ఆర్ధిక స్వేచ్చకు ఆఖరి మేకు

ఇప్పుడు దేశమే కాదు, యావత్ ప్రపంచం విశాఖపట్నము  వైపు చూస్తుంది. కేంద్ర పాలకుల కన్ను ఎప్పుడో  వైజాగ్ మీద పడినా ఇప్పుడు ఆ దుర్ముహూర్తం మరింత దగ్గర పడింది.  విశాఖ ఉక్కు నగరవాసులంతా భయపడుతున్న ఇంతకాలం కడుపు నింపిన కన్నతల్లి అంత్యక్రియలకు సమయం ఆసన్నమైందని ఆందోళన చెందుతున్నారు . కాగల కార్యం గాంధర్వులు ఎప్పుడో నెరవేర్చేశారన్న అనుమానం ,దుగ్ధ,  కార్మికుల్లో అంతర్లీనంగా ఉక్రోషాన్నీ ఉద్రేకాన్నీ నిరసన రూపంలోకి మార్చి  రోడ్డు ఎక్కించింది. ఎందరో ప్రాణ ఫలం , వేల గ్రామాల త్యాగ ఫలం, కోట్ల రూపాయల ప్రభుత్వ ధన వ్యయం, దేశానికి గర్వకారణం ఈ విశాఖ ఉక్కు. చంపే ముందు పిచ్చి కుక్క ముద్ర వేసి చంపడం చాణక్య నీతి. దాన్ని బాగా వంట పట్టించుకున్న పాలకులు దీనికి  కూడా అదే ముద్ర వేశారు. పధకం ప్రకారం రాష్ట్ర నాయకత్వాన్ని జేబులో వేసుకుని, కార్మిక నాయకులకు కడుపునిండా భోజన పెట్టి చక్కగా పని కానిచ్చేసుకున్నారు. సుమారు ఆరు సార్లు పాస్కో ప్రతినిధులు విశాఖ ను సందర్శించారు. ముఖ్య మంత్రి కలిసి ఫోటోలు దిగారు. కార్మికులు   కూడా వారు  వచ్చిన విషయాన్ని గ్రహించి  అర్ధ రాత్రి వెంట తరిమి మరీ నిరసన చూపిన సందర్భాలు ఇటీవలే ఉన్నాయి.


            గత సంవత్సర కాలంగా పాస్కో పేరు ఇక్కడ ప్రతీరోజూ ఏదో  రూపంలో మార్మోగుతూనే ఉంది. వారితో ఉక్కు కర్మాగార  అధికార బదలాయింపుకు సంతకాలు కూడా జరిగిపోయాయని వార్త. నిప్పులేనిదే పొగ రాదు గా. మొన్ననే నిర్మలమ్మ బడ్జెట్ సమర్పణ సమయం లో శంఖంలో తీర్ధం  కూడా పోసేసింది. ఏమీ కాకపోతే ఆమె బడ్జెట్ లో ధైర్యంగా ప్రకటించే సాహసం చేయదు కదా? మరి ఏమి జరిగినది. పధకం ప్రకారం పెట్టుబడుల ఉపసంహరణ జరిగిపోయింది. గతంలో ఉరుములు ఉరిమినా ఇప్పుడు ఆంధ్రుల హక్కును  ఉప్పెన వచ్చి ముంచేసింది. నేడు నిరసన జ్వాలలు ఆకాశానికి ఎగిశాయి. అవి ఆరకుండా కార్య సాధన వైపు సాగుతాయని ఆశిద్ధాము . కానీ మరింత భయపడాల్సిన అంశం ఏమిటంటే నేడు ఈ ఉద్యమం సఫలీ కృతమైనా కర్మాగారం లాభాల్లో నడుస్తుందనీ గారంటీ లేదు  , తిరిగి లాభాల్లో నడిపించే సత్తా మాకుందని అంటున్న మన కార్మికులకూ, నాయకులకూ వెనుక ఉన్న అప్పులు ఎంతో తెలీయనివి కావు. ఆ అప్పులను మాఫీ చేసి అస్మదీయులకు కట్టబెట్టడం లో వారనుకున్నది ఆరు నూరైనా  చేయడంలో దిట్ట కేంద్ర ప్రభుత్వం. మోడీ ,షా ల ద్వయం యొక్క ట్రాక్ రికార్డ్ అలాంటిది మరి.  దీనికి గంపెడు ఉదాహరణలు ఉన్నాయి. ఎందరో దొంగ వ్యాపారులకున్న  లక్షల కోట్ల రూపాయిల రుణాలను మాఫీ తో పోలిస్తే  పాలకులకు ఇది పెద్ద పనేమీ కాదు. అలాగే ప్రైవేట్ వ్యక్తులకు  ఇనుప గనులు కేటాయించగా లేనిది ఆధునిక దేవాలయముగా పిలుచుకుంటున్న ఉక్కు కర్మాగానికి గనులను కేటాయించడం కూడా వారికి నోటి మాట పని . తాజా విశాఖ ప్రజలలో చక్కర్లు కొడుతున్న మరొక ఆసక్తి కరమైయాన విషయం ఏమిటంటే ? కేంద్రం విశాఖ ఉక్కు కర్మాగారానికి స్వంత గనులు కేటాయిస్తారని. ఈ వార్తా వాస్తవం అయ్యే అవకాశాలు క్కువగా ఉన్నాయి. గనులు కేటాయించి ప్రస్తుతానికి బుజ్జగించి చల్లా బడ్డాక తిరిగి వారి ప్రైవేటీకరణ పనులు సాగిస్తారు. తద్వారా ప్రైవేట్ వ్యక్తులకు పనిలో పనిగా గనులు కూడా సమర్పించుకోవచ్చేనే కుట్ర కోణాన్ని గమనించాలి.
                  ఇది కేవలము ఒక్క విశాఖలో ఉన్న ఉక్కు కర్మాగారనికి చెందిన సమస్య అంతకన్నా కాదు. దేశంలో సుమారు 300 లకు పైగా ప్రభుత్వ రంగా సంస్థలున్నాయి. వాటిలో దాదాపు 250 సంస్థలను పైగా అమ్మకం పెట్టిన ఘనత ఈ ప్రస్తుత ప్రభుత్వానిది. వారిని రెండవ సారి గెలిపించిన వారు ఇప్పటికైనా వారి రహస్య ఏజెండాను గుర్తించక పోతే మన భవిష్యత్ తరాలకు సంజాయిషీ చెప్పుకునే పరిస్థితి తల ఎత్తుతుంది. గతంలో  చాలా కాలం మన ప్రధాని మోడీ గారు గుజరాత్ ముఖ్య మంత్రిగా ఉన్నారు. గుజరాత్ మోడల్ అంటూ వచ్చిన కొత్త రోజుల్లో ఊదరగొట్టారు. అదేమిటో తెలియని భజన బృందం అతన్ని గెలిపించి నేడు ఈ పరిస్థితి కి పునాది వేసింది. విషయం ఏమిటంటే ? ఆయన ముఖ్య మంత్రిగా ఉన్న కాల మంతా ఆయన తిరిగిన ప్రైవేట్ విమానం అతని మిత్రుడు గౌతం ఆదాని ది .  కట్ చేస్తే , మిత్రలాభం గా ఇప్పుడు దేశంలో దాదాపు అన్నీ విమానాశ్రయాలూ గౌతం ఆదాని చేతిలో చేరాయి. కొత్తగా అహ్మదా బాద్, లక్నో ,మంగుళూరు అతని సంచి లో చేరగా జైపూర్,గౌహతి తిరువనంతపురం విమానాశ్రయాలు అతని కబ్జా లోనికి చేర బోతున్నాయి. దేశ విమాయానం, విమానాశ్రయాలూ ,అలాగే విమాన రవాణా ఆ గుజరాత్ వ్యాపారస్తుని ధారాదత్తము  కాబోతుంది. ఇప్పటికే దేశంలో అనేక ప్రైవేట్ పోర్టులుకూడా  అతని పేర నమోదై ఉన్నట్టు భోగట్టా. ఆ వివరాల జోలికి పోను. అంటే? విమాన రవాణా తో పాటూ సముద్ర రవాణా కూడా అతని చేతిలో పెడుతున్నారన్న మాట. అక్కడితో ఈ కధ ఆగలేదు. మరొక ప్రధాన అతి పెద్ద ప్రబుత్వ సంస్థ రైల్వే మీద కూడా ఇతని కళ్లు  పడ్డాయి. రైల్వే ప్రైవేటీకరణకు కూడా రంగం సిద్ధం అయ్యిందని మనందరకూ తెలుసుగా..? సుమారు  3 లక్షల మంది ఉద్యోగాలను తీసేయడానికి వ్యూహ రచన సాగుతుంది. అంతేనా మిత్రునికి జనరల్ భవగీలున్న రైళ్లను అమ్మితే ఏమి బాగుంటుంది? అందుకు కొన్ని లక్షల కోట్లతో అన్నీ బోగీ లనూ ఎయిర్ కండీషన్ చేసి మరీ ఆదానికి ఇవ్వడానికి రంగం సిద్దం అవుతుంది. సొమ్ము ఒకడి ది  షోకు ఒకడి దీ అనుభవించేవాడొకడు .  రైల్వే కు ఉన్న మరొక ముఖ్య మైన అనుబంధ సంస్థ “కంటైనర్ కార్పొరేషన్ లిమిటెడ్” ఇప్పుడు ఆదాని చేతిలోకి రాబోతుంది. మామూలుగా వేల ఎకరాల భూమితో అతనికి వెళ్లబోతుంది. “కాం కార్” అని ముద్దుగా పిలుచుకునే ఈ కంటైనర్ కార్పొరేషన్ లిమిటెడ్ కూడా నష్టాల్లో ఉందని వినికిడి. ఈ కాం కార్ దేశంలో అనేక ప్రాంతాల్లో పెద్ద మొత్తం  రైల్వే స్థలాల్లో తమ కార్యాలయాలను ఏర్పాటు చేసుకుంది. వేల ఎకరా భూమి ఈ కాం కార్ ఆధీనంలో లో ఉంది. ఇప్పుడు దేశ వ్యాప్తం గా ఉన్న ఈ భూములను కాంకార్ చేత కొనిపించే ప్రయత్నము జరుగుతుంది. నష్టాల్లో ఉన్న సంస్థ భూములు ఎలా కొంటుందని ఆశ్చర్య పోవద్దు. బాంకులు ఉన్నాయి గా. అందులో మన డబ్బు ఉంది గా, అది చాలదూ? వేల ఏకరాలభూముల్ని కాం కార్  చేత కొనిపించి ఆనక  నష్టాల వంక తో ఆదాని చేతిలో పెడతారు. అయినవాడు కాబట్టీ బాంకు అప్పులను మినహాయిస్తారు ఆ అప్పులను మాఫీ చేసి నట్లు ప్రకటించి నాశతాల్లో ఉన్న కంపనీ కి పెద్ద వేలం రాదనే వంకతో  మిగిలిన ధరం కేటాయిస్తారు. లక్షల కోట్ల ఉక్కు కర్మాగారాన్ని వేల కోట్ల కు అమ్మడం లేదూ?  ( అన్నే అనుకూలంగా సాగితే గనులిచ్చి మరీ) ఇదీ అలాగే అన్న మాట.
                   17 వ శతాబ్ధం లో ఈస్ట్ ఇండియా కంపనీ మాదిరిగా ఆదానీ అంబానీ కంపనీగా భారత దేశం మరొక్క సారి చరిత్రలోనికి వెళ్ల  బోతుందని మనకు  అర్ధము అవుతుందా ? ఎయిర్ పోర్టుల స్వాధీనం తో  వాయు రవాణాను  , నౌకాశ్రయాలు అంటే పోర్ట్ ల స్వాధీనంతో సముద్ర రవాణా ను,  రైల్వే స్వాధీనం తో కాంకార్ ద్వారా రోడ్డు రవాణాను అంటే మొత్తం దేశ రవాణా వ్యవస్థ ను ఆదాని శాసించబో తున్నాడన్న మాట. ఇది మామూలు విషయం కాదు . దేశ ఎగుమతులూ దిగుమతులూ అతని కనుసన్నలలో నడుస్తాయి. ఇప్పటికీ విధ్యుత్ రంగంలో తన ఆధిపత్యాన్ని చూపుతున్నాడు. గుజరాత్ లో, మహారాష్ట్ర లో రాజస్థాన్ లో ,కర్ణాటక లో “ఆదాని పవర్ లిమిటెడ్ “ పేర ఎన్నో పవర్ ప్లాంటులు అతని సొత్తు. ఇలా కొనసాగిస్తే ఆస్ట్రేలియాలో బొగ్గు గనుల నుండీ అంతర్జాతీయ రియల్ ఎస్టేట్ వరకూ ఇతడు చేతిలో లేని  లేని వ్యాపార రంగం లేదు. మరొక ప్రక్క అంబానీ సోదరులు ఒకడు దివాళా తీశాడు. అతని ఆస్తులు అన్నీ అప్పుల్లో ఉన్నాయి. ఆ అప్పులన్నీ మనం దాచుకున్నడబ్బే అని వేరేచెప్పక్కర లేదు. ఆ గుజరాత్ మిత్రుడి నష్టాలను  పూడ్చే  బాధ్యత కూడా మన గుజరాత్ ప్రధాని తీసుకున్నాడు. ఎంతో ప్రతిష్టా త్మక మైక  రక్షణ వ్యవస్థ కు సంబంధించిన రఫెల్ డీల్ అతనికి అప్పచెప్పి దేశ రక్షణ ను కూడా ఈ ప్రభుత్వం పణంగా పెట్టింది . మనము దాచుకున్న మన బాంకు సొమ్ముతో  అతగాడు  వ్యాపారాలు చేయడం వాడి ఖర్మ కాళీ దివాళా తీస్తే మనం డీమోనిటై జేషన్ లకూ , మినిమం బేలన్స్ లకు, అనవసర వడ్డీలకూ , ధరల పెంపుకూ, నిర్ధాక్షిణ్యంగా బలి అవ్వలేక చస్తున్నాం. ఎంకి పెళ్లి సుబ్బు చావుకి రావడం అంటే ఇదే మరి . అన్న గారు ముకేష్ అంబానీ గౌతం ఆదాని వదిలిని ఇతర రంగాలను ఎలా కబ్జా చేశాడో మనకు తెలుసు. ప్రత్యేకించి ఆ అంశాలను  మీ సమయాన్ని వృధా చేయడాలచుకోలేదు. ఆయిల్ , టెలీ కమ్యూనికషన్  ఒ ఎన్ జి సీ నీ , బి ఎస్ ఎన్ ఎల్ ఎలా చతికీల బడుతున్నాయో చూస్తున్నాం. వీటిని భర్తీ  చేస్తూ రిలయన్స్ ,జియో ఎలా జన జీవితాల్లో ప్రవేశించి వాటికి దాసోహం చేసుకున్నాయో చూస్తున్నాం. చివరకు కోవిడ్ విజ్రుభించిన సంవత్సర కాలంలో దేశం ఆర్ధిక వ్యవ్యస్థ ఆటలాకుతలమైపోయింది, ,స్టాక్ మార్కెట్ కుప్ప కూలిపోయింది , మధ్య తరగతి కడుపు నిండా ముద్దకు దూరమైపోయింది , పేదవాడు ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డాడు కానీ అదే సమయంలోముకేష్ అంబానీ గారి ఆస్తులు  1.3 లక్షల కోట్ల నుండీ  6 లక్షల కోట్లకు చేరాతి. ప్రపంచ ధనికుల్లో ఒకడిగా ఎదిగాడు. ఎవరి చమట ? ఎవరి రక్తం  ? త్రాగితే ఆ ఆస్తులు కూడాయి? 
                 ప్రైవేట్ రంగ సంస్థ సర్వీసులు బాగుంటాయి, అనేడి ఒక పెద్ద అపోహ. మొదట్లో అన్నీ బాగుంటాయి. లాభాల కోసం వారు వ్యాపారాలు చేస్తారనే మౌలిక వాస్తవాన్ని మనం  మర్చిపోకూడదు. సేవలు బాగుండాలంటే అధిక మొత్తం చెల్లించాలి. పండగ పూ లలో ప్రైవేట్ బస్సుల ధరలు ఎలా నింగికి ఎగురుతాయో ఒకసారి గుర్తుకుతెచ్చుకోండి. డిమాండ్ బట్టే రేటు.  సామాన్యులు  ఎంత మంది ఎంత కాలం ఈ ఆర్ధిక భారాన్ని భరిస్తారు. ఇక ప్రతీ చిన్న అవసరానికీ ఎంతో కొంత మొత్తాన్ని అడుగడుగునా చెల్లించాల్సి వస్తుందని మనకు బోధ పడుతుందా? కరోనా కాలంలో ఎంతమంది తిండిలేక, ఉపాధి లేక ఉద్యోగం లేక తట్టుకోలేక మృత్యువాత పడ్డారు . ప్రజాలచేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వమే ఏమీ చేయలేని చేతకాని తనాన్ని మనం చూశాం . నిలదీసే హక్కు ఉంది. నిలదీస్తున్నాం. రేపు ఆ కనీస హక్కు మనది కాకుండా పోతుంది. ఉద్యోగం లేక పోయినా, ఆకలికి  మెతుకులు లేకపోయినా బిడ్డల చదువులేక పోయినా జవాబుదారీ తనం లేని ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి దేశాన్ని పోనిద్దామా? Scలూ , stలూ మరీ ముఖ్యం గా 52 % ఉన్న bc లు చదువులూ ఉద్యోగాలూ లేకుండా రోడ్డున పడి అడుక్కుతినే దుర్గతి ని  కల్పిద్దామా?   రాజ్యాంగ బద్దమైన  మౌలిక రిజర్వేషన్లను ప్రైవేట్ వ్యక్తులు  గౌరవించరు , కేవల నాలుగు శాతం ఉన్న వారి చేతికి 92 % ఆర్ధిక వనరులు  అప్పనంగాదోచుకున్నారు. అలా అవి వారికి వదిలి  పెట్టేద్దామా? రెండున్నర నెలలుగా తమకు ఏది మంచో అది చేయమని రైతులు ఆదోళన చేస్తుంటే పాలకుల తీరు ఎలా ఉన్నదో ఎవరి పక్షాన వారు పాలన చేస్తున్నారో గమనిస్తున్నాము గా ఇప్పటికే అర్ధమైందా ?
            మనం రాసుకున్న రాజ్యాంగం ఏమిచెపుతుంది? స్వేచ్చా, సమానత్వం, సమాన్యాయం, అలాగే సహోదరత్వం మన ఊపిరిగా పీఠిక రాసుకున్నాం. వాటిని సాధించడానికి పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని ఎన్నుకున్నాం. ఆర్ధిక సమానత్వం, సామాజిక సమానత్వం రాజకీయ సామానత్వం దీని మూల సూత్రాలు. రాజకీయ సమానత్వం ఆరా కోరగా సాధించినా సామాజిక ఆర్ధిక స్వేచ్చా ఇంకా తీరని కలగా ఉండిపోయింది. కేవలం  ఆ నలుగురూ అన్నీ దోచుకోకూడనే సామాజిక స్పృహతో రిజర్వేషన్లు పొందుపరిచారు. ప్రభుత్వ రంగా సంస్థలను , బహుళార్ధ ప్రాజెక్టు లూ , బాంకుల జాతీయాలు ఆ రాజ్యాంగం మనకు ఇచ్చిన వరాలు. ఆ హక్కులను కోల్పోయి మన బ్రతుకుల్ని  ప్రైవేట్ వ్యక్తులు చేతిలో పెట్టి వారి బంధుప్రీతి కీ  అవినీతి కీ అణిచివేటాకీ పావులుగా మారిపోదామా ?. మెరిట్ పేరుతో డబ్బు వెదజల్లి డిగ్రీ లు కొనుక్కుని కార్పొరేట్ ఆసుపత్రులు పెడతారు, మెరిట్ పేరుతో అయిన వారికి అరిటాకు వేస్తారు. కోట్లకు వారసులుగా పుట్టి కోట్లాది ప్రజల జీవితాలతో ఆడుకుంటారు.  వాళ్ళలో వాళ్ళు దేశ వనరులనీ, అందరికీ రావాల్సిన ఉద్యోగాలనూ, ప్రభుత్వ ఆస్తులనూ  పంచుకుంటారు.ఈ సందర్భంలో ప్రపంచ మేధావి రెండు అత్యుత్తమ విశ్వవిద్యాలయాల నుండీ ఆర్ధిక శాస్త్రంలో డాక్టరేట్ పట్టాలు పొందిన  రాజ్యాంగ నిర్మాత ఏమంటారో చూద్దాం. అమెరికాలోని కొలంబియా నుండీ అలాగే యు.కె లోని లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుండీ డాక్టరేట్ తీసుకున్న ఏకైనా ఆర్ధిక శాస్త్రవేత్త డా అంబేడ్కర్. వ్యవసాయ పారిశ్రామీకరణ ద్వారా రావాల్సిన సంస్కరణల  ప్రస్తావిస్తూ  ప్రభుత్వ రంగా సంస్థలను కాపాడుకోవడానికీ అనేక సూచనలు చేస్తారు. వ్యవసాయ రంగ సంస్కరణలు ద్వారా యాంత్రీకరణ ను ప్రోత్సహించి  రైతుల మీద వొత్తిడి తగ్గించి , రైతులను పట్టణాలలో కర్మాగారాలలో వినియోగించుకుంటూ అటు యాంత్రీకరణ ద్వారా వ్యవసాయ రంగము ఉత్పత్తులను పెంచుకుంటూ, ఇటు ప్రభుత్వ కర్మాగారాలనూ లాభాల బాట పట్టించ వచ్చని వివరిస్తారు. మరి నేడు రాజ్యాంగ సపోవతికి భిన్నంగా ప్రభుత్వం వ్యవసాయ సంస్కరణల పేరుతో అనవసరమైన రైతు వ్యతిరేక చట్టాలతో రైతుల జీవితాలతోనూ , పెట్టుబడులు ఉపసంహరణల ద్వారా కార్మికుల భవిష్యత్ తోనూ  ఆడుకుంటూ పైన  చెప్పిన ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టడం పెట్టుబడారీ వ్యవస్థకు పరాకాష్ట . “పారిశ్రామీకరణ ,పట్టణీకరణ విషయంలో అప్రమత్తంగా లేకపోతే వ్యవస్థ నిరంకుశ ధోరణి తో కూడిన కాపీటలిస్ట్ వ్యవస్థకు దారి తీస్తాయి , అణచివేతకూ దోపిడీ కు పునాది వేస్తాయి  “, అంటారు, డాక్టర్ అంబేడ్కర్ . ఇప్పుడు ఫక్తు అదే జరుగుతుంది . నేడు మనం చూస్తున్న ప్రభుత్వ రంగాలలో పెట్టుబడుల ఉపసంహరణ , విదేశీయ ప్రత్యక్ష పెట్టుబడుల ఆహ్వానం పెట్టుబడిదారీ వ్యవస్థ కు దారి తీసే పరిణామాలే . ప్రజాస్వామ్య, సామ్యవాద, గణతంత్ర స్వాతంత్ర్య దేశాన్ని  కేటలిస్ట్  దేశంగా మార్చే కుట్రలో పావులుగా మారి  పోదామా? రాజ్యాంగబద్దంగా ప్రతీ హక్కునూ  ఈ అభినవ మనువులకు  తాకట్టు పెడదామా?? 
               చివరగా ఒక్క విషయం, ఆకలి భయం తో ఉపాధి భయంతో ఉన్న కాస్త కోల్పోతామన్న భయం తో  ఏదో ఒక ఉద్యోగం ,ఎంతో కొంత జీతం, పరిమితి లేని పని గంటలు, శ్రమ దోపిడీని ప్రశ్నించలేని నిస్సహాయత తో  ,యూనియన్ల ను  , అసోసియాషన్ ల నిషేధం తో వివిధ  ఆంక్షల మధ్య జీవిద్దామా? లేదా , పై వాటి నుండీ విముక్తి నిచ్చి మన జీవితాలకు భద్రతనిచ్చే రాజ్యాంగాని రక్షించుకుంటూ దాని  నీడలో హాయిగా జీవిద్దామా? నిర్ణయం మనదే..

– డాక్టర్ మాటూరి శ్రీనివాస్