కథ చెబుతాను ఊకొడుతావా

వినదగు నెవ్వరు చెప్పిన ..వినినంతనె వేగపడక వివరింపదగున్‌.. గని కల్ల నిజము దెలిసిన.. మనుజుడెపో నీతిపరుడు మహిలో సుమతీ…!

చంద గహ్రణం (కథ)
మేడమీద మంచంలో లక్ష్మయ్యతాత చందమామను చూస్తూ పండుకున్నాడు. మనవడు సుధీర్‌, మనవరాలు ప్రతిమ తాత పక్కన చేరి చందమామను గూర్చి అనేక ప్రశ్నలు అమాయకంగా అడిగారు.
‘‘మేం చిన్నప్పుడు విన్న చంద్రుడికి, పుస్తకాల్లో చదువుకున్న చంద్రుడికి చాలా తేడ వుందిరా. రాహువు కేతువు అనే గ్రహాలు చంద్రుడిని, సూర్యుడిని మింగుతాయట. అలా మింగినపుడు చంద్రగ్రహణం, సూర్యగ్రహణం ఏర్పడతాయని మా తాతముత్తాతలు చెప్పారు. చంద్రుడు చాలా అందంగా వుంటాడని, చంద్రు నిపై చెట్టు, చెట్టుకింద అవ్వ, ఆమె పక్కన కుందేలు వుంటుందని చాలా కథలు చెప్పేవారు. నేను బడిలో చేరి పుస్తకాలు చదివినప్పుడు అసలు చంద్రుడు నేను విన్నట్లు అందంగా వుండడని,చంద్రునిపై చెట్టు,అవ్వ, కుందేలు లేవని చదివాను.చంద్రుని మీద దుమ్ము,ధూళి,రాళ్ళగుట్టలు వుంటాయని చదివా. సూర్యుడికి, చంద్రుడికి మధ్యలో భూమి వస్తే చంద్రగ్రహణం వస్తుంది. ఎక్కువగా పున్నమి రోజు ఈ చంద్రగ్రహణం ఏర్పడుతుంది’’- అన్నాడు తాత లక్ష్మయ్య.

‘‘అయితే సూర్యగ్రహణం ఎలా ఏర్పడుతుందని’’-అడిగాడు మనవడు సుధీర్‌. ‘‘భూమికి సూర్యుడికి మధ్యలో చంద్రుడు వస్తే సాధారణంగా అమావాస్య రోజున సూర్య గ్రహణం ఏర్పడుతుంది.’’-అని అన్నాడు తాత. ‘‘అంటే రాహుకేతువులు చంద్రుణ్ణి, సూర్యుణ్ణి మింగుతాయని చెప్పే మీ తాతముత్తాతల కథలు అబద్ధాలేగా తాత!’’-అని అన్నది మనవరాలు ప్రతిమ.
మంతాన్రికి రక్తం కారదు (కథ)
భీం చేతిలోని నిమ్మకాయ, కత్తి చూపిస్తూ ‘‘తాత తాత ఈ నిమ్మకాయను కోసి పిండితే రక్తం వస్తుంది’’ -అని గంభీరంగా చెప్పాడు. భీం కళ్ళుమూసుకొని నిమ్మకాయమీద పూలు, నీళ్ళు చల్లుతూ ‘‘ఓం! హోం! హ్రీం! భట్‌! ఆం!భీం! భట్‌!’’ అంటూ కళ్ళు తెరిచి నిమ్మకాయను కత్తితో రెండుముక్కలుగా కోసి పిండితే మామూలు నిమ్మరసం వచ్చింది. ‘‘ఏంట్రా మనవడా! నీ మంత్రం పనిచేయలేదేం రా? రక్తం రాలేదేం రా?’’-అని చిన్నగా నవ్వాడు తాత తులసీనాథం. ‘‘నిన్న పక్కింట్లో భూతవైద్యుడు మంత్రించి నిమ్మకాయను కోసి పిండితే, రక్తం వచ్చింది. నేను ఆయనకు పదిరూపాయలిచ్చి ఆ మంత్రం నేర్చుకున్నా. మరి ఆమంత్రం నాకెందుకు పనిచేయలేదు తాతా?’’- అని దిగాలుగా అన్నాడు భీం. తాత తన గదిలోకి వెళ్ళి రెండు సీసాలు,ఒక నిమ్మకాయ, కత్తి తీసుకువచ్చాడు. కత్తి మీద ఒక సీసాలోని ద్రావణం రాసాడు. ఇంకో సీసాలోని రసాయనాన్ని ఇంజెక్షన్‌ ద్వారా తీసుకొని నిమ్మ కాయకు చేసాడు. కత్తి తీసి నిమ్మకాయను కోసి పిండితే ఎర్రగా నిమ్మరసం వచ్చింది. కోసిన కత్తి ఎరుపుగా మారింది. భీం ఆశ్చర్యంగా చూస్తూ వుండిపోయాడు. తాత భీం ను ఒళ్ళో కూర్చోపెట్టుకొని ‘‘ ఈ సీసాలో ‘అమోనియం థయోసైనేట్‌’ ని కత్తిపై రాసాను. ఆ సీసాలో ‘పెరిక్లోరైడ్‌’ ద్రావణం నిమ్మకాయలోకి ఎక్కించాను. కత్తితో నిమ్మకాయను కోసినపుడు, ఈ రెండిరటి రసాయనిక చర్య వలన రసం ఎర్రగా వచ్చిందిరా మనవడా!’’ – అని అన్నాడు.‘ ‘మంత్రాలకు రక్తం కారదు. భూతవైద్యుడు మోసగాడన్న మాట’’ – అని మనవడు ఆనందంగా తాతను ముద్దుపెట్టుకున్నాడు.
కొరివిదయ్యాలు (కథ)
‘‘అమావాస్య రోజు అర్ధరాత్రి కటిక చీకట్లో కొరివి దయ్యాలు చింతమాను చిటారు కొమ్మల్లోంచి పల్లెను చూస్తూ వుంటాయి’’ – అని తాత కిట్టప్ప చెప్పే కథ వింటూ భయంతో వణికి పోతున్నారు మనవడు పాదుక, మనవరాలు శ్రీపాద.
ఇదంతా గమనించిన విరించి కోపంగా ‘‘లేనిపోని భయం వాళ్ళకు ఎందుకు కలిగిస్తావు? దయ్యాలు, కొరివి దయ్యాలు లేవని నీకెన్నిసార్లు చెప్పాను నాన్న’’ – అని గట్టిగా అరిచాడు.
‘‘మీరిద్దరు ఇలారండి, ఈ కుర్చీలో కూర్చోండి. పక్షులు దేనిమీద వుంటాయో చెప్పండి?’’ – అని పిల్లలని అడిగాడు. ఇద్దరు పిల్లలు ఒకేసారి ‘‘చెట్ల మీద కొమ్మల్లో గూళ్ళు కట్టుకొని వుంటాయి.’’ అని ఉత్సాహంగా చెప్పారు. ‘‘కొన్ని రకాల పక్షులు గూళ్ళను ఎత్తైన చెట్ల చిటారు కొమ్మలకు వేళ్ళాడేట్లు కడతాయి. వాటిలొ మెత్తటి గడ్డి, ఈకలు, దూది మొదలైనవి పెట్టి వాటిమీద గుడ్లు పెడతాయి. గుడ్లని పొదిగి పిల్లల్ని చేస్తాయి. అందులో పిల్లలు ఎదిగి బయటకు ఎగిరి పోతాయి. కొన్ని చచ్చిపోతాయి. అలా చచ్చిపోయిన పక్షిపిల్లల ఎముకలూ,గూడు బాగా ఎండిపోతాయి. ఎండాకాలంలో వేడి గాలులు వీచే సమయంలో ఆగూళ్ళు మండి,ఆమంట వూరిలో వారికి రాత్రి పూట బాగా కనపడుతుంది. ఆమంటను చూచి తాత ముత్తాతలు చెప్పిన కొరివి దయ్యాలు అని భయ పడుతారు, పల్లె జనం.’’ అని వివరించాడు తండ్రి విరించి. ‘‘ఇంతకీ, మంట ఎలా వస్తుందో చెప్పలేదేం నాన్నా’’ – అని అడిగారు.’’ఎముకల్లో భాస్వరం మూలకం వుంటుంది. ఎముకలు బాగా ఎండిపోయి రాపిడికి గురైతే ఉష్ణం పుడుతుంది. ఆ ఉష్ణానికి గూట్లోవున్న గడ్డి, దూది, ఈకలు వేడెక్కి పొగ మొదలై, గాలి తగలంగానే మంట వస్తుంది. ఒక గూటి మంట ఇంకొక గూటికి తగిలి పెద్ద మంటగా మండి ఆరిపోతుంది. ఈ రసాయనిక క్రియ మన వారికి తెలియదు కాబట్టి, ఆమంటలు కొరివి దయ్యాలని కథలు కథలుగా ప్రచారంలోకి వచ్చాయి.’’-అని పాదుక, శ్రీపాదలకు వివరించి చెప్పాడు. ‘‘కొరివి దయ్యాల రహస్యం రేపు మాస్కూల్లో పిల్లలందరికి చెప్పి, దయ్యాల భయం పోగొడతాం నాన్న’’. అని చెప్పి పిల్లలు వెళ్ళి నిద్ర పోయారు.
కథలు నిజమేనా? (కథ)
‘‘తాతా! కథలు అన్నీ నిజం కాదాన్నవుగా? రామాయణం కథ కూడా నిజం కాదా?’’ – అని మనుమడు తేజస్‌ తాతని అడిగాడు. ‘‘వాల్మీకి మహర్షి వ్రాసింది అంతా నిజమైన కథే. కాకపోతే కొందరు రచయితలు ప్రచారంలో వున్న జానపద కథలు కూడా కలిపి తెలుగు రామాయణాల్లో వ్రాసారు. అవి మాత్రమే కల్పిత కథలు’’ -అన్నాడు తాత వెంకోబరావు. ‘‘అయితే, కల్పిత జానపద కథలు ఏంటో చెప్పు’’ -అని మనవడు తేజస్‌ అడిగాడు. ‘‘సీతారాములు, లక్ష్మణుడు అరణ్యవాసం చేసేటప్పుడు, రావణాసురుడు సీతమ్మవారిని ముని వేషములో వచ్చి ఎత్తుకు పోయాడు’’ -అన్న తాత మాటలను అడ్డుకుంటూ, మను మరాలు శ్రేయ ‘‘రాములవారి తమ్ముడు లక్ష్మణుడు ఇంటి ముందు మూడు గీతలు గీశాడుగా? ఆగీతలు దాటి రావణుడు సీతమ్మవారిని ఎలా తీసుకుపోయాడు?’’ -అంది.‘‘కాదు, ఏడు గీతలు గీశాడు లక్ష్మణుడు’’ -అని వాదించాడు శ్రేయ అన్న తేజస్‌. వారి ఇద్దరి మాటలు విన్న తాత వెంకోబరావు ‘‘అన్నా, చెల్లెలు చెప్పిన గీతలన్నీ తప్పు’’ -అన్నాడు. ‘‘అంటే, ఇంకా ఎక్కువ గీతలు గీశాడా? తక్కువ గీతలు గీశాడా?’’-అని శ్రేయ అడిగింది. ‘‘అసలు లక్ష్మణుడు ఏవిధమైన గీతలు గీయలేదు’’ అన్న తాత సమాధానానికి అన్నా-చెల్లెలు ఒక నిమిషం మౌనంగా వుండి, ‘‘మరి మేం చూసిన రామాయణం సినిమాలో గీతలుగీసి లక్ష్మణుడు వెళ్ళాడు కదా? మరి సినిమానే తప్పంటావా’’ అన్నాడు తేజస్‌. ‘‘వాల్మీకి వ్రాసిన రామాయణంలో ఏవిధమైన గీతలు లక్ష్మణుడు గీయలేదు. సీతమ్మవారితో- ‘అమ్మా ఈ అరణ్యం మొత్తం రాక్షసుల మాయలకు నిలయము. కావున ఎవరు వచ్చినా కుటీరము నుండి బయటకు రావద్దు. నా అన్న రాములవారిని రాక్షసులు ఏమీ చేయలేరు. నీ ఆజ్ఞపై, అన్నగారిని వెతుకుటకు నిన్ను వదలి వెళుతున్నా’ అని చెప్పి లక్ష్మణుడు వెళ్ళాడు. ఇది నిజమైన కథ’’ అని అన్నాడు తాత వెంకోబరావు. అహల్యను రాయిగా శపించటం, రాముడి పాదాలు ఆ రాయిని తాకంగానే, రాయి అహల్యగా మారటం కల్పిత జానపద కథ’’ -అని తాత చెప్పగానే ఆనందంతో తాతను హత్తుకున్నారు.
-శ్రీ గోమఠం రంగా చార్యులు