మతోన్మాదుల విష కౌగిలిలో రాజ్యాంగం

ఆర్టికల్‌ 29 ప్రకారం మైనారిటీ మతానికి చెందిన పౌరులు తమ మతానికి చెందిన ఆరాధన పద్ధతులు, సంస్కృతులు, సాంప్రదాయాలు స్వేచ్ఛగా ఆచరించే హక్కు రాజ్యాంగం ఇచ్చింది. ఈ హక్కు అమలు అనేది నేడు పెద్ద సవాలుగా మారింది. మన రాజ్యాంగంలో పౌరులకు మత స్వేచ్ఛ ఉంది. కానీ రాజ్యానికి (ప్రభుత్వానికి) మతం లేదు. ఉండదు కూడా. ఎందుకంటే అది లౌకిక రాజ్యం. మతం పేరుతో రాజకీయాలు చేయడం రాజ్యాంగ విరుద్ధం. అయితే ప్రస్తుతం మతమే రాజకీయం అయింది. ప్రతి విషయాన్ని మత కోణంలో చూడడం పెరిగిపోయింది.` మహమ్మద్‌ అబ్బాస్‌ దేశంలో లౌకిక,ప్రజాస్వామిక విలువలకు మతో న్మాద ప్రమాదం తీవ్రంగా పరిణ మించింది. రాజ్యాంగం ప్రజలకు కల్పించిన హక్కులపై దాడి తీవ్రమైంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 14దేశ పౌరులం దరు సమానులే అని ఉద్ఘాటిస్తుంటే, ఆర్టికల్‌ 15 మతం,కులం, జాతి,లింగం,పుట్టిన ప్రాంతం ఆధారంగా ఏ పౌరుని పట్ల వివక్ష చూప రాదని,అలా ఎవరైనా ప్రవర్తిస్తే చట్టరీత్యా నేరం అని స్పష్టం చేసింది. కానీ బిజెపి పాలిత ఉత్తరప్రదేశ్‌ లోని కాన్పూర్‌లో రిక్షా తొక్కి కుటుంబాన్ని పోషించు కుంటున్న తస్లీమ్‌ బేగ్‌ను బజరంగ్‌ దళ్‌ మూక లు చుట్టు ముట్టి ‘జై శ్రీరామ్‌’ అనాలని, తన మైనర్‌ కూతురు సమక్షంలోనే తీవ్రంగా కొట్టారు. పోలీసు స్టేషన్‌లో కేసు పెడితే నిందితులను మూడు రోజులలో వదిలేశారు. వారు బయటికి వచ్చి హిందూ ఏరియాలోకి వస్తే చంపేస్తామని బహిరంగంగా హెచ్చరిం చారు. మధ్యప్రదేశ్‌ దివాస్‌ జిల్లాలో సైకిల్‌పై తిరిగి బిస్కెట్లు అమ్ముకునే జాయెద్‌ ఖాన్‌ అనే వ్యక్తిని ఆధార్‌ కార్డు చూపించమని కొట్టారు. గ్రామాలలో తిరిగి బిస్కెట్లు అమ్మితే చంపే స్తామని బెదిరించారు. అలాగే చిత్తు కాగితాలు, పాత ఇనుప సామానులను కొనుగోలు చేసే మరో వీధి వ్యాపారిని ఇదే రకంగా కట్టేసి కొట్టారు. ఇప్పు డు వీరు బయటికి రావాలంటే భయంతో వణికి పోతున్నారు. దాడి చేసినవారి పై పోలీస్‌ కేసులు లేవు, కేవలం మందలించి వదిలేస్తున్నారు. మధ్యప్రదేశ్‌ బోర్లి ప్రాంతంలో గర్బాహ అనే గ్రామంలోకి హిందూయేతరులు రావడాన్ని నిషేధిస్తూ వి.హెచ్‌.పిబోర్డులు ఏర్పాటు చేసింది. ద్వారకా ప్రాంతంలో హజ్‌ భవన్‌ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ విశ్వ హిందూ పరిషత్‌ ధర్నా నిర్వహించి నిర్మాణాన్ని అడ్డుకున్నారు. ఈ ఘటనలన్ని స్పష్టం చేస్తున్నదేమిటంటే చట్టం అందరికీ సమానం కాదని,మతం పేరుతో విచక్షణ చూపించినా, దాడులు చేసినా చట్టం ఏమీ అనదు అనే సందేశాన్ని ఇస్తున్నాయి.ఆర్టికల్‌ 21 ప్రతి మనిషికి స్వేచ్ఛగా జీవించే హక్కును కల్పిం చింది. హర్యానా నోజిల్లా కేర్‌ ఖలీల్‌ గ్రామంలో ఆసిఫ్‌ ఖాన్‌ అనే 27సంవత్సరాల యువకుడిని అకారణంగా మతోన్మాదుల గుంపు దారుణంగా హత్య చేయడంతోపాటు, గ్రామంలో ముల్లాల నందరిని వదిలిపెట్టం అని హెచ్చరించింది. గతంలో కూడా గో రక్షణ దళాల పేరుతో పెహ్లూ ఖాన్‌,అఖ్లాక్‌ లాంటి అనేక మందిని అందరూ చూస్తుండగానే దారుణంగా హత్య చేసారు. ఉపాధి అవకాశాలను కూడా దెబ్బ తీశారు. ఇవన్నీ రాజ్యాంగం ప్రసాదించిన జీవించే హక్కును హరించేవే. ఆర్టికల్‌ 23 సెక్షన్‌ (2)ప్రకారం రాజ్యం (ప్రభుత్వం) మతం,కులం,జాతి,లింగం,పుట్టిన ప్రాంతం ఆధారంగా ఏమనిషి పట్ల వివక్ష చూపరాదు. కానీ అఖ్లాక్‌ హత్య కేసులో నిందితులకు ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించింది. విద్వేష ప్రకటనలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్న విశ్వహిందూ పరిషత్‌, బజరంగ్‌ దళ్‌,బిజెపి,ఆర్‌ఎస్‌ఎస్‌ కు చెందిన నాయకులపై ఎలాంటి కేసులు పెట్టడం లేదు. త్రిపురలో మైనారిటీలపై వి.హెచ్‌.పి దాడులకు పాల్పడి ఆస్తులను,ఇళ్ళను,ప్రార్థనాస్థలాలను ధ్వంసం చేసి నిప్పంటించినా వారిపై కేసులు పెట్టలేదు. కానీ మైనారిటీలపై జరిగిన మత హింసను విచారించడానికి వెళ్లిన నిజనిర్థారణ బృందంపై దేశ ద్రోహం కింద కేసులు పెట్టారు. హింసాత్మక చర్యలకు పాల్పడిన వారిని వది లేసి,బాధితులను పరామర్శించిన వారిపై కేసులు పెట్టడం అంటే మతోన్మాద దాడులను ప్రోత్సహించడమే కదా ! ఆర్టికల్‌ 25 సెక్షన్‌ (1) ప్రకారం దేశ పౌరులందరికీ మత స్వేచ్ఛ ఇవ్వబడిరది. పౌరులు తమకు నచ్చిన మతాన్ని, ఆరాధన పద్ధతులను స్వేచ్ఛగా ఆచరించవచ్చు. ప్రచారం చేసుకోవచ్చు. ఏమతంపై విశ్వాసం ప్రకటించకుండా స్వతంత్రంగా ఉండే హక్కు కూడా పౌరులకు ఇవ్వబడిరది. ఎవరిపైనా బలవంతంగా విశ్వాసాలను,నమ్మకాలను రుద్దరాదని రాసుకున్నాం. అయితే మానవ హక్కుల సంఘాల నివేదిక ప్రకారం 2021లో సెప్టెంబర్‌ నెలాఖరు నాటికి అంటే 9 నెలల కాలంలోనే క్రైస్తవ ప్రార్థనా సమావేశాలపై 300 దాడులు జరిగాయి. ప్రార్థనల్లో పాల్గొన్న వారిని తీవ్రంగా కొట్టారు. దాడులకు గురైన వారంతా దళితులు, గిరిజనులు. బలవంతపు మత మార్పిడులు అనే పేరుతో దళితులకు,గిరిజను లకు రాజ్యాంగం ప్రసాదించిన మత స్వేచ్ఛ హక్కును హరిస్తున్నారు. కులం పేరుతో, అంటరానితనం పేరుతో అణిచివేసినప్పటికీ వాళ్ళ కాళ్ళ కింద పడి ఉండాలనేది వారి ఉద్దేశ్యం. అందుకే దాడులతో భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. శుక్రవారం రోజున ముస్లింలు ప్రార్థనలు చేయకుండా రెసిడెన్షియల్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ పేరుతో…హర్యానా రాష్ట్రం గుర్గావ్‌ లోని ఎనిమిది ప్రాంతాలలో అడ్డుకు న్నారు. ఈ రకంగా దేశంలో మైనార్టీలకు ఉన్న మత స్వేచ్ఛను, ఆరాధన స్వేచ్ఛను కాలరాశారు. చట్టాలను ఉల్లంఘిస్తూ, అధికారాన్ని దుర్విని యోగం చేస్తూ, దాడులకు దిగుతున్నారు. ఈ దాడులపై ప్రభుత్వ యంత్రాంగం కఠినంగా వ్యవహరించిన పరిస్థితి లేదు. ఆర్టికల్‌ 29 ప్రకారం మైనారిటీ మతానికి చెందిన పౌరులు తమ మతానికి చెందిన ఆరాధన పద్ధతులు, సంస్కృతులు, సాంప్రదాయాలు స్వేచ్ఛగా ఆచరించే హక్కు రాజ్యాంగం ఇచ్చింది. ఈ హక్కు అమలు అనేది నేడు పెద్ద సవాలుగా మారింది. మన రాజ్యాంగంలో పౌరులకు మత స్వేచ్ఛ ఉంది. కానీ రాజ్యానికి (ప్రభుత్వానికి) మతం లేదు ఉండదు కూడా. ఎందుకంటే అది లౌకిక రాజ్యం. మతం పేరుతో రాజకీయాలు చేయడం రాజ్యాంగ విరుద్ధం. అయితే ప్రస్తుతం మతమే రాజకీయం అయింది. ప్రతి విషయాన్ని మత కోణంలో చూడడం పెరిగిపోయింది. టి 20వరల్డ్‌ కప్‌లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ ఓడితే దానికి ముస్లిం కాబట్టి బౌలర్‌ షమీని బాధ్యుడిని చేసి మతం పేరుతో దుర్మార్గంగా ట్రోల్‌ చేశారు. బౌలర్‌ షమీపై మతం పేరుతో దాడి చేయడాన్ని కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ వ్యతిరేకించినందుకు ఆయన ఏడాది వయసున్న కూతురిపై అత్యాచారం చేస్తామని బెదిరింపులకు దిగారు. అలా బెదిరింపులకు దిగింది తెలంగాణకు చెందిన ఉన్నత విద్యావం తుడు కావడం మనం రాష్ట్రానికే అవమానం. అంతేకాదు. తెలంగాణలో విస్తరిస్తున్న మతో న్మాద విష సంస్కృతికి ఇది నిదర్శనం. అసోం రాష్ట్రంలో కొన్ని దశాబ్దాలుగా భూములు సాగు చేసుకుని జీవిస్తున్న రెండు గ్రామాల ప్రజలు కేవలం ముస్లింలు అయినందువలన వారిపైన పారామిలటరీ దళాలను ప్రయోగించి, కాల్పులు జరిపి భూముల నుండి బలవంతంగా తొలగిం చారు. ఆ కాల్పుల్లో ఇద్దరు పౌరులు చనిపో యారు. చనిపోయిన వ్యక్తి శవంపై మీడియా ఫొటోగ్రాఫర్‌ ఎగిరి గంతులు వేయడం కొంత మందిలో పెరుగుతున్న విద్వేష మానసిక స్థాయికి పరాకాష్ట. ఈ దారుణాన్ని చూసి ప్రపంచమే నివ్వెరపోయింది. అంతర్జాతీయ మీడియా ‘డాన్సింగ్‌ ఆన్‌ డెడ్‌ బాడీ’ పేరుతో సంపాదకీయం రాసి దేశంలో పెరుగుతున్న మత ఉన్మాదపు సంస్కృతిని నిరసించింది. గుజరాత్‌లో రోడ్డు పక్కన మాంసాహార పదా ర్థాల అమ్మకాలను నిషేధించారు. వీధి వ్యాపా రం చేస్తూ జీవించేవారిలో మైనారిటీలు, దళితు లు ఎక్కువ మంది ఉన్నారు. ఈ నిషేధం మతోన్మాద కుట్ర తప్ప మరొకటి కాదు. కేరళలో హలాల్‌ పేరుతో రెస్టారెంట్లో వ్యాపారాన్ని దెబ్బతీయడం కోసం బిజెపి పెద్ద ఎత్తున కుట్రకు తెరలేపింది. చివరికి అయ్యప్ప స్వామి ప్రసాదం తయారు చేయడానికి వాడే బెల్లంపై కూడా హలాల్‌ పేరుతో వివాదం సృష్టించి అభాసుపాలైంది.ఇలా రోజూ ఏదో పేరుతో మత విద్వేషాలు, వివాదాలు సృష్టిం చడం, ప్రచారం చేయడం తప్ప మనుషుల గురించి,వారి విద్య, ఉద్యోగా లు,ఆరోగ్యం, వైద్యం,ఉపాధి, జీవన సౌకర్యాల మెరుగుదల గురించి ఏరోజు కూడా పట్టించు కునే పరిస్థితి లేదు. ఒకవైపు అంబానీ,అదానీ లాంటి కార్పొరేట్‌ శక్తులు పాలకుల అండతో లక్షల కోట్ల రూపాయల ప్రజాధనం కొల్లగొట్టి ప్రపంచ కుబేరుల జాబితాలో చేరిపోతుంటే, మరోవైపు దేశంలో నిష్ట దరిద్రుల సంఖ్య 6 కోట్ల నుండి 13.5 కోట్లకు పెరిగింది.ప్రజా సమస్యలు చర్చ లోకి రాకుండా పక్కా ప్రణాళిక ప్రకారం విద్వేష రాజకీయాలు, విద్వేష ప్రకటనలు చేస్తూ సంఘ పరివార్‌ ప్రజలను పక్కదారి పట్టిస్తున్నది. ఈ పరిస్థితిలో మార్పు రావాలంటే ప్రజల వాస్తవ సమస్యలు చర్చ లోకి రావాలి. అలా జరగాలంటే దేశంలో శాంతియుత, సామరస్యపూర్వక వాతావరణం ఏర్పడాలి. లౌకిక, ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ జరగాలి. రాజకీయాల నుండి మతాన్ని విడదీయాలి. బెంగాల్‌,త్రిపుర రాష్ట్రా లలో అధికారంలో ఉన్నప్పుడు మార్క్సిస్టు పార్టీ ఆ పనిని విజయవంతంగా చేసింది. అందుకే బెంగాల్‌లో వామపక్ష ప్రభుత్వం అధికారంలో ఉన్న 35 సంవత్సరాల కాలంలో మత కలహా లు జరగలేదు. బాబ్రీ విధ్వంసం తర్వాత దేశమంతా మత కలహాలతో అట్టుడికి పోయిన ప్పటికీ బెంగాల్‌లో ఆనాటి లెఫ్ట్‌ఫ్రంట్‌ ప్రభుత్వం ఎలాంటి మత కలహాలు జరగకుండా సమర్థ వంతంగా కట్టడి చేయగలిగింది. దేశంలోనే అత్యధిక మంది స్వయం సేవకులు ఉన్న కేరళలో సైతం సిపిఐ(ఎం) నేతృత్వం లోని ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వం మతోన్మాదాన్ని సమర్థవంతంగా ఎదుర్కొంటున్నది. త్రిపురలో కూడా సిపిఐ(ఎం) అధికారంలో ఉన్నంత కాలం ఏ ఒక్క మత ఘర్షణ గాని, మత విద్వేష దాడులు గాని జరిగిన దాఖలాలు లేవు. మార్క్సిస్టులు బలహీనపడిన తరువాతే బెంగాల్‌, త్రిపుర రాష్ట్రాలలో మతోన్మాదం బుసలు కొడుతోంది. ఇది వర్తమాన చరిత్ర మనకు నేర్పిన గుణపాఠం. దేశంలో మతోన్మాదాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే లౌకిక, ప్రజాస్వామిక విలువలను నిక్కచ్చిగా అమలు చేయగలిగే సైద్ధాంతిక పునాది కలిగిన వామపక్ష శక్తులు బలపడాల్సిన అవసరం ఉంది.
వ్యాసకర్త : సీపీఐఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు (నవతెలంగాణ సౌజన్యంతో)