ
బాంగ్లాకు చెందిన పురాతన తెగ సంతల్. బెంగాల్‌లోని బంకుర, పురులియా జిల్లాల్లో తెగకు చెందిన వారు కనిపిస్తారు. బాంగ్లాతోపాటు జార్ఘండ్‌్,ఒడిశా,అస్సోంరాష్ట్రాల్లో నివసిస్తున్న ఈ తెగ మొత్తం జనాభా 49 వేలు. వీరిప్రధాన భాష సంతలితోపాటు బెంగాలీ, ఒరియా, హిందీ భాషలను కూడా మాట్లాడుతుంటారు. వేటతోపాటు అరణ్య ప్రాంతాల్లో లభించే పళ్ళు, కాయల్ని ఈ తెగ ప్రధాన ఆహారం గా ఉంటుంది. వీరు నిర్వహించే ప్రతి చిన్న వేడుకలో నృత్యం తప్పని సరిగా ఉంటుంది. ఈ తెగలో పురుషులు ఫ్లూట్‌తోపాటు తుండక్, తమక్,జున్కొ,సింగా ఇలా రకరకాల వాద్యపరికరాలను తయారు చేస్తుంటారు. వీరునిర్వహించే పండుగల్లో కరమ్ ఒక ప్రధాన పండుగ. సెప్టెంబర్ అక్టోబర్ నెలల మధ్య జరపుకునే ఈ పండుగలో మహిళలు తలపై ఒక కూజాను ఉంచుకొని చేసే నృత్యం కన్నుల పండుగగా ఉంటుంది. బ్రిటీష్ తిరుగుబాటు ఉద్యమాల్లోనూ ప్రధాన పాత్ర పోషిం చిందీ తెగ.
మాతృస్వామిక తెగ
మిజోరాంకు చెందిన గారొ తెగ మాతృస్వామ్య వ్యవస్థ కలిగుంటుంది. ఇక్కడ అన్ని పనులకూ నాయకత్వం వహించేది మహిళలే. కుటుంబ పోషణతోపాటు, ఆర్థిక విషయాలనీ గారొ తెగలో మహిళలే చూసు కుంటారు. అలా మనదేశంలోమాతృస్వామిక వ్యవస్థ కొనసాగుతున్న తెగల్లో గారొ ప్రముఖ స్థానాన్ని దక్కించు కుంది. మిజోరాంతోపాటు మేఘాలయ, అస్సోం, త్రిపుర, నాగాల్యాండ్ రాష్ట్రాల్లో ఈ తెగ మనుగడ సాగిస్తోంది. గారొ తెగ వారిని చిక్ మంన్డే అని పిలుస్తారు. చిక్ మంన్డే అంటే కొండ ప్రజలు అని అర్థం. మేఘాలయాలోని ఘరో కొండ ప్రాంతంలో ఎక్కువగా నివసించే ఈ తెగ ద్వారా వారికి ఆ పేరొచ్చింది. బర్మా, టిబెట్ దేశాల్లో కూడా ఈ తెగ విస్తరించింది. ఈతెగలో మహిళలు వివిధ లోహాలతో తయారుచేసే ఆభరణాలను ఎక్కువగా ధరిస్తుంటారు. వంగ్ల వీళ్ళ ప్రధాన పండుగ. పండుగ సమయంలో అంద మైన వస్త్రధారణతోపాటు వీరి నృత్యాలు కన్నులపండువగా ఉంటాయి. పంచెకట్టుతోపాటు తలపాగ ఈ తెగ పురుషుల ప్రధాన వస్త్రధారణ. ఈ తెగలో ఆడ మగ ఇరువురూ కొప్పుభాగంలో ఈకల్ని తప్పనిసరిగా ధరిస్తారు. గారో తెగ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం ఒకటుంది. అదేంటంటే వీళ్ళు ఇళ్ళు కట్టడంలో ఆరి తేరినవారు. వెదురు వాసాలు, రెల్లు గడ్డిని ఉపయోగించి వీరు నిర్మించుకునే ఇళ్ళలో బహుళ అంతస్తులతోపాటు, గదులు గదులుగా ఈ ఇళ్ళని నిర్మించే తీరు ఆకట్టుకుంటుంది. ఈ ఇళ్ళను ఎంతో అందంగా అలంకరించుకుంటారు.
జిప్సీస్ ఆఫ్ ది ఈస్ట్…
తెలుగు రాష్రాల్లో ప్రధాన తెగలుగా చెంచులు, గడబలు, గోండ్లు, అన్ధ్, బొండ పురజలు, కోయ, లంబాడీలు, సవరలు ఇలా కొన్ని తెగల పేర్లు వినిపిస్తాయి. చెంచులు శ్రీశైలం పర్వత ప్రాంతాలకు చెందినవారైతే, గడబ, కోయ తెగలు భద్రాచలం స్థానికత కలిగిన వారిగా చరిత్రకారులు చెబుతుంటారు. ప్రస్తుతం ఈ తెగల్లో అత్యధిక జనాభా ఉంది సవరలు, లంబాడీ తెగల్లోనే. విజయనగం, విశాఖ పట్నం, శ్రీకాకుళం జిల్లాల్లో స్థానిక తెగలుగా ఉన్న సవరల సంఖ్య తెలుగు రాష్ట్రాల్లోని అన్ని తెగల జనాభా కంటే ఐదు శాతం ఎక్కువ. సవరలు ఎక్కువగా ఒకబృందంగా ఉంటారు. ఒక వరుసలో వీరి ఇళ్లను ఏర్పరుచుకుంటారు. ఈతెగలో ఉమ్మడి కుటుంబాలే ఎక్కువ. ఈ తెగకు చెందిన వారు ఎక్కువగా వ్యవసాయం, కమ్మరి, మేదరి, కుమ్మరి వృత్తుల్లో కొనసాగుతున్నారు. ఇలా వీరు నిర్వహించే వృత్తుల్ని బట్టి జాతి సవర, అర్సి, ములి, కిందల్, కంబి సవరల్లో ఉపతెగలుగా ఉన్నాయి. ఈతెగలో మహిళలు ఎక్కువగా ముక్కు బులాకీ లతో కనిపిస్తారు. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికంగా కనిపించే తెగ లంబాడీలు. వీరినే గోర్ బొయలి, బంజారా ఇలా చాలా పేర్లతో పిలుస్తుంటారు. భారత్‌లో వివిధ రాష్ట్రాలో లంబాడీ తెగను బంజారాలుగా పిలుస్తారు. వ్యవసాయం, పశుపోషణలో ఎక్కువగా ఈతెగ ప్రజలు కొనసాగుతున్నారు. లంబాడీ తెగలు నివసించే ప్రాంతాల్ని తాండ అని పిలుస్తారు. అన్ని తెగల కంటే వీరి వస్త్రధారణ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. మహిళలు గాగ్రాచోళీలో బాటు తలపై ఒక వస్త్రాన్ని ధరిస్తారు. కంచు, ఇతర లోహాలతో చేసిన వివిధ రకాల ఆభరణాల్ని మహిళలు ధరిస్తారు. ఇక తెగలో మహిళలు భుజాల వరకు సత్తు, కంచుతో చేసిన గాజుల్ని ధరించడం ఒక ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. ఆధునిక సమాజానికి దగ్గరగా ఉండే ఈ తెగను ‘జిప్సీస్ ఆఫ్ ది ఈస్ట్’గా ఒకప్పుడు బ్రిటిషర్లు పిలిచేవారు. ఎక్కువగా అలంకరణ వస్తువుల్ని ధరించి నిండుగా కనిపించే ఈ తెగమహిళల ద్వారా లంబాడీ తెగకు ఆ పేరొచ్చింది.
వీరు మాత్రమే కాదు, ఆఫ్రికా మూలాల్ని ఇప్పటికి పదిలపరుచుకున్న సిద్దీస్, భారత్‌లోనే ఉంటూ ఒంటరిగా కనిపించే అండమాన్ జార్వాలు, సెంటినల్స్, ఇంకా ఆదీవాసీ వైవిధ్య ఛాయల్ని మిగుల్చుకున్న ఈశాన్య రాష్ట్రాల కాసీ, ఆగామీలతో పాటు మూన్ద్, భూటియా, కొడవ, టోటో, ఇరులాస్, నైషి, వార్లి, తోడ, కురుంబన్, సొలుగ, లాంటి భారతీయ స్థానికతను కలిగున్న తెగలన్నీ సంస్క ృతి, సాంప్రదాయలు, ఆచారాల్లో తమ ఔన్నత్యాన్ని చాటుతున్నాయి.-అద్దేపల్లి శర్వాణి