జీవ వైవిధ్యం కొన్ని జాతుల కవచం
మనిషి విచక్షణారాహిత్యం వల్ల రోజురోజుకూ జీవవైవిధ్యం దెబ్బ తింటోంది. ప్రకృతి విధ్వంసకర పనుల వల్ల జీవుల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతున్నది. నానాటికి కాలుష్యం పెరిగిపోవడం, విస్తరించాల్సిన జీవజాతుల శాతం తగ్గిపోవడం జీవ వైవిధ్యాన్ని ప్రమాదంలోకి నెట్టేస్తున్నాయి. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే మానవాళికి భారీ మూల్యం తప్పదని హెచ్చరిస్తున్నాయి ప్రపంచ పర్యావరణ, జీవవైవిధ్య సదస్సుల నివేదికలు. డిసెంబర్ 29న ప్రపంచ జీవవైవిధ్య దినోత్సవం సందర్భంగా కొన్ని విషయాలు తెలుసుకుందాం.! `
జీవవైవిధ్యం.. ఆవశ్యకత
అవనిపై జీవించే సకల జీవరాశిని కలిపి జీవవైవిధ్యం అంటున్నారు. సరళంగా చెప్పాలంటే వివిధ రకాల జీవజాతుల సముదాయాన్నే జీవ వైవిధ్యం అంటాం. సూక్ష్మరూపంలోని తొలిజీవి ప్లాజిల్ల్లెటా అనే ఏక కణ జీవి ప్రీ బయాటిక్ సూప్ అనే సముద్ర అడుగు నీటిలో పుట్టిందని శాస్త్రవేత్తలు నిర్ధారిం చారు. తొలుత వృక్షాలు, జంతుజాలం అవతరించాయి. క్రమక్రమంగా ఉభయచరాలు, పక్షులు పుట్టు కొచ్చాయి.ప్రస్తుతం నేలమీద ఎన్నో రకాల వృక్షాలు, పండ్లు, జంతు జాతులు మనుగడ సాగిస్తున్నాయి. సృష్టిలోని ఏజాతి ఉనికైనా జీవ వైవిధ్యం ఎంతో అవసరం.కుందేళ్లు,గేదేలు,జీబ్రాలు వంటివి పచ్చని గడ్డి తింటాయి. ఈజంతువులను మాంసాహారులైన సింహం,పులి,చిరుతపులులు ఆరగిస్తాయి. గొల్ల భామలు గడ్డిని తింటే వాటిని కప్పలు భక్షిస్తాయి. ఈ చక్రంలో ఒకబంధం తెగితే దాని ప్రభావం అనేక రూపాల్లో కనిపిస్తాయి. పాములు నాశనమైతే ఎలుకల సంతతి అనుహ్యంగా పెరిగి పోతుంది. దానితో ఎలుకలు పంటలపై పడి తిండి గింజలను తినేస్తాయి. మానవుడు తన మనుగడ కోసం చుట్టూ ఉన్న పరిసరాలపై ఆధార పడి జీవిస్తాడు.ఆహారం,గాలి,నీరు రక్షణ,ఆశ్రయం నిత్యావసర వస్తువులు అన్నీ ప్రకృతి ఉత్పత్తులే. కంటికి కనబడని ఎన్నో జీవులు సైతం పరోక్షంగా ఎంతో మేలు చేస్తాయి. ఇలా ఒక జీవి మనుగడ మరో జీవి మనుగడకుప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఉపయోగ పడటం వల్లనే సకల జీవులు మానవాళిలో మనుగడ సాగిస్తు న్నాయి. పెరుగుతున్న జనాభా..వనరులను మితిమీరి వినియోగించడం..ఫలితం జీవవైవిధ్య పరిరక్షణ సంక్లిష్టంగా మారుతోంది. అడవుల దహనం..భారీ ప్రాజెక్టుల నిర్మాణం.. ఇష్టా రాజ్యంగా పరిశ్రమల ఏర్పాటు..యథేచ్ఛగా గనుల తవ్వకం..నగరీకరణ..అణు విద్యుత్ కేంద్రాలు..విచ్చలవిడిగా ప్లాస్టిక్ వినియోగం.. వ్యవసాయంలో రసాయనాల వాడకం..తదిత రాలు జీవవైవిధ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. ఫలితం గా భూమిపై ఉన్న కోట్లాది జీవరాశుల్లో మూడిరట రెండొంతులు అంతరించే ప్రమాదం పొంచి ఉందని అంతర్జాతీయ పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. పర్యావరణాన్ని పరిరక్షించు కోవడంతో పాటు పేదరిక నిర్మూలన..సుస్థిర జీవనోపాధి..అభివృద్ధిలో సమానత వంటి అంశాలతో జీవవైవిధ్యం ముడిపడి ఉంది. జీవిత భవిష్యత్తును నిర్మించడానికి ఆశ,సంఫీుభావం,అన్ని స్థాయిల్లో కలిసి పనిచేయాల్సిన ప్రాముఖ్యత కలిగి వుంది. భూమిపై ఒకేజాతి జీవుల మధ్య భేదాన్నే ‘జీవ వైవిధ్యం’ అంటాం. నేడు మన భూమిపై ఉన్న అనేక మిలియన్ల జాతుల జీవ వైవిధ్యం సుమారు 3.5 బిలియన్ సంవత్సరాల పరిణా మం. మానవ జీవనశైలితో పర్యావరణం కలుషితమై, భూగోళం వేడెక్కిపోతుంది.దీంతో జీవ వైవిధ్యమూ దెబ్బతింటోంది. ఫలితంగా ఎన్నో జీవజాతులు అంతరించిపోతున్నాయి. దాదాపు 20 ఏళ్లలో ప్రకృతి వైపరీత్యాల కారణంగా కలిగే నష్టాలు 150శాతం మేర పెరిగాయి. వాతావరణ భూ భౌతిక వైపరీ త్యాల వల్ల ఏకంగా 13 లక్షల మంది చనిపో యారు.పేద, మధ్యతరగతి దేశాల్లోనే మర ణాలు మరింత ఎక్కువ. ఐక్యరాజ్యసమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యాల నివేదికలో ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులపై ఆందోళనకర అంశాలు వెల్లడిరచింది. సముద్ర మట్టాలు, సాగరాల ఆమ్లత పెరుగుతుందనీ..గత నాలుగేళ్లలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదైనట్లు పేర్కొంది. దాదాపు 10లక్షల మొక్కలు, జీవ జాతులు కనుమరుగయ్యే ప్రమాదం ముంచు కొచ్చిందని స్పష్టం చేసింది. ఈ భూమి ఏర్పడి, 350 కోట్ల సంవత్సరాలు. ప్రపంచ వ్యాప్తంగా కోటి 40 లక్షల జీవరాశులు ఉన్నాయి. వీటిల్లో 80 లక్షలు మాత్రమే గుర్తించాం. అందులో మన దేశంలో కేవలం 17లక్షల జీవరాశుల సమాచారం మాత్రమే ఉంది. ప్రపంచ వ్యాప్తం గా అత్యధిక వన, జల, జీవ రాశులున్న దేశా ల్లో భారత్ 12వ స్థానంలో ఉంది. మొత్తం మీద 12శాతం అడవులు మనదేశంలోనే ఉన్నా యి. ఇప్పటికీ మన దేశంలో జీవ వైవిధ్యంపై 60 శాతం మంది ఆధారపడి బతుకుతున్నారు. గత కొన్ని దశాబ్దాల్లో 50 శాతానికిపైగా అరణ్యాలు, 70 శాతానికి పైగా నీటి వనరులు తగ్గిపోయాయి. – ఉదయ్ శంకర్ ఆకుల