బాల సాహిత్యం..వికాసం..విజ్ఞానం

అనగనగా కథలు.. బాల్యంలో సృజనను పెంచే మాలికలు.. అమ్మమ్మ, బామ్మా.. తాతయ్యలు లేని చిన్న కుటుంబాల్లో చిన్నారుల చింత తీర్చేది బాలసాహిత్యమే. చిన్ననాడు చందమామ, బాలమిత్ర సాహిత్య పఠనంతో పెద్దయ్యాక సృజనాత్మక రచన చేస్తున్న వారెందరో.. పిల్లల పట్ల ప్రేమతో రాసినవే నాడూ నేడూ మేలైన కథలు.. భాషపై మమకారం పెంచేది బాల సాహిత్యమే.. కథనం ఎంత ముఖ్యమో.. బాలసాహిత్యంలో చిత్రానికీ సమప్రా ధాన్యం.. పిల్లల్ని ఆకట్టుకునేది కంటికింపైన బొమ్మలే! ఈ విషయంలో ప్రపంచ బాల సాహిత్యంపై సోవియట్‌ ప్రచురణలు చేసిన కృషి అద్వితీయం..
మనం ఎలాంటి విత్తనాలు నాటితే అలాంటి చెట్లే వస్తాయి.బాల్యం నుండే మంచి సాహిత్యం అందిస్తే అలాంటి మంచి వ్యక్తిత్వం గల బాలలు తయార వుతారు. చందమామ అలాంటి సాహితీ సేద్యం చేసింది. దానివల్ల మన భాష, సంస్కృతి, సంప్రదాయాలు, విలువలు బతికాయి. ఇప్పుడు చందమామ లేదు. బాలసాహితీ వేత్తలే ఆ బాధ్యత తీసుకోవాలి. బాల సాహిత్యంలో భాషా సం కరం లేని రచనలు వస్తాయి. తల్లిభాష తలెత్తుకుని తిరుగుతుంది.బాల సాహి త్యాన్ని ముందు పెద్దలు చదివి, పిల్లలతో చదివించాలి.బాలసాహితీ వేత్తలు రాసినంత మాత్రాన సరిపోదు.తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పనిగట్టు కుని బాలసాహిత్యాన్ని ప్రోత్సహించాలి.అలాచేస్తే పుస్తక పఠనం తగ్గదు. కొత్త విష యాలు,మంచి సంగతులు,జీవితానికి, భవిష్యత్తుకి పనికొచ్చే సూత్రాలు తెలుసు కుంటున్నామన్న అభిప్రాయం కలిగితేనే ఎవర్క్కెనా పుస్తకాలు చదువు తారు. బాల సాహితీవేత్తలు ఈ రహస్యం దృష్టిలో ఉంచుకుని,రచనలు చేయాలి.అప్పుడే ఆ రచనలు పంచతంత్రం, ఈసఫ్‌ కథల్లా దశాబ్దాల తరబడి నిలిచి పోతాయి. ఆధునిక విజ్ఞాన విషయాలనూ అతి సరళంగా, ఆసక్తికరంగా రాయాలి.అలా రాయాలంటే పిల్లల రచనలు చేసే వారికి నిబద్ధత ఉండాలి. పిల్లలపట్ల, వారి భవిష్యత్తు పట్ల ప్రేమ ఉండాలి.వారే చరిత్రలో నిలిచిపోతారు. వారి రచనలు చిరంజీవులవుతాయి.- చొక్కాపు వెంకట రమణ,కేంద్ర బాల సాహిత్య,అకాడమీ పురస్కార గ్రహీత,
నేటి బాల సాహిత్యం
తెలుగు బాలసాహిత్యం తొలి నుంచి నీతులు ప్రధానంగా నడిచింది.కుమార శతకం, కుమారీ శతకం…నీతి కథా మంజరి వంటివి ప్రధానంగా చాలాకాలం బాల పఠనీయ సాహిత్యంగా ఉన్నాయి. నేటికీ పిల్లల కోసం చేసే రచనలు పిల్లల నడవడికను ప్రభావితం చేసేవి. నీతి ప్రధానంగా ఉండాలనే రచయితలే ఎక్కువశాతం. వినోద ప్రధానంగా పరమానందయ్య శిష్యులు, తెనాలి రామకృష్ణ కథలు మాత్రమే మిగిలాయి. అనువాద రచనల్లోనూ పిల్లల అద్భుత సాహస గాథలు ఎక్కువభాగం లేకపోవడం శోచనీయం. నేటి పిల్లలకు భాష ఒక సమస్య. కాగా వారి పాఠ్యాంశాల బరువు మరో సమస్యగా తయా రైంది. బాల సాహిత్యం చదివే పిల్లల సంఖ్య చాలా తగ్గిపోయింది. బడిలోని కథల పుస్తకాలను పిల్లల చేత చదివించే టీచర్లు మృగ్యమయ్యారు. బడి పిల్లల చేత కథలు రాయించి, సంకలనాలు తేవడం మంచి చొరవ అయినా ఆ కథలలో కొత్తదనం, ఊహలు లేకపోవడం పెద్దల సృజన లేమిని ప్రతిఫలి స్తోంది. చరవాణిలో పాఠాలు నేర్చుకునే స్థితిలో పిల్లలకు అద్భుత ఊహాలోకం పరిచయం చేయాల్సిన పని రచయితలది. మాట్లాడే పక్షులు, జంతువులు, నది, ఆకాశం, కొండ అన్నీ బాలలకు నచ్చేవే. వాటిని ఎలా అల్లగల మనేది రచయితల మేధకు పరీక్ష. అంత సమాచారాన్ని అందంగా అద్భుతంగా సాహ సాలతో తీర్చిదిద్దడం నేటి రచయితల బాధ్యత. పర్యావరణం, ప్రకృతి సంరక్షణ వంటివే నేటి అవసరం. ఏడో గదిలోకి తీసుకెళ్దాం!
చాలామందిలాగే నా బాల్యం ‘చందమామ’ బాలల పత్రికతో ముడిపడి ఉండేది. అప్పట్లో జానపద సీరియల్స్‌కి ‘చిత్రా’గారు, పౌరాణిక సీరియల్స్‌కి ‘శంకర్‌’గారు, చందమామ ముఖ చిత్రాలు వడ్డాది పాపయ్యగారు వేసేవారు. కథలో పాత్రలకు దీటుగా చిత్రాగారు తన కుంచెను రaళిపించేవారు. పిల్లల కథల పుస్త కాలలో కథల్నీ బొమ్మల్నీ విడివిడిగా చూడ లేము. ఉదాహరణకు రష్యన్‌, చైనా పిల్లల కథల పుస్తకాలలో పేజీ నిండుగా పెద్ద బొమ్మ ఉండి,దాని కింద రెండు లైన్ల కథ ఉంటుంది. దీనిని బట్టి బాలసాహిత్యంలో చిత్రకారుల పాత్ర ఎంత ఉందో అర్థమవుతోంది. బొమ్మలు చూస్తూ కథ చదవడం పిల్లలకు ఒక అద్భుత మైన అనుభూతి.పిల్లల కోసం బాలసాహిత్యం విరివిగా రావాలి.బాల సాహిత్యంలో ఎవరి పాత్ర ఎంత అనే ప్రశ్నే లేదు. చిత్రకారుడు, రచయిత తలుచుకుంటే ఎన్ని అద్భుతాలైనా సృష్టించవచ్చు. ఇలా చెప్పుకుంటూపోతే ఎన్నో పిల్లల సాహసగాథలు ఇంగ్లీష్‌ సాహిత్యంలో ఉన్నాయి. తెలుగు పిల్లలు అడ్వెంచర్స్‌ కావాలంటే ఇంగ్లీష్‌ సాహిత్యం మీద ఆధారప డాలా? మన వాళ్ళకి మనం సాహస కథలు ఇవ్వలేమా?తిప్పి తిప్పి కొడితే మనకు ‘బుడుగు’ తప్ప వేరే క్యారెక్టర్‌ కనిపించదు.రకరకాల విచిత్ర జంతువులు,ఒంటి కన్ను రాక్షసులు, మాంత్రికులే కాదు రెక్కల గుర్రాలూ మనవే. ఏడు తలల నాగేంద్రుడు ఏగుహలో పడుకు న్నాడో అతనిని నిద్ర లేపండి. ఏనుగుని సైతం ఎత్తుకుపోయే గండ బేరుండాలు మనకు ఉండనే ఉన్నాయి. దీనివల్ల పిల్లలు పాడైపొ యేదేమీ ఉండదు. మహా అయితే వారిలో సృజనశక్తి పెరుగుతుంది. తమ ఊహల్లో కొత్త లోకాలను చూడగలుగుతారు. ఇప్పుడు రాయక పోతే ఇకముందు పిల్లల కోసం ఏమీ ఉండదు. చెప్పినంత కాలం నీతి కథలు చెప్పాము. మన జానపద హీరోలను ఏడోగది లోకి మాత్రం వెళ్ళకు అంటే..ఏడో గదికే వెళ్ళి సాహసాలు చేయడమేకాక, రాకుమారినీ దక్కించుకొనేవారు. ఇప్పుడా రాకుమారుడికి ఏడోగది కరువైంది. మీరు చేయవలసిందల్లా ఆ ఏడోగది చూపిం చటమే.- చైతన్య పైరపు, ప్రసిద్ధ చిత్రకారులు
సామాజిక మాధ్యమంలోనూ..
బాలసాహిత్య విస్తృతికి, వికాసానికి సామాజిక మాధ్యమాలు ఎంతో దోహదపడు తున్నాయి. అందులో వాట్సప్‌, ఫేస్‌బుక్‌, ఇ-బుక్స్‌, యూ ట్యూబ్‌ ప్రముఖపాత్ర పోషిస్తున్నాయి. సామాజిక మాధ్యమాల్లో బాలల వ్యక్తిత్వ వికాసాన్ని, విజ్ఞా నాన్ని అందించే అనేక కథలు, గేయాలు, పాట లను స్వయంగా రచయితలే ప్రచురించు కుంటు న్నారు. బాలసాహిత్యం కోసం గతం లోలా కష్ట పడాల్సిన అవసరం లేదు.కొన్ని బాల పత్రికలు ఆన్‌లైన్‌లో లింక్‌ ఓపెన్‌ చేసి, చదువు కునే అవకాశాన్ని కల్పించాయి. నేడు పిల్లలకు ఎలాగూ ఆన్‌లైన్‌ క్లాసులు జరుగుతున్నాయి. అందువల్ల సెల్‌ఫోన్‌, కంప్యూటర్ల మీద విద్యార్థులకు అవగాహన కలిగింది. ప్రతి బడిలోనూ కంప్యూటర్‌ ఉంది. యానిమేషన్‌ ద్వారా కథలు పిల్లలకు అందించాలి. కాకుంటే పిల్లలకు ఊహా ప్రపంచానికి దూరం చేస్తాం. వాట్సాప్‌ గ్రూపులు నడిపే రచయితలు బాలసాహిత్యం పిల్లలకు చేరువయ్యేలా చూడాలి.- సైమన్ గునపర్తి