అక్షరాలకు గుడి కట్టిన సవర తెగ గిరిజనులు

‘‘శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో మాతృభాషను కాపాడుకునేందుకు 28 అక్షర బ్రహ్మ ఆలయాలు, మందిరాలున్నాయి. ఇంకా కొన్ని నిర్మాణంలో ఉన్నాయి. అక్షరానికి ఆలయాలు కట్టడం వెనుక ఒక ఉద్యమమే జరిగింది. అదే ‘మతార్బనోమ్‌’.మత్‌ అంటే దృష్టి,తార్‌ అంటే వెలుగు,బనోమ్‌ అంటే విస్తరించడం. మన దృష్టి వెలుగులో భాషను విస్తరించడం అని అర్థం. మాతృభాష గొప్పతనం తెలిపేందుకు ప్రతి గురువారం అక్షర బ్రహ్మ ఆలయాలు,మందిరాల వద్ద భజనలు, పూజలు చేస్తాం. అక్కడే సవర భాషను నేర్పుతాం. అందుకోసం చాలా మంది స్వచ్ఛందంగా ముందుకు వస్తారు. గ్రామంలోని దాదాపు అందరూ మా భాష నేర్చుకుంటు న్నారు’’
ఏదైనా ఆలయానికో,మందిరానికో వెళ్తే, అక్కడ దేవుడు, దేవత విగ్రహాలు,పటాలు కనిపి స్తాయి. వారికి పూజలు,భజనలు చేయడం కనిపిస్తుంది. కానీ, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న చాలా ఆలయాల్లో అక్షరాలకు పూజలు చేస్తారు. వాటికి మందిరాలు కట్టి భజనలు చేస్తారు. అక్షరమంటే అంత ప్రేమ ఆ గిరిజనానికి.ఇంతకీ అక్షరానికి ఆలయం ఎందుకు? ఆ ఆలయాల ప్రత్యేకత ఏంటి?గిరిజన గ్రామాలకు వెళ్తే వింతైన ఆచారాలు, నమ్మకాలు, జంతు బలులు, గ్రామ దేవతల పూజలు ఇటువంటివే సాధారణంగా కనిపిస్తాయి.కానీ, ఇందుకు పూర్తిగా భిన్నమైన గిరిజన గ్రామాలు కూడా ఉన్నాయి. అక్కడ అక్షరాలకు ఆలయాలు కట్టి పూజలు చేస్తారు. ఇలా ఎందుకంటే తమ మాతృభాషని రక్షించుకునేందుకు అంటారు.
అక్షర బ్రహ్మ ఆలయాలు
అక్షరాలను ప్రతిష్టించి పూజించే ఆలయాలను ‘అక్షర బ్రహ్మ’ ఆలయాలు అంటారు. పెద్ద ఆలయాలు నిర్మించేందుకు అవకాశం లేని చోట, చిన్న మందిరాలు కట్టి అక్షరాలకు పూజలు చేస్తున్నారు. ఆ ఆలయాలు, మంది రాలు అన్నీ కూడా సవర గిరిజన తెగ నిర్మించుకున్నవే. తమ మాతృభాషను కాపాడుకోవడానికి ఇలా అక్షరానికి ఆలయం కట్టడం కంటే మంచి మార్గమేముందని వాళ్లంటున్నారు. ‘‘ఏపీ, ఒడిశా ఏజెన్సీల్లో సవర తెగ ఎక్కువగా కనిపిస్తుంది. మేం మాట్లాడే సవర భాష చాలా పురాతనమైనది. కానీ దానికి లిపి లేదు. అందువల్ల మా పూర్వీకుల సంప్రదా యాలు మాకు సరైన రీతిలో చేరలేదు. దాంతో, లిఖిత రూపంలో ఉన్న ఇతర గిరిజన సంప్రదా యాలనే సవర సంప్రదాయాలుగా అనుస రించాల్సిన పరిస్థితి ఏర్పడిరది. సవర సంప్రదా యాలను ముందు తరాల వారికి అందిం చాలంటే లిపి అవసరమని మావాళ్లు గుర్తించారు. ఒడిశాకు చెందిన సవర పండితుడు మంగయ్య గొమాంగో పన్నెండు సంవత్సరాలు కృషి చేసి 1936లో సవర భాషకు లిపి రూపం ఇచ్చారు. అదే మా మాతృభాష. ఈ లిపి ఇంటింటికి చేరాలంటే ఏం చేయాలనే ఆలోచన నుంచి పుట్టినవే అక్షర బ్రహ్మ ఆలయాలు’’ అని సవర తెగ గురువు సవర కరువయ్య తెలిపారు.
అక్షర చైతన్యం.. మాతృభాషా ఉద్యమం
గిరిజనుల్లో చైతన్యం నింపేందుకే గ్రామాల్లో ఆలయాలు నిర్మించి అందులో అక్షరాలను ప్రతిష్టించారు. అక్షరమే దైవం, దానికే మేం పూజలు చేస్తాం అంటారు గిరిజనులు. అక్షరాలకు దేవాలయాలు, మందిరాలు నిర్మించి వాటి ద్వారా సవర భాష లిపిని అందరికి నేర్పుతున్నారు. ‘‘శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో మాతృభాషను కాపాడుకునేందుకు 28 అక్షర బ్రహ్మ ఆలయాలు, మందిరాలున్నాయి. ఇంకా కొన్ని నిర్మాణంలో ఉన్నాయి. అక్షరానికి ఆలయాలు కట్టడం వెనుక ఒక ఉద్యమమే జరిగింది. అదే ‘మతార్బనోమ్‌’.మత్‌ అంటే దృష్టి,తార్‌ అంటే వెలుగు,బనోమ్‌ అంటే విస్తరించడం. మన దృష్టి వెలుగులో భాషను విస్తరించడం అని అర్థం. మాతృభాష గొప్పతనం తెలిపేందుకు ప్రతి గురువారం అక్షర బ్రహ్మ ఆలయాలు,మందిరాల వద్ద భజనలు, పూజలు చేస్తాం. అక్కడే సవర భాషను నేర్పుతాం. అందుకోసం చాలా మంది స్వచ్ఛందంగా ముందుకు వస్తారు. గ్రామంలోని దాదాపు అందరూ మా భాష నేర్చుకుంటు న్నారు’’ అని అక్షర బ్రహ్మ యువ నిర్మాణ సేవా సమితి ప్రధాన కార్యదర్శి తిరుపతి తెలిపారు.
‘అక్షరానికి పూజలు చేస్తే దేవతలకు పూజలు చేసినట్లే’
అక్షరమంటే ముక్కోటి దేవతలతో సమానమని సవర గిరిజన సమూహాలు భావిస్తాయి. అందుకే అక్షరానికి పూజలు చేస్తే దేవత లందరికీ పూజలు చేసినట్లేనని నమ్ముతారు. దేవతా రూపంలో విగ్రహాలు లేకున్నా, అక్షర బ్రహ్మ ఆలయాల్లో పండుగలు నిర్వహిస్తారు. ‘‘ఇలా అక్షరాలకు గుడి కట్టి పూజించే సంప్ర దాయం మరెక్కడ ఉండదు. అక్షరంలోంచే త్రిమూర్తులు పుట్టుకొచ్చారని పెద్దలు చెప్తారు. ఓంకారం అక్షరమే. అందుకే ఓంకార రూపం వంటి ఆకారం మధ్యలో సవర లిపి అచ్చులు, హల్లులు ఉంచి వాటికే పూజలు చేస్తాం. మా తెగలో అక్షరానికి తప్ప వేరే దేవుడు, దేవతల విగ్రహాలకు పూజలు చేయం. ఈ లిపికి, అక్షరానికి పూజ చేస్తే ముక్కోటి దేవతలకు పూజ చేసినట్లే’’ అని నౌగడ గ్రామ అక్షర బ్రహ్మ ఆలయ గురువు సవర వెంకటరావు చెప్పారు. ‘ఆయనే మా దైవం.. అక్షరమే మా ఆయుధం’ సవర భాషకు లిపిని అందించిన సవర పండిత్‌ మంగయ్య గొమాంగో తమ ఆరాధ్య దైవమని సవర గిరిజనం చెప్తారు. మంగయ్య గొమాంగో అందించిన అక్షరాలే సవర తెగకు ఆయుధాలని, వాటి ద్వారానే చైతన్యం పొందుతున్నామని సవర గిరిజన గురువులు అంటున్నారు. ‘‘అక్షరానికి గుడి కట్టి ప్రత్యేక పూజలతో సవర లిపి ప్రాముఖ్యతను ప్రచారం చేస్తున్నాం. సవర లిపికి 24 అక్షరాలు ఉంటాయి. అందులో 16 హల్లులు, 8 అచ్చులు ఉంటాయి. వీటిని రాతిపై చెక్కి దేవాలయాల్లో పెడుతున్నాం. అక్షరాలను గోడలపై చిత్రాలుగా వేసి, లేదా పటాలు కట్టి వాటికి మందిరాలు నిర్మిస్తున్నాం. శ్రీకాకుళం జిల్లాలోని సీతంపేట మండలం నౌగడ, ముత్యా లు,శంభాంలలోనూ,విజయనగరం జిల్లా గుమ్మలక్ష్మిపురం మండలం కన్నాయిగూడ, లక్కగూడల్లోనూ అక్షరబ్రహ్మ ఆలయాలు నిర్మించాం. జామిగూడ, సతివాడ, నౌగడ తదితర గ్రామాల్లో అక్షర బ్రహ్మ యువ నిర్మాణ సేవా కేంద్రాల పేరున ప్రచార మందిరాలు ఏర్పాటు చేసుకున్నాం’’ అని సవర గురువు, అక్షర బ్రహ్మ ప్రచారకుల సంఘం జిల్లా కోఆర్డినేటర్‌ కరువయ్య చెప్పారు. పాఠశాలల్లో తెలుగు, ఒడియాలతో పాటు సవర భాషను కూడా నేర్పించమని గిరిజన సంఘాలు ప్రభు త్వాన్ని కోరడంతో, కొన్ని పాఠశాలల్లో ఆ భాష ను చేర్చారు. ‘‘ఈ తరం పిల్లలు తమ మాతృభాషలోనే ఏదైనా నేర్చుకోవాలని అనుకుంటున్నారు. అందుకే తెలుగు, ఇంగ్లిష్‌, ఒడియా వంటి భాషలను సవర భాష ద్వారా నేర్పుతున్నాం. మాతృభాష ద్వారా నేర్చుకుంటే ఏదైనా సులభం అవుతుంది. పైగా మా సొంత భాషను వదిలి ఇతర భాషల పట్ల మోజు పెంచుకోవడం సరైనది కాదు. ఉపాధి,ఉద్యో గాల కోసం ఏ భాషైనా నేర్చుకోవచ్చు. కానీ మా మాతృభాష బతికుండాలి కదా. అందుకే ఈ ప్రయత్నం. వలంటీర్ల సహాయంతో తరగతులు చెప్తున్నాం. అందరూ ఈ తరగతు లకు హాజరవుతున్నారు. సవర భాష అక్షరాలు, పదాలను చెప్తూ, వాటికి సమానమైన తెలుగు, ఇంగ్లిష్‌, ఒడియా పదాలు రాయడం నేర్చుకుంటున్నారు’’ అని కరువయ్య చెప్పారు.
‘వీడియోలు, స్టూడియోలు, పాఠాలు’
సవర భాషకు ప్రచారం కల్పిస్తూ వీడియోలు తయారు చేస్తున్నారు. దాని కోసం సతివాడ గిరిజన గ్రామంలో చిన్న స్టూడియో కూడా ఏర్పాటుచేసున్నారు. పాటల ద్వారా మాతృ భాషకు ప్రచారం కల్పిస్తున్నారు. స్వచ్ఛందంగా కొందరు అక్షర బ్రహ్మ మందిరాలకు వచ్చి సవర భాష నేర్పుతున్నారు. ‘‘నేను సవర భాష నేర్చుకున్నాను. నాకు తెలుగు కూడా బాగా వచ్చు. తెలుగు,ఒడియా,ఇంగ్లిష్‌ వంటి భాషల్లోని పదాలను సవర భాషలో బోధించి, అర్థాలు వివరిస్తాను. దీని ద్వారా మా మాతృ భాషను రక్షించుకోవడమే కాకుండా, ఇతర భాషల్లోని వివిధ అంశాలను మా భాష ద్వారా నేర్పడాన్ని ఆస్వాదిస్తున్నాను. మాలో అందరికీ తెలుగు వచ్చు. కానీ సవర భాష అందరికీ రాదు. అందుకే మా మాతృభాషను అందరికి నేర్పించాలనే ఉద్దేశంతోనే నేను, నాలాంటి వాళ్లు వచ్చి పాఠాలు చెప్తున్నాం’’ అని నూకా లమ్మ గూడ గ్రామానికి చెందిన సవర సుబ్బలక్ష్మీ చెప్పారు. ‘గిరిజనమే ఆదర్మం కావాలి’‘‘మాతృభాషకు మించినది ఏదీ లేదు. అది అమ్మ భాష. మాతృభాషని విస్మరిస్తే ఏ భాషైనా మనుగడ కోల్పోతుంది. ఇప్పుడు ప్రపంచంలోని చాలా భాషలు అలాంటి ప్రమాదంలో ఉన్నాయి. వాటిని కాపాడు కోవడానికి ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా మన దేశంలోని అనేక గిరిజన తెగలకు లిపి లేదు. లిపి లేని భాషకు ఎక్కువ కాలం మనుగడ ఉండదు’’ అని ఏయూ తెలుగు విభాగం రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ శ్రీనివాసరావు అన్నారు. ‘‘తమ భాషను బతికించుకునేందుకు సవర గిరిజనం చేస్తున్న కృషి చాలా గొప్పది. అసలు అక్షరానికి ఆలయం కట్టడమనేదే చాలా గొప్ప ఆలోచన. ఇదే తరహాలో వారు సవర లిపిని వ్యాప్తి చేసి, సవర భాషకు మంచి గుర్తింపు తీసుకుని రావాలి. వారి స్ఫూర్తి తెలుగుతో సహా మిగతా భాషలకు ఆదర్శం కావాలి’’ అని ఆయన అన్నారు.(బీబీసీ సౌజన్యంతో) -లక్కోజు శ్రీనివాస్‌