బీటలు వారుతున్న రాజ్యాంగ సౌధం

ఈ ఎనిమిదేళ్ల పాలనలో దళితులకు భూములు పంచలేదు. దళితులపై జరిగే అత్యాచారాల విషయంలో ఎటువంటి విచారణ లేదు. అస్పృశ్యతా నివారణ చట్టాన్నే కాక,1989 ఎస్సీ,ఎస్టీ అత్యా చారాల నిరోధక చట్టాన్ని నిర్వీర్యం చేసే సకల ప్రయత్నాలు చేస్తున్నారు. భారతదేశం ఈనాడు రాజ్యాంగ సంక్షోభంలో ఉంది. దేశంలోని ప్రధాన పాలక వర్గాలు నిరంతరం రాజ్యాంగ ఉల్లంఘనకై ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. రాజ్యాంగం ఒక సామాజిక సాంస్కృతిక విప్లవ మార్గం. రాజ్యాంగం భారతదేశ నిర్మాణ సౌధం. భారతదేశానికి ఒక నిర్మాణాత్మక పరిపాలనా క్రమాన్ని ఇవ్వడానికి అంబేద్కర్‌ 1949 నవంబర్‌ 20వ తేదీన దేశాన్ని సర్వ సత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య రిపబ్లిక్‌గా ప్రకటించారు. రాజ్యాంగంలో ప్రధాన సూత్రం ప్రజలకు సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం.

నిజానికి రాజ్యాంగ అంతర్గత శక్తి ఆలోచనా స్వేచ్ఛ,భావ ప్రకటనా స్వేచ్ఛ. భారత రాజ్యాం గాన్ని మనం లోతుగా చూస్తే అంబేద్కర్‌ అంతకు ముందటి వర్ణ సూత్రాల్ని కూల్చి నూతన ధర్మాల్ని ప్రతిపాదించిన జ్ఞాన దృష్టి కనిపిస్తుంది. ప్రధానంగా ఆదర్శ సూత్రాలను మనం ఒకసారి పరిశీలిస్తే మంచి మాట, మంచి సంబోధన మానవతా సౌరుతో హృదయ దీపాలు వెలిగిస్తుంది. అంబేద్కర్‌ నిజానికి కులేతరమైన సంబోధనకు పాదులు వేశాడు. అంబేద్కర్‌ సమ్యక్‌ వాక్కుని భారతదేశంలో బహుముఖంగా ప్రవేశపెట్టారు. కులేతరమైన రాత, మతాతీతమైన లౌకిక దృష్టి మతోన్మాదేతరమైన జ్ఞాన బోధకు అవకాశం కల్పించారు. రాజ్యాంగ రూపకల్పనలో అంబేద్కర్‌ది శాస్త్రీయ దృష్టి. ఆయనది హేతువాద దృక్పథం. ఆయన లౌకికవాద తాత్వికుడు. నిరావేశ జ్ఞానోత్పత్తికి ఆయన రాజ్యాంగంలో మార్గం చూపించారు. భారతదేశం ఆవేశపూరితంగా మత ఘర్షణలలో ఎంతో రక్తాన్ని నేలలో ఇంకింపజేసింది. ఈరోజు136 కోట్ల మంది జీవించి ఉన్నారంటే అది భారతరాజ్యాంగ స్ఫూర్తితోనే జరిగింది. భారతదేశంలో ఈనాడు హిందూ పునరుద్ధరణ వాదం నడుస్తుంది. ఆర్‌.ఎస్‌.ఎస్‌, విశ్వహిందూ పరిషత్‌, బి.జె.పి. సన్యాసులు, యోగులు, రాజకీయ నాయకులు హిందూవాదాన్ని బహు ముఖంగా తీసుకెళుతున్నారు. శాస్త్రీయ జ్ఞాన ప్రవాహాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. జ్ఞానం విశ్వజనీనమైనది. ఒకరిలో పుట్టి ప్రపంచ వ్యాప్తంగా ప్రవహించే గుణం దానికి ఉంటుంది. జ్ఞానం మానవునిలో విస్తరించినప్పుడే మానవ స్వభావం అనే భావనలో మానవులందరు కొన్ని ఉమ్మడి లక్షణాలు కలిగివుంటారు. నమ్మకం ఇమిడి ఉంటుంది. మానవులందరూ నవ్వుతారు. ఏడుస్తారు. అనేక భావోద్రేకాలు ఉంటాయి. మానవులందరూ సమానమనే భావన రావాలంటే దానికి తప్పక రాజ్యాంగ జ్ఞానం అవసరం. మానవుడు మతానికో, కులానికో కట్టుబడి ఉన్నప్పుడు విస్తృతమైన జ్ఞానాన్ని సంపాదించుకోలేరు. ఈనాడు మన సామాజిక వ్యవస్థ కుల, మత, అస్పృశ్యతతో ఉండటానికి కారణం మత వ్యవస్థే. సాంప్రదాయకంగా హిందూ ధర్మ శాస్త్ర విధాయకులు మానవ జీవితానికి ధర్మార్థ కామ మోక్షాలు నిర్ణయిం చారు. బౌద్ధం అయితే జ్ఞానము, తర్కము, నైతికత, మానవత, ఆత్మీయత, అధ్యయనము, ఆదర్శాలను రూపొందించింది. వీటి ద్వారా భావ ప్రకటనా స్వేచ్ఛను అంబేద్కర్‌ రాజ్యాంగంలో 19వ అధికరణను రూపొం దించారు. ఇది దేశీయతకు మూలమైనది. ముఖ్యంగా భావ ప్రకటనా స్వేచ్ఛలో ఆయుధాలు లేకుండా శాంతియుతంగా సమావేశం జరుపుకునే స్వేచ్ఛను ఇచ్చారు. అయితే మతోన్మాద భావజాలం ఉన్నవారు ఆయుధాలతో ఇప్పుడు ప్రదర్శనలు చేస్తున్నారు. అది రాజ్యాంగ వ్యతిరేకమైన అంశం. రాజ్యాంగంలో గొప్ప విషయం స్వేచ్ఛను ప్రాథమిక హక్కుగా గుర్తించడం. 19వ అధి కరణలోనే ఏకులంవారైనా,ఏవర్ణం వారైనా ఏ వృత్తినైనా, ఏ వ్యాపారాన్నైనా చేసుకోవచ్చునని ‘జి’ క్లాజులో చెప్పారు. అయితే భారతదేశంలో ఇప్పటికీ వ్యాపారం మొత్తం పది కులాల చేతుల్లోనే ఉండిపోయింది. వ్యాపారాన్ని కుల నిబద్ధం చేయడం రాజ్యాంగ వ్యతిరేకం. అయితే బ్యాంకులు కింది కులాల వారికి డబ్బు ఇచ్చి వ్యాపారాన్ని వృద్ధి చేయాలి. అయితే వాళ్ళు బ్యాంకులకు డబ్బులు ఎగ్గొట్టే వారిని చూసి మరీ డబ్బులిస్తున్నారు. చైనాలో వస్తు ఉత్పత్తికి, వస్తువు అమ్మడానికి వర్ణ, కుల బేధాలు లేకపోవడం వల్ల నూటికి తొంబై మంది వస్తు ఉత్పత్తిలో గానీ, ప్రపంచ వస్తు వ్యాపారంలో గానీ ఉన్నారు. నిజానికి భారత రాజ్యాంగ అధికరణ 15 ఏం చెబుతుందంటే కుల,మత,లింగ,పుట్టిన ప్రదేశం కారణంగా వివక్షతకు తావులేదు.ఇది అంబేద్కర్‌ మహోన్నతమైన సిద్ధాంత ఆచరణ నుంచి రూపొందించిన సూత్రం. అయితే, సమాజంలోనే కాక కుల,మత వివక్ష అన్ని విశ్వవిద్యాలయాల్లో జరుగుతున్నది. విశ్వ విద్యాలయాల్లో దళిత విద్య మీద రోహిత్‌ వేముల ఆత్మహత్య తరువాత పెద్ద యెత్తున దాడులు, అణచివేతలు జరుగుతున్నాయి. మొత్తం శాస్త్ర,సాంకేతిక,ఆర్థిక,చరిత్ర,రాజకీయ శాస్త్రాలన్నింటిలో దళితులకు సీట్లు తగ్గించారు. నరేంద్ర మోడీ పుట్టిన బీసీలకు,శూద్రులకు కూడా పరిశోధనా రంగంలో కేంద్రీయ విశ్వ విద్యాలయాల్లో సీట్లు తగ్గాయి. ఉన్నత విద్యలో దళితులను పూర్తిగా దెబ్బ తీయడానికి ‘’హిందుత్వను అంగికరిస్తేనే మీరు విశ్వవిద్యాలయాల్లో ఉండండి, లేకుంటే లేదనే’’ వరకు ఆరెస్సెస్‌ శ్రేణులు ముందుకు వెళుతున్నాయి. ఈఎనిమిదేళ్ల పాలనలో దళితులకు భూములు పంచలేదు. దళితులపై జరిగే అత్యాచారాల విషయంలో ఎటువంటి విచారణ లేదు. అస్పృశ్యతా నివారణ చట్టాన్నే కాక,1989 ఎస్సీ,ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టాన్ని నిర్వీర్యం చేసే సకల ప్రయత్నాలు చేస్తున్నారు. భారతదేశం లోని విశ్వవిద్యాలయాలన్నింటిలో దళిత వివక్ష కొనసాగుతున్నది. అంబేద్కర్‌ దళిత విద్యకే ప్రధానమైన ప్రాధాన్యతను రాజ్యాంగంలో ఇచ్చారు. ఫస్ట్‌ కేబినెట్‌ లోనే దళితులకు భూమి కొనుగోలు కోసం 20కోట్లు కేటాయింపజేశారు. దేశంలో, వివిధ రాష్ట్రాలలో బహుళ జాతి సంస్థలకు భూమిని ధారాదత్తం చేస్తున్నారు గానీ దళితులకు, గిరిజనులకు భూమిని పంచడం లేదు. ఇది సామాజిక, ఆర్థిక, రాజకీయ రాజ్యాంగ నిర్లక్ష్యం,దళితుల పట్ల వివక్ష వల్ల భారతదేశంలో ఉత్పత్తి పెరగడం లేదు. శ్రమ జీవిని నిర్లక్ష్యం చేసిన దేశంలో తప్పక ద్రవ్యోల్బణం పెరుగుతుంది. దళితులు, బహుజనులు, శ్రమజీవులు వారి పిల్లలను విద్యావంతులను చేసుకునే భవిష్యత్‌ దర్శనంలో వాళ్ళున్నారు. అటు భూమిని ఇవ్వకుండా, ఇటు విద్యను ప్రోత్సహించకుండా,ఉద్యోగాలను పూర్తిగా రద్దు చేసి దళితుల పట్ల పూర్తిగా రాజ్యాంగ కుల వివక్ష చూపుతున్న రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు భావ దారిద్య్రంలో ఉన్నాయి.
రాజ్యాంగాన్ని పరిరక్షించాలి
భారతదేశ 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము విజయం సాధించడం అభినందనీయం. జయాపజయాలు పక్కనపెట్టి ప్రజాస్వామ్య విలువలను, పౌర హక్కులను పరిరక్షించి సమాజ పురోభివృద్ధికి కృషి చేసేవారే సరైన పాలకులౌవు తారు.రాజ్యాంగ పరిరక్షణ బాధ్యతలు కలిగియున్న రాష్ట్రపతి పీఠానికి ప్రత్యేక విశిష్టతలూ,విశేషాధి కారాలూ ఉన్నా యి. భారత నూతన రాష్ట్రపతిగా ఆమె పదవీ స్వీకార ప్రమాణం చేశారు. స్వాతంత్య్రం అనంతరం జన్మించి రాష్ట్రపతి పీఠాన్ని అధిష్టిం చిన తొలి వ్యక్తిగా,తొలి ఆదివాసీ మహిళగా, రెండో మహిళగా పలు రికార్డులు ఆమె సొంతం కానున్నాయి. దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా..అణగారిన ఆదివాసీ తెగల నుంచి అత్యున్నత రాష్ట్రపతి పీఠం అధిష్టించే స్థాయికి ఎదిగిన ముర్ముపై ఆయా తెగల ప్రజల్లోనూ, సామాన్య ప్రజల్లోనూ అనేక ఆశలు, ఆకాంక్షలు ఉండటం సహజం. తిండి గింజలతో సహా నిత్యావసర సరుకులపై వస్తు సేవల పన్ను (జిఎస్‌టి) పెంచేయడంతో పోషకాహార లభ్యతకు మప్పు వాటిల్లుతోంది. ద్రవ్యోల్బణం కత్తి నూరు తుంటే..రూపాయి పాతాళానికి పరుగులు తీస్తోంది.సామాజిక, హక్కుల కార్యకర్తల అరెస్టులు నిత్యకృత్యమ య్యాయి. కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వి నియోగపరుస్తూ ప్రతిపక్ష నాయకుల పట్ల వేధింపులు కొనసాగుతూనే వున్నాయి. సమస్యల సుడిగుండంలోకి ప్రజలను నెట్టేసి సహజ వనరులను, ప్రజల సంపదను కార్పొరేట్‌ కంపెనీలకు దోచిపెట్టే చర్యలు యథేచ్ఛగా సాగిపోతున్నాయి.
దేశంలోని 10కోట్ల మంది ఆదివాసీలపై కత్తిని వేలాడదీసింది.ఖనిజ తవ్వకాలు, పునరు త్పాదక విద్యుత్‌, పర్యాటకం, వన్యమృగాల పరిరక్షణ జోన్ల పేరుతో ఇప్పటికే అడవి బిడ్డలను అడవికి దూరం చేస్తున్నారు.ఒడిశాలో బిజెడి-బిజెపి సంకీర్ణ ప్రభుత్వం హయాంలో అటవీభూములను వేదాంత, పోస్కో వంటి బడా కంపెనీలకు కట్టబెట్టి వేలాది మంది గిరిజనులను నిర్వాసితులుగా అడవి నుంచి వెళ్లగొట్టారు. ఎలాంటి భయం, పక్షపాతం లేకుండా రాజ్యాంగ సంరక్షకురాలిగా ముర్ము తన విధులు నిర్వహిస్తార’ని ఆశిద్దాం.- -వ్యాసకర్త :సామాజిక తత్వవేత్త (ప్రజాశక్తి సౌజన్యంతో..)