పీసా చట్టం గ్రూపు చైర్‌పర్సన్‌గా రెబ్బాప్రగడ రవి

‘ ఆదివాసీలు భిన్నజాతుల సమాహారమైన భారత ఉపఖండంలో అనేక గిరిజన సముదాయాలు నివసిస్తున్నాయి. ఆదివాసీలు తమదైన ప్రత్యేక సంస్కృతి, సంప్రదాయం, సామాజిక విలువలను కలిగి ఉంటారు. దేశంలో ఆదివాసీలు నివసించే 9 రాష్ట్రాల్లో గిరిజనులకు కల్పించ బడిన రాజ్యాంగ హక్కులను అమలు పరచడానికి కృషి చేయడం తోపాటు, షడ్యూల్‌ తెగల సామాజిక సాధి కారత. సమా నత్వం, సంక్షేమం సాధిం చడమే సామాజిక బాధ్యత. ప్రజల జీవన ప్రమా ణాలు పెంచడంలోనూ, స్వయం సంవృద్ది సాధించడం లోనూ పీసా చట్టంలోని మరికొన్ని విశేష అధికారాలు ఉన్నాయి ’’ ` రెబ్బాప్రగడ రవి, సమత ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ మరియు పీసా వర్కింగ్‌ గ్రూప్‌ చైర్‌పర్సన్‌, చత్తీస్‌ఘర్‌,

అడవి బిడ్డలకు స్వయం పాలన మరింత సులువు కానుంది. ఇన్నాళ్లు షెడ్యూల్డ్‌ ఏరియాలో గిరిజనుల హక్కుల ఉల్లంఘన యథేచ్ఛగా కొనసాగింది. పెసా (పంచాయతీస్‌ ఎక్స్‌టెన్షన్‌ టూ షెడ్యూల్‌ ఏరియా)1996 చట్టం వచ్చి 25ఏళ్లు పూర్తియిన సమత ఎగ్జిక్యూ టివ్‌ డైరెక్టర్‌ రెబ్బాప్రగడ రవి చత్తీస్‌ఘడ్‌ రాష్ట్ర ప్రభుత్వం పీసా చట్టం వర్కింగ్‌ గ్రూప్‌ చైర్‌పర్సన్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేష్‌ బాగెల్‌ సలహాదారు శ్రీరాజేష్‌తివారీ అధ్యక్షతన‘‘గిరిజన అభివృద్ధి,అటవీ మరియు వన్యప్రాణి నిర్వహణ, మైనర్‌ ఫారెస్ట్‌ ప్రొడక్ట్‌ మేనేజ్‌మెంట్‌ ఏరియాస్‌ డెవలప్‌మెంట్‌’’పై టాస్క్ఫోర్స్‌ ఏర్పాటు చేసింది. దానికి అను బంధంగా టాస్క్ఫోర్స్‌ కింద వివిధ సబ్‌-వర్కింగ్‌ గ్రూపులను ఏర్పాటు చేశారు. ఇందులో సబ్‌-వర్కింగ్‌ గ్రూప్‌ ‘‘ట్రైబల్‌ ఏరియా గవర్నెన్స్‌-పెసా మరియు గవర్నెన్స్‌లో టెక్నాలజీ వాడకం’’ ఛైర్మన్‌గా సమత ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ రెబ్బాప్రగడ రవిని ఆరాష్ట్ర ప్రభుత్వ ప్రణాళిక సంఘం ప్రకటించింది.వర్కింగ్‌ గ్రూప్‌ కమిటీ పీసా చట్టంపై ప్రభుత్వానికి తగు సూచనలు సలహాలు ఇస్తోంది.

విజయేంద్రుడు..సమత రవి

వైవిధ్యం ఆయన జీవనశైలి.ఉద్యమం ఆయన ఊపరి..ఎన్నో సమస్యలపై పోరాడారు. విజయం సాధించారు. గిరిజనులకు ‘నేనున్నా’అంటూ భరోసా ఇచ్చారు. వారిలో చైతన్యం తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నారు. ఆయనే రవి రెబ్బాప్రగడ.ఆయన సేవలకు గాను జాతీయ,అంతర్జాతీయ పురస్కారాలు లభించాయి. ప్రస్తుతం ఐదో షెడ్యూలు ప్రాంతమైన చత్తీష్‌ఘర్‌ రాష్ట్ర ప్రభుత్వం పీసా చట్టం వర్కింగ్‌ గ్రూపు చైర్‌ పర్సన్‌గా ఆ రాష్ట్ర ప్రభుత్వం నియమించింది.సామాజిక సేవా స్పూర్తి కలిగిన ప్రతి వ్యక్తి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచి ఉంటారనడానికి నిదర్శనం సమత ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ రెబ్బాప్రగడ రవి. నాగరిక సమాజానికి ఆమడ దూరంలో అమాయకంగా జీవిస్తున్న ఆదివాసీల హక్కులు పరిరక్షిస్తూ, వారి వనరుల పరిరక్షణకు రాజ్యాంగబద్దంగా నిశబ్ధ విప్లవానికి తెరలేపారు. గిరిజనుల హృదయాల్లో ఆశాజ్యోతిగా నిలిచారు. వారి జీవితాల్లో వెలుగు నింపారు. దేశం యావత్తూ ఒక్కసారిగా ప్రభుత్వేతర సంస్థల పదునేమిటో ప్రత్యక్షంగా చవిచూసిన సంఘటన 1997నాటి సమత తీర్పు. ఎన్నో ఒత్తిడులను ఎదుర్కొని తూర్పు కనుమల్లో గనుల తవ్వకాన్ని సవాలÊ చేస్తూ సుప్రీం కోర్టు ద్వారా సమత వాదన సరైందేనని తీర్పు పొందిన ఘనతకు మూలకారకుడాయన. విశాఖను సమత ఉద్యమాల కేంద్రబిందువుగా తీర్చిదిద్దుతున్న నేపథ్యం పరిశీలిస్తే…సమాజ సేవ చేయాలనే సంకల్పంతో 1986లో రవి భాగవతుల చారిటబుల్‌ ట్రస్టులో చేరారు. ఆ తర్వాత తూర్పు గోదావరి జిల్లా శంఖవరం మండలం పెదమల్లాపురం గిరిజన గ్రామంలో సాతంత్య్ర సమరయోధుడు స్వర్గీయ కందుల సుబ్రమణ్యం తిలక్‌ స్థాపించిన స్పందన సంస్థలో సేవారంగంపై పరిపూర్ణ అవగాహన ఏర్పరచు కున్నారు. ఆతర్వాత 1990లో తానే స్వయంగా సమత స్వచ్చంధ సంస్థను స్థాపించి గిరిజన హక్కుల పోరాటంలో కొత్తపుంతలు తొక్కారు. ఏజెన్సీలోని బవురవాక గ్రామంలో భూస్వాముల కబంధ హస్తాల్లో కొన్ని దశాబ్దాలుగా ఉన్న 298 ఎకరాల పేద గితరిజనుల భూమిపై తొలిసారి పోరాటం చేసి విజయం సాధిం చారు. మొత్తం ఆభూములకు గిరిజనులకు అప్పగించి వాటికి పట్టాలు ఇప్పించారు. దీంట్లో రవి కృషి అనన్య సామాన్యం.ఏజెన్సీలో నెలకొన్న పలు సమస్యల పరిష్కారానికి మొక్కవోని దీక్షతో పనిచేశారు. విశాఖ జిల్లా మారుమూల గిరిజన గ్రామాల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడమే ధ్యేయంగా సమత కార్యకలాపాలను విస్తరించాయి. గిరిజనులను చైతన్యవంతులను పర్చే పలు సామాజిక సేవా కార్యకమ్రాలను చేయడంతో ఆ సేవలను గుర్తించిన అప్పటి విశాఖ జిల్లా కలెక్టర్‌ 1994లో అవార్డు బహుకరించారు. బొర్రా ప్రాంతంలో మైనింగ్‌,భూసమస్యలపై దృష్టి సారించి రాజ్యాంగంలోని ఐదో షెడ్యూలు నిబంధనలకు విరుద్దంగా ప్రభుత్వం చేపట్టే పనులను వ్యతిరేకించారు. బొర్రా, అరకు, అనంతగిరి ప్రాంతాల్లో ప్రైవేటు కంపెనీలకు మైనింగ్‌ లీజులను మంజూరు చేయడంపై సమర్ధవంతంగా అడ్డుకున్నారు. ఈఘటనతో తూర్పు కనుమల్లో గిరిపుత్రల్నీ,వారి హక్కుల్నీ సంరక్షించడానికి ఉద్యమించిన ఉక్కు పిడికిలి రవి రెబ్బాప్రగడ పేరు దేశవ్యాప్తంగా మార్మోగింది. రాజ్యాంగ బద్దంగా న్యాయ పోరాటం చేసి 1997లో సర్వోన్నత న్యాయ స్థానం ద్వారా సాధించిన సమత తీర్పు నేడు దేశవ్యాప్తంగా 9రాష్ట్రాల్లోని గిరిజన హక్కుల పరిరక్షణకు ఓకవచంలా ఉపయోగపడు తోంది.రవి సేవాలను గుర్తించిన పలు సామా జిక సంస్థలు ఎన్నో అవార్డులు బహుకరించింది. వాటిలో ముఖ్యంగా లక్ష్మీపత్‌ సింఘానియా అనే అంతర్జాతీయ సంస్థ రవి సేవలను గుర్తించి యువ నాయకత్వం పరస్కారం లభించింది. ఆ తర్వాత రవి దేశ ఆర్ధికరంగ ప్రణాళిక కమిటీలో సభ్యుడుగా పనిచేశారు. ఇటీవల చత్తీస్‌ఘడ్‌ ప్రభుత్వ పీసాచట్టం వర్కింగ్‌ గ్రూప్‌ చైర్‌పర్సన్‌గా ఎంపికైన సందర్భంగా రవి థింసాప్రతినిధితో మాట్లాతూ పీసా చట్టం విశిష్టితపై వివరించారు.

బీడీ శర్మ,ఎస్‌.ఆర్‌.శంకరన్‌ స్పూర్తితో

సామాజిక సేవా ధృక్పధంతో ప్రజలకు సేవలం దించిన ప్రముఖ ఐఏఎస్‌ అధికారులు స్వర్గీయ బీడీ శర్మ,ఎస్‌.ఆర్‌.శంకరన్‌ గార్ల స్పూర్తితో పీసా చట్టం సాధనలో ఎంతో ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌,ఒరిస్సా,చత్తీషఘర్‌ రాష్ట్రాల్లో ఎంతో మంది గిరిజన యువకులకు పీసా చట్టం పట్ల చైతన్య పరచడానికి శిక్షణలు ఇప్పించారు. సమత తీర్పు,పీసా చట్టం ఉన్న ఐదోవ షెడ్యూలు ప్రాంతాల్లో అనేక రాష్ట్రాల్లో గిరిజనులు తమ హక్కులు ఉల్లంఘన,వనరులు దోపిడికి గురవుతున్న నేపథ్యాన్ని బీడీశర్మ, శంకరన్‌ గార్లతో కలసి ఎన్నో ప్రాంతాలను సందర్శించారు. 2001లో బిడిశర్మతో ఛత్తీష్‌ ఘర్‌ రాష్ట్రంలో సుదీర్ఘమైన ప్రయాణం చేశాను. జగదల్‌పూర్‌ జిల్లా నగర్నర్‌ ప్రాంతంలో నిర్మించిన ఎన్‌ఎండీసీ కంపెనీవల్ల నిర్వాసితులైన ఆదివాసులను సందర్శించాను. అక్కడ నిర్వాసితులతో పీసా చట్టం ప్రాధాన్యత,సమత జడ్జిమెంటు విశిష్టతపై అవగాహన కల్పించాం. కోర్బాలో బాల్కో ప్యాక్టరీ ప్రైవేటీకీకరణ చేస్తున్న నేపథ్యంలో అక్కడ కార్మికులకు మద్దుతు ప్రకటించి, సమత జడ్జిమెంటు ప్రకారం షెడ్యూలు ప్రాంతాల్లో ఉన్న కంపెనీలను ప్రైవేటీకీకరణకు విరుద్దమని అక్కడ బాల్కో కంపెకనీ కార్మికులకు సంఫీుభావం ప్రకటించాం.బీడీ శర్మగారితో కలసి బస్తర్‌ ప్రాంతంలోని అనేక ఆదివాసీ ప్రాంతాల్లో పీసాచట్టం పట్ల అవగాహన కల్పించి పీసా చట్టం,గ్రామసభల విశిష్టతను వివరించాం. పోలవరం,సూరంపాలెం వంటి భారీ ప్రాజెక్టులు వల్ల నిర్వాసితులైన నష్టపరిహారంపునరావాసం కల్పించడం జరుగుతోంది. పకడ్బందీగా పీసా చట్టం పంచాయితీరాజ్‌ షెడ్యూలు ప్రాంతాల విస్తరణ చట్టం(పీసా చట్టం1996)అమలులోకి వచ్చి 25 ఏళ్లు అయింది.గిరిజనుల సాంప్రదాయ హక్కులు,జీవనోపాధి,పరిపాలనవంటి కీలకమైన అంశాలతో ముడిపడివున్న ఈచట్టం అమలులో కొన్ని ప్రభుత్వ వ్యవస్థలు ఉదాసీనంగా వ్యవహరి స్తున్నాయి. ఈ పరిస్థితిని నివారించేందుకు గిరిజన సంప్రదాయాలను గౌరవించి,వారి పద్దతులను సముచిత ప్రాధాన్యమిచ్చేందుకు పీసా చట్టం ద్వారా గ్రామసభలకు అధికారాలు కల్పించారు. వాస్తవంలో అవి ఎండమావుల్ని తలపిస్తున్నాయి.

గ్రామసభ విశేష అధికారాలు

రెండున్నర దశాబ్దాల క్రితం పీసా చట్టం కోసం దేశవ్యాప్తంగా గిరిజనులు పోరాడారు. ముఖ్యంగా ప్రముఖ విశ్రాంతి ఐఏఎస్‌ అధికారులు స్వర్గీయ బీడీ శర్మ,ఎస్‌ఆర్‌ శంకరన్‌,దిలీప్‌ సింగ్‌ భూరియా వంటి గిరిజనతెగల స్పూర్తిదాతల సహకారం కూడా మరవలేనిది.73వ రాజ్యాంగ సవరణలో 1991లో అమలులోకి వచ్చిన పంచాయితీరాజ్‌ చట్టాన్ని దేశమంతటా ఒకేరీతిన అమలు చేయడంతో గిరిజనుల్లో తీవ్ర నిరసన మొదలైంది. వారు ఉద్యమబాట పట్టారు. దీంతో కేంద్రప్రభుత్వం దిలీఫ్‌సింగ్‌ భూరియా నేతృత్వంలోని ఓకమిటీని నియమించింది. కమిటి సీపార్సులతో 1996 డిసెంబరులో పీసా చట్టాన్ని అమలులోకి తీసుకు వచ్చారు. ఈచట్టం ప్రకారం ఆదివాసీ ప్రాంతాల్లో గ్రామపంచాయితీని కాకుండా గ్రామసభను కేంద్రబిందువు చేశారు. గ్రామసభకు విశేషాధి కారాలను కల్పించారు. ఒక ప్రాంతంలో నివసించే ఓటు హక్కు కలిగి ఉన్న నివాసితు లంతా గ్రామసభ పరిధిలోకి వస్తారు. వీరు తాము నివసించే ప్రాంతాల చుట్టూ గల సహజ వనరులు,అటవీ సంపదపై యాజమాన్యహక్కులు కలిగి ఉంటారు.ఆ వనరులను స్వీయ అవసరాల కోసం వినియోగించుకుంటూ,గిరిజన సంప్రదాయ పరిరక్షణకు దోహదపడతారు. ఆయా గ్రామాల్లో ప్రాంతాల్లో ఏర్పాటయ్యే పాఠశాలలు,వైద్య కేంద్రాల పర్యవేక్షణ బాధ్యతలను గ్రామసభలకు అప్పగించారు. అభివృద్ధి ప్రాజెక్టులకు అవసరమైన భూ సేకరణ,నష్టపరిహారం పంపిణీ,గనుల తవ్వకాలకు సంబంధించిన లీజులు, సామాజిక,ఆర్ధిక అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన ప్రణాళికల రూపకల్పన,ఉప ప్రణాళిక నిధుల ఖర్చుకు సైతం గ్రామసభల అనుమతి తీసుకోవాలి. అంతేకాదు ప్రభుత్వం సంక్షేమపథకాల్లో లబ్దిదారుల గుర్తింపు,చిన్న తరహా అటవీ ఉత్పత్తులపై యాజమాన్య హక్కులు,మద్యం అమ్మకాలు,వడ్డీ వ్యాపారాలపై నియంత్రణ,నీటివనరుల నిర్వహణ తదితర విషయాల్లోనూ గ్రామసభలకే సర్వాధికారాలు కల్పించబడ్డాయి. గిరిజన ప్రాంతాల్లో ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన జమాఖర్చుల ధృవపత్రాన్ని జారీ చేసే అధికారం సైతం గ్రామసభలకు ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 2011లో చట్టంలో కొత్తగా కొన్ని నిబంధనలు పొందుపరిచింది. గ్రామసభకు సంబంధించిన ముఖ్యమైన విషయాలు ఇందులో ఉన్నాయి. వీటిని క్షేత్రస్థాయిలో అమలు చేయడంలో వైఫల్యం కనబడుతోంది. 2013 సెప్టెంబరులో గిరిజన సంక్షేమశాఖ జిల్లా,మండల,పంచాయితీల వారీగా గ్రామసభలను గుర్తించి,జాబితాను నోటిఫై చేసింది. అంతేతప్ప పీసా చట్టం అమలు ద్వారా క్షేత్రస్థ్రాయిలో గిరిజనులకు జరగాల్సిన మేలు,లభించాల్సిన హక్కులపై శ్రద్ద చూపలేదు. ఐదో షెడ్యూలు ప్రాంత పరిధిలోకి వచ్చే పర్వత శ్రేణుల్లో బాక్సైట్‌ ఖనిజం తవ్వకాల విషయంలో అక్కడి డోంగ్రియా ఆదివాసుల ఒడిశా ప్రభుత్వంపై చేసిన న్యాయపోరాటం ఫలించడానికి పీసా గ్రామసభ దిక్సూచిగా నిలిచింది. 2013లో పీసా చట్టం ప్రకారం అక్కడి గ్రామసభల అనుమతులు తీసుకున్నాకే ఖనిజ తవ్వకాలు చేపట్టాలని సర్వోన్నత న్యాయస్థానం తీర్పు ఇవ్వడంతో గ్రామసభలు కీలకమయ్యాయి. ఆదివాసీ ప్రాంతాల్లో భూములు,గనులు,అడవులు ఇతర సహజ వనరుల ఇష్టారాజ్యదోపిడిని అడ్డుకు నేందుకు గొప్ప ఆయుధంగా పీసాచట్టం దోహదపడుతుందన్న ఆశలు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల ఉదాసీన వైఖరితో ఆడియాశలయ్యాయి. చాలా రాష్ట్రాలు చట్టం అమలుకు సంబంధించి కనీసం కార్యనిర్వాహక యంత్రాంగాలను ఏర్పాటు చేయలేదు. 1996లో కేంద్రం అమలులోకి తీసుకొచ్చిన చట్టంలో తమ రాష్ట్రాల్లోని గిరిజనుల కట్టుబాట్లు,వనరుల యాజమాన్యంలో సంప్రదాయ పద్దతులకు అనుగుణంగా మార్పులు చేపట్టవచ్చని పేర్కొనడాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సాకుగా తీసుకున్నాయి. కేంద్ర చట్టస్పూర్తికి విరుద్దంగా రాష్ట్రాలు చట్టాన్ని అన్వయించుకోవడంతో దాని స్వరూపమే మారిపోయింది. ఉదాహరణకు షెడ్యూలు ప్రాంతాల్లో ఏదైనా అభివృద్ధి ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణ కోసం ముందు గ్రామసభలను సంప్రదించాలి. ఆ ప్రాజెక్టువల్ల నష్టం అనర్ధం వాటిల్లక ముందు నష్ట పరిహారం,పునరావాసం కల్పించాలని కేంద్ర చట్టం చెబుతోంది. ఈనిబంధనను కొన్ని రాష్ట్రాలు మార్చేశాయి. ఆంధప్రదేశ్‌ ప్రభుత్వం రూపొందించిన పీసా చట్టంలో భూసేకరణకు ముందు మండల పరిషత్‌లను సంప్రదించాలని పేర్కొంది. అంతేకాక అభివృద్ధి ప్రాజెక్టుల ప్రణాళికలు,పర్యవేక్షణ రాష్ట్ర ప్రభుత్వం అజమాయిషీలో ఉండేలా మార్పులు చేసింది. జార్ఖండ్‌ రాష్ట్రం తీసుకు వచ్చిన చట్టంలో అసలు ఈ వెసులబాటే లేకుండా చేశారు. భూసేకరణకు ముందు తాలూకా పంచాయి తీలను సంప్రదించాలని గుజరాత్‌ చట్టం చెబుతోంది. జిల్లా పంచాయితీ,రెవిన్యూ అధికారుల అజమాయిషీలో భూసేకరణ జరిగేలా ఒడిశా ప్రభుత్వం చట్టంలో మార్పులు చేసింది. గనుల లీజులు,నీటిపారుదల నిర్వ హణ,అటవీ ఉత్పత్తుల యాజమాన్యం..ఇలా అనేక అంశాల్లో కేంద్రచట్టం స్పూర్తికి విరుద్దం గా రాష్ట్రాలు తమ చట్టాల్లో మార్పులు చేశాయి. దేశంలో అత్యంత వెనకబాటుకు గురవుతున్న జిల్లాలో అన్నీ దాదాపుగా ఆదివాసుల నివసిస్తున్న ప్రాంతాలే. ఈ ప్రాంతాల్లో వామపక్ష తీవ్రవాదం ఉనికి బలంగా ఉంది. అటవీ వనరులపై హక్కులు కల్పించి, గ్రామసభల స్థాయిలో పరిపాలనపరమైన సామర్ధాన్ని పెంచినప్పుడే గిరిజనుల్లో నిజమైన సాధికారత సాధ్యమవుతోంది. విద్య, వైద్యం, రహదారులు,విద్యుత్‌ వంటి మౌలిక సదు పాయాల కల్పనలో గ్రామసభలను మమేకం చేయాల్సిన అవసరం ఉంది. పంచాయితీరాజ్‌ చట్టం మాదిరే మున్సిపల్‌ చట్టాన్ని గిరిజన ప్రాంతాలకు విస్తరించాలనే ప్రతిపాదన దశా బ్దాల కాలంగా కాగితాలకే పరిమితమైంది. దీంతో గిరిజన ప్రాంతాల్లో అధిక జనాభా ఉన్న పంచాయితీలను పురపాలక సంఘాలుగా మార్చడానికి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. పీసా,అటవీహక్కుల గుర్తింపు చట్టంతోపాటు రాజ్యాంగంలోని ఐదో షెడ్యూలు నిబంధనలను అమలు చేయడానికి రాష్ట్రాల్లో వ్యవస్థాగత యంత్రాంగం లేదు. ఈ చట్టాలను సంబంధించిన నిబంధనలపై అవగాహన కల్పించే,అమలు తీరును పర్యవేక్షించే యంత్రాంగాలూ లేవు. తగినంత మంది సిబ్బంది లేరు. నిధులూ కొరవడ్డాయి. పీసా చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసే దిశగా ప్రభుత్వాలు చురుకుందకోవాల్సిన తరుణమిది. క్షేత్రస్థాయిలో సత్ఫలితాలు ప్రతి ఒక్కరికీ అందినప్పుడే చట్టానికి సార్ధకత ఉంటుంది!- Saiman Gunaparthi