కులం సంకెళ్లు.. ఇంకెన్నాళ్లు ?

తరాలు మారుతున్నా కులం పేరుతో జరుగుతున్న హత్యలు మాత్రం ఆగడం లేదు. కులం మారి పెండ్లిళ్లు చేసుకుంటే అయినోళ్లే బొందవెడు తున్నారు. నిన్నగాక ఇటీవల వరంగల్‌ లో కులాం తర పెండ్లి చేసుకుందని కన్నతల్లే కూతుర్ని కడ తేర్చింది. నిన్న మహారాష్ట్ర ఔరంగాబాద్‌ జిల్లాలో అక్క వేరే కులపుటోణ్ని పెండ్లి చేసుకుంది.. అంతే కడుపుతో ఉందని కూడా చూడకుండా నరికి చంపిండు ఓ తమ్ముడు. దాన్ని సెల్ఫీ తీసి అందరికీ చూపిండు. సాంకేతికంగా ఎంతో ఎదిగిపోయాం అంటూ జబ్బలు చరుచుకుంటున్నాం.. కానీ ఇలా పరువుప్రతిష్ట అంటూ అయినోళ్లనే నిర్థాక్షిణ్యంగా పొట్టన పెట్టుకుంటున్న వారిని మాత్రం ఏమీ చేయలేక పోతున్నాం. ఎన్ని చట్టాలు తెచ్చినా వారిలో మార్పు తేలేకపోతున్నాం. మరి ఈ కులాల కార్చిచ్చు ఆగేదెన్నడు? ప్రేమకు నీడ దొరికేదెన్నడు? పచ్చని జంటలు తమ బతుకులు పండిరచుకునేదెప్పుడు? మన సమాజాన్నిపట్టి పీడిస్తున్న భయం కరమైన జబ్బు కులవ్యవస్థే. కుల ప్రభావం లేని రంగం లేదంటే అతిశయోక్తి కాదు. దేశం వివిధ రంగాల్లో అభివృద్ధి చెందకపోవడానికి కారణం కుల వ్యవస్థే అని మనదేశాన్ని లోతుగా పరిశీలిం చిన సామాజిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దేశం లోని ప్రతి మనిషికి ఏమున్నా లేకున్నా కులం మాత్రం గ్యారంటీ. వేల కులాలున్న ఈ సమాజంలో ఏ కులం కూడా ఇంకో కులంతో సమానం కాదు. స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లవుతున్నా ఇప్పటికీ దాదాపు 30 కోట్ల మంది అంటరానితనం, కులవివక్షతో అణచివేయబడుతున్నారు. మనదేశంలో కులం కొందరికి వరమైతే.. ఎందరికో శాపంగా మారు తోంది. కులాల చిచ్చుతో రగులుతున్న మన సమా జానికి శస్త్రచికిత్స తక్షణ అవసరం. ఆరోజు రావా లంటే ప్రజల్లో సామాజిక చైతన్యం రావాలి.. కుల రహిత సమాజం ఆవిర్భవించాలి. అనునిత్యం దాడులు.. దౌర్జన్యాలు
రెండు వేల సంవత్సరాలకు పైగా మన సమాజాన్ని అంధకారం,అజ్ఞానంలో ఉంచటంలో కులవ్యవస్థ పాత్ర ఎంతో ఉంది. శ్రమచేసే వారికిచదువు లేకుం డా చేసింది కులమే. మనుషుల మధ్య ఐక్యత, సాన్నిహిత్యం లేకుండా చేస్తోంది కులమే. ప్రేమిం చడాన్ని సహించదు సరికదా ద్వేషించడాన్నే ప్రేమి స్తుంది. ఉన్నత చదువులు చదివి విదేశాల్లో పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసే వారు సైతం.. తిరిగి మన దేశానికొచ్చి తన కులమెక్కడుందో వెతుక్కొని, సొంత కులంలోనే పెండ్లి చేసుకుంటున్నారంటే కులమెంతగా ప్రభావం చూపుతుందో అర్థమవు తోంది. కులాంతర వివాహాలు చేసుకున్న వారిపై, చేసుకోవాలి అనుకునే వారిపై దాడులు, దౌర్జన్యాలు, హత్యలు జరగడం మన సమాజంలో మామూలై పోయింది. గత నెలలో వరంగల్‌ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలో ఎస్సీ కులానికి చెందిన యువతి ఎస్టీ యువకుడిని ప్రేమించింది. అది నచ్చని ఆమె తల్లి,అమ్మమ్మ కలిసి దారుణంగా చంపేశారు. తమ కుల కట్టుబాట్లు దాటినందుకే హత్య చేశామని, మా కులం కాని వాడితో పెళ్లి వద్దన్నా వినలేదు అందుకే చంపాల్సి వచ్చిందని వారు సమర్థించు కున్నారు. కులాంతర వివాహాల పట్ల కర్కశత్వంగా వ్యవహరించడం ఇదేమీ మొదటిసారి కాదు, అలాగని చివరిదీ కాదు. గతంలో ఇలాంటి ఘట నలు అనేకం మన ముందున్నాయి.

అన్నీ కుల దురహంకార హత్యలే..
మిర్యాలగూడలో వైశ్య కులానికి చెందిన అమృత భర్త ప్రణయ్‌ను ఆమె తండ్రి, బాబాయిలే కిరాయి గూండాలతో హత్య చేయించారు. ప్రణయ్‌ దళిత మధ్యతరగతి కుటుంబంలో పుట్టడమే దానికి కారణం. ఇదే విధంగా కర్నూల్‌లో కులాంతర వివాహం చేసుకున్నందుకు ఆదాం స్మిత్‌ను గొడ్డళ్లతో నరికి చంపారు. హైదరాబాద్‌లో అవంతిరెడ్డి కులాం తర వివాహం చేసుకున్నందుకు వైశ్య కులానికి చెందిన హేమంత్‌ కుమార్‌ను అవంతి తండ్రి, మామ కిరాయి గూండాల సహకారంతో చంపించారు. భువనగిరిలో స్వాతిరెడ్డి భర్త నరేశ్‌ రజకుడని ఆమె తండ్రి,బంధువులు కలిసి నిర్ధాక్షి ణ్యంగా హత్య చేశారు. పొరుగు రాష్ట్రమైన తమిళ నాడులో సంచలనం సృష్టించిన కౌసల్య భర్త శంకర్‌ హత్య ఈకోవకు చెందిందే. శంకర్‌ దళి తుడైన కారణంగా అతణ్ని కౌసల్య తండ్రి, బంధు వులు కలిసిహత్య చేశారు. పంజాబ్‌కు చెందిన కావ్య భర్త అభిషేక్‌ను కూడా కులాంతర వివాహం చేసుకున్నందుకు చంపేశారు. అక్కడా ఇక్కడా అని లేదు దేశం నలుమూలలా తమ కులం కాని వారిని పెండ్లి చేసుకున్నందుకు అమానుషంగా హత్యలు చేస్తున్నారు. ఇవన్నీ నూటికి నూరుపాళ్లు కుల దురహంకార హత్యలే. ఈ హత్యలన్నీ సమీప రక్త సంబంధీకులు చేస్తున్నవే. కానీ, ఇవి అరుదుగా, అప్పుడప్పుడు జరుగుతున్న ఘటనలుగా, ప్రాధాన్యతలేని వార్తలుగా చూస్తున్నారు. తరతరాల చరిత్రలో ఇలాంటివి ఎన్నెన్నో. ఈ రోజు సాంకేతిక పరిజ్ఞానం పెరిగి, సామాజిక మాధ్యమాలు విస్తృతం కావడం వల్ల ఇవి వెలుగులోకి వస్తున్నాయంతే.

వేరే కులం వారిని పెండ్లి చేసుకుంటే..
పిల్లలు కులాంతర వివాహాలు చేసుకుని తమ కుటుంబం పరువు తీశారని తల్లితండ్రులు, తోబు ట్టువులు, బంధువులు వాదిస్తున్నారు. ఆధిపత్య కులాల వారు తమకులం పరువుపోతోందని ఇలాం టి ఘోరాలకు పాల్పడుతున్నారు. రెండు వేర్వేరు కులాల వాళ్లు పెండ్లి చేసుకుంటే ఒకరు పైకులం గా,ఇంకొకరు కింది కులంగా భావిం చడమే ఇందు కు కారణం. తమకులం కంటే తక్కువ కులమని భావించిన ప్రతి ఒక్కరూ దాడులకు, దౌర్జన్యాలకు, హత్యలకు తెగబడు తున్నారు. కులాంతర వివాహాన్ని వ్యతిరేకించని తల్లిదండ్రు లను కూడా మిగతా బంధువులు వెలి వేస్తున్నారు. వారి పిల్లల్ని ఆదరించకుండా వాళ్లను శిక్షించాలని కులమంతా వేధిస్తోంది. ఎవరైనా కులాంతర వివాహాలు చేస్తు న్నా, ప్రోత్సహిస్తున్నా వారిని ధర్మం తప్పినట్లు కుల సమాజం చూస్తోంది.హంతకులుగా మారుతున్న రక్తసంబంధికులెవరూ తాము చేసింది తప్పని అను కోవడం లేదు. కులధర్మాన్ని కాపాడ టానికే ఈ పని చేశామని ఫీల్‌ అవుతున్నారు.

కుల రహిత సమాజం రావాలంటే..
కులం మన సమాజాన్ని పట్టి పీడిస్తున్న భయం కరమైన వ్యాధిగా మారింది.21వ శతాబ్దంలో కూడా అంటరానితనం, వివక్షలు కుల సంస్కృతిలో భాగమైపోయాయి. ఈ అమానుష కులవ్యవస్థను అంతం చేయడానికి ఎన్ని పథకాలు పెట్టినా కొత్త కొత్త రూపాల్లో అదిప్రత్యక్షమవుతునే ఉంది. ప్రస్తుతం సమాజానికి ఇదో సవాల్‌గా మారింది. ఈ సంస్కృతి సమాజ పురోగమనానికి ఆటంకంగా మారుతోంది. కుల వ్యవస్థ ఇంతకాలం సజీవంగా మిగలడానికి, భవిష్యత్తులో కూడా కొనసాగేది స్వకుల వివాహల ద్వారానే. కులాంతర వివాహాలు ఎంత ఎక్కువగా, ఎంత వేగంగా జరిగితే అంత త్వరగా కులరహిత సమాజం ఏర్పడుతుంది. బాహ్య వివాహాలు(తమ కులాలు కాకుండా బయటి కులాల నుంచి) ఒక నియమమైతే కుల వ్యవస్థే మిగలదన్నారు భారత రాజ్యాంగ నిర్మాత బాబా సాహెచ్‌? అంబేద్కర్‌. ఈ దిశలో కుల వ్యవస్థను నిర్మూలించడానికి మహోద్యమం చేయాల్సిన అవసరం ఉంది.

సాంస్కృతిక విప్లవం రావాలె..
సొంత కులం వారినే వివాహాలు చేసుకోవాలని, అదే ధర్మమని, ఆ ధర్మాన్ని ఉల్లంఘించి కులాంతర వివాహాలు చేసుకుంటే మరణ శిక్ష విధించాలని మన ధర్మ శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. ఇవి ఆనాటి సమకాలీన పరిస్థితులను అనుసరించి రాసినవి. కానీ ‘సంఘం శరణం గచ్చామి.. ధర్మం శరణం గచ్చామి’ అన్న బుద్ధుని ప్రబోధనలను అనుసరిస్తే.. మారుతున్న పరిస్థితులతోపాటు జనమూ మారక తప్పదు. కుల వ్యవస్థను సమూలంగా నిర్మూలిం చడం మనందరి బాధ్యత. వందలాది కులాలున్న సమాజంలో ఒక్క మన కులం కాక మరే కులంలో వివాహం చేసుకున్నా అది కుల రహిత సమాజానికై జరుగుతున్న పోరాటంలో ఒక భాగమే. పెండ్లిలకు ‘ఒక్క నీకులంతప్ప, ఏ కుల మైనా ఫర్వాలేదు’ అన్న నినాదం కావాలి. అందు కోసం దేశంలో అతిపెద్ద సాంస్కృతిక విప్లవం రావాలి. -కందుకూరి సతీష్‌ కుమార్‌