జనగణనలో ఆదివాసీల మతమేమిటీ?

ఈ దేశంలోని 12 కోట్ల మంది ఆది వాసీలకు విలక్షణ మత అస్తిత్వం ఉన్నది. వారిని హిందు వులు లేదా ఇతర ప్రధాన స్రవంతికి చెందిన ఇతర మతాల వారిగా పరిగణించడం సబబు కాదు. 2021 జనాభా గణన ప్రక్రియలో ఆదివాసీ లను వారి సొంత మతాలకు చెందినవారుగా మాత్రమే నమోదు చేయాలి. ఈదేశంలో ఆదివాసీలకు సరైన గుర్తింపు ఉందా? కొత్త సంవత్సరం (2021)లో దేశ జనాభా గణన ప్రక్రియ మొదలవనున్నది. ఆదివాసీలను ఏ మతా నికి చెందిన వారుగా నమోదు చేయనున్నారు? ఈ విషయమై ఆదివాసీలు ఆందోళన చెందుతున్నారు. నిజానికి స్వాతంత్య్రం వచ్చిన తొలి నాళ్లలో ఆదివాసీలకు సముచిత గుర్తింపు లభించింది. అయితే అది ఎంతో కాలం కొన సాగలేదు.
భారతదేశ జనాభాలో ఆదివాసీల సంఖ్య12 కోట్లు. వీరి మతమేమిటి?ఆదివాసీ సమూహాలు అనుసరిస్తున్న మతంపై సుదీర్ఘకాలంగా చర్చ జరుగుతోంది. జనాభా గణనలోనూ లేదా అటువంటి ఇతర గణనల్లోనూ ఆదివాసీ మతాలలో ఒకదాన్ని ఎంపిక చేసుకునేందుకు తమకు హక్కు కల్పించాలని ఆదివాసీలు డిమాండ్‌ చేస్తున్నారు. స్వతంత్ర భారతదేశ తొలి జనాభా గణన ప్రక్రియలో ‘మతం’కాలమ్‌లో‘ట్రైబ్‌’ అనేది తొమ్మిదో గుర్తింపులో ఉండేది. ఆదివాసీలు అంద రూ తమ మతాన్ని ‘ట్రైబ్‌’గా పేర్కొనేవారు. తరువాత ఈ ఆప్షన్‌ను తొలగించారు. ఫలితంగా ఆదివాసీలు వివిధ మతాలకు చెందిన వారుగా నమోదవు తున్నారు. ఇది తమ ఆత్మగౌరవాన్ని కించపరు స్తోందని ఆదివాసీలు వాపోతున్నారు. ఇప్పుడు జనాభా గణనలో ఆరు మతాలు-హిందూ, ముస్లిం, క్రైస్తవ,బౌద్ధ,జైన,సిక్కులకు మాత్రమే గుర్తింపు ఉంది.2011కి పూర్వం ఈ ఆరు మతాలతో పాటు ‘అదర్స్‌’(ఇతరులు) అనే ఆప్షన్‌ ఉండేది. ఆదివాసీలు ఈ ఆప్షన్‌ను ఉపయోగించుకునేవారు.ఇప్పుడు ఆ అవకాశం లేకుండా పోయింది. జనాభా గణన ప్రారంభమయిన 1871 మొదలు 1931దాకా ఆదివాసీలు తమ మతాన్ని ఆదివాసీమతంగా నమోదు చేసేవారు.స్వతంత్ర భారతదేశంలో ముఖ్యంగా 1961 నుంచి ఆ అవకాశం లేకుండా పోయింది. హిందువులుగా, క్రైస్తవులుగా, ఇంకా ఇతర మతాలవారుగాఆదివాసీలను నమోదు చేయ డం జరుగుతోంది.‘ఆదివాసీ మతం’ అనే ఆప్షన్‌ను తొలగించడమంటే తమను మతపరమైన బానిసలు గా పరిగణించడం కాదా అని పలువురు ఆదివా సీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి ఈ సువిశాల దేశంలోని ఆదివాసీలు మొత్తం83 మతా చరణలను అనుసరిస్తున్నారు. విశ్వాసాలు, ఆచారా లు, ఆరాధించే దేవతలు, ఆరాధనా పద్ధతు లు మొదలైనవి భిన్నమైనవి అయినప్పటికీ తమకు మత పరంగా ఒక నిర్దిష్ట గుర్తింపు కోసం ఆదివాసీలు సహజంగా ఆరాటపడుతున్నారు. ప్రధాన స్రవంతి మతాలకు చెందినవారుగా గుర్తింపు పొందడానికి వారు నిరాకరిస్తున్నారు. ఈ సందర్భంగా జార్ఖండ్‌ శాసనసభ తీసుకున్న ఒక నిర్ణయాన్ని ప్రస్తావించ వలసి ఉంది.ఆరాష్ట్రంలోఅత్యధిక సంఖ్యలో ఉన్న శర్ణ ఆదివాసీల మతానికిగుర్తింపు నివ్వాలని, 20 21 జనాభా గణనలో ఆ మతానికి ఒక ప్రత్యేక గుర్తింపు క్రమసంఖ్య నివ్వాలని కేంద్రప్రభుత్వాన్ని కోరుతూ జార్ఖండ్‌ శాసనసభ ఏకగ్రీవంగా ఒక తీర్మానాన్ని ఆమోదించింది.శర్ణ ఆదివాసీలకు గుర్తింపు విషయమై ఆరాష్ట్ర ముఖ్యమంత్రి హేమం త్‌ సోరేన్‌ గట్టి పట్టుదలతో ఉన్నారు. ఈ విషయమై ఆయన ఇప్పటికే కేంద్రప్రభుత్వానికి ఒక లేఖ కూడా రాశారు. జార్ఖండ్‌ శాసనసభ తీర్మానం దేశవ్యా ప్తంగా ఆదివాసీల అస్తిత్వానికి జీవం పోసింద నడంలో సందేహం లేదు. మతపరంగా జాతీయ స్థాయిలో ఒక నిర్దిష్ట గుర్తింపు కోసం ఆదివాసీలు సమైక్యమయ్యేందుకు జార్ఖండ్‌ అసెంబ్లీ తీర్మానం విశేష ప్రేరణ నిచ్చిందనడంలో సందేహం లేదు. ఆదివాసీలను దశాబ్దాలుగా హిందు వులు లేదా ప్రధాన స్రవంతికి చెందిన ఇతర మతాలవారుగా ఎందుకు పరిగణిస్తున్నారు? ఇన్నేళ్లుగా ఆదివాసీలకు మతపరమైన నిర్దిష్ట గుర్తింపు లేకుండా ఎందుకు చేశారు? ఈ దేశంలో ఆదివాసీల అస్తిత్వం మూలాలు ఏమిటి? అనే దానిపై చర్చ జరగడం శ్రేయస్కరం. ఇటువంటి చర్చ జరగని పక్షంలో ఈ దేశ సామాజిక వాతావ రణంలో ఒక స్పష్టమైన మార్పు రావడం అసంభవం అనేది నేడు దేశహితులు అందరూ గుర్తించవలసిన వాస్తవం. నాగరికత ఆనవాళ్ళు అనేవి నవీన శిలా యుగంలో ప్రారంభమయ్యాయి. తమ జీవన ప్రస్థా నాన్ని ముందు తరాల వారికి తెలియజేయాలనే ఆలోచన ఈయుగ మానవులకు వచ్చింది. ఈ విష యమై వారి కార్యాచరణ అద్భుతమైనది. చిత్రాల రూపంలో బండరాయిపై చెట్లరసంతో ముదురు ఎరుపురంగు బొమ్మలు వేయడం ఆ కార్యాచరణలో భాగమే. అటువంటి బొమ్మలు నేడు ఆదివాసీలు నివసించే దట్టమైన అటవీ ప్రాంతాలలో, కొండ గుహలలో కానవస్తున్నాయి. పలువురి పరిశో ధనల్లో ఆబొమ్మలు ఆదివాసీల జీవనంలో భాగమైన పడగలలోని చిత్రలిపి, మౌఖిక సాహిత్యంలో ఉన్నవని నిర్ధారణ అయింది. నవీన శిలాయుగ మాన వులు తమ అస్తిత్వాన్ని చిత్రాల రూపంలో చాటిన మొదటి ఆదివాసీలు. ఆనాటి నుంచి నేటిదాకా ఆదివాసీల జీవనం అడవిలోనే సాగుతోందనడానికి ఇవి తిరుగులేని చారిత్రక ఆనవాళ్లు.
నవీన శిలాయుగంలోనే వ్యవసాయం అంకురించింది.ఆతర్వాత మనిషిని మరింత పరి పూర్ణంగా తీర్చిదిద్దిన నాగరికత సింధు నాగరికత. సింధు నాగరికతతో ఆదివాసీలు ఒక పరిపూర్ణ నాగరికత నిర్మించారని చెప్పవచ్చు.సింధు నాగరిక తలో ఉన్న చిత్రలిపి నేటి ఆదివాసి జీవనంలో సజీవంగా ఉంది. నేటి గోండ్వానా ప్రజల జీవన చిత్రాలు, వేషధారణ కూడా సింధు నాగరికత ఆదివాసి నాగరికతే అని దృష్టాంతీకరిస్తున్నాయి. గోండ్వానా జీవనంలో ప్రాచీన శిలాయుగంలో బండరాళ్ళపై చిత్రలిపి వేసిన ఆదివాసీలు నవీన శిలాయుగంలో దానిని పెద్ద పెద్ద వృక్షాల దారు వుపై వేశారు.సింధు నాగరికత నాటికి ఎర్రని గుడ్డపై చెట్లరసంతో బొమ్మలు వేసి పడిగెల రూపం లో వంశవృక్షాలలో జన్యుపరమైన విభజన చేసు కోవడం జరిగింది.నేటికీ ఆదివాసి ఇలవేల్పు జాతర లో తమ చరిత్రను వంశవృక్షాన్ని దైవ రూపంలో కొలుచుకుంటున్నారు. కొన్ని లక్షల సంవత్సరాలు అయినా తమ వంశవృక్షం ఏమిటి అనే దాన్ని స్పష్టంగా చిత్రలిపి రూపంలో తెలుసుకునేంత గొప్ప శాస్త్రీయ పరిజ్ఞానం ఆదివాసి సమాజంలో మాత్రమే ఉంది. మరి ప్రాక్‌చరిత్ర నుంచి నేటి వరకు ఒక ప్రత్యేకతను సంపాదించుకున్న ఆదివాసీలు హిందు వులు లేదా ఇతర మతాలకు చెందిన వారు ఎలా అవుతారు? పాక్‌చరిత్ర నుంచి నేటి వరకు ఒక్క ఆధారం కూడా ఆదివాసి హిందువు అని చూపించే తార్కాణం ఏదీ కూడా లేదనేది స్పష్టాతిస్పష్టం. ఆదివాసి పూజా విధానంలో పురోహితులు ఉం డరు.ఆదివాసీలు ప్రత్యేక ఆచారాలతో పూజ నిర్వహించుకుంటారు.వారి పూజలు పకృతితో మిళి తమై ఉంటాయి. ఆదివాసీ పండుగలు, ఆచారాలు, కట్టుబాట్లు, జంతుబలులు, ఆహార అలవాట్లు, ఇలవేలుపు జాతరలు భౌగోళిక ప్రాంతాలవారీగా ఒక విలక్షణమైన పద్ధతిలో కొనసాగుతూ ఉన్నాయి. వీటన్నిటినీ ఈరోజు విశ్లేషించాల్సిన అవసరం ఉన్నది. ఆదివాసీ జీవనమే ఒక శాస్త్రీయ జీవనం. విగ్రహం ఆధారం లేనిపూజలు,ఈ సృష్టిలో భూగో ళాన్ని మించిన దైవం లేదని భూమిని కొలిచే భూమి పండుగ,మనిషికి ఆహారాన్ని అందించి ఆకలి తీర్చే ఉత్పత్తికి మూలమైన విత్తనాలను దైవంగా పూజించే విత్తనాల పండుగ ఆదివాసీల విశిష్ట జీవనశైలికి దర్పణాలు.ఉత్పత్తి ప్రక్రియలను ప్రకృతిలో అంతర్భా గంగా భావించి, పండుగలు చేసుకోవడం ఆదివాసీ ల విలక్షణత.ఉత్పత్తి ప్రక్రియలకు మించిన అంశా లు ఈ ప్రకృతిలో ఏమీ లేవు. కనుకనే ప్రకృతిలో ఉత్పత్తికి సంబంధించిన ప్రతి కదలికను ఆదివాసీలు పూజిస్తారు.రేలా పాటలు, కొమ్ము, దింసా, గుస్సాడీ దండారి పాటలు, అడవిలో ఆడే నెమలి ఆటలు, ప్రకృతిలో జంతువుల నుంచి నేర్చుకున్న కళలు. బాహ్యప్రపంచంతో సంబంధం లేని,దట్టమైన అడవులలో,కొండప్రాంతాలలో కల్మషం లేని విశిష్ట సంస్కృతి ఆదివాసీలది.మరి వారిని హిందువు లుగా భావించడం సబబేనా? ఈ వాస్తవాల దృష్ట్యా భారత రాజ్యాంగంలోని ఐదు,ఆరు షెడ్యూళ్లలో పేర్కొన్న ఆదివాసీ తెగలకు మతపరంగా ఒక నిర్దిష్ట గుర్తింపునివ్వాలి. ఇందుకు 2021 జనాభా గణన ప్రక్రియతో శ్రీకారంచుట్టాలి. ఆదివాసీలపై హిందూ, క్రైస్తవ,ముస్లిం మతాల పేరిట దాడులు జరిగినా, పరాయీకరణ కార్యక్రమాలు చేపట్టినా ఇందుకు బాధ్యులైన వ్యక్తులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు మోపాలి.గోండ్వానా,ఇతర గిరిజన తెగల సంస్కృ తులను సంరక్షించాలి. ప్రకృతిని సంరక్షించే ఈ అడవిబిడ్డల విలక్షణ మనుగడను కాపాడడం ప్రభు త్వాల నైతిక కర్తవ్యం.
వ్యాసకర్త : వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, తుడుం దెబ్బ