ఎలెక్షన్లు వస్తున్నాయి..జాగ్రత్త!

మన ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికలు కీలకం. స్వాతంత్య్రం వచ్చి 72సంవ్సరాలు అయ్యింది. 1950 నుంచి చాలాసార్లు చట్టసభలకు ఎన్నికలు జరిగాయి. దేశ్యావ్యాప్తంగా జాతీయ పార్టీలు, ఆయా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు మారుతూ వస్తున్నాయి. మరికొన్ని రాష్ట్రాల్లో పార్టీలు కొత్తగా పుట్టికొస్తున్నాయి. పార్టీలతో పాటు జెండాలు మారుతూ వస్తున్నాయి. కానీ ప్రజా సంక్షేమం మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు మనకు కన్పిస్తోంది. ఎలెక్షన్లు వస్తే మార్పులు వస్తాయి, సంక్షేమ ప్రభుత్వం వస్తోంది..తమ బ్రతకులు బాగుపడతాయని, గిరిజన,దళితులైన పేదప్రజలకు న్యాయం జరుగుతుందనే ఆశతో ఇప్పటి వరకూ ఓటు వేసుకుంటూ వస్తున్నారు !
ప్రతిసారి ఐదేళ్లకు ఒకసారి జరిగే ఎలెక్షన్‌ గేమ్‌లో ప్రజలే కాదు,చదవర్లు,మేథావులు సమిధులుగా అటవుతూనే ఉన్నారు. ఎందుకంటే ఎలెక్షన్‌లో నెగ్గిన రాజకీయ పార్టీ నాయకులందరికీ ప్రజల నాడి అర్ధమైపోయింది. అధికారం చేజిక్కుంచుకొని ప్రజలకు ఇచ్చిన హామీలు పక్కన పెడుతున్నారు. ప్రజాసంక్షేమాన్ని విస్పరిస్తూన్నారు. ఈరకంగానే ఐదేళ్లపాటు అధికారంలో కొనసాగుతున్నారు. ఇది ఆంధ్ర,తెలంగాణ అనే కాకుండా దేశవ్యాప్తంగా అన్నీ రాష్ట్రాల్లోను ఉంది. కేవలం రంగులు మాత్రమే మారుతున్నాయి తప్పా, రాజకీయ దోపిడి మామూళ్లుగానే సాగుతోంది. నెగ్గిన ఐదేళ్లపాటు అధికారమనే లైసెన్స్‌ ఆసరాగా తీసుకొని వారిష్టమోచ్చినట్లుగానే వ్యవహరించే వ్యవస్థ తయారైంది. ప్రజాస్వామ్యంలో ఎన్నికలనేవి చాలా ప్రాముఖ్యమైనవి. ఈ పరిస్థితుల్లో రాబోయే 2019 సార్వత్రిక ఎన్నికల్లో నైనా ప్రజలు అప్రమత్తం కావాలి. దీన్ని ప్రజలు సంపూర్ణంగా అర్ధం చేసుకొని చైతన్యవంతులు కావాలి. రాజకీయ నాయకులు ప్రజల అమయకత్వాన్ని ఆసరాగా తీసుకొని ప్రలోభాలకు గురి చేస్తున్నారు. ఓటర్లకు అర్హతలు సరిగా నిర్ణయించకపోవటం, ఓటర్లు డబ్బులకు ఓట్లు అమ్ముకోవటం, ఓట్ల లెక్కింపు విధానం సరిగా లేకపోవటం,రహస్య ఓటింగుతో పాటు బహిరంగ ఓటింగు లేకపోవటం, దొంగ ఓట్లు వేయటం, పోలింగు కేంద్రాలను ఆక్రమించి రిగ్గింగు చేయటం, బలహీనవర్గాలను పోలింగు కేంద్రాలకు రానీయకుండా అడ్డుకోవడటం, ఎన్నికల్లో మితిమీరిన హింస, తక్కువశాతం పోలింగు కావటం, నేర చరిత్ర ఉన్నవ్యక్తులు ఎన్నికల్లో పాల్గొనటం,కుల,మత,ప్రాంతీయ తత్వాలను రెచ్చగొట్టటం, అధికార యంత్రాంగాన్ని ఎన్నికల్లో దుర్వినియోగం చేయటం, వ్యక్తిగత దూషణలకు పాల్పడటం, అసంబద్ధమైన వాగ్దానాలు చేయటం, సాధారణ ఎన్నికలు, మధ్యంతర ఎన్నికలు, ఉపఎన్నికలతో సంవత్సరం పొడవునా, ఐదు సంవత్సరాలపాటు ఎన్నికల వాతావరణం నెలకొనటం, పార్టీల నియంత్రణ చట్టం లేకపోవటం, ఎన్నికల సంఘానికి ఎక్కువ అధికారాలు లేకపోవటం, ప్రభుత్వ, ప్రైవేటు మీడియాను దుర్వనియోగం చేయటం, పార్టీఫిరాయింపులు మొదలగునవి మన ఎన్నికల విధానంలోని ముఖ్యమైన లోపాలగా పరిగణించ వచ్చాల్సి వస్తోంది.
ప్రజాస్వామ్యం, ఎన్నికల వ్యవస్థ బలంగా ఉండాలంటే రాజకీయ పార్టీల నియంత్రణ చట్టం చాలాఅవసరం. రాజకీయ పార్టీల వ్యవహారాన్ని అంతరంగిక వ్యవహారంగా భావించరాదు. అవికూడా ప్రజలకు, న్యాయస్థానాలకు, ఎన్నికల సంఘానికి జవాబుదారీగా ఉండాలి. రాజకీయ పార్టీల ఎన్నికలు ఎన్నికల సంఘం పర్యవేక్షణలో ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలి. ప్రజాస్వామ్యం పట్ల విశ్వాసం కలిగిన రాజకీయ పార్టీలను మాత్రమే అనుమతించాలి. సాధారణ ఎన్నికల నిర్వహణ సుదీర్ఘకాలంపాటు ఉంటున్నది. దశలు ఎక్కువగా ఉండటం, ఒక్కొక్క దశకు ఎక్కువ కాలపరిమితి ఉండటం వలన సుదీర్ఘ ప్రక్రియగా మారింది. ప్రజా ప్రాతినిథ్య చట్టంలోనే ఎన్నికలను నాలుగు దశలలోనే జరపాలన్న నిబంధన ఉండాలి. ఒక్కొక్క దశకు నాలుగు రోజులవ్యవధి మాత్రమే ఉండాలి. ఎన్నికల ప్రకటన తేదీ నుంచి లెక్కింపు తేదీ మధ్య రెండు నెలలకు మించి ఉండకూడదు. పార్లమెంటు, అసెంబ్లీ స్థానాల సంఖ్యలో నాలుగింట మూడువంతుల స్థానాలను అభ్యర్థులను ఎన్నుకోవటం ద్వారాను, స్థానాలను పార్టీలకు వచ్చిన ఓట్ల నిష్పత్తి ప్రకారం రాజకీయ పార్టీలు సూచించిన అభ్యర్థులను ఎంపిక చేయాలి. సాధారణ ఎన్నికల్లో మెజారిటీ రాని చోట్ల సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడటం, కొద్ది రోజుల్లోనే పార్టీ ఫిరాయింపుల వలన అవి కూలిపోవటం, మళ్లీఎన్నికలు ఎదుర్కొన వలసి రావటం గత 60 సంవత్సరాల నుంచి చూస్తున్నాము. చట్టసభల కాలపరిమితి ఐదు సంవత్సరాలని చెప్పినప్పటికీ చాలాసార్లు మధ్యలోనే రద్దవుతున్నాయి. పార్లమెంటరీ విధానంలో ఇదొక పెద్ద లోపం. దేశంలోని అన్ని వ్యవస్థలకు ఒకేసారి ఎన్నికలు జరిగే విధంగా రాజ్యాం, చట్ట సవరణలు చేసుకోవాలి. కాలపరిమితి ప్రకారమే సాధారణ ఎన్నికలు జరగాలి. పార్లమెంటు,అసెంబ్లీ ఎన్నికలు పార్టీ చిహ్నాల మీద జరిగితే, స్థానిక సంస్థలు, ఇతర సహకార సంఘాల ఎన్నికలు పార్టీ రహితంగా జరగాలి. స్థానిక సంస్థల ఎన్నికలు ఏకగ్రీవం లేక లాటరీ విధానం అనుకరిస్తే ఇంకా మంచిది.ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు ఓటర్లను ఆకట్టుకోవటానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. పోటీ చేసే అభ్యర్థులు ఓట్లను కొనటానికి తెగబడుతున్నారు. ఓటర్లు కూడా చాలామంది ఓట్లు అమ్ముకోవటం తప్పు కాదన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు. ఓటుకు ఇంత ఇవ్వాలని పట్టుబట్టే స్థితికి ఓటర్లు వచ్చారు. దీన్ని నివారించటానికి రహస్య ఓటింగుతో పాటు బహిరంగ ఓటు విధానాన్ని ప్రవేశపెట్టాలి. బహి రంగ ఓటింగు విధానం ప్రజాస్వామ్యాన్ని మరింత బలపరుస్తుంది. ఈ పద్ధతివలన ఓటర్లు బాధ్యత కలిగి ఉంటారు. బాధ్యతతో మెలిగే ఓటర్లుకు విలువ పెరుగుతుంది! – ర‌వి రెబ్బాప్ర‌గ‌డ‌,ఎడిట‌ర్