కొండరెడ్లకు కొండంత కష్టాలు

కొండరెడ్లు గోదావరికి ఇరువైపుల ఉన్న పాపికొండల ప్రాంతంలో నివసిస్తారు. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాలలోఈ ప్రాంతం విస్తరించిఉంది. సాంకేతికంగా ఇంకా వ్యవసాయ పూర్వపు విధానాలు ఈమధ్యవరకు అవలం భించడంవల్ల ఆర్థికంగా వెనుకబడి ఉన్నారు. అందువల్ల ప్రభుత్వం వీరిని చాలా వెనుకబడిన గిరిజన తెగలు (పివిటిజి) జాబితాలో చేర్చింది. అయితే సాంస్కృతికంగా ఎంతో ఉన్నత స్థాయిని అందుకున్నారు కొండరెడ్లు. – గునపర్తి సైమన్

కొండరెడ్ల ఉనికి ప్రశ్నార్థకమే…!
పోలవరం ప్రాజెక్టు ముంపు మండలాల్లో నివసిస్తున్న గిరిజనుల్లో కొండరెడ్లు ప్రధానమైనవారు. శతాబ్దాలుగా సజీవంగా ఉన్న గిరిజన తెగ ఉనికి ఇప్పుడు ప్రశ్నార్థమైంది. విలక్షణమైన వీరి జీవనవిధానం, సంస్కృతి, సంప్రదాయాలు ఇక కాలగర్భంలో కలిసిపో తాయని చరిత్రకారులు, ఆంత్రోపాలజిస్టులు ఆందోళన చెందుతు న్నారు. ఇంతకాలం పచ్చటి అడవుల్లో, కొండల్లో ప్రశాంతంగా జీవించిన కొండరెడ్లు పోలవరం ప్రాజెక్టు కారణంగా చెల్లాచెదురై పోతారని, వారి బతుకులు అధ్వానమైపోతాయని అంటున్నారు. పోలవరం కారణంగా కూనవరం మండలంలోని ఏరువాడ గట్టుపై ఉన్న మూడు కొండరెడ్ల గ్రామాలు, కూనవరం నుంచి చింతూరు వరకూ ఉన్న కూనూరుగడ్డ గుట్టలపై ఉన్న 12 గ్రామాలు, రేఖపల్లి నుంచి తుమ్మలేరు వరకు ఉన్న కొండరెడ్ల గ్రామాలు కనుమరుగ వుతాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో ఉన్న 33 ఆదివాసీ తెగల్లో కొండరెడ్ల తెగ ఒకటి. ఈ తెగ రాతియుగానికి చెందిందని పరిశోధకులు చెబుతున్నారు. తూర్పుకనుమల్లో ముఖ్యంగా గోదావరికి ఇరు పక్కలా గుట్టలపై దట్టమైన అరణ్యాల్లో నివసించే అరుద్కెన గిరిజనులు కొండరెడ్లు. కొండరెడ్డి అంటే కొండలపై నివసించే మనిషి అని అర్థమట…! తాము సూర్యవంశానికి చెందినవారమని చెప్పుకునే కొండరెడ్లు స్వాభావికంగా అమాయకులు. నిగర్వంగా,నిరాడం బరంగా, ఆధునిక సమాజానికి దూరంగా గుట్టలపై జీవిస్తుం టారు. వీరి గ్రామాల్లో ఈనాటికీ మౌలిక సౌకర్యాలు లేవు. రహదా రులు, విద్యుత్తు, విద్య, వైద్య మొదల్కెనవి కరువే. మూఢ నమ్మకాలు, బహు భార్యత్వం, బాల్య వివాహాలు, మంత్రతంత్రాలు ఇలాంటివెన్నో వీరి జాతిలో ఈనాటికీ ఉన్నాయి. విచిత్రమేమిటంటే ఆధునికులుగా, నాగరికులుగా చెప్పుకునే గిరిజనేతరులు వీరి నుంచి నేర్చుకోవాల్సిన కొన్ని మంచి విషయాలు కూడా ఉన్నాయి. కొండరెడ్లను ప్రధాన జన జీవన స్రవంతిలో కలపాలని ప్రభుత్వాలు కోట్లు ఖర్చు చేస్తున్నా ఈనాటికీ అది పూర్తి ఫలితాలు ఇవ్వలేదు.
పోడు వ్యవసాయమే జీవనాధారం
గుట్టలపై నివసిస్తున్న కొండరెడ్లకు పోడువ్యవసాయమే ప్రధాన జీవనాధారం. కొండలపైవాగులకు దగ్గరగా ఉన్న భూము లను చదును చేసుకొని పోడు వ్యవసాయం చేస్తుంటారు. జొన్నలు, సజ్జలు, రాగులు, కొర్రలు మొదల్కెన వర్షాధార పంటలు పండిస్తారు. వీరు నిరక్షరాస్యులు కావడం, నాగరిక సమాజానికి దూరంగా ఉండటంతో ఆధునిక వ్యవసాయ విధానాలు తెలియవు కాబట్టి ప్రకృతి కరుణిస్తేనే పంట చేతికొస్తుంది. అయితే ఆధునిక పోకడలు సంతరించుకున్న కొందరు కొండరెడ్లు సాధారణ రైతులతో పోటీ పడి పంటలు పండిస్తున్న దాఖలాలు కూడా ఉన్నాయి. ఇలాంటివారు తమ పిల్లల్ని పాఠశాలలకు పంపి పట్టుదలగా చదవిస్తున్నారు కూడా. అయితే మొత్తం మీద చూస్తే ఇలాంటివారి శాతం చాలా తక్కువ. పోడు వ్యవసాయంతో పాటు వెదురుతో తట్టలు, బుట్టలు, చాపలు, తడికెలు మొదల్కెనవి తయారుచేసి వారపు సంతల్లో అమ్ముతారు. అడవుల్లో లభ్యమయ్యే తేనె, జిగురు, చింతపండు తదితరాలూ విక్రయిస్తారు. వర్షాకాలంలో పనులు దొరక్క ఆకలితో అల్లాడు తుంటారు. శనగగడ్డలు, జీలుగుచెక్క, మామిడి టెంకలు వీరికి ఆహారం. కొండరెడ్లలో 30శాతం మంది అడవుల్లో లేదా వాటికి దగ్గరగా నివసిస్తుంటారు. వీరు ఇళ్లలోనే అనేక పండ్లచెట్లు పెంచు తుంటారు. చింతచెట్లను ఉమ్మడి ఆస్తిగా పరిగణిస్తారు. అనేక గిరిజన జాతుల్లో మాదిరగానే కొండరెడ్లకు కూడా వేట ప్రధాన వ్యాపకం. మగవారు ఎప్పుడూ విల్లంబులతో తిరుగుతూ జంతువులను వేటాడుతుంటారు. వేటాడిన జంతువుల మాంసాన్ని సమష్టిగా పంచు కుంటారు. చేపల వేట కూడా ఉమ్మడిగానే సాగిస్తారు.
సంప్రదాయాలు…వేషధారణ
కొండరెడ్ల సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు చిత్రంగా ఉంటాయి. వారు వీటిని కట్టుబాట్లు అంటే, ఆధునికులు మూఢ నమ్మకాలు అంటారు. ప్రధానంగా చెప్పుకోవల్సినవి బాలికలు రజస్వల లేదా పుష్పవతి (మెచ్యూర్‌) కాగానే ఇళ్లకు దూరంగా ‘కీడుపాక’ పేరుతో ఓ చిన్నఇల్లు తయారుచేసి వారంరోజులు అక్కడే ఉంచుతారు. గర్భవతులను కూడా ప్రసవ సమయంలో అక్కడే ఉంచి ప్రసవమ య్యాక వారం రోజుల తరువాత ఇంటికి తీసుకొస్తారు. ముత్యాలమ్మ, గంగానమ్మ, భూదేవి, గండమ్మ మొదల్కెన దేవతలను కొలుస్తారు. వీరిని కొండ దేవతలంటారు. భూత వైద్యాన్ని ఎక్కువగా నమ్ముతారు. అనారోగ్యం కలగ్గానే భూతవైద్యుడిని తీసుకొచ్చి వైద్యం చేయిస్తారు. అంటురోగాలొస్తే రకరకాల పూజలు చేస్తుంటారు. వీరిలో ఎక్కవ మంది కొండలు దిగి ఆస్పత్రులకు వెళ్లేందుకు ఇష్టపడరు. దానికితోడు డబ్బు లేకపోవడం, రహదారులు, బస్సులు కరువువడంతో స్థానకం గానే నాటు వైద్యం చేయిస్తుంటారు. ఇళ్ల దగ్గర ఉన్నప్పుడు పురుషులు ఎక్కువమంది చొక్కా లేకుండా గోచీలతో కనబడతారు. ఆడవారు చినిగిన, మాసిన బట్టలతో ఉంటారు. శుభకార్యాలకు వెళ్లేటప్పుడు మగవారు నిక్కర్లు, చొక్కాలు వేసుకుంటారు. ఆడవారు చీరలు కట్టుకుంటారు. మహిళలు చెవులకు వెండి దిద్దులు, ముక్కుపుడకలు పెడతారు. మెడలో రకరకాల కడియాలు వేసుకుంటారు. కాళ్లకూ కడియాలు, పట్టలు ధరిస్తారు. సంతల్లో దొరికే గిల్టు నగలు ఎక్కువగా కొంటారు. కొండరెడ్ల యువతులు, యువకులు ఫ్యాషన్ల వైపు మొగ్గు చూపుతున్నారు.
వివాహాలు
కొండరెడ్లలో వివాహాలు మూడు రకాలుగా జరుగుతాయి. వీటిల్లో బలవంతంగా పెళ్లి చేసుకోవడం ఒక రకం. దీన్ని ‘మొగనాలు’ అంటారు. పురాణాల్లో కనిపించే రాక్షస వివాహం వంటిదే ఇది. అమ్మాయి, అబ్బాయి ఎవ్వరికీ చెప్పకుండా వెళ్లిపోయి పెళ్లి చేసుకో వడం మరోటి. పెద్దలు కుదిర్చినపెళ్లి ఇంకోటి. వీరి వివాహాల్లో కట్నం ప్రసక్తి ఉండదు. బహుభార్యత్వం, పునర్వివాహాలు వీరిలో సాధారణం. ముఖ్యంగా తమ్ముడు చనిపోతే అతని భార్యను అన్న వివాహం చేసుకునే ఆచారం ఉంది.
పండుగలు
కొండరెడ్లు మూడు రకాల పండుగలు జరుపుకుంటారు. వానలు కురవగానే జరుపుకునే పండుగను భూదేవి పండుగ అంటారు. వ్యవసాయ పనులు ప్రారంభించేముందు పందిని బలి ఇచ్చి పనులు ప్రారంభిస్తారు. పంటలు చేతికొచ్చే సమయంలో కోతల పండుగ చేస్తారు. మరొకటి మామిడికాయల పండుగ. కొండరెడ్లు నివసించే ప్రాంతాల్లో మామిడికాయలు ఎక్కువగా కాస్తాయి. అవి పక్వానికి వచ్చేవరకూ ఎవ్వరూ ముట్టుకోరు. పక్వానికి వచ్చాక గ్రామ పెద్ద అయిదారు కాయలు కోసి పూజ చేసి (దీన్ని గొందికి పెద్దడం అంటారు) పెద్దలకు పంచుతాడు. అప్పటి నుంచి మామిడి పండ్లు తినడం ప్రారంభిస్తారు. పండుగులు, జాతర్లు సమయంలో ఆట పాటలతో సంతోషంగా కాలం గడుపుతారు. ఆసమయంలో ప్రత్యే కంగా వస్త్రధారణ చేస్తారు. జంతువుల కొమ్ములతో, నెమలి ఈకలతో అలంకరించుకుంటారు. పురుషులు కోయడోళ్లు వాయిస్తారు. ఆడవారు గిల్లలు మోగిస్తారు. వీరి గిరిజన నృత్యాలు చూడముచ్చటగా ఉంటా యి. వీరి డప్పు నృత్యం, కొమ్ము డ్యాన్స్‌ పాపులర్‌. పండుగల సమయాల్లో తెల్లవారేవరకూ ఆడ,మగ కలిసి కల్లు సేవిస్తారు. జీలుగు కల్లు వీరి ప్రత్యేకత.
అంతరిస్తున్న గిరిజన జాతుల్లో ఇదొకటా?
ప్రపంచంలో ఇప్పటికే అనేక ప్రాచీన గిరిజన జాతులు అంతరించిపోయాయి. ఇప్పడు పోలవరం ప్రాజెక్టు ముంపు కారణంగా కొండరెడ్ల జాతి కూడా అంతరించే అవకాశముందని సామాజిక శాస్త్ర వేత్తలు చెబుతున్నారు. వారుకొన్ని శతాబ్దాలుగా జీవించిన ప్రాంతం మునిగిపోయిన తరువాత కొత్త ప్రాంతంలో కృత్రిమంగా జీవితం సాగించాల్సిందే తప్ప ఆసహజత్వం ఉండదు. ప్రభుత్వ పునరావాస కార్యక్రమాలు ఎంత చక్కగా అమలు జరుగుతాయో అందరికీ తెలిసిన విషయమే. ఏదిఏమైనా కొండరెడ్ల ఉనికిని కాపాడాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మీద ఉంది.
మర్యాదస్తులు కొండరెడ్లు
కొండరెడ్లు గోదావరికి ఇరువైపుల ఉన్న పాపికొండల ప్రాంతంలో నివసిస్తారు. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాలలోఈ ప్రాంతం విస్తరించిఉంది. సాంకేతికంగా ఇంకా వ్యవసాయ పూర్వపు విధానాలు ఈమధ్యవరకు అవలం భించడంవల్ల ఆర్థికంగా వెనుకబడి ఉన్నారు. అందువల్ల ప్రభుత్వం వీరిని చాలా వెనుకబడిన గిరిజన తెగలు (పివిటిజి) జాబితాలో చేర్చింది. అయితే సాంస్కృతికంగా ఎంతో ఉన్నత స్థాయిని అందుకున్నారు కొండరెడ్లు. ఆవిశేషాల సమాహారమేనని ప్రముఖ గిరిజన ప్రరిశోధ కులు డా॥విఎన్‌వికె శాస్త్రి అభిప్రాయపడ్డారు. కొండరెడ్లపై ఆయన చేసిన పరిశోధన..జీవన శైలి విశేషాలు..!
కొండరెడ్ల జీవన విధానాలపై1945లో హేమండార్ఫ్‌ రాసిన ‘రెడ్డీస్‌ ఆఫ్‌ బైసన్‌ హిల్స్‌’ పుస్తకం ఇప్పటికీ ప్రామాణికమే. నేను 1968-72 ప్రాంతంలో పశ్చిమ గోదావరి జిల్లాలోని తూటిగుంట, గెడ్లపల్లి, ప్రాంతంలోని కొండరెడ్డి గ్రామాలలో నెలలతరబడి నివసించాను. ఇంకా చాలామంది కొండరెడ్ల మీద పరిశోధనా పత్రాలు, వ్యాసాలు రాశారు. వీటి సారాంశమే ఈ వ్యాసానికి ఆధారం. కొండరెడ్ల ప్రాంతం సందర్శించి వచ్చిన వారి మొట్టమొదటి అవగాహన వారి భాషమీద ఉంటుంది. వారి మాతృభాష తెలుగే అయినా ఆ స్వచ్ఛత నేను మైదాన ప్రాంతంలో కూడా ఎక్కడా చూడలేదు. 1972 ప్రాం తంలో నేను అక్కడ ఒకపరిశోధన నిమిత్తం వెళ్లాను. వారిఆర్థిక జీవనంపై పరిశోధన జరపాలి. పశ్చిమగోదావరి జిల్లా గెడ్డపల్లి గ్రామంలో మకాం పెట్టి ఆచుట్టుపక్కల గ్రామాలు తిరగాలి. అసలు గెడ్డపల్లి గ్రామంలో నలభై ఏండ్ల క్రితం నివాసం అంటే ఇప్పటికీ ఆశ్చర్యపోతున్నారు అధికారులు. పోలవరం నుంచి తూటిగుంట వరకు లాంచిలో ప్రయాణం చేసి ఆరాత్రికి అక్కడే బస చేశాను. అప్పటికే గెడ్డపల్లి పాఠశాలలో పనిచేసే కొండరెడ్డి తెగకు చెందిన సహాయకుడు తూటిగుంటకు వేరే పనిమీద వచ్చి ఉన్నాడు. అతడి సాయంతో గెడ్డపల్లికి వెళ్లాలి. నా బెడ్డింగు, వంట సామాగ్రి, కిరోసిన్‌ స్టౌ అతడు తన కావిడిలో సర్ది ఉంచాడు. ఉదయం 9గంటల ప్రాంతంలో ఫల హారం ముగించి అడవిలో,కొండల్లో నడక ప్రారంభిస్తే సాయంత్రానికి గెడ్డపల్లి చేరు కున్నాం. అసలే చలిరోజులు. పాఠశాల ఉపాధ్యాయునికి కేటాయించిన ఒక చిన్న గుడిసెలో నా మకాం. పేరుకు గుడిసే కాని అది విశాలంగా, వెచ్చగా ఉంది. గ్రామస్తుల పరిచయం ఆరాత్రే జరిగింది. నేను నా పరిశోధన గురించి వివరించా. ఒక్కొక్క కుటుం బంతో వివరంగా మాట్లాడటానికి, రాసుకోవటానికి గంటకు పైగా సమయం పడు తుందని, అట్లాగే గ్రామంలో అన్నికుటుంబాల సర్వే చేయాలని చెప్పా. కొండరెడ్ల సామాజిక, ఆర్థిక పరిస్థితులను అర్థం చేసుకొని వారి అభి వృద్ధికి ప్రణాళిక రచించడం నా వృత్తిలో భాగం అని కూడా వివరించా. దీంతో వారిలో వారికి చర్చ ప్రారంభమ యింది. ఉదయంపూట కొందరు, సాయంత్రం పూట కొందరు నాకుఅందుబాటులోఉండాలనే నిర్ణయానికి వచ్చారు. వారిలోని ప్రజాస్వామ్యం, సమిష్టి నిర్ణయ తత్వం నాకు ఎంతగానో నచ్చింది. వారిలో వారు చర్చించుకునేటప్పుడు ‘’రెడ్డిగారు మీరు ఉండువారా వెళ్లువారా?’’ అని అడగటం చూశాను. ఎంతటి మర్యాదయిన భాష. చర్చ అంగీకారం తెలుసుకోవటం ప్రజా స్వామ్యానికి పరాకాష్ట. అయితే ఇవే గ్రామాలు ఇప్పుడు వారి అంగీ కారం లేకుండానే, పోలవరం ప్రాజెక్టు కింద మునిగిపోతు న్నాయని తెలిసిన తరువాత ఎంతో క్షోభ అనుభవించాను. ఎంతటి ఉన్నతమైన సంస్కృతి మునిగి పోతుంది! వారితో చర్చించవలసిన అవసరమే లేదనే భావన పాలకుల్లో ఉందంటే ఏమనాలి? మాటల్లో నేను పోడుపొలాలను కూడా చూస్తానని ఓరెడ్డిగారికి చెప్పాను. ఆయన ‘’అయ్యా నేను ఓపలేను’’ (నాకు ఓపిక లేదు), రామిరెడ్డిగారి పోడుకు వెళ్లండి. మాఅందరిదీ ఒకేపద్ధతి అని వివరించారు. వారి భాషపై అభిమానం వారి మర్యాద పూర్వక సమాధా నాలు అబ్బురమ నిపించాయి. కొండరెడ్లు భాషలోనే కాదు రూపంలో కూడా ఆకట్టుకుం టారు. మరీఎత్తు, పొట్టి కాని ఎత్తుతో, బలమైన శరీరంతో విశాలమైన ముఖంతో, పసుపురంగుచర్మంతో, మిగిలిన ప్రజలకంటే వేరుగా ఉంటారు. వారంవారం జరిగే సంతల్లో వారిని వెంటనే గుర్తుపట్టవచ్చు. కొండరెడ్ల సమాజంలో చాలా ఇంటిపేర్లు ఉంటాయి. వల్లాలు,పోటేరు, కడపల, సాయంత, కత్తులలాంటి వాటిని పరిశోధకులు పేర్కొన్నారు. వీరిది పితృస్వామ్య సమాజం. అందువల్ల ఆస్తి తండ్రి నుండి కుమారునకు బదిలీ అవుతుంది. అట్లాగే అధికారం కూడా. పెండ్లి తరువాత భర్త ఇంటికే స్త్రీవెళుతుంది. పురుషుడు ఓలి కట్టడం సర్వ సామాన్యం. పోడు వ్యవసాయం, వేట, అటవీ సంపద సేకరణ లాంటి ఆర్థిక కార్యకలాపాల స్థాయిలో ఆర్థిక వ్యవస్థ ఉండటంవల్ల చిన్న కుటుంబాలే ఎక్కువగా ఉంటాయి. గ్రామాలు కూడా చిన్నవే. పని ముట్లు కూడా చాలా తక్కువ. పెద్దకత్తి, చిన్న కత్తి, విల్లంబులు అందరి దగ్గర ఎప్పుడూ ఉంటాయి. పోడువ్యవసా యంలో జొన్నలు పండిస్తారు. అయితే గోదారిఒడ్డున గ్రామాల్లో స్థిర వ్యవ సాయం, పొగాకు వంటి వాణిజ్యపంటలను పండిరచడం 1970 వ దశకంలోనే చూశాను. తూర్పుగోదావరిజిల్లాలో పండ్ల తోటల పెంప కం కూడా చేపట్టారు.
ఒకరికొకరుగా..
కొండరెడ్ల పంచాయితీవ్యవస్థ చాలా పటిష్టంగా ఉంది.గ్రామ సరిహద్దు లోపలి వనరులు అందరికీ అందుబాటులో ఉంచడం వారి కర్తవ్యం. ‘’ఒక్కరి కోసం అందరు, అందరికోసం ఒక్కడు’’ అనే భావం ప్రతి పనిలోను కనిపిస్తుంది. ఇండ్లు కట్టుకునే సమయంలో బంధువు లందరూ ఒకరికొకరు సహాయం చేసుకుంటారు. అట్లాగే పెండ్లిళ్లు, చావు లాంటి సందర్భాల్లోనూ సమిష్టి తత్వం కనిపిస్తుంది. వేటాడి జంతు మాంసం అందరూ పంచుకుంటారు. పెద్దమనిషి, పిన్న పెద్ద మనిషి, పెద్దకాపు లాంటి పేర్లు వారి సామాజిక స్థాయిని చూపిస్తాయి. వీరందరూ కలిసి పంచాయితీ నిర్వహిస్తారు. పంచాయితీలో ప్రజా స్వామ్యం స్పష్టంగా కనిపిస్తుంది. పంచాయితీ నిర్ణయం అందరికీ ఆమోదయోగ్యం. కొండరెడ్లు పోడు వ్యవసాయమే కాకుండా అటవీ శాఖ నిర్వహించే పనుల్లో కూలీలుగానూ పనిచేస్తున్నారు. ముఖ్యంగా వెదురు కూపుల్లో వారు చూపే నైపుణ్యంవల్ల వీరినే కూలీలుగా ఎంచుకుం టారు. వారి దేవతలందరూ చుట్టుపక్కల అడవిలోనే ఉండి కాపా డుతారని వారి నమ్మకం. అయితే అతి సున్నితమైన జీవన విధానం కలిగిన వీరి నివాస ప్రాంతం ముంపుకి గురైతే వీరు వేరే చోట ఎట్లా జీవించగలరనేది నాభయం. సామాజిక ప్రభావం అంచనా కట్టవలసిన అవసరమే లేదు అనేది పాలకుల అభిప్రాయం. కేంద్రప్రభుత్వం రెండు సార్లు ఆర్డినెన్సులు కూడా ఇచ్చింది. అయినా అది చట్టం కాలేదన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ పాలకుల్లో వచ్చిన ఈభావన మరో రూపంలో ప్రత్యక్షమవుతుంటే ఇటువంటి అతి సున్నిత నాగరి కత కలిగిన తెగలు ఏమైపోతాయనేది తీవ్రంగా ఆలోచించాల్సిన విషయం. వారి సాంస్కృతిక వైభవం ఎట్లా కాపా డాలనేది ముఖ్యమైన అనుబంధ ప్రశ్న.