చిన్న రైతులు సతమతం
దేశంలో వ్యవసాయ కమతాలు నానాటికీ చిక్కిపోతున్నాయి. సాగు రంగానికి ఆలంబనగా ఉన్న చిన్న, సన్నకారు రైతులు అన్ని విధాలుగా చితికిపోతున్నారు. వ్యవసాయాన్ని ఏకంగా బడాసంస్థల పాలుచేసే ప్రభుత్వ ప్రయత్నాలు వారిని మరింత కుంగదీసేవే. కష్టనష్టాల కడలిలో చిక్కిన చిన్న రైతులను ఒడ్డున పడేసేందుకు సర్కారు సమగ్ర చర్యలు చేపడితేనే ప్రణాళిక లక్ష్యాలను చేరుకోగలం.దేశంలో సగానికి పైగా కమతాలు చిన్న, సన్నకారు రైతుల చేతిలోనే ఉన్నాయి. వీరి సంఖ్య పదికోట్లకు పైమాటే. వ్యవసాయమే వీరికి ప్రధాన ఆదాయ వనరు. ఏటా దాదాపు 15నుంచి 20లక్షలమంది చిన్న, సన్నకారు రైతులు అదనంగా చేరుతున్నారు.
వీరి కమతాల ఉత్పాదకత, నికర లాభాలు పెంచటానికి ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్న దాఖలా లేదు. ఆహారభద్రత వంటి భారీ లక్ష్యాలు పెట్టుకొన్న ప్రభుత్వం,చిన్న,సన్నకారు రైతులను విస్మరిస్తే భంగపాటు తప్పదని గ్రహించాలి. వాస్తవంలో, కమతాల విస్తీర్ణం ఆధారంగానే రైతులను వర్గీకరిస్తారు. ఒకటి నుంచి రెండు హెక్టార్ల కమతమున్నవారిని చిన్న రైతులని, అర హెక్టారు నుంచి ఒక హెక్టారు కమతం విస్తీర్ణమున్న రైతులను సన్నకారు రైతులని అంటారు. దేశంలో నేడు రైతంటే చిన్న, సన్నకారు రైతులే. మొత్తం రైతుల్లో 80శాతానికి పైగా వీరే. వీరితలసరి కమతం పరిమాణం అయిదు ఎకరాలు. మనరాష్ట్రంలోనూ కమతాల విస్తీర్ణం తగ్గిపోతోంది. 2005-06లో రాష్ట్రంలో మొత్తం 1.44కోట్ల హెక్టార్ల సాగు భూమి ఉండేది. అయిదేళ్లలో అది 1.42కోట్ల హెక్టార్లకు పడిపోయింది. చిన్న కమతాల సంఖ్య పెరగటంతో కొంత భూమి సాగుకు అందకుండా పోయింది. రాష్ట్రంలో చిన్నకారు రైతుల తలసరి కమతం విస్తీర్ణం 0.7హెక్టార్లు. మొత్తం కమతాల్లో 84శాతం వీరివే. సగానికి పైగా సాగు విస్తీర్ణం ఈ రైతులదే. అధిక దిగుబడులతో ఆహార భద్రతకు వూతమిస్తున్నది చిన్న రైతాంగమే. పండ్లు, కూరగాయల సాగులో అధిక వాటా వీరిదే. 70శాతం కూరగాయలు, 55శాతం పండ్లు, 52శాతం ధాన్యపు గింజలు, 69శాతం పాల ఉత్పత్తి వీరి కృషి ఫలితమే.
అందని విస్తరణ సేవలు
పంట సాగులో రైతుల పెట్టుబడి ఖర్చులు తగ్గాలన్నా, నాణ్యమైన అధిక దిగుబడులు సాధించాలన్నా, వ్యవసాయ విస్తరణ సేవలు కీలకం. జాతీయ నమూనా సర్వే ప్రకారం రైతుకు అందుతున్న ప్రభుత్వ విస్తరణ సేవలు తొమ్మిది శాతమే. ప్రైవేటురంగమే నయం. వారినుంచి 19శాతం సలహాలు అందుతున్నాయి. కానీ, వారి సేవలవల్ల పంటల ఉత్పాదకత పెరగటం లేదన్నది నిజం. ఏటా దాదాపు లక్షకోట్ల రూపాయలకు పైగా వ్యవసాయ విస్తరణ, పరి శోధనపై ఖర్చుపెడుతున్నామని ప్రభుత్వం చెబుతోంది. కానీ, ఆపరిశోధన ఫలాలు రైతులకు అందడం లేదు. పంట రుణాల విషయంలోనూ అదే పరిస్థితి. సకాలంలో పంటల ఉత్పత్తికి కావలసిన కారకాల కొనుగోలుకు పరపతి ముఖ్యం. ప్రభుత్వాలు గొప్పగా చెబుతున్న పంట రుణాలు చిన్న రైతుకు అందటంలేదు. బ్యాంకుల నుంచి రైతులకు అందుతున్న పరపతి కేవలం 15శాతమే. చిన్న, సన్నకారు రైతుల్లో అత్యధికులు పరపతి కోసం వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తోంది. పంటల మార్కెటింగ్‌లోనూ చిన్న రైతు చిత్తవుతున్నాడు. వీరి ఉత్పత్తుల పరిమాణం తక్కువగా ఉండటంవల్ల కనీస మద్దతు ధర పొందుతున్న సందర్భాలు చాలా తక్కువ. మార్కెట్ల అందుబాటూ అంతంతే. దేశంలో 30శాతం చిన్న, సన్నకారు రైతులకు నియంత్రిత మార్కెట్ సేవలు అందుబాటులో లేవు. వారు నేరుగా సంఘటిత మార్కెట్లోకి అడుగుమోపే అవకాశం లేదు. మార్కెటింగ్‌లో చిన్న, సన్నకారు రైతులను ఆదుకునేందుకు ‘రైతు ఉత్పత్తి సమాఖ్యలు’ ఏర్పాటు చేయాలని జాతీయ సలహా మండలి ఇటీవల ప్రభుత్వానికి నివేదించింది. దీనివల్ల చిన్న, సన్నకారు రైతులు సమాఖ్యగా ఏర్పడి, తమ ఉత్పత్తులను మార్కెటింగ్ చేసుకుని, గిట్టుబాటు ధర పొందేం దుకు వీలవుతుంది. ఉత్పత్తి కారకాలు, ఆర్థిక పరపతీ ఈ సమాఖ్య నుంచే చిన్న, సన్నకారు రైతులకు అందుతాయి. ప్రస్తుత ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల ద్వారా చిన్న, సన్నకారు రైతులకు తగినంత పరపతి అందటం లేదు. ఈ సంఘాల్లో సభ్యత్వం పొందటానికి సొంత భూమి ఉన్న రైతులే అర్హులు. ఎక్కువ మంది చిన్న, సన్నకారు రైతులు చిన్న కమతాలతో కౌలుదారులుగా సాగు చేస్తున్నారు. పరపతి సంఘాల్లోని సభ్యుల్లో 20శాతం లోపే చిన్న, సన్నకారు రైతులున్నారు. ఈసమాఖ్యల్లో భూమితో సంబంధం లేకుండా వారికి సభ్యత్వం ఉంటుంది. దేశమంతటా ఈతరహా సమా ఖ్యలు స్థాపించి, అమలు చేయడానికి పన్నెండో పంచవర్ష ప్రణాళికలో మొత్తం రూ.3,600కోట్లు అవసరమని అంచనా. 15నుంచి 20 గ్రామాలకు కలిపి 1000 నుంచి 1200 మందితో ఒక్కో సమాఖ్య ఉంటుంది. ఒక్కో రైతుకు షేర్ల రూపంలో వాటా ఉండి-ఆ ప్రకారం ఆదాయం వస్తుంది. వీటి స్థాపన కోసం కంపెనీల చట్టంతోపాటు మార్కెట్ యార్డు చట్టంలోనూ మార్పులు చేయాలని సలహామండలి సిఫార్సు చేసింది. ఆ దిశలో ప్రభుత్వం ఎంత త్వరగా ముందడుగు వేస్తుందో చూడాలి!
సంస్కరణల దుష్ప్రభావం
ప్రపంచీకరణ, వాణిజ్య సరళీకరణా చిన్న రైతులపై దుష్ప్ర భావం చూపుతున్నాయి. ముఖ్యంగా పత్తి, నూనెగింజల సాగు, ధరల వంటివి విదేశీ వాణిజ్య ధోరణులపై ఆధారపడుతున్నాయి. ఈ పంట లను చిన్న, సన్నకారు రైతులే ఎక్కువగా సాగుచేస్తున్నారు. విదేశాల్లో ఎక్కువ సబ్సిడీలవల్ల ఆ ఉత్పత్తులు దేశంలోకి సులభంగా ప్రవేశించి
చిన్న, సన్నకారు రైతుల ఉత్పత్తుల మార్కెటింగ్‌ను పెంపొం దించడానికి ప్రభుత్వం కొన్ని ప్రత్యేక అవకాశాలు కల్పించాలి.ఆ ఉత్పత్తులు ప్రకృతి సహజమైనవి. ఎక్కువ సేంద్రీయ ఉత్పత్తులు. అందువల్ల వాటిని ప్రత్యేకంగా అమ్ముకోనివ్వాలి. ప్రతినియంత్రిత మార్కెట్లో మొత్తం ఉత్పత్తుల్లో 15నుంచి 20శాతం వరకు చిన్న, సన్నకారు రైతుల ఉత్పత్తులు ఉండేలా ఆదేశించాలి. మారుమూల గ్రామాల్లో సైతం తక్కువ మోతాదు ఉత్పత్తులను కనీస మద్దతుధరకు కొనుగోలు చేసే కేంద్రాలు ఏర్పాటు చేయాలి. చిన్న రైతుల కమతాలు, ఉత్పత్తులను దృష్టిలో ఉంచుకుని వారికోసం ప్రత్యేక ప్రాయోజిత కార్యక్రమాలు చేపట్టాలి. స్వయంసహాయక బృందాల మాదిరిగా ‘చిన్న రైతు సహాయక బ ృందాలు’ ఏర్పాటు చేసి, వారితోనే ఉత్పత్తులను కొనుగోలు చేయించి, ప్రభుత్వం ధర చెల్లించాలి. పన్నెండో పంచవర్ష ప్రణాళికలో సమ్మిళిత వ ృద్ధే లక్ష్యంగా పెట్టుకున్నారు. వ్యవసాయ వృద్ధిరేటు నాలుగు శాతంగా నిర్ణయించారు. ముఖ్యంగా చిన్న రైతుల అభివ ృద్ధితోనే అవి సాధ్యం. అందువల్ల వ్యవసాయ పరిశోధన, విస్తరణ కార్యక్రమాలను, వ్యవసాయ విధి విధానాలను చిన్న, సన్నకారు రైతులకు ప్రయోజనం కలిగించే విధంగా రూపొందించాలి. చిన్న రైతుల చింత తీరేది అప్పుడే!-(రచయిత – డాక్టర్ పిడిగెం సైదయ్య)