గిరిజన సంప్రదాల్ని గుర్తించిన పీసా చట్టం
గిరిజనుల సంస్కృతి సాంప్రదాయాల్లో ముఖ్యమైనది స్వయం పరిపాలన. ఎప్పుడో హిందు రాజులు, మొగల్ సామ్రాజ్యం, దాని తరువాత బ్రిటిష్ నైజాం నవాబుల పాలనలో స్వయం పరిపాలన అధికారాలు కోల్పోయిన గిరిజనులు నిర్విరామంగా పోరాటాలు చేస్తోనే ఉన్నారు. బ్రిటిష్ ప్రభుత్వం అయితే గిరిజన ప్రాంతాలను షెడ్యూలు ప్రాంతాలుగా 1874లోనే గుర్తించి సామాన్య పరిపాలన నుండి తప్పించారు. గిరిజనుల సార్వ భౌమధికారాన్ని కాలరాసేయడం వల్ల అలజడులు వస్తున్నాయని గుర్తించకపోగా హిందు రాజుల ప్రోద్భలంతో వీరు తిరుగుబాట్లు చేస్తున్నారని బ్రిటిష్ వారు అభిప్రాయపడ్డారు. సుమారు 150 సంవత్సరాలుగా అదే అభిప్రాయం కొనసాగుతోంది. అయితే అప్పుడప్పుడు అలజడులకు కారణాలు తెలుసుకునేందుకు కమీటీలను వేసి వాటి ద్వారా విషయాలు సేకరించేవారు. అయినా గిరిజన ప్రాంతాలను చీకట్లో ప్రాంతాలుగా చిత్రీకరించడం మానలేదు. అందువల్ల శాంతిని నెలకొల్పేందుకు పోలీసు బలగాల ఉపయోగం పెరిగింది. కాని మొదట షెడ్యూలు ప్రకారం శాంతి, సుపరి పాలన జరిగేందుకు ప్రయత్నాల చేయడం యాదృచ్చికమే! ఒకానొక సమయంలో ఐదవ షెడ్యూలు ప్రాంతంలో చాలా భాగం కల్లోలిత ప్రాంతంగా కేంద్రహోంశాఖ గుర్తించింది. మరోపక్క రాజ్యాంగం 46వ ఆర్టికల్ ప్రకారం గిరిజనులకు రక్షణ కల్పిస్తూ విద్య, అర్థికా భివృద్ధిని చేపట్టాలని ఉన్నా ఆచరణ మాత్రం అంతంతే. రాజ్యాంగం ఐదవ షెడ్యూలులో ప్రభుత్వ అధికారుల (గవర్నరు) ద్వారా శాంతి, సుపరిపాలన సాధించాలని నిర్దేశించినా అది సాధ్యం కాలేదు. ఎందుకంటే అధికార యంత్రాంగం తమ స్వార్థం కోసమే పనిచేసింది. అక్కడకు బదిలీ అయినవాళ్ళు చాలామంది వెళ్ళకుండా ప్రయత్నం చేసుకుంటే, తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్ళిన వాళ్ళు అక్కడ ఉన్న సంసారాన్ని చెడగొట్టేరు. ఫలితంగా గిరిజనులకే శిక్షపడిరది. ఇదంతా వివరంగా చర్చించిన తరువాత పంచాయితీ రాజ్ వ్యవస్థలో గిరిజన ప్రాంతాలలోని పంచాయితీలకు ప్రత్యేక అధికారాలు ఇవ్వాలని 1992 లో నిర్ణయం జరిగింది.
వారి ప్రపంచం వేరు
73వ రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయితీ రాజ్ చట్టం, 1992 తీసుకు వచ్చేటప్పుడు ఈ చట్టం షెడ్యూలు ప్రాంతాలకు యధాతధంగా అమలు చేయరాదని నిర్ణయించారు. గిరిజన ప్రాంతాలలో స్వయం పాలనా వ్యవస్థ, ముఖ్యంగా సామాజిక వ్వవహారాల్లో ఇంకా పటిష్టంగానే ఉందనే విషయాన్ని గుర్తించారు. అయితే బయటి ప్రపంచంతో సంబంధాలు ఎక్కువ అవుతున్న సందర్భంలో ఉత్పన్నమౌతున్న సవాళ్ళను మాత్రం సాంప్రదాయక వ్యవస్థ ఎదుర్కోలేక పోతోంది. అందువల్ల షెడ్యూల్ ప్రాంతాలలో ఎన్నుకోబడిన పంచాయితీలకు అధికార వికేంద్రీకరణతో పాటు కొన్ని ప్రత్యేక అధికారాలు ఇవ్వాలని కూడా ఆలోచించారు. షెడ్యూలు ప్రాంతంలోని పంచాయితీలకు ఏ ఏ ప్రత్యేక అధికారాలు ఇవ్వాలో నిర్ణయించేందుకు దిలీప్ సింఫ్న్ ఛూరియా నాయకత్వంలో ఒక కమీటీని నియమించారు. ఈ కమీటీలో గిరిజన ప్రాంతాలలో చాలా కాలం పనిచేసిన నిష్ణాతులు ఉన్నారు.షెడ్యూలు ప్రాంతాలలో పంచాయితీలకు ప్రత్యేక అధికారాలపై ఎన్నో సూచనలు ఇచ్చేరు. అయితే ఆదిలోనే హంసపాదు అన్నట్లు వీటిలో కొన్నింటినే ప్రభుత్వం ఆమోదించి 1996లో కేంద్ర పీసాచట్టం (40వ ఏక్టు 1996)రూపంలో పార్లమెంటు ఆమోదం పొందింది. కేంద్రచట్టం అనుసరించి ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ (సవరణ) చట్టం 1998లో వచ్చింది. ఈ చట్టం అమలుకు కావలసిన రూల్సు 2011 సంవత్సరంలో అంటే 13 సంవత్సరాల తరువాత వచ్చాయి. రాజ్యాంగ సవరణ 1992లో జరిగితే పీసాచట్టం అమలుకు కావలసిన మార్గదర్శకాలు (రూల్సు) వచ్చేందుకు ఆంధ్రప్రదేశ్‌లో 19సంవత్సరాలు పట్టింది. డిల్లీ నుండి హైదరాబాదుకు అంతదూరమా? 2011లో రూల్సు వచ్చేసరికి పంచాయతీలు గడువు కాలం తీరింది. 2014లో పంచా యితీ ఎన్నికలు అయినా కనే పీసా పంచాయ తీలు పనిచేసే అవకాశం కలిగింది. పీసా పంచాయతీలను రూల్సు ప్రకారం ప్రకటించవలసిన భాద్యత గిరిజన సంక్షేమశాఖది. దీనికి జిల్లా కలెక్టరు దగ్గరనుండి ప్రతిపాదనలు రావాలి. దీనికోసం మరింత జాప్యం జరిగింది. ప్రభుత్వంలో కొంత మంది విజ్ఞులు ఉంటారు. ఏదైనా పనిచేయకూడదు. అని వారు అనుకుంటే జాప్యం చేస్తే సరి అనే విధానం పాటిస్తారు. పంచాయితీలకు ఇవ్వవలసిన అధికారాలు అన్నీ ఇప్పటికే కొన్ని డిపార్టుమెంటు అధికారులు అనుభవిస్తున్నారు. లాభడుతున్నారు. కూడా. అందువల్ల అధికారాలు బదలాంచడాన్ని ఇష్టపడరు. అలాగని చట్టం అమలు చేయకపోతే ఇబ్బందుల్లో పడతారు. కాలయాపనే మార్గంగా ఎంచుకుంది అధికార వ్యవస్థ. సరే, చట్టం ప్రకారం పంచాయతీలకు సంక్రమిస్తున్న అధికారాలు ఏమిటి? అనేది క్లుప్తంగా తెలుసుకుందాం.
ఆదివాసీ పంచాయితీ అధికారాలేమిటి?
అన్నిటికంటే ముఖ్యమైనది ‘పీసా గ్రామం’ నిర్వచనం. గిరిజనుల ఆచారాల ప్రకారం గుర్తించబడి, వారే పాలన చేసుకునే ప్రాంతాలు: ఆవాసం/శివారు గ్రామాలు/ సముదాయాల పీసా గ్రామాలుగా గుర్తించాలి. అంటే ప్రతి ఆవాసానికి గ్రామ సభ ఉంటుంది. ఇంతకు ముందు గ్రామసభ పంచాయితీ ముఖ్య గ్రామానికే పరిమితం అవుతోంది. ఆ పంచా యితీలో నున్న శివారు గ్రామాలకు ప్రాతినిధ్యం కాగితాలకే పరిమితం రెండవది, అంతే ముఖ్యమైనది పాలనా వ్యవస్థ. గ్రామపంచాయితీ పాలన వారి ఆచార వ్యవహారాలను, సాంస్కృతిక ప్రత్యేకతను రక్షిస్తూ తదనుగుణంగా పరిపాలన చేసుకోవచ్చు. అయితే ప్రస్తుతం అమలులో ఉన్న చట్టాలకు వ్యతిరేకంగా ఈ పాలన ఉండకూడదు. గిరిజన సంస్కృతికి, చట్టాలకు మధ్య సంఘర్షణ ఉన్నప్పుడు చట్టాలదే పైచేయి అవుతుంది. అటువంటప్పుడు గిరిజన సంప్రదాయక చట్టాలు పనికిరావు. ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే గిరిజన సంప్రదాయక పరిపాలనా వ్యవస్థను క్రోడీకరించలేదు. అందువల్ల న్యాయవ్యవస్థ గుర్తించదు. ఒడిసా రాష్ట్రంలో నియామ్‌గిరి కొండల్లో బాక్సైటు గనులకు వేదాంతా (బహుళదేశ) కంపెనీకి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చినప్పుడు ఆ ప్రాంతంలో నివసించే డోంగ్రియా ఖోండులు అనే చాలా వెనుకబడిన గిరిజన తెగవారు అభ్యంతరం తెలిపారు. ఆ కొండల్లో తమ ఆరాధ్య దైవమైన నియామ్‌గిరి రాజు నివసిస్తాడని, బాక్సైటు గనులు త్రవ్వటం వల్ల గిరిజన వ్యవస్థ దెబ్బతింటుందని గ్రామ సభ తీర్మానం ద్వారా తెలిపేరు. దాంతో బాక్సైటు గనుల త్రవ్వకం ఆపేసింది సుప్రీంకోర్టు. అందువల్ల పీసా చట్టం వల్ల గిరిజన సంప్ర దాయాలను కాపాడుకునే అవకాశాలు చాలా ఉన్నాయి. వీటిని ఉపయోగించుకోవాలి. షెడ్యూలు ప్రాంతాలలో గ్రామసర్పంచులు మండల అధ్యక్షులు గిరిజనులే ఉండాలని, పీసా చట్టంలో ఉందికాని ఎం.పి.టి.సి, జెడ్.పి.టిసి వ్యవస్థ దీన్ని దెబ్బతీస్తోంది. గ్రామ ప్రణాళిక తయారు, అమలు, పర్యవేక్షణ, లబ్దిదారుల ఎన్నిక గ్రామ సభదే. అయితే బయటి వారి ప్రమేయం ఎక్కువగానే కనిపిస్తుంది. దీనికి తోడు అధికారుల దొంగ లెక్కలు కలుస్తే అబ్దిదారులు జాబితా తప్పులు తడకలే. షెడ్యూలు ప్రాంతాలలో భూసేకరణ, పునరావాస ప్రణాళిక, అమలులో గ్రామసభ, ఆ పై పంచాయితీ రాజ్ వ్యవస్థల ఆమోదం ద్వారానే జరగాలి. అసలు సంప్రదింపులు కూడా జరగని సందర్భాలు చాలా ఉన్నాయని గిరిజన ప్రజాసంఘాలు చెబుతాయి. షెడ్యూలు ప్రాంతంలో భూమి అన్యాక్రాంతం కాకుండా చూడడం, ఇంతకుముందు అన్యాక్రాంతం అయిన భూమిని గిరిజనులకు తిరిగి ఇప్పించటం లాంటివి చేపట్టేందుకు గ్రామసభకు అధికారాలు ఉన్నాయి. అయితే చట్టం అమలు పరిచే స్థోమత గ్రామసభలకు కల్పించలేదు, చాలాచోట్ల అవగాహనేలేదు. చిన్నతరహా అటవీసంపదపై ఆస్థిహక్కు, మార్కెట్టుపై అజమాయిషీ కూడా గ్రామ సభకు ఉన్నాయి. కాని జి.సి.సి అటవీశాఖలకు కూడా ఈ హక్కులు ఇంకా ఉన్నాయి. గ్రామ సభలకు ఈ వ్యవస్థలను వ్యతిరేకించే స్థోమత లేదు. వడ్డీ వ్యాపారం నియంత్రణకు కూడా గ్రామసభకు అధికారం ఉంది. కాని బ్యాంకులు పనిచేయని చోట్ల వడ్డీ వ్యాపారులే దిక్కు అయినప్పుడు ఈ అధికారం చలాయించడం కష్టమే. ఇక స్థానిక సంస్థలు అధికారులపై అజమాయిషీ హక్కులు ఉన్నా వారిని నియంత్రించే స్థోమత గ్రామ పంచాయితీలకు లేదు. ఉద్యోగులకు బలమైన సంఘాలు ఉన్నాయి. గిరజన పంచాయితీ గ్రామసభలను చైతన్య పరిస్తేనే స్వపరిపాలన సాధ్యం. ఆలోచించండి.
స్వపరిపాలన వారి సంస్కృతికి మూలం
వాడుక భాషలో గిరిజనులు అని పిలువబడే వారిని రాజ్యాంగపరంగా షెడ్యూలు తెగలు అని పిలుస్తారు. మన దేశానికి స్వాతంత్య్రం రాకముందు గిరిజనుల్ని వివిధ పదాలతో పిలిచేవారు. వనవాశి, గిరిజన్, ఆదిమజాతి లాంటి పదాలు ఉపయోగించేవారు. పురాణాలలోను, ఇతిహాసాలలోను గిరిజనుల గురించి ముఖ్యంగా దండకారణ్యం గురించి వివరాలు ఉన్నాయి. గిరిజనుల నాగరికత చాలా పురాతనమైనది. వారికి రాజ్యాలు ఉండేవి. కోటలు ఉండేవి. వారికి భాష ఉంది. సంఖ్యా పరిజ్ఞానం, మాసాలు, ఋతువులు లాంటి లెక్కలు కూడా ఉన్నాయి. సాహిత్యం, సంగీతం, వాయిద్య సహకారం అత్యున్నత స్థాయికి చేరుకుంది. స్వపరిపాలన వారి సంస్కృతికి మూలాలు చాలా గిరిజన సంస్కృతి లో కనిపిస్తాయి. అయితే కాలక్రమేణా వారి రాజ్యాలు, హిందూ రాజులు, మొగలులు, నిజాములు, బ్రిటిష్‌వారి చేతుల్లోకి వెళ్ళిపోయాయి. వారి జీవన విధానానికి తీవ్రమైన ఇబ్బందులు కలిగాయి.1901 జనాభా లెక్కల నాటికి బ్రిటిష్ ప్రభుత్వం గిరిజనుల్ని ‘ఏనిమిస్ట్’ లుగా పిలిచేవారు. కాని అప్పటి జనాభా కమిషనర్ అయిన శ్రీ హట్టన్, ఏనిమిస్ట్‌లను హిందువుల నుంచి నేరుగా పరిగణించటం కష్టం అవుతోందని వర్ణించారు. అయితే గిరిజన ప్రాంతాలు మాత్రం మిగిలిన ప్రాంతాలకంటే భిన్నంగా ఉంటాయని, వాటి పరిపాలన సామాన్య పరిపాలనతోటి కలపరాదని భావించి, బ్రిటిష్ ప్రభుత్వం ఆయా ప్రాంతాలను షెడ్యూలు జిల్లాలుగా 1874లోనే ప్రకటిం చారు. అలాగే హైదరాబాద్ ప్రభుత్వం 1949 లో నోటిఫైడ్ ప్రాంతాలుగా గుర్తించింది. బ్రిటిష్‌వారు వీరిని హిల్‌ట్రెబ్స్ అనిపిలిస్తే, హైదరాబాద్ ప్రభుత్వం నోటిఫైడ్ ట్రెబ్స్‌గా పిలిచారు. వారి భూమి రక్షణకై చట్టాలు కూడా చేశారు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత, ముఖ్యంగా 1960నుంచి గిరిజనులు నివసించే మారుమూల కొండ ప్రాంతాలు రోడ్లతో కలుపబడ్డాయి. బయటి ప్రాంతాల ప్రజలు మొదటి వ్యాపారానికి వచ్చి, తరువాత వ్యవసాయానికి స్థిర నివాసం ఏర్పాటు చేసుకు న్నారు. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు అమ ల్లోకి వచ్చాయి. గిరిజన సంతలు- బయటి మార్కెట్టు ప్రభావానికి లోనయ్యాయి. భారత రాజ్యాంగంలో 366 ఆర్టికల్‌లో షెడ్యూలు తెగల గురించి నిర్వచించడం జరిగింది. రాజ్యాంగంలో 342 ఆర్టికల్ ప్రకారం రాష్టప్రతి ప్రకటించిన గిరిజన తెగలు కాని, సమాజాలు కాని, వాటిలో భాగాలు కాని, గిరిజన తెగలు గుంపులను షెడ్యూలు తెగలుగా గుర్తిస్తారు. కొన్ని తెగలను ఈ లిస్టులో చేర్చడానికి కానీ, తీసివేయడానికి కాని పార్లమెంట్‌కు అధికారం ఉంది. వీరిని రాజ్యాంగపరంగా షెడ్యూలు తెగలు అంటారు. కేంద్ర గిరిజన సంక్షేమశాఖ వారి లెక్కల ప్రకారం దేశంలో 50 షెడ్యూలు తెగలు వున్నాయి. వారిలో 75 షెడ్యూలు తెగలు, ఇంకా పురాతన సాంకేతిక స్థాయిలో ఉండి ఆర్థికంగా, విద్యాపరంగా చాలా వెనుకబడి వున్నాయి. వారిని పి.టి.జి. (ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్సు)గా పిలుస్తారు. 2011 జనాభా లెక్కల ప్రకారం 10.42 కోట్ల షెడ్యూలు తెగల జనాభా ఉంది. అది దేశ జనాభాలో 8.6 శాతం. మధ్య భారతదేశం, దక్షిణ భారతదేశంలో గిరిజన జనాభా ఎక్కువగా ఉంది. ఈశాన్య భారతదేశంలో షెడ్యూలు తెగల జనాభా సాంద్రత ఎక్కువగా వుంది. దేశంలోని గిరిజన జనాభాలో 89.96 శాతం గ్రామీణ ప్రాంతాలలోనే ఉన్నారు.ఏదైనా తెగను కాని, భాగాన్ని కాని, సముహల్ని కాని షెడ్యూలు తెగలుగా గుర్తించేందుకు లోకూర్ కమిటీవారు కొన్ని ప్రామాణికాల్ని నిర్ధేశించారు. అవి (1) అతి పురాతన సాంకేతిక విధానం (ఆహార సేకరణ, పోడు వ్యవసాయం), (2) ప్రత్యేక సంస్కృతి (్భష, ఆచారాలు, నమ్మకాలు, కళలు లాంటివి), (3) ప్రత్యేక నైవాశిక ప్రాంతం (అడవి, కొండలు లాంటివి), (4) బయటివారితో కలవడానికి ఇష్టపడకపోవడం, (5) బాగా వెనుకబడి వుండటం (మానవా భివృద్ధి సూచికలు- విద్య, ఆరోగ్యం, ఆదాయం లాంటి వాటివి) ఆర్టికల్ 244 (1) ప్రకారం రాష్టప్రతి షెడ్యూలు ప్రాంతాలను ప్రకటిస్తారు. గిరిజనుల సాంద్రత ఎక్కువగా వున్న ప్రాంతా లు, పరిపాలన సౌలభ్యం ఉండే ప్రాంతాలు, ఆర్థికంగా వెనుకబడ్డ ప్రాంతాలను షెడ్యూలు ప్రాంతాలుగా గుర్తిస్తారు. అయితే భారత రాజ్యాంగం రాకముందే ఉన్న ఏజెన్సీ ప్రాంతాలే రాజ్యాంగం తరువాత ఇంచుమించుగా షెడ్యూ లు ప్రాంతాలుగా గుర్తించడం జరిగింది.- తేజావత్ నందకుమార్ నాయక్